x

ఏపీ పెట్టుబడుల ప్రగతి.. అంకెల్లో ఎంత? ఆచరణలో ఎంత?

22లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన అపారమైన సహజ వనరులు, 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ స్థాయి ఓడరేవులతో దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా అవతరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తూ సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేసింది. భూ కేటాయింపులు, విద్యుత్ సబ్సిడీలు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, తంలోలా రాయితీల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రత్యేక ఎస్క్రో (Escrow) అకౌంట్ తీసుకురావడం పారిశ్రామికవేత్తలలో కొత్త భరోసా నింపింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూన్ 2024 నుండి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 22.6 లక్షల కోట్ల విలువైన 714 పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, అందులో రూ. 6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రాంతాల వారీగా పరిశ్రమల వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తూ..ఉత్తరాంధ్రలోని పూడిమడకలో ఎన్టీపీసీ రూ. 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ రూ. 1.36 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాయి. విశాఖ, భోగాపురం పరిసరాల్లో గూగుల్ $15 బిలియన్ల ఏఐ హబ్, రిలయన్స్ రూ. 1.08 లక్షల కోట్ల ఏఐ డేటా సెంటర్ , జీఎంఆర్ ఏవియేషన్ హబ్ ఏర్పాటు కానున్నాయి. అలాగే దక్షిణ కోస్తాలోని రామాయపట్నంలో బీపీసీఎల్ రూ. 96 వేల కోట్ల రిఫైనరీ నిర్మిస్తుండగా, రాయలసీమలో రిలయన్స్ సోలార్, కియా అనుబంధ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.
ఈ పారిశ్రామిక ప్రగతికి మరింత ఊపునిస్తూ, విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో 58 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా, మరో రూ. 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో 160కి పైగా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం కొత్త పెట్టుబడి ప్రతిపాదనల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కాయని కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని ఇన్వెస్ట్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలు వెల్లడించడం ప్రభుత్వ వాదనకు బలాన్నిస్తోంది.
అయితే, ఈ భారీ అంకెల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితిని విశ్లేషిస్తే ప్రభుత్వం ముందు కీలక సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం 74 శాతం కన్వర్షన్ రేటుతో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, స్టీల్ ప్లాంట్లు, రిఫైనరీల వంటి మెగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం 3 నుండి 5 ఏళ్ల సమయం పడుతుంది. అంతేకాకుండా, భారీ ప్రాజెక్టులకు భూసేకరణ, స్థానికుల అభ్యంతరాలు, పర్యావరణ అనుమతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంపెనీలకు హామీ ఇచ్చిన వేల కోట్ల రాయితీలను సకాలంలో చెల్లించడం ప్రభుత్వానికి అసలు పరీక్షగా నిలవనుంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఈ అడ్డంకులను అధిగమించి పరిశ్రమలను పూర్తిస్థాయిలో నడిపించినప్పుడే ఏపీ నిజమైన పారిశ్రామిక విజేతగా నిలుస్తుంది.
Read More
Next Story