x

ఏపీపై ఎల్‌నినో ఎఫెక్ట్

రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్; వేల కోట్ల భారం పడకుండా సీఎం మాస్టర్ ప్లాన్


ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. నవంబర్ 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో కరెంట్ వినియోగం 18.23 శాతం పెరిగింది. సాధారణంగా రోజుకు 240 మిలియన్ యూనిట్లుగా ఉండే డిమాండ్, ప్రస్తుతం 270 నుండి 290 మిలియన్ యూనిట్లకు చేరుకోగా, గ్రిడ్ లోడ్ సుమారు 10,300 నుండి 10,850 మెగావాట్ల మధ్య కొనసాగుతోంది. రాబోయే ఆరు నెలల్లో (వేసవి నాటికి) రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరుకుంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది.

మరోవైపు, ఎల్నినో వల్ల వర్షాలు తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో పాటు థర్మల్ కేంద్రాల మరమ్మతులు , బొగ్గు ఒత్తిడి కారణంగా ఏపీజెన్‌కో సొంత ఉత్పత్తి రోజుకు సుమారు 66 నుండి 72 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ భారీ డిమాండ్‌కు తగ్గట్టుగా సొంత ఉత్పత్తి సరిపోకపోవడంతో, రాష్ట్రంలో విద్యుత్ కోతలు తలెత్తకుండా ఉండేందుకు డిస్కంలు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, టర్మ్-అహెడ్ మార్కెట్ ద్వారా స్వల్పకాలిక ఒప్పందాలతో అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి.
అత్యవసర అవసరాల కోసం బహిరంగ మార్కెట్‌లో కరెంట్ కొనుగోలు చేస్తుండటంతో యూనిట్‌కు సగటున రూ. 6.79 వరకు ఖర్చవుతూ డిస్కంలపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. అయితే, ఈ అదనపు కొనుగోలు భారాన్ని ప్రభుత్వం సామాన్య వినియోగదారులపై వేయకుండా 2026–27 ఆర్థిక సంవత్సరంలో టారిఫ్ పెంపు లేకుండా చూడటంతో పాటు, ఏపీఈఆర్‌సీ ద్వారా రూ. 629.35 కోట్ల మేర ట్రూ-డౌన్ వెసులుబాటును కల్పించింది.
అధిక ధరలకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు, ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికలను వేగవంతం చేశారు. పీక్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడానికి ఏఐ, టెక్నాలజీని వినియోగించడంతో పాటు, పీఎం సూర్య ఘర్ కింద ఈ నెల చివరి నాటికి 9 లక్షల సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీటితో పాటు రూ. 21,838 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 , పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగవంతం చేసి, తక్కువ వ్యయంతో సొంత విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Read More
Next Story