మూడు రాజధానుల యోచన ముప్పు ఎందుకవ్వాలి?
x

మూడు రాజధానుల యోచన ముప్పు ఎందుకవ్వాలి?

రెండు ప్రాంతీయ పార్టీల్లో ముందుగా ఏది ‘పొలిటికల్ రిలవెన్స్’ కోల్పోయి బలహీనపడితే, అందులోకి ప్రవేశానికి బిజెపి ఆశగా ఎదురుచూస్తున్నది


రాజకీయం వేరు రాజనీతి శాస్త్రం వేరు. వీటిలో మొదటిది డాక్టర్ అయితే రెండవది వైద్యం. ప్రతి డాక్టర్ మంచి వైద్యుడు కానక్కరలేదు. ఈ రెండింటి మధ్య తేడా కోసం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 2014లో రెండుగా విడిపోయాక, గెలిచిన టిడిపికి ఓడిన వైసీపీతో రాజకీయ స్పర్ధకు ఒక కారణం కావాలి. కానీ అప్పుడే పుట్టిన ఏపీలో ‘రాజకీయం’ అంటే వెంటనే అది ఎక్కడి నుంచి తేవాలి? నిజానికి అదే ‘వైద్యం’ తెలిసిన డాక్టర్ కనుక అయితే, అప్పుడే జనరల్ ఎలక్షన్స్ గెలిచాము కనుక వెంటనే ఏ స్థానిక సంస్థల ఎన్నికలు అనో, లేదా జిల్లాల విభజన చేస్తూ కొత్త జిల్లాలు ప్రతిపాదన అయినా చేసి ఉండాలి. ఎందుకంటే నిజానికి అది రాజనీతి శాస్త్రాన్ని పక్కాగా ‘ఫాలో’ కావడం. అదెలా అంటే, ఏపీ ఒక కొత్త ‘మ్యాప్’ కనుక, ఎన్నికయిన ప్రభుత్వం అది ఏదైనా రాష్ట్రం అంచుల (‘మార్జిన్స్’) నుంచి ‘కవర్’ చేస్తూ దాని ‘పొలిటికల్ ప్లానింగ్’ ఉండాలి.

‘రాజ్యము’- అంటేనే ప్రజలు, ప్రాంతము, ప్రభుత్వము కనుక, సహజంగానే ఈ మూడింటి చుట్టూ ‘రాజకీయం’ తిరుగుతుంది. అప్పుడు కొత్త ప్రాంతాల నుంచి కొత్త కులాల నుంచి రాజకీయ నాయకత్వం కోసం కొత్త తరం ప్రజాజీవితంలోకి వస్తుంది. కానీ ఇక్కడ ‘వైద్యం’ తెలియని ‘డాక్టర్’ చేతి చికిత్స అనేసరికి- ‘దివి నుంచి భువికి..’ అన్నట్టుగా కంటికి కనిపించనిది ఏదయినా కావాలి. అప్పుడు, ఏమి చేయాలి? మీరు నా ‘విజన్’తో చూస్తే అది మీకు కనిపిస్తుంది అనాలి.

అప్పుడు దాని చుట్టూ ఎన్ని వలయాలు అయినా భ్రమభరితంగా నిర్మించవచ్చు. ‘రాజధాని’ నిర్మాణం అంశం చంద్రబాబు పార్టీకి అందుకు పనికొచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పటికీ పూర్తికాని రీతిలో ఫేజ్ వన్, ఫేజ్ టూ అంటూ దాన్ని పెంచుకుంటూ, ఒక ‘షాడో ఇమేజ్’ సమీప భవిష్యత్తులో ‘రాజధాని’ పేరుతో అక్కడ ఉండాలి. ఉంటే, విభేదించిన రాజకీయ ప్రత్యర్ధి తన వనరులు కొన్ని అయినా నిరంతరం అక్కడ ‘బర్న్’ (వృధా) చేసుకుంటూ ఉండాలి. బాబు తన ‘జూనియర్’ ప్రత్యర్ధి పార్టీ లక్ష్యంగా ఇంతగా ‘ప్లాన్’ చేసినప్పుడు, దీన్నే తనకంటే ‘సీనియర్’ తనకు అనుకూలంగా మల్చుకోలేడా? ఇందులో ఇదొక అంశం.

అదేంటి కొత్త రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం లేదా అనిపించవచ్చు అది అవసరమే; కానీ అప్పుడు- గతంలో విషయం ఎక్కడ ఆగిందో... అక్కడ నుంచి మళ్ళీ అది మొదలవ్వాలి. ఇక్కడ విషయం ఏమిటి? కేంద్రం అస్సలు తెలంగాణ ఇవ్వాలా వద్దా? అనేది ప్రశ్న, అందుకు యూపీఏ ప్రభుత్వం జస్టిస్ బి.ఎన్. శ్రీ కృష్ణ కమిటీ (2010-2011) ఏర్పాటు చేసింది. నివేదిక అందాక, దానిపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. అ తర్వాత ఏపీ రాజధాని ఎక్కడ అనే దానిపై 28 మార్చి 2014న కేంద్రం శివరామ కృష్ణన్ కమీషన్ వేసింది.

ఈ మధ్యలో ‘ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణ చట్టాన్ని’ పార్లమెంటు ఆమోదించడంతో 2 జూన్ 2014న రాష్ట్ర విభజన అమలయింది. ఇది జరిగాక శివరామ కృష్ణన్ కమీషన్ రిపోర్టు 27 ఆగస్టు 2014న కేంద్రానికి ఇచ్చింది. కేంద్ర-రాష్ట్రాల మధ్య విభజన విషయం ఇక్కడి వరకు వచ్చాక, అది రాష్ట్రమైనా కేంద్రమైనా అక్కడి ప్రభుత్వాలలో పార్టీలు మారినప్పటికీ, తదుపరి చర్య ఎక్కడ నుంచి మొదలు కావాలి? విషయం ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి మళ్ళీ అది మొదలవ్వాలి. కాని జరిగింది ఏమిటి?

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపే వెసులుబాటును వొదులుకుని, శివరామ కృష్ణన్ కమీషన్ నివేదికపై చర్చ లేకుండానే విభజన జరిగిన మూడు నెలలకే 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రాజధాని’ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ లేకుండా ఈ తీర్మానం ఏమిటని ప్రతిపక్షం వైసీపీ తప్పుపట్టి, అది దాన్ని ‘రాజకీయం’ చేసింది. అధికార టిడిపి దాన్ని ఖాతరు చేయకుండా 1 ఏప్రెల్ 2015న కొత్త రాజధాని పేరు- ‘అమరావతి’ అన్నారు.

ఇలా చంద్రబాబు పవర్ లోకి వచ్చిన వెంటనే తన పాత అలవాటు ప్రకారం, ఆయన రాజధాని విషయంలో ‘ప్రొసీజరల్ డైవర్షన్’ తీసుకున్నారు. ఆర్ధిక సంస్కరణల అమలు తొలిరోజుల్లో 1995 నాటికి బాబు సిఎం అయ్యాక, ‘సరళీకరణ’ను ‘ప్రైవేటీకరణ’ను పూర్తిగా తన ‘పొలిటికల్ అడ్వాంటేజ్’కి ఆయన వాడుకున్నారు. అప్పట్లో మన దేశానికి అది ఎటువంటి సంధి కాలం అనేది అర్ధం కావడానికి 2007-2009 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం (‘గ్రేట్ రెషిషన్’)తో మనవద్ద ‘సత్యం కంప్యూటర్స్’ రామరాజు ఎదుర్కొన్న కష్టాలు మనం గుర్తు చేసుకోవడం ఇక్కడ అవసరం.

విభజనతో అన్ని విధాలా దెబ్బతిన్న ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య స్పర్ధను, మోడీ బిజెపి బాల్యావస్థలో ఉన్న రాష్ట్రంలో తన పాగా వేయడానికి ఇది ఆయాచితంగా దొరికిన అవకాశంగా చూసింది. అందుకే మందడం గ్రామంలో 2015 అక్టోబర్ 22న జరిగిన భూమి పూజకు అధికారికంగా నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో వచ్చినప్పటికీ, ఒక యజ్ఞంలో పాల్గొనే ‘మహర్షి’ తరహాలో ఆయన మట్టి-నీళ్ళు తెచ్చిన ఘటాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈ ధోరణిలో బీజేపీలో ఇప్పటికీ మార్పులేదు. పదేళ్ళ తర్వాత కూడా 2024 ఎన్నికల ముందు మ్యానిఫెస్టో విడుదల వేదికపై ‘మీడియా’ ముందు ఆ పుస్తకం కాపీ పట్టుకోవడానికి కూడా ఆ పార్టీ ప్రతినిధి అభ్యంతరం చెప్పడం, అంటే ఏమిటి?

ఎన్నికల కోసం కలుస్తున్నప్పటికీ, టిడిపి ‘పొలిటికల్ కమిట్మెంట్స్’కు మోడీ బిజెపి ‘సాంకేతికంగా’ దూరంగా ఉండాలని అనుకుంటుంది అనేది అర్ధం అవుతూనే ఉంది. ఈ విషయంలో అదెంత దౌత్యంగా వ్యవహరిస్తున్నది అంటే, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చినప్పుడు కూడా దానిపై బిజెపి మౌనంగా ఉంది. ఏపీ విషయంలో దాని రాజకీయ వ్యూహం గురించి పైన మాట్లాడుకున్నాము.

ఇక టీడీపీది ‘ప్రొసీజరల్ డైవర్షన్’ అనుకున్నాము. సరే మరి వైసీపీ మాట ఏమిటి? అది శివరామ కృష్ణన్ కమీషన్ రిపోర్టులోని ‘వికేంద్రీకరణ’ అంశాన్ని తన రాజకీయ నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకుంది. అందులోని పేజీ 14 3.4 క్లాజ్ లో ‘డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్’ విభాగంలో-“Decentralized development of all 13 districts in the newly formed state, with particular focus on developing the naturally backward regions of North Costal Andhra and Rayalaseema to ensure balanced growth” అన్నప్పుడు ఆ పార్టీ కూడా మొదట ఆ ‘అకడమిక్’ అంశాన్ని ‘ఫోకస్’ చేయాలి కదా, కానీ అది చెప్పదు. ఎందుకంటే, అది కూడా ఒక రాజకీయ పార్టీ కనుక, దాని ‘పొలిటికల్ మైలేజ్’ కోసం అది చూసుకుంటున్నది.

ఇదే పేజీలో మూడవ అంశంగా ఉన్న ‘కాళహస్తి-నడికుడి రైల్వే లైన్ ప్రాజెక్టు’ శరవేగంగా సిద్దమవుతున్న తీరు కనుక మనకు అర్ధమైతే, చట్టబద్దమైన అంశాలకు అలా కానివాటికి ఉండే తేడా తెలుస్తుంది. వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని ‘కనెక్ట్’ చేయడానికి 2010లో మొదలైన ఈ రైల్వే ప్రాజెక్టును, రాజధాని ప్రాంత ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ తన ‘రిపోర్ట్’లో ప్రస్తావించడంతో, విభజన తర్వాత దాని ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు పూర్తికావడానికి సిద్దంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు భూసేకరణ పనుల పురోగతిని 2015 నాటి ఏపీ చీఫ్ సెక్రటరీ ఐ.వి.ఆర్. కృష్ణారావు ‘పీరియాడికల్’గా సంబంధిత రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించేవారు. మరి అదే పని ‘రాజధాని’ విషయంలో ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఒక ‘ఈవెంట్’గా 2 మే 2025న జరిగిన అమరావతి ‘రీలాంచ్’ సభలో లేకుండా, అదేరోజు మున్సిపల్ ఎడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సింహాచలం గుడి ప్రమాదం విచారణకు విశాఖ ఎందుకు వెళ్లారు. కారణం ‘బుక్’ బయట జరిగేవి లోపల జరిగేవి వేర్వేరు కనుక.

ఇక ‘ఎన్డీఏ’ ప్రభుత్వం మాట ఎలా ఉన్నా బిజెపి అయితే రాజకీయం, వాణిజ్యం అనే ద్విముఖ వ్యూహంతో ఏపీని ముట్టడించే ‘ప్లాన్’తో ఉంది. ఇక్కడి రెండు ప్రాంతీయ పార్టీల్లో ముందుగా ఏది ‘పొలిటికల్ రిలవెన్స్’ కోల్పోయి బలహీనపడితే, అందులోకి ప్రవేశానికి అది సిద్దంగా ఉంది. దానికి ‘కౌంటర్’ అన్నట్టుగా బాబు కూడా కొత్తగా తనదైన ఆధ్యాతికత ‘మాస్క్’తో బిజెపికి ఎదురు వెళ్ళుతున్నాడు. ఇది ఇలా ఉంటే, ఛత్తీస్ఘర్ లోని దంతేవాడ జిల్లా బైలదిల్లలోని 875 హెక్టార్ల ఆటవీ భూమిలో ముడిఇనుప గనుల తవ్వకానికి ఎన్.ఎం.డి.సి. కి జనవరి 8న కేంద్రం పర్యావరణ అనుమతి ఇచ్చింది.

ఇక ముందు మన విశాఖ ఉక్కును అది వెక్కిరిస్తూ మరీ, ముడి ఇనుప ఖనిజాన్ని విశాఖ పోర్టుకు చేర్చడానికి ‘రాయపూర్ - విశాఖపట్టణం ఎక్స్ప్రెస్ వే’ ఛత్తీస్ఘడ్, ఒదిశా, మీదుగా 13 గంటల ప్రయాణాన్ని 6-7 గంటలకు తగ్గిస్తూ ఏపీలోకి దూసుకు వస్తున్నది. 2026 డిసెంబర్ నాటికి ఈ రోడ్డుపై ప్రయాణం మొదలైతే, నేరుగా డిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, జబల్పూర్ ఈ రోడ్డుతో కనెక్ట్ అవుతాయి. రెండేళ్ల క్రితం ఇది తమ ప్రభుత్వానికి ఎందుకు ‘డ్రీమ్ ప్రాజెక్టు’ అనేది 3 మార్చి 2023 న జగన్మోహన్ రెడ్డితో కలిసి విశాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇప్పుడైనా ఆ ప్రసంగాన్ని ‘యూ ట్యూబ్’లో కనుక వింటే, జగన్ మూడు రాజధానుల యోచన ఎందుకు ముప్పు కాదో అర్ధమవుతుంది.

Read More
Next Story