తెలంగాణ రాజకీయాల్లో ఈ తిట్లేమిటి? ఈ భాష ఏమిటి?
x

తెలంగాణ రాజకీయాల్లో ఈ తిట్లేమిటి? ఈ భాష ఏమిటి?

వ్యక్తి దూషణ తారా స్థాయికి చేరుతున్నది. నువ్వు మగాడివైతే అనే పదం వాడటంతో ఈ అంశం చర్చనీయాంశమయింది.ప్రజలు గమనిస్తిన్నారన్న ఇంగితం ఉన్నట్లు కానరావడం లేదు.


*రమణాచారి

ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా, జుగుస్సాకరంగా కూడా ఉంటున్నది. వ్యక్తి దూషణ తారా స్థాయికి చేరుతున్నది. నువ్వు మగాడివైతే అనే పదo వాడకంతో ఈ అంశం ప్రత్యేక చర్చనీయాశంగా మారింది. ప్రజలు గమనిస్తిన్నారన్న ఇంగితం ఉన్నట్లు కానరావడం లేదు. ఈ పదప్రయోగం సమాజం హర్షించదు. ప్రజల మౌలిక సమస్యలను, సమగ్రoగా చర్చించి పరిష్కారం చూపెందుకు ఇచ్చే సమయం కన్నా, ఒకరిలో మరొకరు తప్పులు వెతికేందుకు, పరస్పర నిందారోపణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు.

సమస్యలను సమిష్టిగా చర్చించి పరీక్షరించు కోవాలనే కనీస ఆలోచన చేయడం లేదు. ఒకరిపై ఒకరు అభ్యంతరకర, అనుచిత పద బంధాలను ఉపయోగిస్తున్నారు. అందుకేనేమో పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే రెండు పదాలు ఇటీవల చర్చనీయాంశంగా ముందుకొచ్చాయి. పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలలో ఎటువంటి భాష ఉపయోగించాలనేదానికోసమే ఈ పదాలు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రత్యేకమైన భాషలు కానప్పటికినీ, చట్టసభలలో ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సభా సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేందుకు ఇవి వాడకంలోకి వచ్చాయి.

ప్రధానంగా తెలంగాణ పౌర సమాజం చాలా చైతన్యవంతమైనది. తెలంగాణ ప్రజలు అసమాన త్యాగాలతో, పోరాటపటిమతో, ఉద్యమస్ఫూర్తితో, పోరాడి సాధించారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. పెత్తందారి, దోపిడీ స్వభావంగా మారిన పాలకుల నుండి విడిపించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలు, యాస భాషల వెక్కిరింపు తెలంగాణ ప్రజల మనసు నొప్పించాయి.

వనరుల దోపిడీకి వ్యతిరేకంగా స్వపరిపాలన కోసం, దేశంలోని రాజకీయ పార్టీలను ఒప్పించి, తెలంగాణలోని రాజకీయ పార్టీని, ప్రజలందరిని ఒక్కతాటిపై నిలిపి ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. దక్షిణాదిలోనే రెండు పెద్ద నదులు గోదావరి, కృష్ణ ప్రవహించే ప్రాంతం తెలంగాణ. అపారమైన ఖనిజ సంపద, అటవీ సంపద ఉన్న రాష్ట్రం. నీళ్లు, నియామకాలు జరపాలనే ప్రాతిపదికతోనే మడమతిప్పని ఉద్యమ చైతన్యంతో సాగించిన సమాహారమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ఒక్క మాటలో చెప్పాలంటే అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ.

ఇది గుర్తు ఎరిగి నడుచుకోవడం పాలకుల కర్తవ్యంకావాలి. పునర్నిర్మానంపై దృష్టి సారించకుండా ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజలను ఒట్టి అమాయకులుగా భావించి సోయిలేకుండా మాట్లాడుతున్నారు.

గెలుపు వినమ్రతను, విజ్ఞతను పెంచాలి. అహంభావాన్ని ప్రదర్శించేవిగా ఉండకూడదు. అధికారం తాత్కాలికం, అశాశ్వతం. పార్లమెంటు అసెంబ్లీ వంటి చట్ట సభలలో, బహిరంగ సభలలో భాషను అదుపులో ఉంచుకొని పొదుపుగా మాట్లాడాలి. అగౌరవాన్ని కలిగించే విధంగా సభ్యులతో ప్రవర్తించరాదు. మెజారిటీ బలం ఉందని, మాటలు అదుపు తప్పితే, ప్రజలు బుద్ధి జీవులు వెయ్యి కళ్లతో గమనిస్తుంటారని మరువ రాదు.

ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికార పగ్గాలు చేపడతారు అలాంటప్పుడు వారి ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. రాగద్వేషాలకతీతంగా ప్రజలందరిని చూడగలగాలి. చట్టబద్ధమైన పరిపాలన సాగించాలి. ఎన్నికల సమయంలో తప్ప, గెలిచిన తరువాత ప్రజలందరికీ నాయకుడనని గుర్తుంచుకొని మసలు కోవాలి. హుందాగా, పెద్దరికంతో మెలగాలి. నాయకుడు మొదటగా తాను ప్రజలకు సేవకుడని గుర్తుంచుకోవాలి. అడ్డగోలు పెత్తనం చేయరాదు. అంతఃకరణ శుద్ధితో ప్రవర్తించాలి. ప్రతిదీ చట్టానికి లోబడి, రాజ్యాంగం మీద గౌరవంతో నడుచుకోవాలి. ప్రజా బాహుల్యాలలో వాడే భాష, హావ-భావ ప్రదర్శన అందరూ పరిశీలిస్తారననే ఇంగిత జ్ఞానం ఉండాలి. సభ్య సమాజం ఏవగించుకునే పదాలను ఉపయోగించకూడదు.

అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు నమ్మకంతో ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సభలు సమావేశాలలో వాడే భాష మరింత ఆకర్షణీయంగా ఉండాలి. ప్రధానంగా చట్ట సభలలో (అసెంబ్లీ, పార్లమెంటు) ప్రజా ప్రతినిధులు జరిపే చర్చలను ప్రజలంతా మేధావులు మీడియా ప్రతినిధులు పరిశీలిస్తుంటారు.

ప్రజోపయోగమైనటువంటి, ప్రజామోదమైన సమస్యల పైన సమూలంగా, సమగ్రంగా చర్చించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ తరాలకు, నాయకత్వం ఎలా ఉండాలో తెలియజెప్పేలా చర్చలు చేయాలి. పరస్పర నిందారోపణలతో కాలాపహరణం చేయడమంటే, ప్రజాధనం వృధా చేయడమే. నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నా అనేది వితండ వాదన.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మనం వేటినైతే సమస్యలుగా భావించామో, అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి రాకుండా చూసుకోవాలి. భలే గుందిరా మన అసెంబ్లీ ఆటోడు ఇటు కుసుండు, ఇటోడు అటుకుసుండు వీని నోట వాని మాట, వాని నోట వీని మాట ప్రజలందరి నోట మట్టి గడ్డల మూట అనే గద్దర్ పాట సారాంశం పునరావృతం కారాదు.

Read More
Next Story