కేంద్రంలో జనసేన ఎందుకు చేరలేదు?
x

కేంద్రంలో జనసేన ఎందుకు చేరలేదు?

ఏపీ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో 'త్రిపక్ష కూటమి' విజయం సాధించడానికి గణనీయమైన కృషి చేసిన జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్‌లో ఎందుకు చోటు లభించలేదు?

ఏపీ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో 'త్రిపక్ష కూటమి' విజయం సాధించడానికి గణనీయమైన కృషి చేసిన జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్‌లో ఎందుకు చోటు లభించలేదు? మోడీ చొరవ చూపలేదా! లేక పవన్ తిరస్కరించారా? ఆదివారం జరిగిన మోడీ ప్రమాణ స్వీకారం తరువాత ఏపీలో, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో తలెత్తిన పెద్ద సందేహం ఇది. గత మూడు, నాలుగేళ్లుగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి చాలా దగ్గరయ్యారన్నది అందరికీ తెలిసినదే. కొందరు పెద్ద నాయకులకు కూడా దొరకని మోడీ అపాయింట్‌మెంట్ పవన్‌కు వెంటనే దొరికేదనీ, మోడీయే ఒక్కొక్కసారి ఫోన్ చేసి పవన్‌తో మాట్లాడేవారనీ బిజెపి నేతలు సైతం అనేవారు.

అంత సన్నిహితమైన పవన్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు లభించక పోవడంతో అందరిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి రెండు ఎంపి సీట్లు సాధించిన మిత్రపక్షాలకు కూడా ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చిన మోడీ రెండు ఎంపీ సీట్లున్న జనసేనకు ఎందుకివ్వలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో త్రిపక్ష కూటమికి వచ్చిన సీట్ల ప్రకారం కనీసం నాలుగు మంత్రి పదవులు లభించవచ్చనే అనుకున్నారు. టిడిపి కూడా అదే ఆశాభావంతో కనిపించింది. నాలుగు బెర్త్‌లు కూటమికి ఇస్తే, జనసేన వద్దనుకుంటే అది కూడా తాను తీసుకోవచ్చని భావించింది. కూటమిలోని ప్రధాన భాగస్వామిగా తనకు కీలక శాఖలు దక్కించుకొనడానికి, గతంలో కంటే ఎక్కువ శాఖలు సాధించడానికి టిడిపి 'పెద్ద' ప్రయత్నాలే చేసింది.

ఫలితాలు వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారానికి మధ్యలో మూడు నాలుగు రోజుల పాటు చంద్రబాబు.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉండి మోదీ, అమిత్ షా, నడ్డాలతో విస్తృతంగానే చర్చలు జరిపారు. ఆ భేటీల్లో కొత్త కేబినెట్ కూర్పు, దానిలో మిత్రపక్షాలకు మంత్రి పదవులపైనే చర్చలు సాగాయి. తెలంగాణకు రెండు లేదా మూడు, ఏపీకి మూడు లేదా నాలుగు మంత్రి పదవులివ్వడానికి బిజెపి అధిష్ఠానం అంగీకరించినట్లే తెలిసింది. ఏపీకి ఇచ్చే బెర్త్‌లలో టిడిపికి రెండు, జనసేనకు ఒకటి, బిజెపికి ఒకటి ఇవ్వడానికి మోడీ కూడా స్థూలంగా అంగికరించారనే వార్తలు వినిపించాయి.

తుది రౌండ్ చర్చల్లో కూడా జనసేన ప్రాతినిధ్యం గురించి చర్చించారు. మోడీ స్వయంగా పవన్‌తో ముఖాముఖి అయ్యారు. ఇద్దరి భేటీలో మంత్రి పదవులపై ఒక అంగీకారం కుదిరిందని తెలిసింది. పవన్ ఒప్పుకుంటే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి కూడా మోడీ సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ప్రమాణ కార్యక్రమానికి ముందురోజు సాయంత్రం పవన్ తన మనసులోని మాట స్పష్టంగా మోడీకి చెప్పారనీ, అందుకు ఆయన అంగీకరించారనీ తెలిసింది. కొంతకాలం తాము వేచి ఉంటామని చెప్పి దానికి గల కారణాలను పవన్ మోడీకి తెలిపారనీ, అందుకు ఆమోదించిన మోడీ పవన్ ఎప్పుడు అడిగినా మంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించారనీ విశ్వసనీయంగా తెలిసింది.

టిడిపి నుంచి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లను చంద్రబాబు ముందే ఖరారు చేయించుకున్నారనీ, మరో బెర్త్ కోసం పట్టుపట్టినా 'తర్వాత చూద్దాం' అని బిజెపి అధిష్ఠానం నచ్చజెప్పిందనీ తెలుస్తోంది. జనసేన ఎంపి బాలశౌరి పేరు కూడా తొలుత వినిపించింది. పవన్, నాదెండ్ల కాకపోతే బాలశౌరికే మంత్రి పదవి దక్కగలదని భావించారు. అయితే ప్రస్తుతం జనసేనలో ఏ ఒక్కరికీ కేంద్ర మంత్రి పదవి వద్దని పవన్ అనడంతో ఆ విషయం వెనక్కి వెళ్లిందనీ అంటున్నారు. తెలంగాణలో కిషన్ రెడ్డికి ఖాయమే అయినా, రెండో బెర్త్ డీకే అరుణకు లభించవచ్చనే ప్రచారం జరిగింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ హామీ ఇచ్చినట్లుగా రెండో బెర్త్ బండి సంజయ్‌కి లభించింది. ఏపీలో బిజెపి తరఫున పురందేశ్వరి పేరు ప్రచారమైనా చివరికి శ్రీనివాస వర్మకు ఖరారయింది. పురందేశ్వరికి కీలకమైన మరో పోస్ట్ మోడీ ఆఫర్ చేసినట్లుగా వినిపిస్తోంది. టిడిపి కీలకమైన స్పీకర్ పదవి ఆశించిందనీ, కానీ జనసేన ఒప్పుకోక పోతే డిప్యూటీ స్పీకర్ పోస్టు టిడిపికి ఇస్తామని చెప్పారనీ, దానిని చంద్రబాబు తిరస్కరించారనీ తెలుస్తోంది. తొలుత 30 మంది మంత్రులు మాత్రమే ప్రమాణం చేస్తారని చెప్పినా, ముహూర్తం సమయానికి వారి సంఖ్య 72 కు పెరిగింది.

ఆదివారం సాయంత్రం వరకు మార్పులు, చేర్పులు సాగుతూనే ఉన్నాయి. పవన్ ఢిల్లీలోనే ఉండడంతో చివరి దశ మార్పుల్లోనైనా జనసేన ప్రాతినిధ్యం ఉంటుందేమో అని చాలామంది ఊహలు చేశారు. ఆదివారం సాయంత్రం పవన్ ఒక ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించడంతో అసలు విషయం చాలా మందికి అర్థమైంది. తాను, తన పార్టీ నేతలు రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నామనీ, భవిష్యత్తు నిర్ణయాలపై ఇప్పుడే చెప్పలేననీ పవన్ అన్నట్లుగా ఆ ఛానల్ ప్రసారం చేసింది. దానిని బట్టి పవన్ మదిలో "భారీ" ఆలోచనలే ఉన్నట్లుగా జనసేన నేతలు భావిస్తున్నారు.

డిప్యూటీ సీఎం హోదాతో రాష్ట్ర హోం శాఖ బాధ్యతలు తాను తీసుకోవాలని పవన్ అనుకొంటున్నట్లుగా చెబుతున్నారు. బహుశా అదే నిజం కావచ్చు కూడా! అలాగే నాదెండ్లకు కూడా రాష్ట్ర కేబినెట్‌లో కీలక పదవే లభించవచ్చనుకుంటున్నారు. 21 మంది ఎమ్మెల్యేల బలం పవన్‌కు ఉండడంతో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయన కీలక పాత్రనే వహిస్తారనడంలో సందేహం లేదు. ఇక రెండు రోజుల్లో ఆ దృశ్యం కూడా తెరపైకి వస్తుంది.

Read More
Next Story