జగన్ ‘సదరన్ స్పైస్’ను పాన్ ఇండియా చేస్తున్న నాయుడు
x
జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

జగన్ ‘సదరన్ స్పైస్’ను పాన్ ఇండియా చేస్తున్న నాయుడు

సోనియాది, వైఎస్ కుటుంబానిది ఒకే రకమైన ‘క్రైస్తవ్యం’ కాదు, అవి వేర్వేరు. వై.ఎస్. ‘క్రైస్తవ్యం’ భారతీయమైతే, సోనియా ‘క్రైస్తవ్యాని’కి ఆసియా మూలాలు లేవు

“గర్భాలయము ముందు కుడిపార్శ్వమున అయిదు, ఎడమ పార్శ్వమున అయిదు, పది బంగారపు దీప స్తంభములు, బంగారపు పుష్పములు, ప్రమిదెలు మేలిమి బంగారపు పాత్రలు, ధూప కలశములు, అంతర్మందిరమైన అతి పరిశుద్ధ స్థలము, ఆలయపు తలుపులకు బంగారపు బందులను రాజు చేయించెను. సొలొమోను రాజు యెహోవా దేవుని మందిరమునకు చేసిన పని అలా సమాప్తమాయెను”

పై పంక్తులు ప్రపంచ క్రైస్తవుల పవిత్ర గ్రంధమైన ‘బైబిల్’ లోనివి అంటే, కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ నిజమది! అవి- బైబిల్ ‘ఓల్డ్ టెస్ట్మెంట్’ లోని మొదటి రాజులు గ్రంధం ఏడవ అధ్యాయం 49-51 మధ్య వచనాలు లోనివి. మనం చూసే ప్రాచీన దేవాలయ నిర్మాణ కౌశల్యం (‘టెంపుల్ ఆర్కిటెక్చర్’) యావత్తూ ఇందులో నిక్షిప్తమై ఉంది. కీ.పూ. 550లో ప్రవక్త జెర్మియ నాయకత్వంలోని బృందం ఈ అధ్యాయాన్ని సంకలన పర్చారని బైబిల్ పండితులు అంటారు.
ఇండియాలో ‘బైబిల్’ లేదా ‘క్రిస్టియానిటీ’ అంటే, అది విదేశాల నుంచి యూరోపియన్లు ఇక్కడికి బట్వాడా చేసిన విశ్వాసం అనే అపోహ క్రైస్తవేతరులకే కాదు కొందరు క్రైస్తవులకు కూడా ఉంది. అయితే, కనీసం ఆంధ్రప్రదేశ్ లో అయినా ఆ అపోహను సరిచేసుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే, 2026 ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ‘బైబిల్’ ‘క్రిస్టియానిటీ’ గురించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ‘క్రిస్టియన్’ కావడంతో, తన రాజకీయ కారణాలతో ఆయన ఈ పని చేశారు.
అయితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 200 ఏళ్లపాటు బ్రిటిష్ పాలనలో ఉన్న కారణంగా ఇక్కడ కొందరు ‘క్రిస్టియానిటీ’ అవలంబించారు అనేది కేవలం పాక్షిక దృష్టి మాత్రమే. ఇరవై ఏళ్ల క్రితం డిల్లీలో సోనియాగాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన మత వివాద ‘పాలిటిక్స్’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో తన ప్రత్యర్ధి రాజకీయ కుటుంబాలకు తిరిగి ‘అప్లై’ చేస్తున్నాడు! అయినా భారతీయ రాజకీయాల్లో 90’ దశకం తర్వాత, నాయకుల విశ్వాసం కంటే వారి ‘మతం’ చుట్టూ చర్చ జరగడం కొందరికి ప్రయోజనకరమైన అంశం అయింది.
నిజానికి ఇప్పటి భాషలో దాన్ని చెప్పాలంటే- మతం కనిపించే ‘హార్డ్ వేర్’ అయితే, విశ్వాసం కనిపించని ‘సాఫ్ట్ వేర్’. ఇది ఎంత కీలకం అయింది అంటే, 2004 జనరల్ ఎలక్షన్స్ ముందు నాటి కాంగ్రెస్ ప్రసిడెంట్ సోనియా గాంధీ క్రిస్టియన్ అని ఆమె ‘విశ్వాసం’ చుట్టూ నేరుగా విమర్శల దాడి జరిగింది. చిత్రం ఏమంటే, ప్రతిపక్షమే కాకుండా, కాంగ్రెస్ లో ఒక ‘గ్రూప్’ కూడా ఆ పని చేసింది. దాంతో అదే ఏడాది మార్చిలో వెలువడిన రషీద్ కిద్వాయ్ రచన ‘పెంగ్విన్’ ప్రచురణ ‘సోనియా ఏ బయోగ్రఫీ’ గ్రంధంలో (తెలుగు: అలకనంద ప్రచురణలు, విజయవాడ) ఏకంగా ‘ఆమె విశ్వాసం’ అంటూ గ్రంధ రచయిత పదిహేను పేజీల ఒక అధ్యాయం రాశారు!
అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందిన ‘కేథలిక్ క్రిస్టియన్’ అనేది జగమెరిగిన విషయం. విదేశాల్లో యూనివర్సిటీలో ఆమెను రాజీవ్ గాంధీ ఇష్టపడడంతో, వారి వివాహం భారతీయ సంప్రదాయం ప్రకారం ఇందిరాగాంధీ ఇక్కడ జరిపించారు. ఆ తర్వాత చరిత్ర మనకు తెలిసిందే. అయితే, సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రసిడెంట్ అయ్యాక, ఆ పార్టీ కేంద్రంలో గెలిచాక ‘ఆమె ఎవరు?’ అనేదాని చుట్టూ చర్చ మొదలయింది.
ఆసక్తికరంగా ‘క్రిస్టియన్’ అయిన లోకసభ మాజీ స్పీకర్ పి. ఏ. సంగ్మా సి.డబ్యూ.సి. సమావేశంలో- “నీ విశ్వాసం మాట ఏమిటి? నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్ అవునా కాదా?” అంటూ నేరుగా ఆమెను అడిగాడు. ఆ తర్వాత 1999 జనవరి నాటికి ఆయన- “సోనియా క్రైస్తవ్యం ఆచరించడం లేదు” అని ప్రకటించాడు. సంగ్మా ప్రకటన ఆమెకు దిగ్భ్రాంతిని కలిగించింది. ‘రోమన్ క్యాథలిక్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా’ కూడా ఆమె క్రైస్తవ్యం ఆచరించడం లేదని ప్రకటించినప్పుడు, సోనియా మౌనంగా ఉండిపోయింది.
అయితే ఆమెను సంగ్మా ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించలేదు. “ఆమె భవిష్యత్ ప్రధాని మంత్రిగా భారత ప్రజల అంగీకారం సాధించడం కోసం, తన మత విశ్వాసానికి కూడా దూరం అవుతున్నది” అన్నాడు. సంగ్మా దృష్టిలో సోనియాది దైవ దూషణ. ఆయన అడిగాడు- “ఎవరైనా సరే, తమ విశ్వాసాల విషయంలో మరొకరి దయాదాక్షిణ్యం కోసం ఒదిగి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఒక భారతీయుడిగా ఎంత గర్విస్తున్నానో, ఒక క్రైస్తవుడు అయినందుకు అంతే గర్విస్తున్నాను. వాస్తవానికి నా చర్చికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను” అన్నాడు.
నాయకుల విశ్వాసం విషయంలో 2000 నాటికి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబం విశ్వాసం విషయం ఏమిటి? అనేది కూడా చర్చనీయ అంశమే. ఎందుకంటే, ప్రధానంగా ఇండియా హిందువులు అధిక సంఖ్యలో ఉండే దేశం కనుక, ‘పబ్లిక్ లైఫ్’లో ఉండే నాయకులది ‘క్రైస్తవ్యం’ వంటి ‘మైనార్టీ’ మతం విశ్వాసం అయినప్పుడు ఆ అంశానికి ఉండే పరిమితులు దానికి ఎటూ ఉంటాయి. అయితే దీన్ని- “కమ్ వాట్ మే..” అని సవాలుగా తీసుకోవడం అనేది వారి వ్యక్తిగత నిబద్దతకు సంబంధించిన విషయం.
ఏదేమైతేనేమి రెండు ‘టర్మ్’లలో కూడా డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ పాలన సాగింది. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రసిడెంట్ గా ఉండిపోవల్సి వచ్చింది. ఆ ప్రభుత్వంలోనే రాష్ట్ర విభజన జరిగాక, బిజెపి గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా, దాని మత రాజకీయాల ‘లైన్’ దానికి ఉన్నప్పటికీ, ఏపీలో వై.ఎస్. కుటుంబం విశ్వాసాన్ని ఈ పదేళ్ళలో బిజెపి ఎప్పుడూ ‘పొలిటికల్ ఎజెండా’ చేసే తెగువ చూపలేదు.
ఏమిటి అందుకు కారణం అన్నప్పుడు- ఇక్కడే విషయం కొత్త ‘టర్న్’ తీసుకుంటున్నది. అదేమంటే - సోనియాది, వైఎస్ కుటుంబానిది ఒకే రకమైన ‘క్రైస్తవ్యం’ కాదు, అవి వేర్వేరు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, వై.ఎస్. ‘క్రైస్తవ్యం’ భారతీయమైతే, సోనియా ‘క్రైస్తవ్యాని’కి అస్సలు ఆసియా మూలాలు కూడా లేవు. అది పూర్తిగా భిన్నమైంది, విశ్వాసం విషయంలో లోతులు ఆమెకు బొత్తిగా తెలియవు. నిజానికి అది ఎంతో కొంత మేర తెలిస్తే మళ్ళీ మోడీ బిజెపికి తెలుసు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయనకు ఇవేమీ తెలియకే అస్సలు ఈ సమస్య అంతా.
డా. వై. ఎస్. 2009 ఎన్నికల్లో కూడా పార్టీని రాష్ట్రంలో గెలిపించి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలను డిల్లీ పంపించాక అనుకున్న ప్రకారం, ఎన్నికల ఫలితాలు వెలువడి పార్టీ గెలిచిన తర్వాత డా. రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఇజ్రాయెల్ – జెరూసలేం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుని, అనుమతి అడిగితే, డిల్లీలో యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు పూర్తి అయ్యేంత వరకు వెళ్లొద్దు ఆగమని సోనియా నుంచి ఆదేశం. అలా ఆ ‘ట్రిప్’ ఆయన ఒక వారం వాయిదా వేసుకోవలసి వచ్చింది.
ఇక్కడ విషయం ఏమంటే, ఆ యాత్రలో వైఎస్ కుటుంబం అంతా ఇజ్రాయెల్ పర్యటనలో జోర్డాన్ నదిలో ‘బాప్టిజమ్’ తీసుకున్నారు. సోనియాకు జోర్డాన్ నది ప్రాశస్త్యం గానీ, ఆసియాలో భారత్ వంటి దేశాల్లో నదీ స్నానానికి ఉండే పవిత్రతగానీ, మొక్కుబళ్ళు గురించి గానీ తెలిసే అవకాశం లేదు. ‘బైబిల్ ల్యాండ్’ ఆసియాలో ఉండడం ఒక భౌగోళిక వాస్తవికత. అక్కడ నుంచి లేఖనాలు తర్జుమాల రూపంలో రోమ్ ద్వారా యూరప్ లోకి ప్రవేశించిన తర్వాత, ఆయాదేశాల ప్రపంచ వాణిజ్య అవసరాలకు ‘బైబిల్’ ఒక చుక్కానిగా ఉపకరించింది అనేది జగమెరిగిన సత్యమే!
అలా ఇప్పటికి వందేళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన ఐరోపా మిషనరీలు ద్వారా ముందుగా ఆంగ్ల విద్యావంతులు అయిన ఇక్కడి కుటుంబాలు ‘చర్చి’లకు దగ్గరగా ఉన్నవి మాత్రమే కావడం సహజమే. వాటిలో వై. ఎస్. కుటుంబం కూడా ఉన్నంత మాత్రాన, మన రాజకీయం కోసం దానికి ఇప్పటికిప్పుడు కొత్తగా ‘యూరోపియన్’ మూలాలు ఎక్కణ్ణించి వస్తాయి? ప్రపంచ మతమైన క్రైస్తవ్యంలో ‘తూర్పు క్రైస్తవ్యం’ (‘ఈస్ట్రన్ క్రిస్టియనిటీ’) గురించి తెలియని వారి సమస్య ఇది.
కడప జిల్లా జమ్మలమడుగులో సి. ఎస్. ఐ. కేంప్ బెల్ హాస్పటల్ 1891 లో ఆంగ్ల మిషనరీలు పెడితే మెడ్రాస్ లో మెడిసన్ చదివిన వై. ఎస్. వెంకట రెడ్డి కుమార్తె డా. వై. ఎస్. రత్నమ్మ అందులో గైనకాలజిస్టు గా పనిచేస్తూ తొలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని రాయలసీమ ప్రాంత స్త్రీలకు దానిపట్ల అవగాహన కలిగించారు.
ఒకప్పుడు క్రైస్తవానికి ‘చర్చి’ కేంద్రం అనేది నిజమే అయినా అది కేవలం ప్రాధమిక దశ. కామన్వెల్త్ దేశాల్లో ‘చర్చి’తో పాటుగా విద్య, వైద్యం రెండు మౌలిక అంశాలుగా ‘చర్చి’కి అనుబంధంగా ఉండేవి. ఒకసారి అది ఒక ‘మిషన్’ రూపం తీసుకున్నాక, కేవలం ఒక భవనం అయిన ‘చర్చి’తో క్రైస్తవ్యనికి ఇక పనిలేదు. పైగా ‘మిషన్’లో ‘సరళీకరణ’ అనే విముక్తి అంశ ఉండడంతో, విస్తరణలో దాని వ్యాప్తి బాహురూపాలుగా మారుతుంది. మనం 1991 నుంచి అమలుచేసుకుంటున్న ఆర్ధిక సంస్కరణలలో గానీ, లేదా అభివృద్ది చెందుతున్న దేశాలకు లక్ష్యాలుగా UNDP ఇచ్చిన ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ లో ఉన్నఅంశాలు గానీ ఈ ‘మిషన్’కు ఏ మాత్రం భిన్నమైనవి కావు. అవి ఆ ‘మిషన్’కు కొనసాగింపు మాత్రమే.
జగన్ మత విశ్వాసం లక్ష్యంగా, సిఎం చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో మాజీ టి. టి. డి. ఛైర్మన్ భార్య ‘బైబిల్’ పట్టుకున్నటుగా చెబుతూ ఉంటే, అదే కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ లో ‘అబ్రహామిక్’ విశ్వాసాలైన- జుడాయిజం, క్రైస్తవ, ఇస్లాం, పుట్టిల్లు అయిన జెరూసలేం నుంచి- “Israel is father land, India is mother land” (ఇజ్రాయెల్ తండ్రి భూమి అయితే, భారత్ తల్లి భూమి) అని బెంజమన్ నెతన్యుహు సమక్షంలోనే అనడం కేవలం యాదృచ్చికమే కావొచ్చు.
ఏపీ ఎన్నికల్లో 2019 లో గెలిచి జగన్మోహన్ రెడ్డి సిఎం అయినప్పుడు, ‘ఫ్యామిలీ’తో ఆగస్టు మొదటి వారంలో నాలుగు రోజులు ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చారు. మళ్ళీ 2024 లో ‘కూటమి’ 164 సీట్లు గెలిచిన రెండేళ్ళు గడవక ముందే, ఓడిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్ధిగా కాకుండా, అతని మతం ఎత్తిచూపుతూ ‘క్రిస్టియన్’ అంటూ లక్ష్యం చేస్తుంటే, జగన్ చేస్తున్నది ఏమిటి?

గతంలో సంగ్మా సోనియాను అడిగాడు, “ఈ పదవుల కోసం ఇలా నీ విశ్వాసాన్ని వొదులు కుంటావా?” అని. అయితే, ఏపీలో జరుగుతున్నది అందుకు భిన్నం. ఎవ్వరూ అడగకుండానే జగన్ తనని తాను ‘ప్రూవ్’ చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, స్వంత పార్టీ పెట్టుకుని, ఒక ‘టర్మ్’ ప్రభుత్వంలో ఉంటూ తనని తాను నిరూపించుకుని కూడా ఘోరంగా ఓడాడు. కనుక, వంచడానికి ఇనుము ఎర్రగా కాలినప్పుడే పైన సమ్మెట దెబ్బ పడాలి.

జగన్ ను ఓడించాము కనుక, ‘విశ్వాసం’ అనే వ్యక్తిగత సున్నితాలపై దాడి చేసి అతణ్ని బలహీనపర్చాలి. ఏమయింది? సోనియా మాదిరిగా ఇక్కడ రాజీలేదు సరికదా, ఎదురొడ్డి మరీ జగన్ నైతికంగా బలపడుతున్నాడు. గెలిచింది 11 సీట్లు అయినా ‘క్లీన్ ఇమేజి’తో రెండేళ్లకే అతడు ‘పవర్ సెంటర్’గా మారాడు. జాతీయ మీడియాలో ‘కూటమి’ స్వీయ ప్రచారానికి కూడా ‘జగన్’ను తమతో ‘క్యారీ’ చేయక తప్పడం లేదు. ఇలా డిల్లీకి జగన్ వొక ‘సదరన్ స్పైస్’గా మారుతుంటే, దాన్ని ‘పాన్ ఇండియా’ ప్రొడక్టు చేస్తున్న నాయుడు ‘విజన్’ ఇప్పుడొక అతి పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది!


Read More
Next Story