జగన్ ‘మాకేమిటి’ తీరు మారేది ఎప్పుడు?
x

జగన్ ‘మాకేమిటి’ తీరు మారేది ఎప్పుడు?

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది కేవలం సాంకేతికం. అది లేదని ప్రజారంగం బాధ్యతల నుంచి దూరంగా ఉండడం ఎవ్వరూ హర్షించరు.


జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగిందీ అనేది తెలియనివారు లేరు. రాజకీయ పార్టీ స్థాపించి ఈ పదిహేనేళ్ళలో ఒక టర్మ్ ప్రతిపక్ష నాయకుడిగా మరొక టర్మ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే, ఇప్పుడు ఆయన ఉన్నది ప్రత్యేకమైన పరిస్థితి కనుక, ఇక ఆయన ‘ప్రోగ్రాం’ ఏమై ఉండాలి అనేది ఒక్కటే ప్రస్తుత విషయం. అయితే అది ఆయన ఒక్కడి సమస్య కాదు. ఇతరుల జోక్యం అందులో ఉండకూడదు అంటే కుదరదు. కారణం గతంలో ఆ రెండు హోదాలు ఆయన ‘పబ్లిక్ లైఫ్’లో ఉంటాను... అని బయటకు వస్తే, అందుకు ప్రజలు ఇచ్చినవి.

అలాగే గత ఏడాది ఓడిన ఎన్నికలో ఓటు వేసిన 40 శాతం ఆ పార్టీతో ఉన్నారు. దాంతో ఆ పార్టీ ‘ప్రోగ్రాం’ ఏమైనా అందులో ప్రజాహితానికి విధిగా చోటు ఉండాలి. ప్రతిదీ... ‘మన పార్టీకి ప్లస్సా మైనెస్సా?’ అని తూకం వేస్తే కుదరదు. పార్టీ పెట్టి 15 ఏళ్ళు దాటాక, దాని పటిష్టత చూసుకోవడానికి ఆ యంత్రాంగం ఎటూ ఉండనే ఉంటుంది, కొత్తది చేరుతూనే ఉంటుంది. అయినా అది వారి స్వంత విషయం, దానికి మాత్రమే ఇక్కడ విషయం పరిమితమై లేదు. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టడంలో ప్రధాన పార్టీగా దాని పాత్ర కీలకం కావాలి. కానీ తొలి ఏడాదిలో ఆ దిశలో జగన్ ఆలోచనలు ఉన్నట్టుగా ఇప్పటికి కనిపించడం లేదు.

కనీసం రెండవ ఏడాదికి ఆ పార్టీ ‘ప్రోగ్రాం’ మారాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది కేవలం సాంకేతికం. అది లేదని ప్రజారంగం బాధ్యతల నుంచి దూరంగా ఉండడం ఎవ్వరూ హర్షించరు. వేరే పార్టీకి ఓటు వేసినవారు కూడా అక్కడ తమ సమస్యలు పరిష్కారం కానప్పుడు, మళ్ళీ ఎన్నికల వరకూ వాళ్ళు చూసేది ప్రతిపక్షం వైపే. పదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం అయ్యాక, ఐదేళ్ళ క్రితం కొత్త ప్రాంతీయ పార్టీ నుంచి తొలి ముఖ్యమంత్రి అయ్యాక, మీ పార్టీతో గాని మీతోగాని ఇప్పటికే ‘కనెక్ట్’ ఏర్పడిన వ్యక్తులు ఎన్నో సమూహాలుగా ఉంటాయి. ఒక ‘లీడర్’ పట్ల ప్రజలు నమ్మకం పెంచుకోవడానికి కారణాలు కొన్నిసార్లు, ఇద్దరికీ కూడా తెలియదు.

కనుక వారి ఆశలు తీర్చలేకపోయినా... కనీసం వాటిని ‘అడ్రెస్’ చేస్తే, ప్రజలు ప్రభుత్వానికి దగ్గర అవుతారు. నిజానికి అందుకోసం పార్టీలు అవి ఎంత చిన్నవైనా నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ‘వ్యవస్థలు’ తన ప్రజలకు నమ్మకం కలిగించడం చాలా అవసరం. తమ సమస్యల్ని ప్రభుత్వాలు సకాలంలో ‘అడ్రెస్’ చేయక, ఏళ్ల తరబడి నిస్పృహతో ప్రజల్ని నిరీక్షణలో ఉంచిన సరిహద్దు రాష్ట్రాల నుంచి దేశం అనేక సమస్యల్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నది. ఇన్నాళ్ళ తర్వాత వాటిని కూడా పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కనిపిస్తున్న కొత్త- ‘ట్రెండ్’.

సంకీర్ణ రాజకీయాలతో స్థిర ప్రభుత్వం నమూనాను 2004లో ‘యూపీఏ’ దేశానికి చూపించింది. కానీ, దానికి ‘సరళీకరణ’ హంగులు అద్ది చంద్రబాబు సంస్కరణలు మొదలైన ఐదేళ్ళకే 1995నుంచి ఎంతో విజయవంతంగా వాడి మరీ దేశానికీ చూపించాడు. ఆయన ‘పొలిటికల్ స్కూల్’ రాజకీయాలలో పైకి కనిపించని లబ్దిదారులు ఎక్కువ. జగన్ ప్రభుత్వంలో ఆయనకు తగ్గడం ఎక్కడో తెలిసింది కనుక, ఇప్పుడు అనుమానం లేదు ఆయన మిత్రపక్ష రాజకీయంతో ఐదేళ్ళు నెగ్గుకు రాగలరు.

సోషల్ మీడియా వల్ల ఏర్పడిన కొత్త ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’తో యువత రాజకీయ అవగాహన వేగంగా పదునెక్కుతున్నప్పటికీ, ఆయన తన పాత ‘టెక్నిక్స్’తో నెట్టుకొచ్చే ప్రయత్నం మానలేదు. సమకాలీకుడు మహారాష్ట్ర లోని శరద్ పవార్ మాదిరిగా బాబుది సాంప్రదాయ ‘అభివృద్ధి-సంక్షేమం’ భాష మాట్లాడే టైపు కాదు. ఏదైనా కొత్త విషయం దొరికితే చాలు, దాని ఆనుపానులు తెలియకపోయినా, ముందుగా దాన్ని తానే పైకి అని ముందు దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే, ‘నేను ముందే చెప్పాను’ అనడానికి రేపు అది పనికొస్తుంది. ఆ తర్వాత అది జరుగుతుందా లేదా అనేది వేరే విషయం.

అయితే అందరూ అలా ఉండలేరు. ఉండాలని కూడా ఎవరూ కోరుకోరు. మాదిగ ‘దండోరా’ విషయమే చూడండి, ‘అది నాదే...’ అని 2025 నాటికి ఆయన అసెంబ్లీలోనే అంటూ ‘మా అమ్మగారి ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయి’ అంటారు. గడచిన ముప్పై ఏళ్లలో దేశమంతా జాతుల సమస్యలు తలెత్తాయి, వాటిని సకాలంలో ‘అడ్రెస్’ చేయడంలో ఇప్పటికే ఆలస్యం అయింది, వాటిలో ఇదొకటి అంటే, అందరికీ అది రుచించదు. పోనీ అదే విషయం జగన్ ‘జనరలైజ్’ చేసి- ‘రెండు ఉపకులాలు నాకు ఒక్కటే...’ అంటూ, ఆయన స్వంత పదం- ‘అవుట్ రీచ్’ వర్గాలకు నిజాయితీగా మేలు జరగాలి అని ఒక ప్రకటన చేయవచ్చు. కానీ తన ఓటర్లలో ప్రధాన భాగమైన ‘ఎస్సీ’ ఉపకులాల వివాదం గురించి ఆయన కిమ్మనరు.

అందుకే విజయానికి ‘క్లెయిం’దారులు ఎక్కువ అంటారు. అయినా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ చూపు వైశాల్యం పెద్దది కనుక, ప్రాంతీయ పార్టీలకు కనిపించే సూక్ష్మ స్థాయి అంశాలు దానికి కనిపించక పోవచ్చు. డెబ్బై దశకం చారిత్రిక నేపధ్యంలో 80’ల మొదట్లో పుట్టిన ప్రాంతీయ పార్టీ ‘టిడిపి’కి ఇప్పడు ఇంకా మిగిలిన కొత్త ‘ప్రోగ్రాం’ అంటూ ఏమీ లేదు. దానివద్ద ఉన్న అస్త్రాలు అన్నీ ఇప్పటికే అయిపోయాయి, కొన్నిపాత పడ్డాయి. అందుకే ప్రాంతానికి-ప్రజలకు సంబంధం లేని కొత్తకొత్త పదాలు ఏవో నిత్యం చెలామణిలో ఉంచి, వాళ్ళు రోజులు నెట్టుకొస్తున్నారు. ఇక జనసేన ‘రోడ్ మ్యాప్’ అంటే, అది డిల్లీ నుంచి వస్తుంది కనుక దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.

సామాజిక మాధ్యమాలు సృష్టిస్తున్న ఇప్పుడున్న ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో కొన్నాళ్ళకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే, మధ్య వయస్కులకు, రాష్ట్ర విభజన తర్వాత ‘చరిత్ర’ అనుకోవడం తేలిక అవుతుంది. వైసీపి మరో ప్రాతీయ పార్టీగా అది ‘పోస్ట్ రిఫార్మ్స్ పిరియడ్’ (పిఆర్పి)లో పుట్టడం వల్ల, మరో మూడు దశాబ్దాల పాటు నిలకడగా ఉండే ఆస్కారం యువ ప్రాంతీయ పార్టీగా కనిపిస్తున్నది.

అయితే అది ఎప్పుడు, అందరినీ సౌహర్ధ్ర సమావేశాలకు పిలిచి, ఇతర పార్టీలను జగన్ తన ‘టేబుల్’ చుట్టూ కూర్చోబెట్టుకున్నప్పుడు. ఇతరులతో పంచుకోవలసిన ‘కామన్ ఎజెండా’ ఆ పార్టీ వద్ద ఉన్నప్పుడు. జగన్ పార్టీకి ప్రజల్లో ఉన్న సమ్మతి దృష్ట్యా, అధికారంలో లేని చాలా పార్టీలు తమ ‘ఎజెండా’ అమలుకు దాన్ని వినియోగించుకోవచ్చు. మనమూ చూస్తున్నాం, ‘పిఆర్పీ’ కాలంలో- ‘రీ గ్రూపింగ్’, ‘విన్-విన్ సిట్యుయేషన్’ వంటివి కార్పోరేట్ రంగాల్లో అంగీకృతం కావడం.

దశాబ్దం కాలం పైబడి తమ భవిష్యత్తు నాయకుడిగా సిపిఐ డిల్లీ జే.ఎన్.యూ.లోని ఎ.ఐ.ఎస్.ఎఫ్. (AISF) నాయకుడు కన్హయ్య లాల్ ను చూసుకుంటే, గద్దలా కాంగ్రెస్ అతన్ని తన్నుకుపోయి యూత్ కాంగ్రెస్ నాయకుణ్ణి చేసి, బీహార్ ఎన్నికల కోసం అతనితో పాదయాత్ర చేయించడం చూస్తున్నదే! ఉనికి పోరాటం చేస్తున్న పార్టీలు మనవద్ద చాలా ఉన్నాయి. వెతికితే, ఒక్క కలెక్టరేట్ హెచ్ సెక్షన్ లో మాత్రమే వాటి జాబితా దొరుకుతుంది. వాటితో రాష్ట్ర స్థాయి ‘మైత్రి గ్రూప్’ కోసం జగన్ పిలుపు ఇవ్వగలిగితే, ఆయనకు మనవద్ద కూడా మరి కొందరు కన్హయ్యలు దొరుకుతారు.

Read More
Next Story