జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రైతుల్లో ఎందుకు వ్యతిరేకత??
x

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రైతుల్లో ఎందుకు వ్యతిరేకత??

జగన్ ఓటమికి రాజకీయ పరమైన అంశాలు కాకుండా ఇంకేం కారణాలు ఉండొచ్చు? వాటిపై రీసెర్చ్ స్కాలర్ చిన్న రంగయ్య ఈ వ్యాసంలో పరిశోధనాత్మక కథనం రాశారు.



-చిన్న రంగయ్య దండు

(రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)

రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడడమే తరువాయి. కానీ గత ప్రభుత్వం యొక్క భారీ ఓటమి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గత ప్రభుత్వాలు చేయనంత సంక్షేమం చేసినా ప్రజలు ఓడించారనేది ఆ పార్టీ నాయకుల వాదన. సోషల్ మీడియాలో అయితే కొందరు ప్రజలను నిందిస్తే, కొందరు టాంపరింగ్ అని చర్చిస్తున్నారు. కానీ నేను ఇలాంటి రాజకీయ పరమైన చర్చలోకి వెళ్ళకుండా ఒక సంవత్సర కాలంగా నా పరిశోధనలో భాగంగా గ్రామాల్లో తిరిగినప్పుడు గమనించిన కొన్ని అంశాలను ఇక్కడ చర్చిస్తాను.

పంట సాగుదారు హాక్కు చట్టం (2019):

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక భూ అధికృత సాగుదారు చట్టం (2011) కు కొన్ని మార్పులు చేసి పంట సాగుదారు హాక్కు చట్టం (2019) తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతుదారుడు పంట సాగుదారు హాక్కు కార్డులు పొందాలన్న, ప్రభుత్వ అందిస్తున్న వ్యవసాయపరమైన పథకాలు పొందాలన్నా భూ యజమాని యొక్క సంతకం అవసరం ఉంటుంది. మనం గమనించినట్లైతే దేశంలో చాలా వరకు కౌలు విధానం సాధారణంగా ఓరల్ గా జరుగుతుంది. దానికి కారణాలు వ్యవసాయ చట్టాలలో తీసుకొస్తున్న వివిధ రకాల చట్టపరమైన మార్పులు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే కౌలుదారుడు భూ యజమాని నుండి సంతకంతో కూడిన ఆమోద పత్రం తీసుకోవడం అనేది కష్టతరమైన అంశం. అదే 2011 లో ఉన్న భూ అధీకృత సాగుదారుల చట్టం అయితే కౌలు రైతులు పంట హక్కుదారుల కార్డ్ పొందాలంటే భూ యజమాని సంతకం అవసరం ఉండేది కాదు. కౌలుదారు కౌలుకు తీసుకొనే భూ వివరాలను దరకాస్తులో పొందుపరిస్తే సరిపోయేది. దానిని గ్రామా సభ ద్వారా స్థానిక ఎమ్మార్వోలు, విఅర్వోలు నిర్ధారించి కార్డ్స్ ఇచ్చేవారు.

రైతు భరోసా కేంద్రాలు:

వాస్తవానికి రైతు భరోసా కేంద్రాలు అనేది ఒక విప్లవాత్మకమైన అంశం అయినప్పటికీ దాని పని తీరుపైనే రైతులకు చాలా అసంతృప్తి ఉన్నది. రైతు భరోసా కేంద్రాలు రైతులకు పంట విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి అలాగే రైతులకు కాలానుగుణంగా వేసుకొనే పంటలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వంటివి వీటి ముఖ్య ఉద్దేశ్యం అయినప్పటికీ రైతులకు సదస్సులు ఏర్పాటు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించాయి. గత ప్రభుత్వాలకు కొనసాగింపుగా ‘పొలంబడి’ లాంటి అవగాహన సదస్స్లు ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి ఈ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఈ కేంద్రాలు రైతు అవసరాలను తీర్చడంలో రైతులకు కావాల్సిన మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడంలేదు అనేది ఎక్కువగా వినిపించేది. ఉదాహరణకు ఈ కేంద్రాలలో ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే లభిస్తాయి. అవి కూడా రైతు ముందస్తుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవాలి. అలాగే నేను ఫీల్డ్ చేసిన చాలా గ్రామాల్లో రైతులు అర్బికేస్ కన్నా ఎక్కువగా ప్రైవేట్ ఏజెన్సీస్ మీదనే ఆధార పడే వారు. ఎందుకు అని చర్చించినప్పుడు రైతులు ఎక్కువగా చెప్పిన విషయం ఏమిటంటే అర్బికేస్ లో రైతు పంటకు కావాల్సిన పెస్టిసైడ్స్ మందులు లభించేవి కావని చెప్పేవారు. ఒకవేళ రైతుకు అవసరమైన ఎరువులు లభించిన వాటి ఉపయోగంపై, మరియు సప్లిమెంట్స్ పై అవగాహన కల్పించే సిబ్బంది లేరు, ఉన్న వారు స్పందిచరు అని అనేవారు.

రైతు భరోసా వర్సెస్ వ్యవసాయ సబ్సిడీలు:

రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి 13500 ల వరకు డబ్బు సహాయం అందిస్తున్నప్పటికీ ఇది గత ప్రభుత్వాలతో పోలిస్తే అంతగా ఉపయోగ పడలేదని ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తున్న రైతుల్లో అధికంగా ఉన్నది. ఇక్కడ ప్రత్యక్ష్యంగా ఎందుకన్ననంటే చాలా మంది భూ యజమానులు వ్యవసాయం చేయకున్నా ఆ భూమి పై రైతు భరోసా లబ్ది పొందేవారు.


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడతలవారిగా ఇచ్చేది. ఆ డబ్బులు మాకు ఏ సీజన్లో కూడా కనీస ఇన్పుట్ సబ్సిడీగా కూడా ఉపయోగపడేది కాదు అని ఎక్కువ మంది రైతులు చెప్పారు.గత ప్రభుత్వాలు వివిధ రకాలుగా సబ్సిడీలు, మెటీరియల్ బెనిఎఫిట్స్ ఇవ్వడం ద్వారానే లబ్దిపొందామని ఎక్కువ మంది రైతులు చెప్తున్నా మాట. మెటీరియల్ బెనిఫిట్స్ అనేవి కొంతకాలంపాటు ఉపయోగంలో ఉంటూ రైతుకు ఫలితాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పారు. ఉదాహరణకు గత ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో డ్రిప్, స్పింక్లేర్ మరియు పండ్లతోటల అవసరాల నిమిత్తం ప్రూనింగ్ పరికారాలు ఇచ్చేవారు. వీటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నాం కదా అని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎన్నికలు దగ్గరపడే సమయానికి వివిధ పరికారాలు సబ్సిడీ కింద ఇస్తామని అధికారులు చెప్పిానా అది కార్యరూపం దాల్చలేదు.

ప్రభుత్వ మార్కెట్లు:

గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ మార్కెట్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. మార్కెట్లో జరిగే ధర నిర్ధారణ వేలంపాటను అప్రమత్తం పాటించాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నియంత్రణ కూడా ఉండేది కాదు. ఇది గత ప్రభుత్వాలలో ఉన్నప్పటికి ఈ ఐదు సంవత్సారాల కాలంలో మరింత దిగజారిందని చాలామంది రైతులు చెప్పారు. దీని వల్ల రైతులు ఎక్కువగా దళారులపైన, మరియు ప్రైవేటు మార్కెట్ వ్యవస్థల పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కొన్ని మార్కెట్లు నష్టాల్లో ఉండి ఒక మార్కెట్ నుండి ఇంకో మార్కెట్ ఆర్థిక వనరులు బదాలాయింపు జరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని ఒక ఎ.పి.ఎంసి. అధికారి చెప్పడం విశేషం.

గ్రామ సభలు:

గ్రామాల్లో ఎక్కువగా సామాజిక వివాహాలను, కౌలు రైతులను మరియు ఇంకా మరెన్నో గ్రామ సంబందిత అంశాలను నిర్ధారించే గ్రామసభలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి.

అసైన్డ్ భూముల చట్టం:

గత ప్రభుత్వాలు భూమి లేని కింది కులాలకు ఇచ్చిన భూములను అమ్ముకోవడానికి వెసులు బాటు కల్పించే చట్టం. వాస్తవానికి గత ప్రభుత్వాలు భూమి లేని కింది కులాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇచ్చిన భూములు అవి. అప్పట్లో అవి వ్యవసాయానికి అనుకూలంగా లేనప్పటికీ చాలా కుటుంబాలు వాటిని తయారుచేసుకొని వ్యవసాయయోగ్యంగా మార్చుకున్నారు. కాని ఈ చట్టం వల్ల వాళ్ళ భూములు చేతులు మారతాయని ఆందోళన దిగువ కులాలు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులలో ఎక్కువగా ఉన్నది. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు వివిధ రకాల రుణాల రూపంలో అగ్రకుల భూస్వాముల చేతిలో ఉండిపోయాయి. ఈ చట్టం వాటి బదాలయింపును సులభతరం చేసింది. నేను పరిశోధనలో భాగంగా కొన్ని దళిత కుటుంబాలను సందర్శించినప్పుడు ఎక్కువ మంది పిల్లల వివాహాల కోసం, చదువుల కోసం, కొందరు ప్రభుత్వం ఇచ్చిన భూముల వ్యవసాయోగ్యంగా తయారుచేసుకోవడం కోసం వివిధరకాల కారణాల రీత్యా కొంత మంది పెద్ద రైతుల దగ్గర తాకట్టు పెట్టి రుణాలకు డబ్బులు తీసుకున్న వాటికి నేటికి వడ్డీలు కడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా వాటి బదలాయింపు సులభతరం చేశారనే ఆందోళన వారిలో ఎక్కువగా కనిపించేది.

పట్టాదారు పాస్ బుక్:

పట్టాదారు పాస్ బుక్ పై సి.యం. బొమ్మ ఉండడం కుడా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను కొంత ఆందోళనకు గురి చేసింది. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత పని నిమిత్తం నేను ఒక వైశ్య హోటల్ సందర్శించినప్పుడు ఆ హోటల్ యజమాని మా భూములు ఏమైనా పోతాయా అని నన్ను అడుగుతూ ఆందోళన వ్యక్తపరిచాడు.

ఈ విధంగా చాలా వరకు వ్యవసాయ సంబంధిత ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులలో వ్యతిరేకతను సృష్టించాయి. ప్రస్తుతం ఏర్పడుతున్న ప్రభుత్వం వీటిపై శ్రద్ధ వహించి సమూల మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Read More
Next Story