నదుల నీళ్లన్నీ తోడేస్తాను అంటున్న చంద్రబాబు, అపుడేమవుతుంది?
x

నదుల నీళ్లన్నీ తోడేస్తాను అంటున్న చంద్రబాబు, అపుడేమవుతుంది?

సాధ్యాసాధ్యాలు ఏంటి? నది గతి మారితే పర్యావరణ ముప్పు తప్పదంటున్న నిపుణులు


"నదుల అనుసంధానం నా కల.. లక్ష్యం దిశగా సాగుతా.. నదుల అనుసంధానం తో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది " ఇవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్న మాట. మరి ఈ నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలు ఏంటి? ఈ కార్యాచరణ చేపడితే భారీగా నిధులను ఎలా సమకూరుస్తారు? నదుల సహజ స్వరూపాన్ని మార్చితే అనర్థాలు చోటుచేసుకోవా? ఈ ప్రశ్న పర్యావరణ వేత్తల నుంచి ఎదురవుతోంది. అయితే , చంద్రబాబు ప్రణాళికలలో అన్ని నదులను అనుసంధానం చేయడం ఒక కీలక లక్ష్యం. గ్రామాభివృద్ధి కి ఇదో మార్గమని, వర్షాలు లేకపోయినా సాగునీరు అందించడం సాధ్యమని ఆయన చెబుతున్నారు. నీటిపారుదల, సాగు, గ్రామీణ అభివృద్ధి,అనే మూడు అంశాలే నదుల అనుసంధానం ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశ్యం అని చంద్రబాబు చెప్పారు.

నదుల అనుసంధానం అంటే...

ఒక ప్రాంతంలో నీటి కొరత, మరో ప్రాంతంలో వరద వున్నప్పుడు నీటిని ఒక నది నుండి తీసుకొని కాలువలు, రిజర్వాయర్లు, లిఫ్ట్ స్టేషన్ లో ద్వారా మరో నదిలోకి పంపి నీటి పంపిణీ లో సమతుల్యం సాధించడమే.ఏపీ విషయానికి వస్తే గోదావరి జలాలను కృష్ణ నదిలో కలిపే చర్యలు చేపట్టారు. 2015 లో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కృష్ణ లో కలిపారు.దాని నిర్వహణ, నిధులు వ్యయం గురించి అట్లుంచితే పోలవరం - బనకచర్ల అదే ఇప్పుడు పేరు మార్చి నల్లమల సాగర్ ప్రాజెక్టు గా తెరపైకి తెచ్చారు. మరోపక్క గంగా - కావేరి అనుసంధానం కావాలని, తమ ఎన్డీయే ప్రభుత్వం ,తాను భగీరధ ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

దేశంలోని గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వచ్చే పదేళ్లలో నీటియుద్ధాలు చోటుచేసుకోవచ్చునని అమెరికా గూఢచార నివేదిక ఇటీవల ప్రమాద ఘంటికలు మోగించింది. దేశంలో జల సమతుల్యత లోపించిందని, 2050నాటికి అది వివిధ ప్రాంతాల్లో సంక్షోభానికి దారితీయవచ్చునని జాతీయ జలసంఘం 1999లోనే హెచ్చరించింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి నదుల అనుసంధానం ఏకైక మార్గం మన్న వాదనా కొందరు చేస్తున్నారు.

ఉత్తరాది నదుల్లో పుష్కలంగా ప్రవహిస్తున్న నీరు పూర్తిగా ఉపయోగపడక వృథాగా సముద్రం పాలవుతుంటే, దక్షిణాదిలో జలవనరులు పలుచోట్ల ఎండిపోతున్న దుస్థితి గుండెలు మెలిపెడుతున్నాయి.అందుకే ఈ కలల పథకం నదుల అనుసంధానం సాకారం చేసేందుకు నడుం కడతారా? దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలన్నది నీటిపారుదల నిపుణులు, పర్యావరణ వేత్తల అభిప్రాయం.

ముందు రివర్ బేసిన్ లో అవసరాలు తీర్చాలి

నదుల అనుసంధానానికి ముందు సాధ్యాసాధ్యాలు ఆలోచించాలని, ఏదో పెద్ద పెద్ద కాలువలు తవ్వగానే సరిపోదని ,ఒక నది నీటిని మళ్లిస్తే ,మళ్లించిన నీటిని నిల్వ వుంచడానికి భారీ జలాశయాలు నిర్మించాలని నీటి పారుదల నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్ పాపారావు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో అన్నారు." భారీ జలాశయాలు నిర్మించి వదిలేసినా ప్రయోజనం వుండదు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేసినప్పుడే పథకం సార్థకం అవుతుంది.

ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డిస్టిబ్యూటరీ వ్యవస్థ ను పుట్టించు కోవడం లేదు " అన్నారు.నదుల అనుసంధానం అంటూ భారీ కాలువలు తీసి నీరు అందులోకి పారిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ముందుగా ఏ నదియైనా దాని పరివాహక ప్రాంతాలు అవసరాలు తీర్చాలన్నారు.

"వర్షా కాలంలో నదులకు వరదలు వస్తాయి. ఆ సమయంలోనే నీరు సముద్రం పాలవుతోంది ,దానిని వినియోగించుకోవాలి.ఆ సమయంలో పక్క నదిలో కూడా వరద నీరు పుష్కలంగా వుంటుంది.భారీ జలాశయాలు నిర్మించి నీటిని నిల్వ చేస్తేనే ఉపయోగం.వరద లేని సమయంలో ఆ నీటిని వినియోగించుకునేలా వుండాలి.అలా ఎక్కడా ఆంధ్రా , తెలంగాణ తో సహా జరగడం లేదు. ఇంకా నదులు అనుసంధానం తో ఉపయోగం ఏంటి?" అంటూ పాపారావు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నదుల అనుసంధానం అనేది ఇప్పుడే వచ్చిన ఆలోచన కాదు 50 ఏళ్ల కింద నుంచే వచ్చింది అయితే ఎప్పటి పరిస్థితులు అప్పుడు అధ్యయనం చేయాల్సి వుందన్నారు.నీటి లభ్యత కూడా ఈ యాభై ఏళ్లలో తగ్గుతూ వచ్చిందన్నారు. ఏదైనా పెద్ద జలాశయాలు నిర్మాణం,పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేసుకోకపోతే నదుల అనుసంధానం ప్రక్రియ చెప్పడానికే బాగుంటుందని, అందుకే నీటి అవసరాలను ప్రజలు, రాజకీయ నేతలు అర్థం చేసుకోవాలని పాపారావు తెలిపారు.

సమగ్ర అధ్యయనం అవసరం

నదులు అనుసంధానం అయితే నీటి కారువనేదే వుండదని లెక్కలు చెబుతూ, సమస్యలు తీరిపోతాయి అను కోవడం పెద్ద పొరబాటని, దీని వెనుక సమగ్ర అధ్యయనం అవసరమని ప్రముఖ పర్యావరణ వేత్త బీవీ సుబ్బారావు అన్నారు. అందులో అనుసంధానం విషయంపై సుబ్బారావు ఫెడరల్ న్యూస్ తో మాట్లాడారు. నదుల అనుసంధానం విషయంలో పర్యావరణ పరిరక్షణ ను ప్రధానంగా దృష్టి లో పెట్టుకోవాల్సిన అవసరం వుందన్నారు. "ఉన్న నదుల ప్రొటెక్షన్, కంజర్వేషన్ ముఖ్యం.గోదావరి, కృష్టా నదీజలాల పెంపకం అంశంలోనూ ఆరు రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్,ఇంకో ట్రిబ్యునల్ అంటూ వాటాలలో అన్యాయం జరుగుతోందని కొట్టుకుంటున్నాయే గానీ, నదీ పరీవాహక ప్రాంతం పరిరక్షణలో బాధ్యత గా వ్యవహరించడం లేదు " అన్నారు . నదుల ప్రవాహాలను ఇష్టానుసారం అడ్డుకొని సముద్రం లోకి నీరు పోకుండా చేస్తే వచ్చే ఉపద్రవాలకు ఆరల్ సముద్రం ఘటనే ఒక ఉదాహరణ గా తెలిపారు.

"అరల్ సముద్ర విపత్తుకు ప్రధాన కారణం, 1960ల నుండి సోవియట్ యూనియన్ పత్తి సాగుకు మద్దతు ఇచ్చే నీటిపారుదల ప్రాజెక్టుల కోసం దాని రెండు ప్రధాన వనరులైన అము దర్యా , సిర్ దర్యా నదుల నుండి నీటిని అధికంగా ఉపయోగించడం. దీని వలన అరల్ సముద్రం ఎండిపోయింది.సముద్రతీర ప్రాంతానికి తీవ్రమైన పర్యావరణ నష్టం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు నదుల అనుసంధానం జరిగితే ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన వాటిని కోల్పోయి ప్రకృతి ప్రకోపాన్ని కూడా చూడాల్సి వస్తుంది " అని ఈ పర్యావరణ వేత్త తెలిపారు.

సముద్రాల మనుగడకు నదుల నుంచి వెళ్లి అందులో కలిసే నీరే ప్రధానమని ఆ సంగతిని కూడా మర్చిపోకూడదని అభిప్రాయపడ్డారు." చిన్న నది, పెద్ద నంది అన్నది ముఖ్యం కాదు. దాని నైసర్గిక స్వరూపం, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయాలి.నీటిని వస్తువుగా చూడటం అనే ఆలోచన తప్పు " అని సుబ్బారావు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ తో సహా ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా సరియైన ఆపరేషన్, మెయింటెయిన్ చేయడం అత్యంత ముఖ్యం కాని అది జరగడం లేదని తెలిపారు. "పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల తప్పుడు ఆలోచనలతో నదుల స్వభావాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు.నీటి అవసరాలు విషయంలో రక్షణ, పరిరక్షణ అవసరం. కట్టడి చేయాలని చూస్తే, జీవకోటి మనుగడకు ప్రమాదం " అని చెప్పారు.

భారీ ప్రాజెక్టులు నిరుపయోగం - నాలుగు జలాల భావన పై దృష్టి పెట్టాలి

నదుల అనుసంధానం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ నేత, జాతీయ ప్రకృతి వైపరిత్యాల నివారణ సంస్థ మాజీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి , భారీ ప్రాజెక్టుల నిర్మాణం తో ఉపయోగం లేదన్నారు. మనకున్న నీటి వనరులన్నింటిని సద్వినియోగం చేసుకుంటే నీటి కొరత వుండదన్నారు. "రిటైర్డ్ ఇంజనీర్ టి హనుమంతరావు ప్రతిపాదించిన “నాలుగు జలాలు” భావనను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి, ఆ భావనకు అనుగుణంగా కార్యాచరణ చేపడితే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు " అన్నారు.ప్రధాన ప్రాజెక్టుల కంటే చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

"మహారాష్ట్ర అత్యంత విస్తృతమైన నీటిపారుదల మౌలిక సదుపాయాలు , అత్యధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయినప్పటికీ ఇది అత్యధిక సంఖ్యలో రైతు ఆత్మహత్యలను కలిగి ఉంది. పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి, ఖచ్చితంగా చిన్న రైతులకు కాదు" అని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తెలిపారు. . వరద నీటిపై ఆధారపడిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు."వరదనీరు రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. అటువంటప్పుడు నీటి వనరులపై ఆధారపడిన పెద్ద ప్రాజెక్టులపై ప్రభుత్వాలు భారీ మొత్తాలను ఖర్చు చేయడం సమంజసం కాదు" అన్నారు.బనకచెర్ల ప్రాజెక్టును పునఃపరిశీలించాలని, దాని సాధ్యాసాధ్యాలను తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆయన కోరారు.

మరోవైపు తెలంగాణ లో ప్రతిపాదిత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉటంకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.7,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోందని ఆయన అన్నారు.అంటే ఒకే పంట సీజన్‌లో ఎకరానికి సగటున రూ.7 లక్షలు.

"నాలుగు జలాల భావనతో, అదే ప్రాంతాన్ని కేవలం రూ. 150 కోట్లతో కవర్ చేయవచ్చు , ఇది దీర్ఘకాలిక ప్రాతిపదికన కరువును పరిష్కరిస్తుంది" అని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఎత్తి చూపుతూ, ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆయన ప్రశ్నించారు.

భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. ఏకత్వంలో భిన్నత్వానికి ఇక్కడి వాతావరణం సూచిక. ఉత్తరాదిలో వరదలు వెల్లువెత్తి వూళ్లకు వూళ్లను ముంచెత్తుతున్న సమయంలోనే దక్షిణ భారతంలో తీవ్ర కరవు కాటకాలు తాండవిస్తుంటాయి. దేశంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిలోనే తాగునీటికి కటకట ఏర్పడితే, మరోవైపు రాజస్థాన్‌లోని థార్ ఎడారి అనుకోని వర్షాలతో తడిసి ముద్దవుతుంది. అటు వానల దరువు, ఇటు చినుకే కరవు. రెక్కలు తెగిన బడుగు రైతుకు, బతుకే బరువు! మంచి వర్షాలు కురిసినా- సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఈ దురవస్థ ఎల్లకాలం కొనసాగాల్సిందేనా? లేకేం, భేషుగ్గా ఉంది. అదే, నదుల అనుసంధానం. అయితే ఈ అనుసంధానం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా సమగ్ర అధ్యయనంతో జరిగిన నాడే ఫలితం వుంటుందనే దే జలవనరుల నిపుణులు, పర్యావరణ వేత్తలు చెబుతున్న మాట.

Read More
Next Story