
పుట్టపర్తి సాయిబాబా, ఎన్టీఆర్
పుట్టపర్తి సాయిబాబాని ఎన్టీఆర్ ఎందుకు దర్శించుకోలేదు?
పుట్టపర్తి సాయిబాబా అసలు పేరేమిటీ, ఎందుకంత ప్రాచుర్యం లభించిందీ? ప్రజలకు ఆయన అందించిన సేవలేమిటీ?
(దివి కుమార్)
ఒక ముస్లిం అయిన షిరిడి సాయిబాబా అవతారంగా తాను జన్మించానని ప్రకటించుకున్న పుట్టపర్తికి చెందిన రత్నాకర సత్యనారాయణ రాజు, కాలక్రమంలో సత్యసాయిబాబాగా పేరు పొందారు. హిందూ - ముస్లిం - క్రిస్టియన్ మతాల ఉమ్మడి చిహ్నం తనదిగా ఆయన చెప్పుకున్నారు. భక్తులు దానినే స్వీకరించారు. ఒక రకంగా ఇది కూడా షిరిడి సాయిబాబా సందేశానికి కొనసాగింపే! మతసామరస్య సంస్కృతికి దోహదపడేదే!!
షిరిడి సాయిబాబా 1918లో మరణిస్తే, పుట్టపర్తి సత్యనారాయణ రాజు 1926లో జన్మించారు. 1940వ దశకoలో ఈయన తన పేరును సత్యసాయిబాబాగా మార్చుకున్నారు. నాకు తెలిసి 1960వ దశకoలో పుట్టపర్తి సత్యసాయిబాబా మహత్యాల ప్రచారం గ్రామాల స్థాయికి వచ్చింది. నాకు అప్పటికీ షిరిడి సాయిబాబా పేరు తెలియదు. సుమారుగా 1980వ దశకoకు ముందు షిరిడి బాబా పేరు తెలియ రావటమే కాకుండా, అది చాలా వేగంగా ఆంధ్రదేశంలో విస్తరించింది.
1993 జూన్ 6వ తేదీన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆరు హత్యలు జరిగిన సందర్భంగా పత్రికలు అందించిన వార్తలు పుట్టపర్తి బాబా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. దానిని నిలుపుకోవటానికి ఆయన సుమారు 2 వేల కోట్ల రూపాయల తాగునీటి పథకాన్ని రాయలసీమ వాసులకు కల్పించవలసి వచ్చింది.
నాకు అర్థమైనంత వరకు షిరిడి బాబా మరణానంతరం, ముఖ్యంగా బొంబాయి సినీ పరిశ్రమ ప్రముఖులు కల్పించుకున్న తర్వాత ఆయన కీర్తి ప్రతిష్టలు బాగా విస్తరించుకున్నాయి.
ఆయన జీవిoచి ఉన్నకాలంలో ఇంతమంది ప్రముఖులను ఆయన ఆకట్టుకున్నట్లుగానీ అందుకు ప్రాచుర్యంగానీ ఉన్నట్లు దాఖలాలు లేవు. లోకమాన్య బాలగంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే ఆయనను సందర్శించటానికి వచ్చారని భక్తులు చెప్పుకోవటమే గాని అందుకు తగిన నిదర్శనాలు లేవు. అదే సమయంలో ఆయన పట్ల ఎలాంటి వివాదాలు రేగినట్లు కూడా లేవు.
పుట్టపర్తి బాబా పేరు ఆయన జీవించి ఉండగానే అనేక వివాదాల మధ్యన దేశదేశాంతరాల స్థాయిలో విస్తరించుకుంది. మన దేశపు ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య, అముఖ్య మంత్రులు అనేక రాజకీయ పార్టీల ప్రముఖులు ఆయనను సజీవంగా దర్శించుకున్నారు. అదే సమయంలో పుట్టపర్తి బాబా గారడి విద్యలతో ప్రజలను మోసం చేస్తున్నాడనే తీవ్ర విమర్శలు కూడా చాలా ఉన్నాయి. అలా విమర్శలు చేసిన వారిలో తెలుగు వారే కాక ఇతర భారతీయులు ఇంకా విదేశీయులు కూడా ఉన్నారు.
32 సంవత్సరాల క్రితం 1993 జూన్ 6వ తేదీన పుట్టపర్తి సత్యసాయి నిలయంలో ఆరుగురు యువకుల హత్య జరిగింది. ఆనాటి పత్రికల వార్తల ప్రకారం ప్రశాంతి నిలయంలో అశాంతి చాలా ఉన్నట్లు అందుకు స్వయంగా పుట్టపర్తి బాబానే కారకుడైనట్లు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. స్వయంగా ప్రభుత్వాలు పుట్టపర్తి బాబాను భారత రాజ్యాంగ చట్టానికి అతీతునిగా చేసి వ్యవహరించాయి. ఆయన్ను రక్షించడానికి పూనుకున్నాయి.
ఆ విధంగా ప్రభుత్వాలే చట్టాన్ని ఉల్లంఘించాయి.
ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టపర్తి హత్యలపై విచారణకు పోలీసు శాఖలను ఆదేశించాయి. అయితే వాటి నివేదికలను ప్రజల దృష్టికి తీసుకు రాకుండా తొక్కిపట్టాయి. ప్రభుత్వాలు భక్తుల మనోభావాలు గాయపడకుండా చూడటం అనే సాకుతో, భక్తులను మోసానికి గురి కాకుండా చూడవలసిన తమ చట్టబద్ధ బాధ్యతను విస్మరించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ (హెచ్) ఒకటి ఉన్నట్లే ఎరగని వాళ్ళు లాగా ప్రవర్తిస్తున్నారు.
హైదరాబాదులోని సత్య సాయి నిగమాగమనిగం భవనంలో ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారికి పుట్టపర్తి బాబా తన స్వహస్తాలతో బంగారు గొలుసును గాలిలో సృష్టించి అందించాలని చేసిన ప్రయత్నం దూరదర్శన్, డెక్కన్ క్రానికల్ ఇతర ఫోటోగ్రాఫర్ల
కెమెరాలకు దొరికిపోయి అది కేవలం ఒక హస్త లాఘవ విద్యగా రుజువైపోయింది. అయినా ప్రభుత్వాలు పుట్టపర్తి బాబాను కాపాడటానికి కంకణం కట్టుకున్నాయి. ఆత్మవంచకుల జాబితాలో చేరిపోయాయి.
ఆ పరిస్థితులలో తన నైతికశక్తిని కోల్పోయి, ప్రజలలో పలచనైపోయిన సత్య సాయిబాబా రాయలసీమ నీటి పథకం ద్వారా తిరిగి దానిని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా పేరు పొందిన పుట్టపర్తి బాబా, ప్రజలకు భౌతిక వనరులను సమకూర్చడం ద్వారా తాను కోల్పోయిన పరువు ప్రతిష్టలను నిలబెట్టుకోవాలనే భౌతిక లంపటత్వపు వ్యామోహానికి గురయ్యారు.
పుట్టపర్తి బాబా ప్రజా ప్రయోజనాల కోసం చేసిన పనులను ప్రభుత్వాలు ఆకాశానికి ఎత్తి నేడు పొగుడుతున్నాయి. పైన పేర్కొన్న ప్రజా సేవల్ని అందించాల్సిన ప్రభుత్వాల వైఫల్యం అందులో ఇమిడి ఉంది. ఈ సత్యాన్ని గుర్తించకుండా బాబాలో 'సత్యాన్ని' వీరు వెతుకుతున్నారు. ఒక వ్యక్తి చేయగలిగిన పనిని, తాము చేయవలసి ఉండి కూడా చేయలేక పోయినందుకు మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి.
అన్యమతస్తుల ద్వేషమే సనాతనంగా తమ అబద్ధాల ఫ్యాక్టరీ ద్వారా ప్రచారం గావిస్తున్న హిందూత్వవాదులు, షిరిడి సాయిబాబా ముస్లిం కనుక ఆయనకు పూజలు చేయకూడదు, గుళ్ళు గోపురాలు నిర్మించకూడదు, షిరిడీకి వెళ్ళకూడదు అంటూ ఇటీవల అడ్డగోలు ప్రచారాలు సాగిస్తున్నారు. తనను తాను షిరిడి బాబా అవతారంగా చెప్పుకున్న పుట్టపర్తి సత్యసాయి బాబాను, సనాతన వాదులమని ఆత్మవంచన చేసుకునే ఈ హిందుత్వ శక్తులు దేవుని అవతారంగా ఎలా కీర్తిస్తున్నారు? హిందూ - ముస్లిం - క్రిస్టియన్.... మూడు మతాల సారం తాను అన్నట్లు వాటి గుర్తులతో నిరంతరం ప్రచారం చేసుకున్న సత్య సాయిబాబాను విమర్శలకు అతీతునిగా ఎందుకు నిలబెడుతున్నారు? ఇది వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట కాదా!
పుట్టపర్తిలో జరిగిన తరహా హత్యలే షిరిడి సాయి జీవించి ఉండగా ఆయన నివసించిన ద్వారకామయిలో కనుక జరిగి ఉంటే ఈపాటికి వీరు పల్లె - పట్నం ఏకం చేసి మాధ్యమాలనన్నీ విపరీత ప్రచారాలతో ముంచేత్తే వారు కాదా? మతదృష్టి సత్యానికి పొరలు కమ్మిస్తుంది అనేదానికి ఇది స్పష్టమైన ఉదాహరణ.
మరొక్క జ్ఞాపకంతో దీన్ని ముగిస్తాను. 1970వ సంవత్సరంలో విడుదలైన "కోడలు దిద్దిన కాపురం" ఎన్టీ రామారావు గారి సొంత సినిమా. అందులో పుట్టపర్తి బాబాని తలపించే వేషంతో ఒక దొంగ బాబా పాత్రను సత్యనారాయణతో చేయించారు. దానిని చూసిన వారందరూ పుట్టపర్తి బాబా మోసగాడని భావించేటట్లు సినిమా తీశారు. సినిమా తీసిన వారి ఉద్దేశ్యం ఏదైనా ప్రేక్షకులు అలాగే భావించారు.
పుట్టపర్తి బాబాకు సుమారు సమవయస్కుడైన ఎన్టీఆర్ తన జీవితకాలంలో కానీ, రాజకీయ ప్రవేశం జరిగి ముఖ్యమంత్రి అయిన తరువాత గానీ ఒక్కసారి కూడా పుట్టపర్తి బాబాను దర్శించుకోలేదు, అలా అని ఎన్టీ రామారావు నాస్తికుడు కాదు, పరమ భక్తుడు కూడా. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
(రచయిత- జనసాహితీ అధ్యక్షుడు, వ్యాసకర్త, జర్నలిస్టు)
Next Story

