
మాధవ్ ఎంపికలో బీజేపీ అధిష్టానం లెక్కలేంటి?
ఏపీ రాజకీయాల్లో ఏమాత్రం రాజకీయ ప్రాతినిధ్యం లేని ఒక బిసి సామాజికవర్గానికి చెందిన మాధవ్ ఎంపిక లక్ష్మమేమిటి?
అనేక ఊహాగానాలు, తర్జనభర్జనల అనంతరం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. తద్వారా బీజేపీ వర్గాలనే కాకుండా ఇతర పార్టీలవారినీ మరోసారి అధిష్టానం నివ్వెరపరిచింది. అందులోనూ రాష్ట్రంలో బలమైన కాపు, రెడ్డి, కమ్మ సామాజికవర్గాలను విస్మరించి బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం ద్వారా ఆ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన పీవీఎన్ మాధవ్ బీసీ సామాజికవర్గానికి చెందినవారు. అందులోనూ బీసీల్లో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న యాదవ, గౌడ, తూర్పు కాపు, కొప్పుల వెలమ, పొలినాటి వెలమ, కురుబ, వాల్మీకి తదితర సామాజికవర్గాలకు చెందినవారు కాకపోవడం గమనించదగ్గ విషయం. ఏపీ రాజకీయాల్లో ఏమాత్రం రాజకీయ ప్రాతినిధ్యం లేని రజక సామాజికవర్గానికి చెందినవారు పీవీఎన్ మాధవ్ అని తెలుస్తోంది.
మరి బలమైన అగ్ర వర్ణాలు, బీసీల్లో బలమైన వర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా మాధవ్‌కు ఏపీ పగ్గాలు అప్పగించడంలో అసలు బీజేపీ అధిష్టానం వ్యూహమేంటనేది హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మూడు బలమైన సామాజికవర్గాలు.. మూడు ప్రధాన పార్టీల వెంట నడుస్తున్నాయని అభిప్రాయం ఉంది. ఇందులో కమ్మలు తెలుగుదేశం పార్టీ వైపు, కాపులు జనసేన పార్టీ వైపు, రెడ్లు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు సామాజికవర్గాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదని ఆ పార్టీ అధిష్టానం భావించిందని టాక్ నడుస్తోంది.
అలాగే బీసీల్లో బలమైన యాదవ (కురుమలతో కలిపి), గౌడ (శెట్టి బలిజ, ఈడిగలతో కలిపి), చేనేత (గవర), మత్స్యకారులు (అగ్నికుల క్షత్రియ, జాలరి/పల్లెకారి) టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేనల్లో ప్రధానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీల్లో రాజకీయంగా అంతగా అవకాశం లేని వర్గం (రజక)ను అధిష్టానం ఎంచుకుంది. తద్వారా బీసీల్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో రాజకీయ అవకాశాలు దక్కించుకోలేకపోయిన రజక, కుమ్మరి, మేదర, విశ్వ బ్రాహ్మణులు, సూర్య బలిజ, వడ్డెర తదితర అట్టడుగు బీసీ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక జరిగిందని అంటున్నారు. తద్వారా తాము అట్టుడుగు వర్గాలకు సైతం అవకాశాలు కల్పిస్తామని.. ఆ వర్గాలకు భరోసా ఇవ్వడం, రాజకీయ అవకాశాలు దక్కించుకోలేని మిగతా సామాజికవర్గాలను ఆకట్టుకోవడం వంటివి బీజేపీ వ్యూహంగా భావించవచ్చు. ఇందులో భాగంగానే మాధవ్ ఎంపికను చూడాల్సి ఉంటుంది.
మాధవ్ ఎంపిక ద్వారా బీజేపీ అధిష్టానం చెప్పదల్చుకున్న అంశం మరొకటి ఉంది. పార్టీని నమ్ముకుని ఉంటే, విధేయతతో ఉంటే ఎప్పటికైనా మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం. పీవీఎన్ మాధవ్ తండ్రి చలపతి మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. తన తండ్రి బాటలోనే పీవీఎన్ మాధవ్ కూడా బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. మాధవ్ సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా శాసనమండలిలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించే చాన్సు కూడా కల్పించింది. దీంతో మాధవ్ ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఆ తర్వాత 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కూడా మాధవ్‌కు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో మాధవ్ ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. అయినప్పటికీ పార్టీనే నమ్ముకుని నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతను, గతంలో ఆయన తండ్రి చలపతి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం మాధవ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించింది. తద్వారా తాము విధేయతకు, పార్టీకి అందించిన సేవలకు పెద్దపీట వేస్తామనే విషయాన్ని బలంగా చాటిచెప్పింది.
ఇప్పటివరకు బీజేపీ ఏపీ అధ్యక్షులుగా చేసినవారిలో కమ్మ సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువ. వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. అయితే వీరు అధ్యక్షులుగా ఉన్న కాలంలో రాష్ట్రంలో బీజేపీని బలపడకుండా చేశారని, టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేవారనే ఆరోపణలు వారిపై వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి కమ్మ సామాజివర్గానికి బీజేపీ అధిష్టానం పదవి ఇవ్వలేదని సమాచారం. ఇప్పటివరకు అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మరోసారి పొడిగింపు లభిస్తుందని, చంద్రబాబు కూడా పురందేశ్వరిని కొనసాగించాలని బీజేపీ అధిష్టానానికి సూచించారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ఇందుకు కారణం పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించుకోవడం వల్లేన ని తెలుస్తోంది.
ఇక దగ్గుబాటి పురందేశ్వరికి ముందు బీజేపీ ఏపీ అధ్యక్షులుగా కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఆ తర్వాత పరిణామాల్లో కన్నా టీడీపీలో చేరి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అటు సోము, ఇటు కన్నా హయాంలోనూ అధికార పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పార్టీని బలోపేతం చేయడం లేదని, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేయడం లేదని వీరిద్దరిపై విమర్శలు రేగాయి. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సీటును దక్కించుకుని ఎమ్మెల్యే పదవితో సర్దుకుపోయారు. ఇక సోము వీర్రాజు గత ఎన్నికల్లో రాజమండ్రి లేదా అనపర్తి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. అయితే అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ పార్టీనే నమ్ముకుని ఉండటంతో ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.
రాష్ట్రంలో మూడు బలమైన ప్రధాన సామాజికవర్గాలు కాపు, కమ్మ, రెడ్లులలో ఎక్కువ శాతం మంది ఆయా పార్టీలయిన జనసేన, టీడీపీ, వైఎస్సార్‌సీపీ వైపు ఉండటంతో బీజేపీ అధిష్టానం బీసీలను నమ్ముకుంది. అందులోనూ బీసీల్లో అట్టడుగు వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు కదిలింది. అందులో భాగంగానే పీవీఎన్ మాధవ్‌కు చాన్సు ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో 2019 ఎన్నికల తర్వాత ఆయా పార్టీల నుంచి బీజేపీలోకి జంపైన చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి (ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యే), సీఎం రమేశ్ (అనకాపల్లి ఎంపీ), సుజనా చౌదరి (విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే) వంటివారిని పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. వీరంతా అగ్ర వర్ణాలకు చెందినవారే కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు అగ్ర వర్ణాలవారే. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి బలమైన సందేశాన్ని ఆయా వర్గాలకు పంపిందనే చర్చ జరుగుతోంది.