మిట్టల్ స్టీల్  మీద ఉన్న ప్రేమ వైజాగ్ స్టీల్ మీద లేదెందుకు?
x

మిట్టల్ స్టీల్ మీద ఉన్న ప్రేమ వైజాగ్ స్టీల్ మీద లేదెందుకు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అణగదొక్కి, ప్రైవేటు సంస్థలనే ప్రోత్సహించడం ఆశ్చర్యకరం, బాధాకరం.


కేవలం స్వలాభాల కోసం పనిచేసే ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలకు ఇస్తున్న ప్రాధాన్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో పని చేస్తూ, సమాజానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు ఎందుకు ఇవ్వడం లేదు?


ఆరు దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రలో జరిగిన ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ప్రజా ఉద్యమం ఫలితంగా, కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా స్థాపించింది. ఈ ప్రాంతం పార్లమెంట్ ప్రతినిధులు, వారి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధం పడినప్పుడే, అప్పటి ప్రధాన మంత్రి, విశాఖ ఉక్కు స్థాపన విషయంలో పార్లమెంటులో ప్రకటించవలసి వచ్చింది.

ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర ప్రాంతం బహుముఖ అభివృద్ధికి దోహదం చేసింది. వేలాది మందికి, ముఖ్యంగా SC/ST/OBC లకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలను కలిగించింది. ఆ ప్రాంతంలో ఎన్నో చిరు పరిశ్రమలు, చిన్న కారు వ్యాపారులు, విశాఖ ఉక్కు మీద ఆధారపడి ఉన్నారు. కేవలం లాభాల కోసం పనిచేసే ప్రైవేటు సంస్థల వలన, అటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉండదు.

అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖ ఉక్కు విషయంలో, కేంద్ర ప్రభుత్వం, గత పది పదిహేను సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం కారణంగా, ఆ సంస్థ ఆర్ధికంగా బలహీనపడింది.

ఉదాహరణకు, కేంద్రం విశాఖ ఉక్కుకు తనదైన ఇనుప ఖని ని కేటాయించి ఉంటే, ఉక్కు ఉత్పత్తి ఖర్చులు తగ్గి, ఆ కర్మాగారం లాభాలు గణించి ఉండేది. ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ఉదారంగా ఖనులను కేటాయిస్తున్న కేంద్రం, విశాఖ ఉక్కుకు మాత్రం, ఒక మైనింగ్ బ్లాక్ అయినా కేటాయించలేదు. ఆ కర్మాగారం ఉన్నత పదవులలో ఏళ్ల తరబడి నిపుణులను నియమించకుండా ఖాళీగా ఉంచి, కర్మాగార నిర్వహణ ను కేంద్రం బలహీన పరిచింది. పైగా, విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందనే సాకు చూపించి, కేంద్ర ప్రభుత్వం, ప్లాంటును అతి తక్కువ ధరకు, కావాల్సిన ప్రైవేటు సంస్థలకు బదలాయించే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం.

గత పది పదిహేను సంవత్సరాలుగా, రాష్ట్రంలో పరిపాలన చేసిన అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు పట్ల అదే వైఖరి చూపించడం జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేటు యాజమాన్యం చేతిలో పెడితే, కార్మికులు పెద్ద ఎత్తున నిరోద్యోగులు అవ్వడమే కాకుండా, భవిష్యత్తులో, SC/ST /OBC ప్రజలకు ఉద్యోగావకాశాలు క్షీణిస్తాయి.

కేంద్రంలో, రాష్ట్రంలో, రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీల తో కుమ్మక్కయి, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు బదలాయించే దిశలో పని చేయడం ప్రజలు గమనించాలి.

ఉదాహరణకు, ముందున్న YSRC ప్రభుత్వం, కడపలో JSW గ్రూప్ వారికి, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడం, ఎన్నో రాయితీలు ఇవ్వడం జరిగింది. JSW వారికి కేంద్రం అప్పుడే ఇనుప ఖనులను అతి తక్కువ ధరలకు కేటాయించింది. ఆ కారణంగా, దక్షిణ ప్రాంతంలో, తనకు ఉన్న వినియోగదారులను, విశాఖ ఉక్కు కోల్పోయే అవకాశం ఉంది.

అదే విధంగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం, విశాఖ దగ్గరిలో నక్కపల్లి దగ్గర ఉక్కు కర్మాగారాన్ని స్థాపించే అనుమతులను, ప్రైవేట్ రంగ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ కు ఇవ్వడమే కాకుండా, దగ్గరిలో ఉన్న దోనివాని లక్ష్మీ పురం లో 2.9 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని, తనదైన పోర్ట్ నిర్మించడానికి, రాయితీలతో సహా దారాదత్తం చేసింది.

ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ వారు తమ ఉక్కు ప్లాంట్ కోసం 2,500 ఎకరాలకు పైగా భూమి కావాలని ప్రభుత్వాన్ని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అంటే, నక్కపల్లి లో సస్యశ్యామలమై వ్యవసాయ భూములు పోవడం కారణంగా, ఆ ప్రాంతం ఆహార భద్రతకు నష్టం కలగడమే కాకుండా, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు కూడా నష్టపోతారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ సమాజానికి ఎన్నో హక్కులు ఇచ్చే 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి, ఆ హక్కులను అణిచివేసే Land Pooling Scheme (LPS) క్రింద భూముల తీసుకుంటామని ప్రకటించారు (

ప్రజల వనరైన తీరప్రాంతాన్ని, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడమే కాకుండా, చట్ట విరుద్ధం అవుతుంది.ఆ తీర ప్రాంతం నుంచి వేటకు వెళ్ళి ఉపాధి పొందే సంప్రదాయ మత్స్యకారుల విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్లు కనిపించడం లేదు. విశాఖ నక్కపల్లి తీరప్రాంతంలో దేశ భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆర్సెలర్ మిట్టల్ కు కేంద్రం అప్పుడే ఇనుప గనిని, తక్కువ ధరకు కేటాయించింది. అటువంటి అదృష్టం, అంటే స్వంత గని, స్వంత పోర్ట్ సౌకర్యాలు, ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ ఉక్కుకు ఈరోజు వరకు దక్కలేదు. ఆ కారణంగా, విశాఖ ఉక్కు కు దక్షిణ ప్రాంతంలో ఉన్న వినియోగదారులు మరి కొందరిని కోల్పోయే అవకాశం ఉంది.

ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ నిర్మించే పోర్ట్ కారణంగా, మరొక ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖ పోర్టు కు కూడా అదేవిధంగా నష్టం కలుగుతుందని ప్రజలు గమనించాలి.

ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ వారికి, సౌత్ ఆఫ్రికా లో ఒక పెద్ద ఉక్కు కర్మాగారం ఉంది. కొన్ని నెలల క్రితం, ఆ కంపెనీ, అక్కడి ప్రభుత్వం అదనపు రాయితీలు ఇవ్వకపోతే, ప్లాంటును తత్ క్షణం మూసివేస్తామని బెదిరించడం జరిగింది. ప్లాంట్ ఆ విధంగా మూసివేస్తే, స్థానికంగా వందలాది మంది కార్మికులు నిరుద్యోగుల అవ్వడమే కాకుండా, ప్లాంట్ మీద ఆధారపడి ఉన్న చిన్న పరిశ్రమలు నష్టపోతాయి. కంపెనీ ఒత్తిడి కారణంగా అక్కడి ప్రభుత్వం 92 మిలియన్ డాలర్ల రాయితీలు, కంపెనీకి ఇస్తామని ప్రాధేయపడే పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.

మన దేశంలో ఉక్కు కర్మాగారాలు విదేశాలలో కొనే "మెట్ కోక్" అనే ముడి పదార్థం దిగుమతి మీద, కేంద్రం ఆంక్షలు విధించగానే, ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్, మరి కొన్ని ప్రైవేట్ ఉక్కు కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం మీద కేసులు వేసి, తమ ప్లాంట్లను మూసివేస్తామని బెదిరిస్తున్నారు ఆ విషయాన్ని కూడా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాభాల కోసం పనిచేసే ప్రైవేటు కంపెనీలు, సమాజ సంక్షేమం గురించి ఆలోచించరు

ఈ విషయాలు తెలిసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియనట్లు, వ్యవహరిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అణగదొక్కి, ప్రైవేటు సంస్థలనే ప్రోత్సహించడం ఆశ్చర్యకరం, బాధాకరం.

కొన్ని నెలల క్రితం, కేంద్ర మంత్రి వర్గం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు, 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది, కాని అటువంటి సహాయం సరిపోదని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. విశాఖ ఉక్కు కర్మాగారానికి, తనదైన ఇనుప గని లేకపోతే, ఉక్కు ఉత్పత్తి ఖర్చుల భారం కారణంగా, మిగిలిన కర్మాగారాలతో పోటీ చేయలేదు. ప్రస్తుతం, కర్మాగారం బకాయిలు తీర్చేందుకు, 30,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కావలసి వస్తుంది. అయినా, కేంద్రం ఆ విషయాలను పట్టించుకోకుండా ఉండడానికి కారణం, ఆ కర్మాగారాన్ని తమకు కావాల్సిన ప్రైవేట్ సంస్థకు, తక్కువ ధరకు అమ్మే ఉద్దేశంలో ఉండడం.

విశాఖ ఉక్కు ఉద్యోగులు, విశాఖ ఉక్కును, SAIL లో విలీనం చేయాలని, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేశారు కాని కేంద్రం ఆ ప్రతిపాదనను కూడా పరిశీలించడం లేదు.

పైగా, విశాఖ ఉక్కు సమస్యలకు కేంద్రం వైఖరే కారణమని తెలిసినా, కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఉద్యోగులే బాధ్యులని, వారిమీద VRS ఆయుధం ప్రయోగించి, వారిని బాధ పెట్టడం చూస్తున్నాం.

కేంద్రం ఆమోదించిన National Steel Policy (పారా 4.15.4) లో, ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా తెలియపరిచినా, అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రైవేట్ కర్మాగారాలనే ప్రోత్సహించి, ఆ Policy ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం బాధాకరం.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించడం లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే, ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరు. ఉత్తరాంధ్ర ప్రజల సహకారంతో పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు, ఎన్నుకోబడిన శాసన సభ్యుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకు రావాల్సిన బాధ్యత ఉందని, వారు గుర్తించాలి.

ఆ కర్మాగారాన్ని శాశ్వితంగా పునరుద్ధరించడానికి, కేంద్రం తత్ క్షణం, పూర్తి బకాయిలు తీర్చే దిశలో, 30,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, కర్మాగారానికి, ప్రస్తుతం ఇనుము ముడిపదార్ధం ఉత్పత్తి చేస్తున్న తనదైన గనిని కేటాయించడం అవసరం.

గుజరాత్ లో సెమి కండక్టర్ కర్మాగారాన్ని పెడతామని ముందుకు వచ్చిన అమెరికా దేశ ప్రైవేటు కంపెనీ Micron కు, కేంద్రం సంకోచించకుండా 13,000 కోట్ల రాయితీలను ఇచ్చిన విషయం దృష్టిలో పెట్టుకుని, కేంద్రం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు కు ఎందుకు సహాయం చేయడం లేదు?

కేంద్రం, విశాఖ ఉక్కు కు ప్రస్తుతం ఇనుము ఉత్పత్తి చేస్తున్న, తనదైన గనిని కేటాయించలేక పోతే, ఆ కర్మాగారాన్ని SAIL లో విలీనం చేయడం తప్ప, ఇంకొక పరిష్కారం లేదని కేంద్రం గుర్తించాలి.

ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవడం అవసరం.

కడప, నక్కపల్లి లో నిర్మించబడుతున్న ప్రైవేట్ ఉక్కు కర్మాగారాల విషయంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తతో వ్యవహరించాలి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వని రాయితీలు, సౌకర్యాలు, ప్రైవేట్ కర్మాగారాలకు ఇవ్వకూడదు.

ఈ విషయాలను ఉత్తరాంధ్ర ప్రజలు క్షుణ్ణంగా, విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది.

ఆరు దశాబ్దాల ముందు, ఆ కర్మాగారం కోసం ప్రజలు చేసిన త్యాగాలు దృష్టిలో పెట్టుకుని, ఉత్తరాంధ్ర ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఒత్తిడి తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

Read More
Next Story