బీజేపీతో ఉంటూ క్రిష్ణయ్య ఎవరి ప్రయోజనాలు కాపాడతారు?
బహుజనుల పేరుతో అందలమెక్కి బహుజన ప్రయోజనాల తాకట్టు పెట్టడమేనా?
దేశమంతా సమగ్ర కులగణన చేపట్టనని వాదిస్తున్న పార్టీ నుంచి వెనుకబడిన కులాల ప్రతినిధి ఆర్ క్రిష్ణయ్య పెద్దల సభకు పంపారు. మొన్నటి వరకు వైసీపీలో ఎంపీలు గా వెలగబెట్టిన ఆర్ క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు కండువా మార్చి తెలుగుదేశం, బీజేపీ పంచన చేరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన పార్టీ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం ఇబిసి రిజర్వేషన్ కల్పించారు. ఉన్న అరకొర నియామకాల్లో ఇబిసి వర్గాలకు ఓబిసిల కంటే తక్కువ కటాఫ్ మార్కులతో వెనుకబడిన వర్గాలకు శరాఘాతంగా మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ కుల గణన జరగాల్సిందేనని బీసీ ఉద్యమకారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోక పోవడం దురదృష్టకరం. కుల గణన అనేది జరిగితే ఎవరు ఎంత శాతం ఉన్నారు తెలుస్తుంది.
జనాభాలో 54 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. జనాభా 54 శాతం ఉన్న అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ మండల స్థాయి ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులు ఉన్నాయి.
బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మేధావులు హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి స్పష్టం గా ఉంది. బీసీ కుల గణన చట్టం అనుమతిస్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి, బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తారు. ‘కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏమంటే ప్రతిపక్షం అధికార పార్టీలు బీజేపీతో అంటకాగి తిరుగుతున్నాయి.
గతంలో బ్యాంకులను ముంచడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం నాయకులు బీజేపీ లో చేరి పునీతులైనారు. పన్నెండు సంవత్సరాల క్రిందట జన్ లోక్ పాల్ బిల్లు పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రధాన భూమిక పోషించిన గాంధేయవాది అన్నా హజారే గారి ప్రియ శిష్యులు నేడు లిక్కర్ స్కాం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
సామాన్య మదుపరుల ఆస్తులు లక్షల కోట్లు ఆవిరవుతున్న, ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగం కుదేలవుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం చలనం లేదు. దేశంలో కుల గణన చేపట్టకుండా, సామాజిక సమగ్రత లేకుండా, మహిళలపై, ముస్లింలపై, రైతులపై, కార్మికులపై దాడులు జరుపుతున్న బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణయ్య ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు.
ప్రభుత్వంపై నోరుమెదపని బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి నాయకులను ఏమనాలి. జాతీయ ప్రయోజనాలను మరుగుపడినచోట ఉత్పాతాలే మిగులుతాయి. పాఠం నేర్పకపోతే ఏ దేశమైనా మునగక తప్పదు. మన దేశంలో ఆర్థిక వృద్ధి అంచనాలు గత నాలుగు సంవత్సరాలుగా పేలవంగా ఉన్నాయి ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధంగా ఉంది.
జనాభా రీత్యా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారతదేశం తన యువ కార్మిక శక్తిని ఇముడ్చు కోవాలంటే ఏటా 1.30 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. అయితే 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారాలపై జీఎస్‌టీ అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నాయి. వాటిలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు.
దేశంలో వ్యవసాయం, నిర్మాణ రంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మిక శక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాలలో ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నత స్థితికి చేరాల్సిందిపోయి, నీచ స్థితికి చేరడం మొదలయింది ప్రజలంతా వారి కుల లెక్కలు తీయాలని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది.
రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ జనాభా లెక్కలు బయటకు వస్తే దోపిడీ చేసేవారు అడ్డుకట్ట పడుతుంది. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి.
దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేండ్లు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతుంది, వ్యవస్థలన్నీ పతనమై పోయాయి, నిరుద్యోగం 8.4 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా తీసేలా చేస్తున్నారు. ఇన్సూరెన్స్, రైల్వే, కమ్యూనికేషన్, చివరికి ఇస్రో, హెచ్ఏఎల్ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలి. దేశ జనాభాలో 54% బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరం.
కులాల లెక్కలు తీయకపోతే బీజేపీ గద్దె దిగి పోవాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతో పాటు బీసీలకు వచ్చే వాటా కూడా అనుభవిస్తున్నారు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ" అని,రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4)&16(4) లో స్పష్టంగా పేర్కొనబడింది. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుండి వచ్చింది. రిజర్వేషన్ కు ప్రాతిపదిక సామాజిక వెనుకబాటు మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది.
మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఓబీసీ ల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు. తీర్పు వెలువరించే ముందు ఓసి ల జనాభాను సుప్రీం శాస్త్రీయ లెక్కలు లేవు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు వెనుకబడిన తరగతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54%రిజర్వేషన్ల కోసం పోరాడాలి .
సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి, వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి.అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, ఎన్నికల్లో, బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి. భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే ఆరెస్సెస్ ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఐక్య ఉద్యమాలు నిర్మించాలి.