ఫైల్స్ను ఎవరు తగలబెడుతున్నారు! ఎందుకు తగలబెడుతున్నారు!
x

"ఫైల్స్"ను ఎవరు తగలబెడుతున్నారు! ఎందుకు తగలబెడుతున్నారు!

ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు అక్రమాలు - అవినీతికి పాల్పడాలంటే ఉన్నతాధికారులు - ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు.


టి. లక్ష్మీనారాయణ

ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు అక్రమాలు - అవినీతికి పాల్పడాలంటే ఉన్నతాధికారులు - ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు. గత ప్రభుత్వ కాలంలో జీవోలు వెబ్సైట్ లో పెట్టలేదు, అంతా రహస్యమే. అక్రమాలు - అవినీతికి ఆధారాలు దొరికితే వాటికి పాల్పడిన రాచకీయ రాబంధులతో పాటు వాటిలో భాగస్వాములైన అవినీతి అధికారులు - ఉద్యోగులు కూడా దొరికిపోతారు. కాబట్టి తమను తాము రక్షించుకోవడానికి, అవినీతి రాచకీయ రాబంధులను కాపాడడానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని "ఫైల్స్" తగలబెట్టే దుశ్చర్యలకు బరితెగించి పూనుకున్నారని స్పష్టమవుతున్నది. ఒకటి, రెండు అయితే ప్రమాదవశాత్తు అనుకోవచ్చు. "ఫైల్స్" తగలబెట్టే పరంపర రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నది.

2024 జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలై మొదటి వారంలో విజయవాడలోని గనుల శాఖ ఆఫీసులో పైల్స్, హార్డ్ డిస్కులను తగలబెట్టడంతో మొదలైన దహనకాండ గుంటూరు మీదుగా మదనపల్లి సబ్ - కలెక్టర్ కార్యాలయం, తిరుమల - తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ ఆఫీసు, పోలవరం ప్రాజెక్టు ఆఫీసు, అలా సాగిస్తూనే ఉన్నారు. మదనపల్లి ఘటనను విద్యుత్ ప్రమాదంగా చిత్రీకరించారు. విజయవాడలో చెత్తను కాల్చేశారన్నారు. పోలవరం ఆఫీసులోని పనికిరాని జీరాక్స్ కాగితాలను తగలబెట్టారంట! ఆ జిరాక్స్ కాపీలు ఎవరివి? ఎందుకిచ్చారు? వాటిపై దరఖాస్తుదారుల సంతకాలు, అధికారుల సంతకాలు లేదా రిమార్క్స్ ఉన్నాయా! లేదా! వాటిని కాల్చడానికి ఎవరు అనుమతిచ్చారు!

పరిపాలనా వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోబడుతున్నది, ఒక ఆఫీసులో పైల్స్ తగలబెట్టితే సంబంధిత శాఖకు చెందిన మరొక ఆఫీసులో పైల్స్ కొన్నైనా ఉంటాయి కదా! క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వాస్తవాలను తెలుసుకోవచ్చు! ఆధారాలను సేకరించవచ్చు! గత ప్రభుత్వ కాలంలో అవినీతి - అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి. ఇప్పటి వరకు తగలబెట్టిన ఘటనలపై తక్షణం సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఫైల్స్ తగలబడితే ఆ ఆఫీసు ఉన్నతాధికారిని బాధ్యుడుగా చేసి, శిక్షించాలి.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Read More
Next Story