రెండు పడవలపై పవన్!
త్రిపక్ష కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించింది.
ముహూర్తం దగ్గరకొచ్చేసింది. త్రిపక్ష కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించినా, దీనిలో ప్రధాన భాగస్వామి టిడిపియే గనుక ఆ పార్టీకి ఎక్కువ మంత్రి పదవులు, ప్రాధాన్య పదవులు లభించడం సాధారణమే. దాని తర్వాత స్థానంలో నిలబడే జనసేన పార్టీకి కూడా అటువంటి ప్రాధాన్య పదవులే లభించే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీ విషయంలో చివరిదాకా ఒక స్పష్టత లేకుండా సాగడం గమనించవలసిన అంశం.
కేంద్రంలో పదవులను వద్దన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూడా అదే విధానం అనుసరించాలని తొలుత అనుకున్నారు. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. కానీ అలా చేస్తే ' సమతూకం ' దెబ్ఫతిని కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన టిడిపి నాయకత్వం చివరి క్షణం దాకా ఆయనతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
కేంద్రంలో పదవి స్వీకరించినా, రాష్ట్రంలో పదవి స్వీకరించినా పాక్షికంగానో, పూర్తిగానో కొంతకాలమైనా . సినిమాలకు విరామం ప్రకటించవలసి వస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు భారీ సినీ ప్రాజెక్టులు ఉండడంతో వాటిని సకాలంలో పూర్తి చేయవలసిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.
ఎన్నికల ముందు చివరి నాలుగు నెలలు సమయాన్ని పూర్తిగా రాజకీయాలపై నిమగ్నం చేయడంతో ఇప్పటికే కొన్ని సినిమాలు చాలా ఆలస్యమయ్యాయని అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఆలస్యమైతే నిర్మాతలు భారీగానే నష్టపోతారు. అటువంటి పరిస్థితి ఏర్పడితే పవన్ సినీ జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ విషయం పవన్ కు తెలియనిది కాదు.
ఒక పార్టీని నడపాలంటే ఎన్ని కోట్లు ఖర్చుచేయవలసి వస్తుందో పవన్ కు గత ఆరేడు సంవత్సరాలుగా బాగా అర్థమైంది గనుక, బంగారు బాతు గుడ్ల వంటి సినిమాలకు దూరం కావడానికి ఆయన ఇష్టపడక పోవచ్చు. కానీ ఆయన పెట్టిన రాజకీయ పార్టీ కూడా ఫలాలందించే దశకు చేరుకుంది గనుక దానిని పక్కన పెట్టే పనిని కూడా ఆయన చేయలేరు. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా రెండింటినీ నిర్వహించవలసి ఉంటుంది. కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని కీలక పదవులు తీసుకుంటే సమయంలో అధిక శాతం వాటికోసం వెచ్చించవలసి ఉంటుంది. నిర్లక్ష్యం ఛాయలు పడకుండా చూసుకోవలసి వస్తుంది. దానిలో తేడా ఏ కొంచెం కనిపించినా ఎండగట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటారనేది కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడిది ఆయనకు కొత్త పాత్ర.
పార్టీ నేతగా తనకు వీలు చిక్కినపుడు ఆయన ప్రజలకు కనిపించవచ్చు. దానిని ఎవరూ ప్రశ్నించలేరు. కానీ మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అయితే ఎంతో బాధ్యతగా మెలగవలసి ఉంటుంది. ప్రజల నుంచి, ప్రతి పక్షాలు నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు, సవాళ్లకు బాధ్యతతో స్పందించవలసి ఉంటుంది. లేకుంటే ఆ లోపం మొత్తం ప్రభుత్వం మీద, దాని పరిణామాలమీద చూపుతుంది. సినిమాల్లో రాజకీయ పాత్రలు వేయడం పవన్ కు కొత్త కాకపోయినా నిజజీవితంలో ఒక మంత్రి పదవిని చేపట్టి రాణించడమంటే చాలా కష్టసాధ్యమైన విషయం. రెండు రంగాలలో ఆయనకు ఇంకా సుదీర్ఘమైన భవిష్యత్తు ఉన్నందున చాలా ' బ్యాలెన్స్ డ్ ' గా నడవాల్సి ఉంటుంది. తేడా వస్తే ఆ నడక ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
' ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ లోకి అడుగు పెడతా ' అని ఒక సందర్భంలో ఆయన అన్నారు. దానితో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది. ప్రధాని ఆఫర్ ను ఉపయోగించుకొని కేంద్రంలో అధికారం చెలాయించాలని ఆ పార్టీ నేతలు కొందరు ఉవ్విళ్లూరారు. కానీ పవన్ తాను ఎలాంటి బాధ్యత తీసుకోలేదు , తన పార్టీ లోని ఎవరికీ అప్పగించకపోయేసరికి పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి పెల్లుబికినట్లు వార్తలు వినిపించాయి.
ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ, బుద్ధప్రసాద్ వంటి సీనియర్ నాయకులు కొందరు జనసేనలో చేరారు. అలాగే టిడిపి లోను చాలామంది చేరారు. ఒకవేళ అధికారం వస్తే తమకు ఏదోఒక పదవి లభిస్తుందనే కదా వారు పార్టీల్లో చేరేది! ' మాకు పదవులొద్దు ప్రతిపక్షంలో ఉంటాం ' అంటే వారెందుకు పార్టీలో ఉంటారు! అందుకే పవన్ పై ఒత్తిడులు బాగా ఎక్కవయ్యాయనీ, చివరికి పదవులు తీసుకొనడానికి ఒప్పుకొనక తప్పలేదనీ తెలుస్తోంది.
పవన్ కు పదవి ఇవ్వాల్సి వస్తే అది ఏదో సాధారణంగా ఉండదు కదా! చంద్రబాబు తర్వాతి స్థానమే అయి ఉండాలి. చంద్రబాబు కూడా పవన్ ను ఒప్పించారనీ, డిప్యూటీ సీఎం పోస్టు స్వీకరించడానికి పవన్ అంగీకరించారనీ విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో నాదెండ్ల కు ఇప్పటికే ఖరారయింది. మరో రెండు పదవులకు అవకాశం ఉండడంతో పై నాలుగు పేర్లలో రెండు ఖరారయ్యే సూచనలున్నాయి.
నిబంధనల ప్రకారం కూటమికి లభించిన మొత్తం సీట్లలో మిత్ర పక్షాలకు ఐదు లేక ఆరు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం జనసేనకు నాలుగు ఇస్తే బిజెపికి ఒకటి లేదా రెండు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సామాజిక వర్గాల వారీగా కూడా సమతుల్యత పాటించవలసి ఉంటుంది. ' అస్మదీయుల ' కు చోటు కల్పిస్తూనే సమతుల్యతను, మిత్ర ధర్మాన్ని కూడా జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది.
చంద్రబాబు ఈ విషయంలో చాలా అనుభవజ్ఞుడే గనుక ఆలోచించవలసింది లేకపోయినా, పవన్ ఇక రెండు పడవలపై ఎలా ప్రయాణిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారుతోంది. అటు ఒప్పుకున్న సినిమాలకూ న్యాయం చేయాలి, ఇటు అంతకంటే బాధ్యతాయుతమైన, ప్రజలకు జవాబు దారీ అయిన మంత్రి పదవి కీ న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే పార్టీలో అసమ్మతి తలెత్తకుండా కూడా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బుధవారం నుంచి పవన్ కొత్త పాత్ర ఎలా పోషిస్తారో చూడవలసిందే.