Kumaraswamy as Dev Senapati (Source: Vedicfedd.com)
x

కుమారస్వామికథ ఆవిష్కరించే చారిత్రక సత్యం ఏమిటో తెలుసా?

రామాయణంలో నిరుత్తరకాండ-29: పురాణ, ఇతిహాసకథల్లో దాక్కుని వున్న ఒక నాటి గణసమాజలక్షణాలను గుర్తించడానికి కుమారస్వామి కథ అవకాశమిస్తోంది.


‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’ (Enki and the World Order) అనే సుమేరు పురాణగాథకు విలియం ఇర్విన్ థామ్సన్ తన ‘ది టైమ్ ఫాలింగ్ బాడీస్ టేక్ టు లైట్ -మైథాలజీ, సెక్స్యువాలిటీ అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ కల్చర్’ (The Time Falling Bodies Take To Light- Mythology, Sexuality & the Origins of Culture) అనే పుస్తకంలో ఇచ్చిన అన్వయమూ, చేసిన విశ్లేషణల వెలుగులో రామాయణంలోని కుమారస్వామికథను పరిశీలించే ముందు పౌరాణికశైలి గురించి ఒకటి రెండు విషయాలు క్లుప్తంగానైనా చెప్పుకుందాం.

గంగ అనే నదినీ, భూమినీ స్త్రీలుగానూ; హిమవత్పర్వతాన్నీ, మేరుపర్వతాన్నీ పురుషులుగానూ చెప్పడం; మేరుపర్వతం కూతురైన మనోరమను(మరో కథనంలో ఈమె పేరు మేనక) హిమవంతుని భార్య అనడం, హిమవత్పర్వతంపై పుట్టిన గంగానదిని వారి పెద్దకూతురనడం – ఇలా ప్రకృతిలోని ప్రతి ఒక్కదానికీ మానవరూపాన్ని ఆపాదించి వాటిమధ్య చుట్టరికాన్ని కల్పించడం పురాణ, ఇతిహాసాల్లో సర్వసాధారణం. మనదగ్గరే కాక, ఇతర పురాణకథల్లో కూడా కనిపించే శైలి ఇది. ఆధునికపండితులు ఆంత్రోపోమోర్ఫిజమ్(Anthropomorphism) పేరిట దీనినిపురాణ, ఇతిహాసపరిశీలనలో భాగం చేశారు. ఈ మాటను మానవారోపణగా, లేదా పురుషభావారోపణగా అనువదించుకుంటున్నాం. ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతితో మమేకమై మనిషి జీవించడం నుంచి ఈ కల్పన అభివృద్ధి చెందినట్టు అర్థమవుతూనే ఉంది.

బంగారం, వెండి తదితర లోహాలు శివుడి వీర్యంనుంచి పుట్టినట్టు చెప్పడంలో వాటికి దైవసంబంధాన్ని, లేదా మానవాతీతగుణాన్ని ఆపాదించడం కనిపిస్తుంది. లౌకికంగా చూసినప్పుడు, భూమినుంచి వాటిని తవ్వి తీయడంలోని మానవప్రయత్నాన్ని, మనిషి జీవితంలో అవి ప్రధానభాగం కావడాన్ని ఈ కల్పన సూచిస్తూ ఉండవచ్చు. అలాగే, కృత్తికలనే నక్షత్రాలు కుమారస్వామికి స్తన్యమిచ్చాయని చెప్పడంలో కూడా మానవారోపణ ఉంది. ఎప్పుడో, 50వేల సంవత్సరాల వెనకటి ఎగువ రాతియుగంలోనే సైన్సు, మతం, ఖగోళవిజ్ఞానాల మహత్తర సమన్వయానికి స్త్రీలే తొలి పునాదులు నిర్మించారని ఇంతకుముందు చెప్పుకున్న సంగతిని గుర్తుచేసుకున్నప్పుడు, పురాణకథలను మరింత లోతుగా పరిశీలించి, అర్థం చేసుకుని, చారిత్రకంగా అన్వయించుకోడానికి ఎంతో విలువైన దారి కనిపిస్తుంది. విలియం ఇర్విన్ థామ్సన్ తన పుస్తకంలో చేసింది అదే.

అయితే, కుమారస్వామికథలో గంగకు వర్తించినట్టుగా హిమవంతుని రెండవ కుమార్తె అయిన ఉమకు ప్రకృతి సంబంధమైన అన్వయం ఏదీ చటుక్కున స్ఫురించడం లేదు. అటువంటిదేమీ లేదనుకుంటే, గిరిప్రాంతాలలో జీవించే తెగకు చెందిన అమ్మాయిని ఆమె సూచిస్తూ ఉండవచ్చు. పర్వతరాజపుత్రికగా పార్వతి పేరు గిరిజనసంబంధాన్ని మరింత స్పష్టంగా వెల్లడిస్తుంది. అలాగే, రామాయణశ్లోకం కుమారస్వామిని ‘సురసేనాగణపతిగా’ చెప్పడం కూడా గమనార్హం. ఆ శ్లోకం ఇదీ:

సురసేనాగణపతిం తత స్తమతులద్యుతిం

అభిషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః(బాల-స 37-శ్లో 30)

సాటిలేని కాంతి గల అతనిని(కుమారస్వామిని)అగ్ని మొదలైన దేవతాగణాలు దేవసేనాగణానికి నాయకుడిగా అభిషేకించారని ఈ శ్లోకానికి అర్థం. ‘గణపతి’కి సోదరుడిగా చెప్పే కుమారస్వామిని ‘సురసేనాగణపతి’గా చెప్పడం ఇక్కడ ఆకర్షించే విషయం. ‘గణం’ అనే మాట - వ్యక్తులను ప్రాంతంతో కాకుండా నిర్దిష్టమైన పేరు కలిగిన ఒక కట్టుగా, లేదా గుంపుగా గుర్తించే దశకు చెందినది. ఆ మాట అలాంటి నిర్దిష్టార్థం నుంచి, ‘సమూహ’ మనే సామాన్యార్థంలోకి క్రమంగా మారింది. వేదాల్లోనూ, పురాణ, ఇతిహాసాల్లోనూ గణశబ్దం విరివిగా కనిపిస్తుంది. మరుద్గణాలను ఇంద్రునికి సహచరులుగా ఋగ్వేదం చెబుతుంది. అలాగే, శివుని దేవసేనాపతిగా మొదట బ్రహ్మ నియమించాడని కుమారస్వామికథ చెబుతోంది. అయితే, కుమారస్వామినే తప్ప శివుని దేవసేనాపతిగా చెప్పడం అంత ప్రసిద్ధం కాదు.

ఈవిధంగా పురాణ, ఇతిహాసకథల్లోని గణసమాజలక్షణాలను గుర్తించడానికి ఈ కథ అవకాశమిస్తోంది. ఎలాగంటే, ‘గణ’శబ్దంతోపాటు, ‘దేవసేనాపతి’ అనే మాట కూడా పౌరాణికకథనశైలిలో అనామకంగా కలిసిపోయి ఇప్పుడు మామూలు మాటలా ధ్వనిస్తున్నా, నిజానికది గణసమాజంలో నిర్దిష్టమైన అర్థాన్ని, దశను సూచించే మాట. ఇంకా చెప్పాలంటే, గణమనే ప్రాథమిక సామాజికరూపం నుంచి అంతకంటె ఉన్నతమైన రాజ్యమనే రాజకీయరూపానికి జరిగిన ప్రస్థానంలో అదొక ముఖ్యమైన మజిలీ. లూయీ హెన్రీ మోర్గన్ తన ‘పురాతన సమాజం’ అనే గ్రంథంలో గ్రీకుల సామాజిక, రాజకీయనిర్మాణాల గురించి చర్చిస్తూ సేనాపతి, లేదా సైన్యాధ్యక్షుడి పదవి ఏ దశలో పుట్టిందో, ఎలా ప్రాధాన్యాన్ని సంతరించుకుందో చెబుతాడు. ఆ నేపథ్యం నుంచి చూసినప్పుడు కుమారస్వామికథ తనను కప్పిన పౌరాణిక, ఇతిహాసపు మేలిముసుగు తొలగించుకుని చారిత్రకతను ఆవిష్కరిస్తుంది.

మోర్గన్ వివరించిన ప్రకారం, పురాతనకాలంలో ఎక్కడైనా సరే, మూడు అంచెలుగా సమాజనిర్మాణం జరిగి, నాలుగవది అయిన జాతి, లేదా ప్రజలు అనే అంచెకు చేరుకుంది. మనకు పరిచయమైన మాటల్లో చెప్పుకుంటే, ఆ మూడు అంచెలూ ఇవి: 1. గణం 2. వ్రాతం 3. తెగ. వీటిలో గణం ప్రాథమిక సామాజికరూపం. గ్రీకులు దీనిని ‘పేట్రీ’ అన్నారు. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్యనున్న రక్తబంధుత్వం నుంచి ఈ రూపం పుట్టింది. దీని మూలాలు ఆటవికయుగంనుంచీ ఉన్నాయి. ఒకే గణానికి చెందినవారు క్రమంగా అనేక గణాలుగా చీలిపోయినప్పుడు ఆ గణాలన్నీ కలిసిన రూపమే, వ్రాతం. ఈ వ్రాతమే మనదగ్గర ‘కుల’మయిందనీ, ఉత్తరాదివారు దీనిని ‘బిరాదరి’ అంటారనీ రాంభట్ల కృష్ణమూర్తి ‘జనకథ’లో అంటారు. లాటిన్లు దీనిని ‘క్యూరియా’ అనీ, గ్రీకులు ‘ఫ్రేట్రీ’ (phratry) అనీ అన్నారు; ఇది ‘భ్రాత్రం’ అనే సంస్కృతశబ్దానికి దగ్గరగా ఉండే మాట. వ్రాతంగా ఏర్పడిన గణాలు సోదరసంబంధం ఉన్నవి కనుక, ఫ్రేట్రీ, లేదా ‘భ్రాత్రం’ అనేది సోదరసంస్థ. ఇది మతసంబంధవ్యవహారాలు ఉమ్మడిగా నడుపుకోవడానికి ఉద్దేశించిన నిర్మాణం.

ఇలాంటి ‘ఫ్రేట్రీ’లు కొన్ని కలిసి ఏర్పడే రూపమే తెగ. తెగను గ్రీకులు ‘ఫైలో’ అనీ, లాటిన్లు ‘ట్రైబ్’ అనీ అన్నారు. ఫ్రేట్రీగా ఏర్పడిన గణాలన్నీ ఉమ్మడిగా మతసంబంధవ్యవహారాలు నడుపుకున్నట్టే; తెగగా ఏర్పడిన ఫ్రేట్రీలు కూడా జరుపుకుంటాయి. ఇలాంటి తెగలు కొన్ని కలిసినప్పుడు ఏర్పడేదే- జాతి, లేదా ప్రజలు అనే నాలుగవ సామాజికనిర్మాణం.

గ్రీకులలో గణనాయకుని ‘అర్కాన్’ అంటారు. గణం జరిపే మతకర్మలలో ఆయనే పురోహితుడిగా వ్యవహరిస్తాడు. గణనాయకుడనగానే మన దగ్గర చటుక్కున గుర్తొచ్చే దేవుడు గణపతి; ‘గణనాయకుడ’ని కూడా ఆయనకు మరో పేరు. మతసంబంధమైన తంతులు, కార్యక్రమాలు, శుభకార్యాలు ప్రారంభించేముందు గణపతి పూజ చేసే ఆనవాయితీ ఇప్పటికీ మన దగ్గర ఉంది. అదలా ఉంచితే, గ్రీకుల ప్రతి ఫ్రేట్రీకి ఒక నాయకుడుంటాడు; అతన్ని ‘ఫ్రేట్రియార్క్’ అంటారు. ఫ్రేట్రీ జరిపే సమావేశాలకు అతడు అధ్యక్షత వహించడమే కాక, దాని మతక్రియలను కూడా తనే జరిపిస్తాడు.

గ్రీకులు తెగ, లేదా ఫైలోకు నాయకత్వం వహించే వ్యక్తిని ‘బాసిలస్’ అన్నారు. ఇతడే పురోహితుడిగా ఉండి తెగ స్థాయిలో జరిగే మతకర్మలన్నింటినీ జరిపిస్తాడు. ఆపైన, నేరవిచారణాధికారంతోపాటు మరో కీలకమైన బాధ్యత కూడా ఇతనికే ఉండేది, అది, సైన్యానికి నాయకత్వం వహించడం! గ్రీకులు తమ తెగల సర్వసైన్యాధ్యక్షుని బాసిలస్ అన్నట్టే, అతని కింద ఉన్న ప్రభుత్వాన్ని ‘బాసిలియా’ అనీ పిలిచారు.

మోర్గన్ ప్రకారం, గ్రీకు తెగల మతజీవితానికి ఫ్రేట్రీలు, గణాలు కేంద్రాలే కాక, మూలాలు కూడా. వీటిలోనే దేవతావ్యవస్థ, దేవతల్లో హెచ్చుతగ్గులు, వాటికి సంబంధించిన సంకేతాలు, పూజావిధానాలు పరిణతి చెందాయి. పురాణకాలంలోనూ, చరిత్రకాలంలోనూ గొప్ప విజయాలను సాధించడానికి పురాణగాథలు ఆవేశాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేవాలయాలు, శిల్పాలు ఆ ఉత్సాహంనుంచి రూపు దిద్దుకున్నవే. పై సామాజికనిర్మాణాలలో పుట్టిన మతకర్మలనే జాతిపరం చేశారు. ఈ క్రమంలో పురాణ, వీరయుగాలలో ప్రాముఖ్యం తెచ్చుకున్న పదవే, బాసిలస్. వీరయుగం నాటి అథీనియన్లు(గ్రీకు నగరమైన ఎథెన్స్ కు చెందినవారు) అమలుచేసుకున్న మూడు పరిపాలనాశాఖల్లో బాసిలస్ ఒకటి. మిగతా రెండూ- నాయకుల సమితి, ‘ఆగొరా’ అనే ప్రజాసమితి.

అయితే, నాయకుల సమితీ, సైన్యానికి నాయకత్వం వహించే బాసిలస్ పదవీ ఉన్నప్పటికీ; పేట్రీ, ఫ్రేట్రీ, ఫైలో (లేదా గణం, వ్రాతం, తెగ) అనే మూడు నిర్మాణాలూ స్వయంపాలితంగానే ఉండేవనీ, ప్రజాతంత్రస్వభావంతో పనిచేసేవనీ మోర్గన్ అంటాడు. తర్వాతి కాలంలో రాబోయే రాచరికనిర్మాణంలోని నిరంకుశపు రాజుతో బాసిలస్ ను కొందరు పోల్చి చెప్పడాన్ని తప్పుపడతాడు. కాకపోతే, సైన్యాధ్యక్షుడిగా బాసిలస్ పదవిలో ఉన్న వ్యక్తి విశేషాధికారాలను చేజిక్కించుకుంటూ ఉండవచ్చు. అందువల్ల నాయకులసమితికీ, బాసిలస్ కు మధ్య ఘర్షణ తలెత్తుతూ వచ్చిందనీ, అథీనియన్లు ఒక దశలో బాసిలస్ పదవిని రద్దు చేశారనీ మోర్గన్ అంటాడు. బాసిలస్ ఉన్న తెగనిర్మాణాన్ని ‘సైనికప్రజాతంత్రం’గా చెప్పాలి తప్ప రాచరికంతో ముడిపెట్టకూడదంటాడు.

ఏదైనా ఒక్క గణం మాత్రమే ఎక్కువమంది సైనికులను సమకూర్చలేదు; ఫ్రేట్రీ, ఆ తర్వాత ఫైలోల నుంచే పెద్ద సంఖ్యలో సైనికబలాన్ని సమీకరించుకోవడానికి వీలవుతుంది. అప్పటికింకా జాతి, లేదా ప్రజ అనే నాలుగో సామాజికనిర్మాణానికీ, రాచరికానికీ చేరుకోలేదు కనుక ఫ్రేట్రీ, ఫైలోల రూపంలోనే యుద్ధంలో భాగస్వాములు కావలసి ఉంటుంది. ఇందుకు నిదర్శనాన్ని హోమర్ చెప్పిన ‘ఇలియడ్’ కావ్యంనుంచి మోర్గన్ ఉదహరిస్తాడు. “ఫ్రేట్రీలుగానూ, తెగలుగానూ సైనికులను విడదీసి యుద్ధంలో భాగస్వాముల్ని చేయి, అప్పుడు ఫ్రేట్రీకి ఫ్రేట్రీ, తెగకు తెగకు బాసటగా ఉంటాయి; అప్పుడే గ్రీకులు నీ మాట వింటారు; ఏ సేనాధిపతి, ఏ సైనికుడు పిరికిపందో, ధైర్యశాలో నీకు తెలుస్తుంది; వారు తమ శక్తికొద్దీ యుద్ధం చేస్తా” రని, ట్రాయ్ యుద్ధంలో గ్రీకుసైన్యానికి నాయకత్వం వహిస్తున్న అగమెమ్నన్ కు వృద్ధుడైన పైలాస్ రాజు నెష్టర్ సలహా ఇస్తాడు. నెష్టర్ పాత్ర మహాభారతంలోని భీష్ముని గుర్తుచేస్తుంది.

అమెరికా ఆదివాసుల్లో అనాగరికయుగం మధ్యదశలో ఉన్న త్లస్కలాన్లూ, అజ్ టెక్ లూ తమ సైన్యాలను ఇలాగే ఫ్రేట్రీల వారీగా విడదీసి మోహరించేవారనీ; ప్రాచీన జర్మన్ తెగలు కూడా తమ సైన్యాలను ఇలాగే సిద్ధం చేసేవనీ మోర్గన్ అంటాడు. విశేషమేమిటంటే, మహాభారతయుద్ధంలో కూడా కురు, పాండవుల ఇరువురి వైపులా సేనల సమీకరణ ఇలాగే గణాలు, వ్రాతాలు, తెగల స్థాయిలోనే జరుగుతుంది. క్షత్రియులు, యాదవులు, నాగులు మొదలైనవారు గణాలు, వ్రాతాలు, తెగలుగానే యుద్ధంలో పాల్గొంటారు. కౌరవులవైపు యుద్ధం చేసిన త్రిగర్తరాజు సుశర్మ, అతని సోదరులు ఇందుకు మరో ఉదాహరణ. వారిని ‘సంశప్తకులు’ పేరుతో మహాభారతం గుంపుగానే పేర్కొంటుంది. సంశప్తకులతో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడే కౌరవులు అభిమన్యుని వధిస్తారు.

ఇలా సమీకరించే సైన్యానికి నాయకత్వం వహించే క్రమంలోనే గ్రీకుల్లో బాసిలస్ పదవి ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఏతావతా తేలుతున్నదేమిటంటే, రాచరికపు కాలంనాటి రాజుకన్నా ముందు పుట్టినది సైన్యాధ్యక్షపదవే; తెగల దశలో పాలనాధికారానికి గల స్పష్టమైన లక్షణం సైన్యాధిపత్యమే. కుమారస్వామికథకు వస్తే, దేవసేనాధిపతిగా బ్రహ్మ నియమించిన శివుడు తపస్సుకు పూనుకోవడంతో కొత్త సేనాధిపతిని నియమించమని దేవతలు బ్రహ్మను కోరడం; శివునికి పుట్టబోయేకుమారుడైన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించుకోమని బ్రహ్మ చెప్పడం పౌరాణికపు ముసుగులో గణ-వ్రాత-తెగ దశలకు చెందిన పై సార్వత్రిక చారిత్రకనేపథ్యాన్ని స్ఫురింపజేస్తూ ఉండవచ్చు. గ్రీకుల్లో బాసిలస్ పదవి వంశపారంపర్యంగా సంక్రమించేదనడానికి గట్టి సాక్ష్యం లేకపోయినా, ఒకవేళ అలాంటిది ఉంటే అది కూడా ఎన్నిక ద్వారానే జరగాలి కనుక ప్రజాతంత్రస్వభావానికి విరుద్ధం కాదని మోర్గన్ అనడం గమనార్హం. విఘ్నగణాధిపత్యానికి అన్నదమ్ములైన వినాయకుడు, కుమారస్వామి పోటీ పడినట్టు, ఆ పోటీలో వినాయకుడు గెలిచినట్టు చెప్పే పురాణకథ కూడా మన దగ్గర ఉంది. ఇది కూడా పైన చెప్పిన గణసమాజనేపథ్యాన్నే సూచిస్తోందా అన్నది ఆసక్తికరమైన పరిశీలన.

కొంచెం విషయాంతరంలా కనిపించవచ్చుకానీ, రామాయణంతో సహా మన ఇతిహాస, పురాణకథలను భిన్నభిన్న కోణాలనుంచి అర్థం చేసుకోడానికి ఈ రకమైన అధ్యయనం ఎంతైనా తోడ్పడుతుంది. మన ఊహకు అతీతమైనవిగా, దేవతలకు సంబంధించినవిగా, మాయలూ, మంత్రాలూ, మార్మికతా కలిగినవిగా మనం చూడడానికి అలవాటు పడిన పురాణ, ఇతిహాసకథలను, మనం సులభంగా పోల్చుకోగలిగిన చారిత్రకత అనే నేల మీదికి దింపి మనకు మరింత చేరువ చేస్తుంది.

‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’ (Enki and the World Order) అనే సుమేరు పురాణగాథ వెలుగులో కుమారస్వామికథా పరిశీలన వచ్చేసారి.




Read More
Next Story