విద్యార్థుల సృజనాత్మకతను దెబ్బతీస్తున్న విద్య సంస్కరణలు
విద్యా సంస్థల అభివృద్ధి, విద్యా వ్యాపారం రద్దు అంశాలపై ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు, డా. యం. సురేష్ బాబు విశ్లేషణ
బడ్జెటరీ నిధుల పెంపుకు, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి, విద్యా వ్యాపారం రద్దుకు డిమాండ్ చేస్తూ ప్రజలు ఉద్యమించాలి. తల్లికి వందనం పథకం బడ్జెట్ కేటాయింపులు జరిపి తక్షణమే అమలు చేసి కేవలం ప్రభుత్వ విద్యాలయాలకు అన్వయిస్తే బాగుంటుంది.
ఎన్ఇపి 2020 అమలు లక్ష్యంతో ఇంటర్మీడియట్ లో సంస్కరణలు శరవేగంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు ఒక తపాలా శాఖగా మార్చి సీబీఎస్ఈ ని అమలు చేయాలని ప్రతిపాదన. రాష్ట్రంలో విద్యా వ్యాపారం లేకుండా కామన్ విద్యా విధానం ఉంటే ఇందులో ప్రతిపాదించిన 'స్టూడెంట్ ఛాయస్' ప్రయోజనకరంగా ఉంటుంది.
రాష్ట్రమంతా విద్యా వ్యాపారం అలుముకున్న స్థితిలో మంచి ప్రయోగాలు కూడా వికటిస్తాయి. ఎన్ఇపి ప్రాప్తికి ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమం అమలు చేయాలి. (ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో మాతృభాషా మాధ్యమం తప్పనిసరి చేయాలి. ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ కొనసాగించాలి. ఇంటర్మీడియట్ తరగతులకు అవసరమైన పీజీటీ పోస్టులు ఇవ్వాలి. గత ప్రభుత్వం విద్యార్థులకు ఏదైనా మేలు చేసిందంటే హైస్కూల్ నందు ఇంటర్మీడియట్ ప్రారంబించడం, తగినన్ని పీజీటీలను ఇవ్వకపోవడం వల్ల అవి సరిగా జరగలేదు. తగినన్ని పీజీటీలను ఇచ్చి ఉంటే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. కేవలం నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ ల కోసం ఇంటర్మీడియెట్ రద్దు చేశారు.
ఇంటర్ కొనసాగించటం వలన ఆత్మహత్యలు తగ్గుతాయి, తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. సీబీఎస్ఈ కోర్సులు ఆంధ్ర రాష్ట్రంలో 10 వ తరగతి వరకు పెట్టారు. ఫలితంగా పాఠశాల విద్య ప్రమాణాలు పడిపోయాయి. అదే విఫల ప్రయోగం ఇప్పుడు ఇంటర్ లో చేస్తున్నారు. మొదటి సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు లేక పొతే విద్యార్థులు చదవకపోవడం కాదు, అధ్యాపకులు తక్కువగా ఉంటే మొదటి సంవత్సరం విద్యార్థులు నిర్లక్ష్యనికి గురవుతారు.
ప్రభుత్వం నియామకాల్లో కూడా ఆశ్రద్ధ చేస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో కూడా నాన్ ర్యాంక్ విద్యార్థులు మరింత నిర్లక్ష్యనికి గురవుతారు. ఐదు సబ్జక్ట్స్ తో పాస్ అయిన వారిని ఆరు సబ్జక్ట్స్ తో పాస్ అయిన వారితో సమానంగా చూస్తారా? ఈ ఛాయస్ విద్యార్థుల భవిష్యత్ కు సంకెళ్లు గా మారుతుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం ఆంగ్లం ఒక పాఠ్య విషయంగా అందరికీ తప్పనిసరి, మాతృభాష మాత్రం ఒక పాఠ్య విషయంగా తప్పనిసరి కాదు. హిందీని లేదా సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నం. నీట్ , జేఈఈ ల చుట్టూ విద్యా విధానం నిర్మించలేము. అలాగే అనుకున్నా, ఇంటర్ బోర్డు ఆధారంగా చదివిన వారికి ఎక్కువ సీట్లు వస్తుంటే సీబీఎస్ఈ కి మారడం దేనికి.
విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, సృజనాత్మకత పెంచడానికి సీబీఎస్ఈ అంటున్నారు. రసాయన శాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ తీసేసి, ఫిజిక్స్ లో మైకేల్ ఫారడే అయస్కాంత సూత్రాలను తీసేసి, జీవ పరిణామం గురించి డార్విన్ మహాశయుడు ప్రవేశపెట్టిన థియరీ పక్కన పెట్టి, ప్రజాస్వామ్యం, మొఘలుల చరిత్ర, ఆల్టర్నేటివ్ ఎనర్జీ పాఠ్యంశాలు తొలగించారు.
సీబీఎస్ఈ పాఠ్యంశాలు కాషాయికరించబడుతున్న పరిస్థితుల్లో పరిశీలనా శక్తి, సృజనాత్మకత ఎలా పెరుగుతాయి. 15 రాష్ట్రాలు ఆమోదించి నంత మాత్రాన మనం ఆమోదించ నవసరం లేదు. రాష్ట్రాల ఫెడరల్ హక్కులు చాలా ప్రధానం. సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలలు తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్ విధానం అమలు జరగాలి.
ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలను, విద్యార్థుల వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. ఇంటర్ బోర్డు పాఠ్యంశాలు, పరీక్షలు విద్యార్థులకు భారం కాలేదు. ర్యాంక్స్ కొరకు జరిగే కార్పొరేట్ పోటీ వలన విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. విద్యా వ్యాపారం రద్దు చేయడమే పరిష్కారం. ఇంటర్నల్ మార్కులు ఇవ్వడం మంచిది. కానీ కార్పొరేట్ సంతలు వంద శాతం కాపీ కొట్టిస్తాయి. విద్యా వ్యాపారం రద్దయేవరకు ఇంటర్నల్ అసెస్మెంట్ మంచిది కాదు.
బిట్లు, ఖాళీలను పూరించడం, ఏక వాక్య సమాధానాలు, సమ్మరీ రాయడం వంటి విధానాలన్నీ 'విద్య కష్ట సాధ్యం, మార్కులు సులభ సాధ్యం' చేస్తాయి. విద్యా వ్యాపారం, కేంద్ర ఆధిపత్యం రద్దు కావాలి. అప్పుడే సంస్కరణలు ప్రయోజనాలు ఇస్తాయి. విద్యా వ్యాపారం, కేంద్ర ఆధిపత్యం రద్దు చేయకుండా ఇటువంటి సంస్కరణలు చేస్తే మరింత నష్టం.