తాజాగా షాడో న్యూస్ చాణక్యం!
x

తాజాగా 'షాడో న్యూస్' చాణక్యం!

అన్నీ చంద్రబాబునాయుడికి అవకాశాలే...


ప్రముఖ టెలివిజన్ ఎడిటర్ రాజదీప్ సర్దేసాయ్ 2025 ఏప్రెల్ మొదటివారంలో భారతీయ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు గురించి మాట్లాడుతూ, మొదటిసారి బాబుపై ఆయన తన అంచనాను ‘ఆన్-రికార్డు’ భద్రపరిచారు. విజయవాడలో రాజదీప్, ప్రణయరాయ్ తో కలిసి 2019 ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబును ఒక హోటల్లో కలసి వాళ్ళిద్దరూ నాయుడ్ని ప్రశ్నలు వేస్తూ అప్పట్లో టీవీల్లో కనిపించారు. బాబు పిలిచినా లేక వాళ్ళే వచ్చినా నేషనల్ మీడియా ప్రముఖులతో కనిపించడం ఒక అవసరమని బాబు అనుకుంటారు. దేశంలో ‘మార్కెట్ ఎకానమీ’ మొదలైన తొలిరోజుల్లో మారుతున్న కాలానికి తగినట్టుగా ఆయన తన ‘లైన్’ మలుచుకున్నారు.

మళ్ళీ మరోసారి 2024 ఎన్నికల ప్రచార సమయంలో ఆయన హైదరాబాద్ ప్యాలెస్ లాన్స్ లో బాబుతో రాజదీప్ కనిపించారు. అయితే గతంలో కేవలం ‘రిపోర్టింగ్’కు మాత్రమే పరిమితమైన రాజదీప్, ఈ ఏప్రెల్ లో మొదటిసారి- బాబువి ఎప్పుడూ- ‘లావాదేవి సంబంధాలు’ (ట్రాన్సాక్షినల్ రిలేషన్స్) అంటూ, బాబు 75 వ ‘బర్త్ డే’ ముందు రాజదీప్ తన ‘యూ ట్యూబ్’ చానల్లో ఈ వ్యాఖ్యలు చేసారు. అస్సలు ఆయన్ని ఒక వ్యక్తిగా అంచనా వేయడమే కష్టమని, అదొక ‘ట్రికి కేస్ స్టడీ’ అని అంటూ, ఆయనలో ‘అండర్ లైన్ హిపోక్రసీ’ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొదటి నుంచి తాను ‘సెక్యులరిస్ట్’ని అంటూనే, రాజకీయ మనుగడ కోసం వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ లో మద్దత్తు ఇవ్వడంపై బాబును రాజదీప్ నిశితంగా విమర్శించారు.

నేషనల్ మీడియాలో ప్రముఖులుగా కనిపించే కొందరు ఆంగ్ల పాత్రికేయులకు దేశంలో కమ్యునికేషన్ రంగంలో ఉన్న ‘స్టార్ వాల్యూ’ తక్కువ ఏమీ కాదు, ‘ఫలానా వాళ్ళు ఈ మాట అన్నారు..’ అంటే, దానికుండే విలువ దానికుంది. గత ముప్పై ఐదేళ్ళలో ‘మీడియా’ రంగంలో జరిగిన కార్పోరేట్ మార్పులు చూస్తున్నదే. జర్నలిస్టులు ‘రాజకీయులను’ మించిన రాజకీయం చేయగలరు అని కూడా మనవద్దనే దేశంలో మొదటిసారి నిరూపితం అయింది. ఈ చరిత్ర తెలుగు వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియక పోవచ్చు. రాష్ట్రంలో 1995 తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి మండల కేంద్రాల వరకూ ఉపాధిరంగంలో- ‘జర్నలిజం’ అంటే, అదొక కోలాహల కాలం.

ఈ మార్పు వచ్చిన పదేళ్ళకు క్రమంగా ‘మీడియా’ అనేది అదొక సంస్థాగత శక్తిగా మారడంతో, 1994 తర్వాత తిరిగి 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి- ‘ఆ రెండు పత్రికలు...’ అంటూ ఈ సభలో లేని మరో ప్రతిపక్షం మాకు బయట ఉంది అని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు. సరిగ్గా ఈ కాలంలోనే జర్నలిస్టులు పత్రికల ఎడిటర్ల పర్యవేక్షణా పరిధి నుంచి నేరుగా వారు మేనేజ్మెంట్ సిండికేట్ లోకి మళ్ళారు. కాలక్రమంలో ఒక పత్రిక జిల్లా స్థాయి విలేకరులు ఇద్దరు ఏకంగా రాష్ట్ర మంత్రులు అయ్యారు అంటేనే జరిగిన రూపాంతర ప్రక్రియ సాంద్రత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

అప్పటి వరకూ కేవలం ప్రభుత్వ కార్యక్రమాల ‘పబ్లిసిటి’కి పరిమితమైన సమాచార -పౌరసంబంధాల శాఖ 1983 తర్వాత- ‘రెండు రూపాయలకు కిలో బియ్యం–అన్నవరం’ తరహ ‘ప్రాపగాండా’ శైలిలోకి మారినా; 1995 తర్వాత కేవలం పదేళ్ళ కాలంలోనే ‘మీడియా మేనేజ్మెంట్’ ఒక్కటే సమస్తమూ అనే వైఖరిలోకి అది తన ‘గేర్’ మార్చాల్సి వచ్చింది. ఎనభై దశకంలో కూడా ఆ శాఖలో తాలూకా స్థాయి వరకూ పది రకాల ‘మీడియం’లు వినియోగిస్తూ ప్రభుత్వ పధకాల గురించి ప్రజల్లో అవగాహన గలిగించే వ్యవస్థ ఉండేది. వాటిలో ‘రీసెర్చ్ అండ్ రిఫరెన్స్’ విభాగం ఒకటి. కాని మారిన పరిస్థితుల్లో ఆ శాఖలోని ‘సమాచారము – పౌర సంబంధాలు’ రెండూ కూడా క్షతగాత్రం (క్యాజువాలిటీ) అయ్యాయి.

డా, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో పక్కన సీనియర్ మంత్రి రోశయ్య కూడా ఉన్నప్పుడు, ఒకరోజు సమాచార శాఖ అధిపతి ఒకరు ఆయన్ని కలిసి- ‘మునుపు చేసినట్లే మా శాఖ తరపున ‘మీడియా మేనేజ్మెంట్’ కొనసాగిస్తాము’ అన్నారట. దానికి వైస్- ‘అదేం వద్దు, ప్రజల్లోకి వెళ్ళడానికి మా పద్దతి మాకుంది, మీరు మీ పని చేసుకోండి’ అన్నారట. విషయం ఏదైనా ఆయన పని శైలి వేరు. అలా... యాభై దశకంలో పంచవర్ష ప్రణాళికలను గ్రామీణ ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం కోసం మొదలైన ఈ శాఖ, తెలుగునాట ఏర్పడిన తొలి ప్రాంతీయ పార్టీ రాజకీయ వైఖరితో, తనకంటూ ఒక ‘మాన్యువల్’ లేక, చివరికి ఒక రూపం లేని శాఖగా ఇది మిగిలిపోయింది.

ఇప్పుడు కూడా తెలుగు సిఎం గురించి రాజదీప్ సర్దేసాయ్ వ్యక్తం చేసిన అభిప్రాయంలో ఒక పాత్రికేయ పరిశీలకుడిగా మూడున్నర దశాబ్దాల కాలాన్ని దాటి వచ్చిన అనుభవం ఉంది. ఒక ‘అప్ కంట్రీ జర్నలిస్ట్’గా ఈ కాలంలో భారతీయ రాజకీయ నాయకుల వైఖరిని చాలా దగ్గరగా చూసిన గతం ఉంది. అందుకే చంద్రబాబు వైఖరి గురించి ‘వక్ఫ్’ బిల్లు సందర్భంగా రాజదీప్ అంతగా ‘ఓపెన్’ అయ్యారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు ఏప్రెల్ 25న బెజవాడలో మంత్రి నారాయణ కుమార్తె శరణి రచన ‘మైండ్ సెట్ షిఫ్ట్’ పుస్తక ఆవిష్కరణ సభలో “ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను” అనడం చూస్తే, బాబు ఇప్పటికే తనది ఒక ‘స్కూల్ ఆఫ్ థాట్’ అనే సంతుష్టి దశకు చేరినట్టుగా ఉంది?

కోలాహల కాలం (1995-2004) అని పైన చెప్పుకున్న పదేళ్ళ తర్వాత, తెలుగునాట జర్నలిస్టులకు తమ వృత్తిని బట్టి కాకుండా, కేవలం వ్యక్తిని బట్టి గౌరవం మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ కాలాన్నిఎడిటర్ సుప్రసిద్ధ రచయిత కె.ఎన్.వై. పతంజలి తన కాల్పనిక రచనల్లో ‘రికార్డు’ కూడా చేసారు. ఇలా వీరిలో వృత్తిపరమైన పదును తగ్గిన కారణంగానే, 2010 తర్వాత రాష్ట్ర విభజన అనివార్యం అనే వాతావరణం కనిపిస్తున్నప్పుడు, ఆంధ్ర ప్రాంతం పాత్రికేయులు తెలంగాణ వారి మాదిరిగా ప్రాతీయ దృష్టితో సమైఖ్యాంధ్ర ఉద్యమానికి తమ మేధో సహకారాన్ని అందించలేకపోయారు. అయితే, అప్పటికి రాష్ట్రంలో సామాజిక శాస్త్రాల చదువులు అటక ఎక్కడం కూడా పూర్తి అయింది.

ఒక పక్క పాత్రికేయం ఏమో ఇలా మిగిలి, ఆయనేమో తన భావధారను ఏకంగా అదొక- ‘స్కూల్ ఆఫ్ థాట్’ అంటున్నప్పుడు, ఇక మాట్లాడడానికి మిగిలింది ఏమిటి? ఒకప్పుడు డా. వైఎస్ఆర్ ఎత్తి చూపిన ‘ఆ రెండు పత్రికలు’ను వారి విమర్శకులు ‘ఎల్లో మీడియా’ అంటుంటే, అందుకు వారు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక ఈ పోటీదారులు ఇద్దరికీ తమ స్వంత మీడియా ఉంది అనేది జగమెరిగిన సత్యమయింది. సరే కానీ అవి రాసే లేదా చూపించే వార్తల్లోని సత్యం ఎంత? అనే ప్రజల అనుమానానికి జవాబు ఏది?

పాక్షికంగా ‘సోషల్ మీడియా’ అందుకు జవాబు అని చెప్పవచ్చు. దాని ‘కంటెంట్’ ఒక్కటే కాకుండా, ఉన్న సాంకేతిక సౌలభ్యం కూడా విషయం ‘రీచ్’ని విస్తృతంగా పెంచుతున్నది. అందుకే- “ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను” అనే చంద్రబాబుకు 2025 నాటికి దొరికిన పరిష్కారమే ‘మీడియా మేనేజ్మెంట్ 0.2’. ఇక్కడ లెక్క చాలా సులభం. ప్రతి మనిషికి ఉండేది అదే 24 గంటలు ప్రతి తెలుగు డైలీలో ఉండేవి అవే 14 పేజీలు, ఆంగ్ల పత్రిక అయితే 4 పేజీలు. ఇక ఆ పత్రికలకు ఛానళ్ళు కూడా ఉన్నప్పుడు, పత్రికలలో విషయమే టీవీల్లోకి చేరుతుంది. అటువంటప్పుడు, ‘షాడో న్యూస్’ కొన్ని సృష్టిస్తే అస్సలు వార్తల మధ్య అవి కూడా కొంతమేర జాగా ఆక్రమిస్తాయి.

ఉపయోగం ఏమిటి?

ఒకటి- ఇవి చదువరుల లేదా ప్రేక్షకుల దృష్టిని మళ్ళిస్థాయి, రెండు- ప్రజల్లో ‘కరెంట్ ఎఫైర్స్’పై జరిగే చర్చ రెండుగా విడిపోతుంది. మూడు- వీటిపై వీలైనంత తక్కువ ‘పబ్లిక్ అటెన్షన్’ ఉంటే చాలు.. అనుకునేవి ఈ మధ్యలో పూర్తిచేసుకోవచ్చు. నాలుగు- పబ్లిక్ నుంచి ఒత్తిడి పెరిగే అంశాల నుంచి దృష్టి మళ్లింపు, ఐదు- ‘ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి...’ అనే ‘ఇల్యూజన్’ పెంచవచ్చు, ఆరు- ఇతరులకు లేదా ప్రత్యర్ధులకు ఆ మేరకు ‘మీడియా స్పేస్’ తగ్గించవచ్చు.

ఇదే నెలలో 16వ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ సందర్శనలో చంద్రబాబు మ్యాప్ చూపిస్తూ మరీ ఈ రాష్ట్రం తక్షణ అవసరం 80,000 కోట్లు ఖర్చు అయ్యే ‘గోదావరి-బనకచర్ల’ ప్రాజెక్ట్ అని వివరించారు. అనుమానం ఏముంది ఇక ముందు దీనిపై జరిగే సమీక్షలతో రాబోయే నాలుగేళ్ళు ఇది ప్రతి నెలా పత్రికల్లో దర్శనమిస్తుంది. దీనిపై మాజీ రాష్ట్ర వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వర రావు మాట్లాడుతూ- “ఈ మొత్తంలో నాలుగు వంతులు కనుక ఖర్చుపెడితే, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పాతిక వరకూ పూర్తి అవుతాయి. పొలాలకు నీళ్ళు చేరతాయి” అంటున్నారు. ‘...అవకాశంగా మార్చుకుంటాను’ అన్నతర్వాత, ఇంకా ఎవరైనా మాట్లాడడానికి ఏముంది?

Read More
Next Story