పర్షియా, మెసపొటేమియా రాజులతో రాముడి పోలిక ఎలాంటిది?
x

పర్షియా, మెసపొటేమియా రాజులతో రాముడి పోలిక ఎలాంటిది?

రామాయణంలో నిరుత్తరకాండ-40 : కల్లూరి భాస్కరం

రామాయణం ప్రారంభంలో వాల్మీకి నారదమహర్షిని కొన్ని ప్రశ్నలడుగుతాడు; అవి ఇలా ఉంటాయి:

ఇప్పుడు భూలోకంలో మంచి గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమే మాట్లాడేవాడు, దృఢసంకల్పం కలిగినవాడు ఎవరు?

మంచి నడవడి కలవాడు, ప్రాణులన్నిటికీ మేలు చేసేవాడు, విద్వాంసుడు, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలిగినవాడు, అందరికీ ప్రీతి కలిగించే రూపురేఖలు ఉన్నవాడు ఎవరు?

ధైర్యవంతుడు, కోపాన్ని జయించినవాడు, చక్కని కాంతి కలిగినవాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో ఆగ్రహించినప్పుడు దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు ఎవరు?

సాధారణమానవులలో కనిపించని ఈ లక్షణాలన్నీ ఇక్ష్వాకువంశానికి చెందిన ఒక్క రాముడిలోనే ఉన్నాయని నారదుడు అంటాడు; బాలకాండ, ప్రథమసర్గలోని తొలి 18 శ్లోకాలలో ఆ లక్షణాలను మరింత విస్తరించి చెబుతాడు. వాటి ప్రకారం, రాముడు శత్రువులను నశింపచేయగలడు, శరణాగతరక్షకుడు, ఆశ్రితపోషకుడు, పెద్దలను గౌరవించేవాడు, సర్వసమత్వభావనకలిగినవాడు, స్వధర్మాన్ని, స్వజనాన్ని కాపాడేవాడు, సహనము, త్యాగము కలిగినవాడు...

రాముడు సూర్యవంశీకుడని ఈ పరిచయంలో ప్రత్యేకించి చెప్పకపోయినా, అది ప్రసిద్ధమైన విషయమే; రామాయణంలో వేరేచోట్ల ఆ ప్రస్తావన వస్తుంది.

మనం అంతగా గుర్తించని, లేదా చర్చలోలేని ఒక ఆసక్తికర విషయమేమిటంటే; పైన చెప్పిన రాముడి గుణగణాలూ, సూర్యుడితో అతనికున్న సంబంధమూ -ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రాచీన పర్షియా, మెసపొటేమియా రాజులకూ వర్తిస్తాయి. దాని గురించి మరికొన్ని వివరాలు చూద్దాం:

పర్షియన్లనే మనదగ్గర పార్శీలుగా చెప్పుకుంటాం. పర్షియన్లు జరతుష్ట్రమతాన్ని అనుసరిస్తారు. ప్రాచీన ఇరాన్ లో జరతుష్ట్ర అనే ప్రవక్త స్థాపించిన మతం అది. ‘అవెస్తా’ వీరికి చెందిన మతగ్రంథం. వేదాలకూ, అవెస్తాకూ మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. వైదికజనాలు, పర్షియన్ల పూర్వీకులు ఒకే కుదురుకు చెంది, నేటి ఇరాన్ ప్రాంతంలో కొంతకాలం కలసి జీవించడంవల్ల ఏర్పడిన పోలికలవి. ఆ తర్వాత వేరుపడి భిన్నపంథాలుగా అభివృద్ధి చెందినా రెండింటిలోనూ కొన్ని మౌలికలక్షణాలు అలాగే ఉండిపోయాయి. అగ్నినీ, మిత్రుని పేరుతో సూర్యునీ ఆరాధించడం వాటిలో భాగం. ఏకేశ్వరోపాసనతోపాటు ద్వైతలక్షణం కలిగిన జరతుష్ట్రమతం అనంతరకాలంలోని యూదు, క్రైస్తవ, ఇస్లాంమతాలను కూడా ప్రభావితం చేసిందని చరిత్ర చెబుతోంది. ఆవిధంగా, ఈరోజున భిన్నభిన్నమతాలుగా చూడడానికి మనం అలవాటుపడిన వివిధ మతాల మధ్యా గాఢమైన సోదరసంబంధం ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ మతాల పుట్టుక, పరిణామాల చరిత్రలోకి మరింత లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కనుక ఇక్కడ ఆగుదాం.

సృష్టిలో రెండు విరుద్ధశక్తులు ఆధిపత్యం కోసం సంఘర్షిస్తూ ఉంటాయనీ, ఆ రెంటిలో ఎటువైపు ఉండాలో మనుషులు నిర్ణయించుకోవాలనీ జరతుష్ట్రమతం చెబుతుంది. మొదటిది మంచితోనూ, వెలుగుతోనూ నిండినదైతే; రెండవది చెడుతోనూ, చీకటితోనూ నిండినది. ప్రతి కర్మకూ ఫలితం తప్పదన్న కర్మసిద్ధాంతాన్ని కూడా ఈ మతం బోధిస్తుంది. అగ్నీ, సూర్యుడూ వెలుగుకు ప్రతీకలు కనుక ఈ మతంలో ఆరాధ్యులయ్యారు.

విశేషమేమిటంటే, హెచ్. ఎ. డేవిస్ (H. A. Davies) అనే చరిత్రకారుడు ‘ఏన్ ఔట్ లైన్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్’(An Outline History of The World) అనే తన గ్రంథంలో పర్షియన్ల గురించి చెప్పిన మాటలు, పైన చెప్పిన రాముడి గుణగణాలకు దాదాపు ప్రతిధ్వనులుగా వినిపిస్తాయి. ఆయన ఇలా అంటాడు:

The Persians were, in many ways, a highly civilized people, and they had many admirable qualities, of which perhaps the most striking were their love of truth, their belief that it was disgraceful to fall into debt, and their courage.

(పర్షియన్లు అనేకవిధాలుగా అత్యంతనాగరికజనాలు; ప్రశంసనీయమైన అనేక సుగుణాలు కలిగినవారు; వాటిలో బహుశా మరింత ప్రముఖంగా కనిపించేవి- సత్యంపట్ల వారి అనురక్తీ, ఎవరికైనా రుణపడి ఉండడం అత్యంత అవమానకరమన్న వారి విశ్వాసమూ, వారిలోని ధైర్యసాహసాలూ)

ఇప్పుడు వాల్మీకి నారదుని అడిగిన తొలి ప్రశ్న ఎలా ఉందో చూడండి; అది ప్రశ్నరూపంలోనే రాముడిలోని సుగుణాలను చెబుతుంది; రామాయణం మొత్తంలోనే ఇది రెండవ శ్లోకం:

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః

ఇప్పుడు భూలోకంలో మంచి గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమే మాట్లాడేవాడు, దృఢసంకల్పం కలిగినవాడు ఎవరని ఈ శ్లోకభావం. ఇందులో ‘కృతజ్ఞు’ డనే మాటకు, ‘ఇతరులు తనకు చేసిన మేలును గుర్తుపెట్టుకుని ప్రత్యుపకారం చేసేవా’ డని అర్థం చెప్పుకుంటే, ‘ఎవరికైనా రుణపడి ఉండడం అత్యంత అవమానకర’మన్న పర్షియన్ల భావనకు పూర్తిగా సరిపోతుంది.

పై ప్రశ్నకు నారదుడు ఇచ్చిన సమాధానాలు కూడా, గుణగణాలలో రాముడికీ, పర్షియన్లకూ ఉన్న పోలికలనే మరోసారి నొక్కి చెబుతాయి:

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః

నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ (బాలకాండ, సర్గ 1, శ్లో.6)

ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముని గురించి జనమంతా విని ఉన్నారు; అతడు నిశ్చితమైన స్వభావమూ, గొప్ప పరాక్రమమూ, మంచి కాంతీ, ధైర్యమూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు.

ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః

యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్య: సమాధిమాన్ (బాలకాండ, సర్గ 1, శ్లో. 12)

రాముడు అన్ని ధర్మాలూ బాగా తెలిసినవాడు, సత్యసంధుడు, ప్రజల హితాన్నే కోరుకునేవాడు, గొప్ప కీర్తి కలిగినవాడు, జ్ఞానసంపన్నుడు, పరిశుద్ధుడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, గొప్ప ఆలోచనాశీలి.

రాముడికీ, పర్షియన్లకీ ఉన్న మరో ఆసక్తికరమైన పోలిక చూడండి:

రాముడు వానరసైన్యంతో కలసి రావణసంహారానికి లంకకు బయలుదేరాడు. అందుకు సముద్రం దాటాలి. సముద్రంపై వారధి నిర్మించాలని రాముడు అనుకున్నాడు. వారధి నిర్మాణానికి సహకరించమని మూడురోజులపాటు సముద్రుని ప్రార్థించాడు; ఆ మూడు రోజులూ దర్భలు పరచుకుని సముద్రతీరంలోనే పడుకున్నాడు. అయినా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. దాంతో రాముడు ఆగ్రహించాడు. భయంకరులైన దానవులతో నిండిన ఈ సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తానంటూ ధనుష్టంకారం చేసి, సముద్రునిపై బాణాలు ప్రయోగించాడు. అయినా సముద్రుడు లొంగకపోవడంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై వారధి నిర్మాణానికి దారి ఇచ్చాడు.

హెరోడటస్(Herodotus) అనే చరిత్రకారుడు నమోదు చేసిన ప్రకారం, క్రీ.పూ.519కి చెందిన పర్షియన్ చక్రవర్తి జక్సీస్(Xerxes) గ్రీకులపై యుద్ధానికి బయలుదేరాడు. సముద్రం అడ్డువచ్చింది. నౌకలతో వారధి కట్టించాడు. అంతలో పెద్ద తుపాను సంభవించి ఆ నౌకలను చెదరగొట్టింది. దాంతో జక్సీస్ కు సముద్రుడిపై కోపమొచ్చింది. పర్షియన్ చక్రవర్తినైన తనను ఇలా అవమానించడానికి సముద్రుడి కెంత ధైర్యమనుకుని ఆగ్రహించాడు. సముద్రుని బంధించమని ఆదేశించి, అందుకు సూచనగా కొన్ని సంకెళ్ళను సముద్రంలో వేయించాడు; మూడు వందల కొరడా దెబ్బలను సముద్రునికి శిక్షగా విధించి అమలు చేయించాడు.

మెసపొటేమియాలో, అక్కడుల పేరుతో తొలి సామ్రాజ్యాన్ని స్థాపించిన సారగాన్(క్రీ.పూ. 2334-2279)గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం; రాజును దేవుడిగా, లేదా దేవుడికి ప్రతినిధిగా చెప్పుకోవడం ఇతనితోనే మొదలైందని కూడా అనుకున్నాం. దేవుడు, లేదా దైవప్రతినిధి పాలనను, ప్రజలకు మేలు చేకూర్చే ధార్మికపాలనగా చిత్రించుకోవడం సహజమే. ఇతని గురించిన కథనాలు కూడా ఇతని శౌర్యసాహసాలను ఉగ్గడిస్తాయి; సముద్రాన్ని దాటి వెళ్ళి శత్రువులను జయించిన అనుభవం ఇతనికి కూడా ఉంది. రాజు, రాచరికాలకు చెందిన నమూనాను ప్రపంచానికి అందించినవాడిగా ఇతను గుర్తింపు పొందాడు.

మెసపొటేమియాలోని బాబిలోనియాను ఏలిన హమ్మురాబి(క్రీ.పూ. 1728-1686)కి రాముడితో పోలిక మరింత స్పష్టంగా కనిపిస్తుంది. భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్ని, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల దౌర్జన్యంనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో ‘సూర్యుడిలా ప్రకాశిస్తూ’ భూమి అంతటా వెలుగు నింపమనీ తనను దేవతలే ఆదేశించినట్టు అతను చెప్పుకున్నాడు. ఇక రాముడు సూర్యవంశీకుడే కాక విష్ణువు అవతారం కూడా.

స్త్రీదేవత స్థానంలో పురుషదేవుణ్ణి; మాతృపారంపర్య, మాతృస్వామ్యాల స్థానంలో పితృపారంపర్య, పితృస్వామ్యాలను ఎలా స్థాపించారో; వాటికిగల సామాజిక, సాంస్కృతిక, మత, తాత్విక, చారిత్రకనేపథ్యం ఎలాంటిదో విలియం ఇర్విన్ థామ్సన్ ను ఉటంకించుకుంటూ గతంలో విస్తృతంగా చెప్పుకున్నాం. ఆయనకన్నా చాలాముందే, ‘ది మాస్క్స్ ఆఫ్ గాడ్’ (The Masks of God) పేరుతో నాలుగు బృహద్ సంపుటాలను వెలువరించిన ప్రముఖ పౌరాణిక విషయాల పండితుడు జోసెఫ్ కాంబెల్ ఈ పరిణామక్రమం వెనుకనున్న తాత్వికతను వివరిస్తాడు; సూర్యునితో ముడిపెట్టుకున్న ఈ రాజుల అవతరణతో ‘సౌరీకరణ’(Solarization)గా చెప్పదగిన ఒక ఆసక్తికరపరిణామమూ, ‘సౌరయుగ’మూ ప్రారంభమయ్యాయనీ, అవి, స్త్రీదేవత ప్రాధాన్యం వహించే ఆదిమపౌరాణికతకు చెందిన ప్రతీకలవ్యవస్థ మొత్తాన్ని తలకిందులు చేశాయనీ ఆయన అంటాడు.

ఎలాగంటే, ఆదిమపౌరాణికతలో చంద్రుడూ, వృషభమూ ముఖ్యప్రతీకలైతే; పురుషదేవుడు ప్రాధాన్యం వహించే నవీనపౌరాణికతలో సూర్యుడూ, సింహమూ ముఖ్యప్రతీకలయ్యాయి. ఈ నవీనపౌరాణికతకు చెందిన రాజును పోల్చవలసింది వృద్ధి, క్షయాలను, చీకటి, వెలుగులను సంకేతించే చంద్రుడితో కాదు; నిత్యం వెలుగునిచ్చే సూర్యునితో! సూర్యప్రతాపం ముందు అన్ని రకాల చీకట్లూ, అసురులూ, శత్రువులూ, సందిగ్ధాలూ పలాయనం చిత్తగించవలసిందే. ఇది సూర్యుడు కేంద్రంగా మొదలైన నూతనయుగం. ఇందులో ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, మంచి-చెడు అనే జంట పదాలు, వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, శక్తుల మధ్య సంఘర్షణా; ఆ సంఘర్షణలో ధర్మం, నీతి, మంచి అనేవి విజయం సాధించడమనే ఒక సూత్రం, లేదా ఒక మూస రూపొందింది. దీనిని ‘పురుషసూత్ర’మనీ, స్త్రీప్రాధాన్యం కలిగిన వెనకటి వ్యవస్థ ‘స్త్రీసూత్రా’నికి చెందినదనీ కాంబెల్ అంటాడు. ఈ రెండు సూత్రాల మధ్య స్పర్థా, సంఘర్షణా ఫ్రాక్, పశ్చిమాలకు చెందిన పురాణ, ఇతిహాసాలలో ఎలా వ్యక్తమయ్యాయో ఆయన వివరిస్తాడు.

ఈ కోణంనుంచి చూసినప్పుడు గ్రీకుకవి హోమర్ చెప్పిన ఇలియడ్, ఒడిస్సీలు; వాల్మీకి చెప్పిన రామాయణం, వ్యాసుడు చెప్పిన మహాభారతాల మధ్య ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. రామాయణ, మహాభారతాల్లానే ఇలియడ్ కూడా యుద్ధప్రధానమైన ఇతిహాసం; వాటిలానే ధర్మాధర్మాలు, నీతి అవినీతులు, మంచి చెడులనే ద్వంద్వాల మధ్య ఘర్షణను; ఆ క్రమంలో వ్యక్తులు ప్రదర్శించే ధైర్యసాహసాలను, శౌర్యాన్ని చెబుతుంది. ఇలియడ్ లో ప్రధానదైవమైన అపోలో వెలుగునిచ్చే దేవుడు, అంటే సూర్యుడు.

ఒడిస్సీ విషయానికి వస్తే, అది స్త్రీసూత్రాన్ని ప్రముఖంగా ఎత్తిచూపుతూ, స్త్రీపై పురుషుడి విజయాన్ని చెప్పే తత్త్వప్రధానమైన కృతి. ఇందులోని నాయకుడైన ఒడీసియస్ పదేళ్లపాటు జరిగిన ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న వీరుడు. ఇలియడ్ లో ప్రధాన ఇతివృత్తం ట్రోజన్ యుద్ధమే. ఆ యుద్ధం తర్వాత ఒడీసియస్ మరో పదేళ్లపాటు భార్య పెనెలొపికి దూరమై స్త్రీసూత్రానికి చెందిన అధోజగత్తులో సంచరిస్తాడు. పురుషసూత్రానికి చెందినవాడిగా స్త్రీ సృష్టించే అనేక అడ్డంకులను వీరోచితంగానూ, యుక్తితోనూ అధిగమిస్తాడు. ఆ క్రమంలో విధ్వంసాన్ని ఎదుర్కొని, సహచరులను నష్టపోతాడు. చివరికి ఇరవయ్యేళ్ళ విరామం తర్వాత ఒంటరిగా ఇంటికి చేరి భార్యను కలసుకుంటాడు.

విశేషమేమిటంటే, తన పదేళ్ళ సుదీర్ఘయాత్రలో ఒడీసియస్ సూర్యుడు ఉదయించే ప్రదేశానికి అంటే సౌరద్వీపానికి కూడా వెళ్ళివస్తాడు. ఆ విధంగా అతను కూడా రాముడు, సారగాన్, హమ్మురాబిలలానే ‘సౌరవీరుడు’.

ఆపైన, ఆదిమపౌరాణికతకు చెందిన స్త్రీదేవతలపై రాక్షసులు, లేదా దుష్టశక్తులన్న ముద్రవేసి చంపడం; ఆ పౌరాణికతకు చెందిన ప్రతీకలను చిన్నబుచ్చడం, లేదా పురుషదేవుళ్ళకు అన్వయించడం, మొత్తంగా స్త్రీ తన వెనకటి ప్రాధాన్యాన్ని కోల్పోవడం వగైరాలు ఈ సౌరయుగపరిణామాలే. ఇలా సూర్యుడు, సౌరయుగం అనేవి తూర్పు, పశ్చిమాలకు చెందిన పురాణ, ఇతిహాసకథల మధ్య ఏకసూత్రతను కల్పిస్తున్నాయి.

స్త్రీపై, స్త్రీసూత్రంపై విజయం సాధించడంతో సహా ఈ సౌరయుగలక్షణాలన్నీ రామాయణంలో రాశిపోసి కనిపిస్తాయి. ఆయా సందర్భాలలో వాటి గురించి చెప్పుకుందాం.


భూమన్ చెబుతున్న









Read More
Next Story