ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణలో  మళ్ళీ రాజకీయం
x

ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణలో మళ్ళీ రాజకీయం

సభలో పూర్తి మెజార్టీ వున్న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీ లో బిల్లు ఆమోదింప చేసే బదులు, ఆర్డినెన్స్ అంటున్నారు. ఎందుకు?


(వెలది కృష్ణకుమార్)

ఎస్సీ వర్గీకరణ మూడు దశాబ్దాలుగా సాగిన సమస్య. ఎస్సీ వర్గీకరణ కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, రాష్ట్రాల పరిధిలో ఎస్సీ ఉపకులాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు అంత సులభంగా జరిగేలా లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ పరిణామాలను గమనిస్తే, తెలంగాణ లో సాఫీగా పరిష్కారానికి నోచుకున్న ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ లో రేవంత్ ప్రభుత్వం అన్ని పార్టీల ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది. రాజకీయంగా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు. అయితే ఏపీలో పరిస్థితి కొద్దిగా భిన్నంగా వుంది. అంతకుముందు తెలంగాణ లో, ఏపీలో ప్రభుత్వాలు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి వర్గీకరణ పైన నివేదికలు కోరాయి. కమిషన్ల నుంచి అందిన నివేదికలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాలలో ఆమోదం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా, తీర్మానం తో సరిపెట్టి ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించింది. అయితే ముందు నుంచి ఎస్సీ వర్గీకరణ కు చంద్రబాబు నాయుడు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలు బీజేపీ, జనసేన కూడా వర్గీకరణకు మద్దతు గా నిలుస్తున్నాయి. సభలో పూర్తి మెజార్టీ వున్న చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీ లో బిల్లు ఆమోదించి వర్గకరణ అమలు చేయవచ్చు. కానీ ఖచ్చితమైన ఎస్సీ జనాభా లెక్కలు వచ్చే వరకు అంటే 2026 జనాభా లెక్కల వరకూ ఎస్సీ వర్గీకరణ బిల్లు తేకుండా అప్పటివరకూ ఆర్డినెన్స్ అమలు చేయాలని చూస్తోంది. ముఖ్యంగా ఎస్సీలలో వర్గీకరణ కోరుకుంటున్నది మాదిగ వర్గాలు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలో దశాబ్దాలుగా జరిపిన పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పుతో విజయం సాధించారు.సుప్రీం కోర్టు తీర్పును అమలుచేస్తూ అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అమోదించాలని కృష్ణమాదిగ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయి?

ఉమ్మడి ఏపీలో నాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నాయి. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఒక కోటి38 లక్షల 78 వేల 78,వీరిలో మాదిగలు 67లక్షల 2 వేల 609 మంది కాగా, మాలలు 55 లక్షల 70 వేల 244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలోని SC జాబితాలోని 59 ఉపకులాలలో మాలలు , మాదిగలు రెండు ప్రధాన ఉప కులాలు. 2011లెక్కల ప్రకారమే కేవలం తెలంగాణలోని 54.32 లక్షల SC జనాభాలో, మాదిగలు 32.33 లక్షలు , మాలలు 15.27 లక్షలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 84.45 లక్షల SC జనాభాలో మాదిగలు 34.68 లక్షలు మాలలు 40.43 లక్షలుగా వున్నారు. అంటే తెలంగాణ లో మాదిగల జనాభా ఎక్కువగా వుంటే ఏపీలో మాలల డామినేషన్ కనిపిస్తోంది. అందుకే ఏపీలో వర్గీకరణ అంశలో పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏంటి?

ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడింది. ఎస్సి ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2011జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించినట్లు, నూతన జనాభా లెక్కింపు పూర్తయిన అనంతరం అంటే 2026 తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేస్తామని స్పష్టం చేసారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఏపీ ప్రభుత్వం తీసుకు రానుంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఏకసభ్య కమిషన్‌ సమర్పించిన నివేదికకు మార్చి 17న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.జనాభా ప్రాతిపదికన.. రెల్లి కులస్తులకు 1 శాతం, మాదిగ - మాదిగ ఉపకులాలకు 6.5 శాతం, మాలలు - మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నివేదికలో కమిషన్‌ సూచించింది.

మొత్తం ఎస్సీ జనాభాలో మాల, మాదిగ రెండు ఉపకులాల జనాభానే 80 శాతం వరకూ ఉన్నట్లు అంచనా వేసారు. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.

వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఏపీ మాల నేతలు

ఆంధ్రప్రదేశ్ లో 2011 లెక్కల ప్రకారం చూసినా మాలలేదే ఎక్కువ సంఖ్య .అయినా ఆ లెక్కలు కూడా తప్పని ఏపీలో మాలల సంఖ్యను ఇంకా తక్కువగా చూపుతున్నారన్నది మాల మహానాడు నేతల వాదన. ఈ విషయంపై ఏపీ మాల మహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ మాట్లాడుతూ తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. తాను పార్టీ పరంగా తెలుగుదేశం నేతనే అయినా మాలల ప్రతినిధిగా వర్గీకరణకు వ్యతిరేకమని తెలిపారు. ఏపీలో ఎస్సీల జనాభా లో వెయ్యిమంది మాలలుంటే కేవలం 100 మందే మాదిగలు వున్నారని, అలాంటిది మాదిగ లకే ప్రభుత్వాలు, పార్టీలు అధిక ప్రాధాన్యం ఇస్తూ, లెక్కలనే తారుమారు చేస్తున్నాయని ఆరోపించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎందుకన్నారు.ఎస్సీ రిజర్వేషన్లు 15శాతం నుంచి 18శాతానికి పెంచిన తరువాత 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మాలలలో వున్న అనైక్యతను పార్టీ లు అనుకూలంగా మార్చుకుంటున్నాయని అందుకే మాదిగల పెత్తనం నడుస్తోందని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మాలవర్గం మీద నమ్మకం లేదని, గతంలో మాలనేతలు జూపూడి ప్రభాకరరావు, కారం శివాజీ లాంటి లీడర్లకు పదవులు ఇచ్చినా వారు తెలుగుదేశం పార్టీని మోసం చేశారన్న భావం చంద్రబాబు లో వుండిపోయిందన్నారు.ఎస్సీ వర్గీకరణ బిల్లును దమ్ముంటే ముందుగా పార్లమెంట్ లో ఆమోదించాలని, అన్ని రాష్ట్రాలలో కూడా ఎందుకు బిల్లు తేవడం లేదన్నారు.అయితే మాలల సైలెంట్ ఓట్ టీడీపీ కి భవిష్యత్ లో ప్రమాదం గా మారే అవకాశం కనిపిస్తోంది.మరికొందరు మాల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం పై ఎమ్మార్పీఎస్ హర్షం..

ఎస్సీ వర్గీకరణ ను సమర్దిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై ఎమ్మార్పీఎస్ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ప్రభుత్వం నిర్ణయాన్ని , చంద్రబాబు నిబద్దతను మెచ్చుకున్నారు. అదే సమయంలో వర్గీకరణ విషయంలో వైసీపీ స్పష్టమైన వైఖరిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతల మాటలు వర్గీకరణ కోరుకున్నట్లు అనిపించడం లేదని, మాల వర్గానికి మద్దతుగా వుంటున్నాయని అన్నారు. ఎంపీగా వున్నప్పుడు , ఆ తరువాత ఎస్సీ వర్గీకరణకు తాన మద్దతు ప్రకటించిన జగన్ ఇప్పుడు నేరుగా ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నను లేవనెత్తారు.వర్గీకరణ ఉపయోగంపై ఎస్సీ వర్గాలలో అవగాహన పెంచాలని ఇది ప్రభుత్వ బాధ్యత గా ఎమ్మార్పీఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

వైసీపీ తటస్థంగా వ్యవహరిస్తోందా,?

ఎస్సీ వర్గీకరణపై వైసీపీ దూకుడు గా వెళ్లడంలేదు. తమ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూనే అన్ని ఉపకులాలకు సరియైన న్యాయం జరగాలన్నదే తమ పార్టీ అభిప్రాయం గా నేతలు చెబుతున్నారు. అసెంబ్లీలో ఎస్సీవర్గీకరణ తీర్మానం ఆమోదం తరువాత వైసీపీ నేత ,మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేరుగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం యూనిట్ గా 2026 లెక్కలు తరువాత జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేస్తామనడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. చంద్రబాబు కు వర్గీకరణపై చిత్తశుద్ధి లేదని మాదిగ వర్గాన్ని ప్రసన్నం చేసుకోడానికి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కూడా నేరుగా ఏమి మాట్లాడడం లేదు. అయితే వైసీపీ కి మాల వర్గం నుంచి మంచి ఓటు బ్యాంకు వుందన్న విషయాన్ని ఎవరూ కాదనరు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ను సమర్దిస్తూ వచ్చిన మాల వర్గాలు , విభజన తరువాత వైసీపీకి అనుకూలంగా మారాయి .ఈ రాజకీయ కారణాలతో వైసీపీ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు.

మూడు దశాబ్దాల వర్గీకరణ పోరాటం

ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో 1994లో ఈ ఉద్యమం మొదలైంది.

ఎస్సీలకు మొత్తంగా వున్న 15 శాతం రిజర్వేషన్ కోటా లో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే భావం మాదిగ లలో వచ్చింది ఆచర్చలు ఉద్యమంగా మారాయి.

జనాభా పరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటి కీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామ చంద్రరాజు కమిషన్ తేల్చింది. రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగా గుర్తించారు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా, 1997 జూన్ 6న ఆనాటి ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. అయితే, మాల మహా నాడు దీనిపై కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందనీ, రాజ్యాంగ విరుద్ధమైందనీ ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉండిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, వర్గీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

ఆ తర్వాత, 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకర ణ చట్టం చేసింది. నాటి రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి నారా యణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చినా, 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2004లో వైస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి, ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.2008 మేలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, దానిద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫార్సు చేశారు. ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరుగుతూనే వున్న ఎస్సీ వర్గీకరణ అంశాలో వివాదానికి సుప్రీంకోర్టు పులిస్టాప్ పెట్టింది. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అను కూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దానితో రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ దిశగా అడుగులు వేశాయి. తెలంగాణ లో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా ,మాలలు ఎక్కువగా వున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వర్గీకరణ రాజకీయంగా ఇబ్బందులు తెస్తోంది.

Read More
Next Story