ఢిల్లీ కాలేజీకి ‘వీర్ సావర్కర్’ పేరు పెట్టడం ఎన్నికల స్టంట్ ?
x

ఢిల్లీ కాలేజీకి ‘వీర్ సావర్కర్’ పేరు పెట్టడం ఎన్నికల స్టంట్ ?

ఆర్ఎస్ఎస్, భారతీయ జన్ సంఘ్ కూడా సావర్కర్ ను దూరం పెట్టాయి


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఇంకా కొన్ని గంటల్లో ప్రకటించబోతోంది. ఇందుకు కొన్ని రోజుల కంటే ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని కీలక పనులకు శంకుస్థాపన చేశారు. అందులో గృహ, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందులో మరీ ముఖ్యమైనది విద్యారంగ సంస్కరణ.

దాదాపు మూడు దశాబ్ధాల తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని విస్తరణకు ఆయన పచ్చజెండా ఊపారు. చివరిగా దేశ రాజధానిలో విద్యా రంగాన్ని 90 దశకంలో విస్తరించారు. అప్పట్లో 12 కాలేజీలు కేంద్ర ఆధ్వర్యంలోని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా స్థాపించబడ్డాయి.
ఆ కాలేజీలన్నీ కూడా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతమయి ఉండగా, తాజాగా కేంద్రం తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో కొత్తగా నిర్మించడానికి భూమి పూజా చేసింది. రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యను అందించే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. ఇక్కడ వరకూ అంత బాగానే ఉంది.
విమర్శలు ప్రారంభం..
ఈ భూమి పూజ కార్యక్రమంలో కూడా మోదీ రాజకీయాలకు తెరతీశారు. గత దశాబ్ధ కాలంగా తనకు కొరకరాని కొయ్యాగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ, దాని అధినేత, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై విమర్శలు ప్రారంభించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఈ కాలేజీకి హిందూ హృదయబంధు, సనాతన ధర్మ సిద్దాంతాలను ప్రచారం చేసిన వినాయక్ దామోదర్ సావర్కర్(వీడీ సావర్కర్) పేరు ను పెట్టారు.
ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇటీవల మరణించిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా 2014 నుంచి విద్యా రంగాన్ని తమ రాజకీయాల పోరాట వేదికగా మార్చేశాయి. విద్యా రంగంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విబేధాలు కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలు ప్రస్తుత పాలక పక్షానికి అనుకూలమైన వ్యక్తులను ఉత్పత్తి చేసే ప్రదేశంగా మారాయి. ఇది కొత్త సాంప్రదాయం మాత్రం కాదు.
కొత్త కాలేజీకి దేశానికి చెందిన అనేక మంది నాయకులు, ప్రముఖ భారతీయుల పేర్లు పెట్టే అవకాశమున్నప్పటికీ, ప్రస్తుత పాలక పక్షం హిందుత్వ సిద్ధాంత పితామహుడిగా భావించే వీడీ సావర్కర్ పేరును ఎంచుకుంది.
జేఎన్ యూ పేరు పెట్టినప్పుడే..
1980 చివర నుంచి 90 ల ప్రారంభం లో దేశ రాజకీయాలు ప్రతిస్పందనల స్థాయి పెరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పేరుపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
1964 డిసెంబర్‌లో, నెహ్రూ మరణం తర్వాత ఏడునెలల్లో, జేఎన్‌యూ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. విద్యా మంత్రి ఎం.సీ. చాగ్లా ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, ఇది నెహ్రూ జీవితం, కార్యాలు, ఆలోచనలకు గౌరవసూచికగా వుంటుందని అన్నారు.
అయితే, పార్లమెంటు సభ్యులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపారు. అలా నవంబర్ 3, 1965న నివేదిక వచ్చింది. తరువాత యూనివర్శిటీలకు పేరు పెట్టారు. ప్రస్తుతం వీడీ సావర్కర్ కాలేజీ విషయంలో కాంగ్రెస్ అభ్యంతరాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.
కాంగ్రెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు కోరింది
1964 లో ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని మహిళా కళాశాల స్థాపించారు. 1966 లో ఆధునిక కళాశాలగా మార్చారు. తరువాత 1974 లో నెహ్రూ భార్య, ఇందిరాగాంధీ తల్లి అయిన కమలానెహ్రూ కళాశాలగా మార్చారు. ఇలా అనేక పరిణామాల తరువాతనే ఇలా పేరు మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేకత సంప్రదాయం కాదని, కేవలం వీడీ సావర్కర్ పేరు పెట్టడం పై మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సావర్కర్ పేరు బదులు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కోరింది. కేవలం రాజకీయ లక్ష్యాలతో విద్యా సంస్థలకు పేర్లు పెట్టే సంప్రదాయాలకు స్వస్తి పలకాలంది.
సావర్కర్ పేరు వివాదాస్పదమైంది.. తన సిద్దాంతాలతో సమస్యాత్మక వ్యక్తిగా మిగిలిపోయాడు. సావర్కర్ జైలులో ఉండగా బ్రిటిష్ వారికి రాసిన లేఖ, గాంధీజీ హత్య కేసులో ప్రమేయం వంటి ఆరోపణలు ఉన్నాయి. గాంధీ హత్య తరువాత అంటే ఫిబ్రవరి 1949 లో నిర్దోషిగా విడుదల అయ్యాడు. దేశంలో మొదటి రాజకీయ హత్య జరిగిన తరువాత దర్యాప్తును పూర్తి చేసిన జేకే కపూర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కారణంగా హత్యకు కుట్ర పన్నినట్లు ఆధారాలు లేవని, కానీ సిద్ధాంతాలు ప్రమాదకరం అని రాశారు.
స్వాత్రంత్య్ర సమరయోధుడు మదన్ లాల్ ధింగ్రా ఉరితీయడానికి దారి తీసిన విప్లవాత్మక జాతీయవాదం వివిధ చర్యలలో పాల్గొన్నందున సావర్కర్ కు అతని అభిమానులు ‘వీర్’ బిరుదును ఇచ్చారు.
మొదటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని పురస్కరించుకుని 1907 లో సావర్కర్ ఓ పుస్తకం రాశారు. అదే ‘ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857’ ఈ పుస్తకాన్ని లండన్ లో వేరే అట్టలతో పబ్లిష్ చేసి జాతీయ వాదులకు పంపిణీ చేసేవారు. తరువాత సావర్కర్ అరెస్ట్ కాబడ్డాడు. దాదాపు దశాబ్ధం అండమాన్ జైలులో వెలుతురును చూడకుండా జైలు శిక్ష అనుభవించాడు. తరువాత రత్నగిరి జైలులో ఉన్నాడు.
హిందూ ఐక్యతను పెంపొందించడం, వారి గుర్తింపును బలోపేతం చేయడం సావర్కర్ లక్ష్యం. మతపరమైన మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు కొంత వరకూ సమాన పౌరులుగా ఉండాలనే ఆలోచనను తీవ్రంగా తిరస్కరించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో హిందూవులు బ్రిటిష్ సైన్యంలో పెద్ద ఎత్తున చేరాలని కోరాడు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు.
వివాదాస్పద వ్యక్తిత్వం..
భారతీయ హిందూ రైట్ వింగ్ కు లీడర్ గా ఉన్నప్పటికీ సైద్దాంతిక మధ్య మార్గాన్ని అనుసరిస్తున్న వారిలో కూడా సావర్కర్ తీవ్ర వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు. కపూర్ కమిషన్ రిపోర్టులు సావర్కర్ మెడపై డామోకల్స్ కత్తిలా వేలాడుతున్నాయి. సావర్కర్ నిర్ధోషిగా విడుదలైన 17 సంవత్సరాల తరువాత కూడా జనబాహుళ్యంలోకి రాకుండా ఉండిపోయాడు.
అలాగే 1966 లో కఠినమైన ఉపవాస దీక్షతో మరణించాడు. ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న సమయంలో నెలవారి పింఛన్ చెల్లింపుకు ఆమోదం తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో సావర్కర్ గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసినప్పటికీ అతని జీవితంలో మరక మాత్రం అలాగే ఉండిపోయాయి.
ప్రస్తుతం ఢిల్లీలో సిద్ధమవుతున్న కళాశాలకు సావర్కర్ పేరు పెట్టడం అన్నది దేశంలోనే తొలిసారి అవుతుంది. ఇంతవరకూ ఎక్కడా సావర్కర్ పేరుతో కళాశాలలు లేవు. రాహుల్ జాతీయవాది పేరును పెట్టడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన మాటలపై మరాఠాలోని అన్ని పార్టీలు విభేదిస్తున్నాయి.. అయితే ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
ఆర్ఎస్ఎస్ కూడా వెనక్కి తగ్గిన వ్యక్తి..
హిందూత్వవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా సావర్కర్ పేరు తమతో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. చివరకు ఆయన మరణం తరువాత కూడా ఆర్ఎస్ఎస్, భారతీయ జన సంఘ్ ఆయనను కీర్తించలేదు. తనకు ఉన్న మరకలను ఎక్కడ తమపై రుద్దుతారో అని వారు భయపడ్డారు.
ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ లో భారతీయ సంఘ్ మెజారిటీలో ఉన్నప్పుడూ లాల్ కృష్ణ అద్వానీ దానికి చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆ కాలంలో స్థాపించిన మహిళా కళాశాలకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కళాశాల స్థాపించారు. నిజానికి దానికి సావర్కర్ పేరు పెట్టడానికి ఆయన ఇష్టపడలేదు.
గత దశాబ్ధకాలంగా మోదీ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతాలు, చిహ్నలు ప్రచారం చేసింది. దీనిపై దాని భాగస్వామ్య పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2024 లో దాని బలం 240 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ దాని రాజకీయ ఎజెండాను కొనసాగిస్తోంది. ఇది కేవలం ఢిల్లీ నగరానికే పరిమితం అయినప్పటికీ రెండు కూటమి పార్టీలతో పాటు చిన్న పార్టీల అవకాశాలను కూడా ఎన్నికల పరంగా దెబ్బతీస్తుంది.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పువచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమి ఇంకా బలంగా లేదు. కాలేజీకి మన్మోహన్ సింగ్ పేరును కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే, ఎన్డీఏ లో చీలికలు వచ్చే దిశగా ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా వ్యవహరించాలి.
( ఈ అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. ది ఫెడరల్ అన్ని స్థాయిల అభిప్రాయాలను ప్రచురిస్తుంది)


Read More
Next Story