అతడొక అక్షర యోధుడు...
x

అతడొక అక్షర యోధుడు...

నేడు (నవంబరు 16) శ్రీభాగ్ వొడంబడిక రోజుకదా. రాయలసీమ కోసం బాగుపడాలని కలవరించిన అక్షర యోధుడు ఎం వి రమణారెడ్డిని ఈ రోజు గుర్తు చేసుకుని తీరాలి



అప్పుడెప్పుడో మా ఇంటికి వచ్చినప్పుడు పిచ్చాపాటీగా మాట్లాడుతూ " అమ్మా Wren and Martin ఒక్క మారివ్వండి " అని నా భార్యను అడిగితే , ఇతని కెందుకబ్బా అనుకుంటూంటే , రెన్ అండ్ మార్టిన్ (Wren and Martin) మాదిరిగా తెలుగులో వ్యాకరణం రాయాలని వుందబ్బా అన్నప్పుడు నా ఆశ్చర్యానికి అంతులేదు. ఏందయ్యా ఎం.వి. ఆరూ మేము ఎకడమిక్ ఫీల్డ్ లో (academic field) లో వుంటూ ఆలోచన కూడా చెయ్యని సంగతులన్నీ నెత్తికెత్తుకుంటున్నావే అంటూ , నా భార్య తెలుగు ఆచార్యులయి వుండీ ఈ ఆలోచన చెయ్యను కూడా చెయ్యలేదని అబ్బురపడి పోయినాను.


Wren and Martin చిన్నప్పుడు తనకు వారి తండ్రి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవాడని , వ్యాకరణం ఎంత ముఖ్యమో తెలిసొచ్చిందని , ఇప్పుడు ఎం.వి.ఆర్ (ఎంవి రమణారెడ్డి :MVR) తెలుగు వ్యాకరణం రాయాలనే సంకల్పం గురించి చెప్పినప్పుడు మేమిద్దరం సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయినాము. ముప్పయ్యేండ్ల తర్వాత " తెలుగింటి వ్యాకరణం " పుస్తకం అందుకోగానే మా ఆశ్చర్యానికి అంతే లేదు. అందీ అందగానే నేరుగా ప్రొద్దుటూరుకు పోయి ఎం.వి. ఆర్ని కలిసి వ్యాకరణంకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించుకున్నాము.


రమణారెడ్డి అనారోగ్యంతో ఉన్నపుడు పలకరిస్తూన్న రచయిత భూమన్


భాషనడిచే తీరును వివరించే విధానమే వ్యాకరణమని , తెలుగును తెలుగింటి భాషగా బతికేలా చూడాలనే తన తాపత్రయాన్ని ఎంత ఆవేదనగా చెప్పినాడో ఇప్పటికీ నాకు గుర్తుంది. వ్యాకరణంతో పాటు సమగ్రమయిన ఆధునిక నిఘంటువుని రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పినాడు. రెంటినీ కంప్యూటర్లో ఎక్కించుకుంటే తెలుగు భాష సజీవంగా కలకాలం విరాజిల్లుతుందనే ఒక ఆకాంక్ష వ్యక్తం చేసినాడు.


అప్పటికీ ఎం.వి.ఆర్ నాకు అత్యంత ఆప్తుడు. ఆత్మీయ మిత్రుడు. 1970 లో నెల్లూరులో కె.వి.రమణా రెడ్డిగారు తొలిసారిగా డా. యం.వి.రమణారెడ్డిని పరిచయం చేసినాడు. అప్పటినుండి అతను చనిపోయేంతవరకు వివిధ సంఘాల్లో , కుటుంబపరంగా , వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలుగుతూ అడుగడుగునా అతడి కార్యకలాపాలనుచూసి అబ్బుర పడుతూనే వున్నాను. విరసంలో సభ్యులుగా అనేక సభల్లో కలుసుకునే సందర్భాల్లో జాతీయ , అంతర్జాతీయ , స్థానిక సంగతుల గురించి చెబుతూంటే , ఇతగాడికి ఇంతటి పరిజ్ఞానం ఎట్లా అబ్బింది రా అని చకితుణ్ణయిపోయే వాణ్ణి.


ప్రొద్దుటూరులో ' ప్రభంజనం ' పత్రిక స్థాపించినప్పుడు పోయి చూస్తే , ఆప్రెస్సు , అతడి వ్యవహారం , అతగాడి వైద్యవృత్తి , అన్నీ ఆశ్చర్యమే , ' ప్రభంజనం ' పత్రికతో రాష్ట్రంలో ఒక సంచలనమే సృష్టించినాడు. అతగాడి రాత , ఆ శైలి అసామాన్యం. ప్రతి అక్షరం ఒక అగ్నికణంలా , ప్రతి వాక్యం ఒక బుల్లెట్ లా దూసుకొచ్చేది. ప్రొద్దుటూరులో ప్రభంజనం పత్రికతోపాటూ , కరపత్రాల జోరుతో అక్షరాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నాడు.


అప్పటికే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. వైద్యాన్ని పక్కన పారేసి ట్రేడ్ యూనియన్ వ్యాపకాలే వృత్తి , ప్రవృత్తి చేసుకున్నాడు. ఆంధ్రా కాటన్ మిల్లు కార్మిక పోరాటం మొత్తం రాష్ట్రాన్నే కుదిపేస్తున్న రోజులవి. కార్మిక నాయకునిగా స్థిరత్వం వచ్చింతర్వాత తాడిపత్రి , కడప , మదనపల్లె , గుంతకల్లు , రేణిగుంట , హిందూపురం లాంటి ఎన్నో ఊర్లలో కార్మిక యూనియన్ల బాధ్యతలు కూడా చేపట్టడం అత్యంత వేగంగా జరిగిపోతున్నాయి.


ఈ గందరగోళపు వర్గపోరులో ఏమయి పోతాడ్రా స్వామీ అనుకునే వాణ్ణి. విరసం తెనాలి సర్వసభ్య సమావేశంలో సత్యం ప్రవేశ పెట్టిన డాక్యుమెంటు మీద జరిగిన చర్చ అసామాన్యమయినది. అతడి వాదనకు అందరూ నోళ్లు వెళ్లబెట్టేవాళ్లు. ఇతడి ప్రశ్నలకు , ఆర్గ్యుమెంట్లకు తమ వద్ద సమాధానాలు లేవనే వాళ్లు. పెద్ద ఉపన్యాసకుడూకాదు , మాటకారి కాదు , సంభాషణా చతురుడూ కాదు. అయినా అతని మాటలో ఏదో మంత్రం ఉంది. ఆ మాటల్లో సహేతుకత , శాస్త్రీయత ఉండేది. తన మాటే పై మాటగా చెల్లుబడి అయ్యేది. విరసం గుంటూరు మహాసభల్లో అత్తలూరి నరసింహరావు , నేను , ఎం. వి. ఆర్ ఒక టీ కొట్టు దగ్గర రంగనాయకమ్మగారితో కలసి మాట్లాడుకుంటూంటే ఆమెను వదిలేసి మా ముగ్గురినీ ఒక పెట్టీ కేసులో అరెస్టు చేసినారు పోలీసులు.



1970 దశకంలో ఒక సమావేశంలో డా. ఎంవీ రమణారెడ్డి (ఎడమ), భూమన్ (మధ్య)


మా విడిపింపు కోసం మహాకవి శ్రీశ్రీ నాయకత్వంలో పెద్ద ఊరేగింపు , నిరసన జరిగి గుంటూరు పట్టణాన్ని అల్లాడించింది. గుంటూరు బహిరంగసభ ఆ అరెస్టులతో చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. అదంతా బాగున్నా ఆకేసు సందర్భంగా మేం మాత్రం పదిహేను రోజులపాటు గుంటూరులోనే వుండిపోవలసి వచ్చింది. అప్పుడే ఎం.వి. రమణారెడ్డి గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థని , విద్యార్థి దశలోనే ' కవిత ' అనే మాస పత్రికను నడిపినాడని తెలుగు సాహిత్యమన్నా , తెలుగు సినిమాలన్నా , ప్రాచీన సాహిత్యమన్నా , పద్యమన్నా భలే ఇష్టమని తెలిసింది.


పుట్టపర్తి నారాయణాచార్యులు , గడియారం వెంకటశాస్త్రి గార్ల గురించి అపుడే విన్నాను. అప్పటికే ప్రొద్దుటూరులో FILM SOCIETY ఏర్పరచి అద్భుతమయిన సినిమాలు పరిచయం చేస్తున్నట్టుగా కూడా తెలుసుకున్నాను. ఇంతటి ప్రజ్ఞాపాటవాలు కలిగిన ఎం. వి. ఆర్ జీవితం ట్రేడ్ యూనియన్ వ్యవహారంతో మరొక మలుపు తిరిగింది. ఇతను విశాఖలో ఉండగా ప్రొద్దుటూరులో రామసుబ్బారెడ్డి హత్య జరగటం , అందుకు ఇతనే కారకుడని అరెస్టు చేయటం , ముషీరాబాదు జైల్లో నిర్భందించటం వేగంగా జరిగిపోయినాయి. 1975 అత్యవసర పరిస్థితిలో మేమూ అరెస్టు కావటంతో ముషీరాబాదు చేరుకున్నాము.


అంతకు మునుపే మేమందరం విరసంకు రాజీనామా చేసి ఉన్నాము. జైల్లోకి రాకమునపటి నెలలో నేను , జ్వాలాముఖి ఎం.వి.ఆర్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రొద్దుటూరులో ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించినాము. ప్రొద్దుటూరు చరిత్రలోనే అదొక చారిత్రాత్మకమయిన సభ. జైల్లో 18 నెలలపాటు కలిసి వుండటం వల్ల ఎం. వి.ఆర్ మరింత దగ్గరగా తెలిసొచ్చినాడు. అతనికి ఆంగ్ల సాహిత్యంలో బాగా పరిచయం వుంది. అనువాదం మీద ఆసక్తి వుంది. డా. బసవరాజు " ఘనతంత్రాలు - కుట్రలు " అనే అనువాద పుస్తకాన్ని తిరిగి సరిదిద్దే ప్రయత్నం చేయటం మొదలు పెట్టినాడు. బసవరాజుగారి అనువాదం చదివించేట్టుగా లేదు మరి. ఒక్క ముక్క అర్థమయితే వొట్టు.


బహుశా అతని అనువాదం వల్లనేమో ఎం.వి.ఆర్ అనువాదల్ని అంత సరళంగా , బాగా చదివించగలిగేట్టుగా చేసినాడేమో ? ముషీరాబాదు జైలు మాకు చాలా విషయాలు నేర్పింది. మార్క్స్ , మావోలను అర్థం చేసుకునేలా చేసింది. ప్రాచీన తెలుగు సాహిత్యపు ఔన్నత్యాన్ని తెలియజెప్పింది. ఆధునికతకు చారిత్రక పరంపరగా ప్రాచీన సాహిత్యం ఎట్లా ఉపకరిస్తుందో నేర్పింది. జైల్లో ఉన్నపుడే మాకు ఒక ఉన్నతమయిన వ్యక్తి , గొప్పమానవతా మూర్తి పరిచయమయినారు. ఆయనే సి.కె. నారాయణ రెడ్డిగారు. సి.కె. వల్లనే డా. ఎం.వి.ఆర్ అనువాదరంగంలోకి దిగిన సంగతి నాకు తెలుసు.


ఇంగ్లీషులో డా.హార్న్ (Joshua S. Horn) రాసిన అవే విత్ ఆల్ పెస్ట్స్ (Away with All Pests) అనే పుస్తకాన్ని అనువాదం చేయవలసిందిగా డా. యం.వి.రమణారెడ్డిని పురి కొల్పింది సి.కె. గారే అదే ' పురోగమనం ' పేరుతో వచ్చిన తొలి అనువాద పుస్తకం. ' పురోగ)మనంలో ' నేర్చుకోవలసిన సంగతులు చాలా వున్నాయని పదే పదే చెప్పేవారు ఎం.వి.ఆర్. తదనంతరం సి.కె. గారి కోరిక మేరకు ' బాణామతి ' అన్న పేరుతో మరొక చిరు పుస్తకాన్ని రచించాడు. తెలంగాణా ప్రాంతంలో మూఢనమ్మకాలలో బాణామతి ఒకటి.


ఈ పుస్తకం ద్వారా బాణామతి లాంటి పిచ్చినమ్మకాల నుండి బయటపడడానికి ప్రజలను జాగ్రతుం చేశాడు. అనువాదకుడిగా విజయాన్ని చవిచూసిన ఎం. వి.ఆర్ తిరిగి వెనక్కు చూడకుండా , పురోగమనం , రెక్కలు చాచిన పంజరం , చివరకు మిగిలింది ?, మాటకారి , పెద్దపులి ఆత్మకథ , కడుపు తీపి మొదలయిన అద్భుతమయిన అనువాదాలు అందించి తెలుగు సాహిత్యాన్ని మరొక అడుగు ముందులో నిలిపినారు. ప్రొద్దుటూరు స్థానిక రాజకీయాల నుండి బయట పడవయ్యా , నీకు అద్వితీయమయిన శక్తి సామర్థ్యాలున్నాయి నలుగురికీ పంచుదాంరా అని అంటే 1983 తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party )లో గెలిచి ఎం.ఎల్.ఏ. అయినాడు.


అయిన వెంటనే అప్పటి ఎన్.టి.రామారావు ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టులోని లోపాలని ఎత్తిచూపుతూ తిరుగుబాటు చేసినాడు. ఆ తిరుగుబాటు రాయలసీమకు ఎంతో మేలు చేసింది. ఆ వెంటనే అసెంబ్లీ లైబ్రరీలో ఎన్నో రోజులు కూర్చొని ఎన్నో రికార్డులను కూలంకషంగా పరిశీలించడంతో పాటూ , ఎ.వి.ఎస్ రెడ్డిని కలిసి , శ్రీరామకృష్ణయ్యగారితోనూ , శ్రీరామిరెడ్డి , వెంకట్రామిరెడ్డి లాంటి ప్రసిద్ధమయిన ఇంజనీర్లతోనూ చర్చించి తదనంతరం , కన్నెమెర లైబ్రరీలో మరికొంత పరిశోధన చేసి " రాయలసీమ కన్నీటి గాధ " అనే అపురూపమయిన , అద్వితీయమయిన పుస్తకాన్ని రచించి రాయలసీమకు అంకితం చేసినాడు.


అదొక రాయలసీమ మాగ్నాకార్టాగా మిగిలిపోయింది. ఆ పుస్తకం రాయలసీమలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయటమేగాకుండా , ఎందరినో రాయలసీమ ఉద్యమంలో పాలు పంచుకునేలా చేసింది. అధికారపార్టీ శానససభ్యుడిగా ప్రభుత్వ పథకాల్ని విమర్శించడమేకాక , రాయలసీమ వెనుకబాటు తనాన్ని తొలగించడానికి వివిధ అంశాలపై ప్రభుత్వానికి సూచనలివ్వడమే కాక వాటి సాధన కొరకూ ప్రభుత్వంతో పోరాటానికి సైతం వెనుకాడని ధీశాలి ఎం.వి.ఆర్. 1985 వ సంవత్సరంలో రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి కొరకు ప్రభుత్వం నుండి తగు హామీలకోసం ఎం. వి.ఆర్ చేసిన 21 రోజుల నిరాహారదీక్ష రాష్ట్రంలో పెనుసంచలనమయింది.


నిరాహారదీక్షలో వున్న ఎం.వి.ఆర్. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో విస్త్రుతంగా పర్యటించి చేసిన ఉపన్యాసాలకు ప్రజల నుండి లభించిన స్పందన అద్వితీయం. రాయలసీమ ప్రజలలో కలిగిన చైతన్యాన్ని మరియు నాటి ఉద్రిక్త పరిస్థితులను చూసి బెంబేలెత్తిన నాటి ప్రభుత్వం రాయలసీమ సమస్యల పరిష్కారానికి ఎం.వి.ఆర్ చేసిన డిమాండ్లను అంగీకరిస్తూ చేసుకున్న వొప్పందం చారిత్రాత్మకం.


ఒక రోజు పిచ్చాపాటీలో


నాటి శ్రీబాగ్ వొడంబడిక (Sribagh Pact) తర్వాత రాయలసీమ ప్రాంతవాసుల కోసం ఎం.వి.ఆర్ సాధించిన మరొక అగ్రిమెంటు ఇది. ఈనాడు దేశంలోనే ఉత్తమ థర్మల్ కేంద్రంగా ఎన్నో సంవత్సరాలు అవార్డు సాధించిన రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం నాటి ఎం.వి.ఆర్ పోరాట ఫలితమే. 1984 లో డా. యం.వి.ఆర్ ప్రారంభించిన రాయలసీమ విమోచన ఉద్యమం , డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి , డా.యం.వి.మైసూరారెడ్డితో పాటూ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ' కదలిక ' పత్రిక సభ్యులమైన మా రాకతో కాక తీరింది. అందరం కలిసి రాయలసీమ ఉద్యమకార్యచరణసమితిని ఏర్పాటు చేసుకుని 1986 జనవరి 1 నుంచి 22 వరకు రాయలసీమ కరువు బండ పాదయాత్ర చేయటం రాయలసీమ ఉద్యమంలో ఒక గొప్ప చారిత్రాత్మక మలుపు.


ఈ పాదయాత్ర గురించే ఒక పెద్ద వ్యాసం రాయవలసి వుంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 75,000 క్యూసెక్కులకు పెంచాలనేది మా ప్రధాన డిమాండు. ఆ పాదయాత్రలోనే మాగ్రూపు , డా. ఎం.వి.రమణారెడ్డి గ్రూపు కలిసి నాలుగు రోజులు కలిసి నడవవలసివచ్చింది. అప్పటికి డా. ఎం.వి. రమణారెడ్డి ఎంత పాపులర్ ఉన్నాడో ప్రత్యక్ష్యంగా చూసినవాణ్ణి. ఏ గ్రామంలోకి పోయినా జన నీరాజనాలే. పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుపతిలో అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తే , అధ్యాపకుడివి దీన్నంతా నువ్వేంభరించగలవని ఆసరాగా నిలిచిన డా. ఎం.వి. ఆర్ని ఎట్లా మరువగలను.


అదొక చారిత్రాత్మక సమావేశం. డా.వై.ఎస్.ఆర్ కార్యదర్శిగా నన్ను ఉండమని వత్తిడి తెచ్చినా ఉద్యోగ బాధ్యతలవల్ల కాదని డా. ఎం.వి.ఆర్ ని ప్రధాన కార్యదర్శిగా డా.ఎం.వి. వైసూరారెడ్డిని అధ్యక్షుడిగా , డా. వై.ఎస్.ఆర్ (Dr YS Rajasekhar Reddy) ని గౌరవ అధ్యక్షుడి నేనే ప్రతిపాదిస్తే నన్ను ఉపాధ్యక్షుణ్ణి చేసిన అరమరికలులేని నాయకత్వపు రోజులవి. రాయలసీమ (Rayalaseema) సమస్యలను వెలుగులోకి తెచ్చిన గొప్పరోజులవి. రాయలసీమ కన్నీటి గాధ ప్రేరణగా కదలిన రోజులవి. వొక ప్రక్క రాయలసీమ సమస్యలపై పోరాడుతూ మరొక ప్రక్క తన వర్గాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ , ఇంకోక ప్రక్క ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగడానికి వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూవున్న సమయంలో , 1991 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా జైలుకు వెళ్ళడం జరిగింది.


వొక ప్రక్క తన విడుదల కోసం ప్రభుత్వంతో పోరాటంచేస్తూ , ఇంకొక ప్రక్క తనకు ఇష్టమైన రచనా వ్యాసంగంలో భాగంగా ' రెక్కలు చాచిన పంజరం. ' అన్న పుస్తకాన్ని అనువదించడం వొక్క ఎం.వి.ఆర్కే సాధ్యమనిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా 1994 సంవత్సరంలో జైలునుండి విడుదల కావడం మరొక సంచలనం. తిరిగొచ్చినవాడు వచ్చిన వాడొచ్చినట్టుగా అవేవీ గుర్తుకు రానీయకుండా " తెలుగు సినిమా స్వర్ణయుగం " అనే అద్భుతమయిన పుస్తకం వెలుగులోకి తెచ్చినాడు. అదీ డా. ఎం.వి.ఆర్ అంటే. సినిమా అంటే అభిరుచేకాదు , సినిమా పట్ల గౌరవం , ప్రేమ కలిగిన వాడు ఎం.వి.ఆర్. సినిమా సాహిత్యానికి పొడిగింపే (Extended form of literature) అనే వాడు.


ఈ పుస్తకం ఎంత విలువైందో సీరియస్గా చదివేవాళ్లకే తెలుస్తుంది. ఆ తర్వాత అద్భుతమయిన కథలు రాయటం దగ్గర నుంచి , తనకు నచ్చిన కథలు ఏరి ' మచ్చుతునకలు ' గా ప్రచురించటం విద్వాన్ విశ్వం గారి ' కాదంబరి ' ని ప్రచురించటం అతనికి సాహిత్యం పట్ల ఉన్న హృదయ చైతన్యాన్ని తెలియజేస్తుంది. అతను వేసిన తర్వాతనే ' కాదంబరి'ని చదివి ముగ్ధుణ్ణయ్యాను. అలాగే కరణం బాల సుబ్రమణ్యంగారి శంకరాచార్యుల కవితా వైభవ పుస్తకాన్ని ప్రచురించటం అతడి సాహిత్యాభిలాషిత్వాన్ని తెలియజేస్తున్నది. ' శంఖారావం ' వ్యాసాలు వ్యక్తీకరణలు ఎంత అలోచన దాయకమో చదివిన వాళ్లకు తెలుసు.


' మహాభారత స్రవంతిలో తెలిగింటికొచ్చిన ద్రౌపది ' పుస్తకం లాంటి దాన్ని మరొక దాన్ని ఎరుగుదుమా ? మహాభారతం గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎంత మంది పండితులు జడుసుకున్నారో నాకు తెలుసు. ఇంత అద్వితీయమయిన ప్రజ్ఞా పాటవాలు కలిగిన వ్యక్తి నా సన్నిహితుడయినందుకు , అతని ద్వారా లోకపు పోకడలు ఎంతో కొంత తెలుసుకున్నందుకు ఎంతో సంతోషిస్తాను. గర్వపడుతూంటాను. ఇంత చక్కటి రాతగాణ్ణి , వచనంలో ఆరితేరినవాణ్ణి , అక్షరాన్ని ఆయుధంగా మలచిన వాణ్ణి , కరపత్రాల ద్వారా శంఖారావం పూరించిన వాణ్ణి నేను మరొకరిని చూడలేదు. ఎవరూ కానరాలేదు.


ఒక వైద్యునిగా , వకీలుగా , ట్రేడ్ యూనియన్ నాయకునిగా , పత్రికా సంపాదకుడిగా , రాజకీయనాయ కునిగా , విద్యాసంస్థల స్థాపకుడిగా , ఉద్యమకారునిగా , రచయితగా , అనువాదకునిగా , చరిత్రకారుడిగా , సినిమా ప్రేమికుడిగా , కారాగారాన్ని సాహిత్యాన్ని సృష్టించే కర్మాగారంగా మలుచుకున్న ధీశాలిగా ఇంకా ఎన్నెన్నో అద్వితీయ లక్షణాలు కలిగిన డా. ఎం.వి.రమణా రెడ్డిలాంటివారు మరొకరు దొరకటం ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యేపని కాదు.



ఒక సభలో...


" టూకీగా ప్రపంచ చరిత్ర " రాస్తున్నప్పుడు దగ్గరగా చూసిన వాణ్ణిగా చెబుతున్నా అతని పట్టుదల , సంకల్పం ఉడుంపట్టులాంటిదే. ఏదైనా అనుకున్నాడంటే అది జరిగి తీరవలసిందే. మనం ఎన్ని చెప్పు, చర్చ ( arguments) లో చిట్టచివరికి తన మాటే పైమాటగా ఉండాలనే మంకు పట్టును కూడా అనేక సందర్భాలలో చూసినాను. ' కడుపు తీపి ' ఆ పేరేందయ్యా , ఆ ముఖచిత్రమేందయ్యా , నప్పలేదయ్యా స్వామీ అని అంటే వినడే అతని వాక్యమే చివరిదయింది.


చివరి క్షణం వరకు నిక్కచ్చయిన హేతువాదిగా , Scientific temper తో , దేవుడు అనే భావం దరికి రానీయకుండా బతికిన అపురూపమయిన వ్యక్తి డా. ఎం.వి.ఆర్. అయ్యా ఎన్నో మాట్లు చెబుతున్నా ఇప్పటికయినా నీ జీవిత చరిత్ర రాయి అని వత్తిడి తెస్తే ' కడుపు తీపి'ని గబగబా పూర్తిచేసి “ గతించిన రోజులు ” పేరిట మొదలు పెట్టి అసంపూర్తిగా ఆక్సిజన్ ( Oxygen) ను వదిలేసిన బాకీ పడ్డ మిత్రుడు ఎం.వి. రమణా రెడ్డి. అతడొక సంచలనం , అతడొక చరిత్ర , అతని జీవితం వెంటాడే ఒక మరుపుకు రాని జ్ఞాపకం.





Read More
Next Story