
ప్రకృతి తిరుపతికే ప్రసాదించిన ఎర్రచందనం విశేషాలు
శేషాచలం కొండల్లో ఎర్రబంగారం
-డాక్టర్ ఎం గోవిందరాజ భాస్కర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న శేషాచల కొండలు తూర్పు కనుమలలో అంతర్భాగం. శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లంకమల, నల్లమల అడవులు తూర్పు కనుమల కిందకు వస్తాయి.
ఈ శేషాచలం కొండలు వాటి ప్రత్యేక పర్యావరణ వ్యవస్థల వలన చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతం అనేక స్థానిక జాతులతో సహా వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయం. ఈ శేషాచల కొండలలో ఔషధ మొక్కలు అయినటువంటి బోస్వెల్లియా ఓవాలిఫోలీఏటా, పింపినెల్లా తిరుపతియెన్సిస్, సైకాస్ బెడ్డోమీ, టెరోకార్పస్ శాంటలినస్, శాంటలమ్ ఆల్బమ్, టెర్మినాలియా పల్లిడా, సైజిజియం ఆల్టర్నిఫోలియం, షోరియా తుంబుగ్గియ మొదలైన అనేక రకాల ఔషధ మొక్కలకు నిలయం.
శేషాచల అడవుల పర్యావరణ మరియు భౌగోళిక ప్రాముఖ్యత
శేషాచలం కొండలలో పెరిగే అనేక చెట్లలో, ఎర్రచందనం ఒక ప్రత్యేకమైన మరియు విలువైన వృక్ష జాతిగా నిలుస్తుంది. ఆంగ్లంలో రెడ్ సాండర్స్,అని పిలువబడే ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల దక్షిణ భాగాలైన శేషాచలం కొండలు మరియు వెలుగొండ ప్రాంతంలో వృద్ధి చెందే అత్యంత విలువైన స్థానిక వృక్ష జాతి.
ఈ ప్రాంతాలలో అధిక-నాణ్యత గల ఎర్ర చందనం చెట్ల పెరుగుదలకు కీలకమైన పొడి, వేడి వాతావరణం మరియు ఇక్కడి రాతి నేల, ఎర్రచందనం వృక్ష పెరుగుదలకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితులను అందిస్తాయి.

శేషాచలం కొండల యొక్క ప్రత్యేకమైన భౌగోళిక కూర్పు, ఎర్రచందనం చెట్ల ఎదుగుదలకు మరియు నాణ్యమైన దుంగల పెరుగుదలకు గణనీయంగా దోహదపడుతుంది. ఈ కొండలలో యురేనియం, ఇనుము, గ్రాఫైట్ మరియు కాల్షియంతో సమృద్ధిగా మరియు సరిఅయిన నిష్పత్తులలో ఉండటం మూలాన , ఇవి చెట్టు అభివృద్ధికి అనువైన నేల పరిస్థితులను సృష్టిస్తాయి.
ఇతర ప్రాంతాలలో పెరిగే ఎర్రచందనం చెట్ల కన్నా, శేషాచలం మరియు వెలిగొండ ప్రాంతాలలో పెరిగే ఎర్రచందన చెట్ల కలప, ముదురు ఎరుపు రంగులో వుంటూ చక్కటి నాణ్యతను కలిగివుండటం మూలాన అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా జపాన్, చైనా మరియు మధ్యప్రాచ్యం దేశాలలో చాలా విలువ చేస్తుంది. ఈ చెట్ల కలపను లగ్జరీ ఫర్నిచర్స్ కొరకు , సంగీత వాయిద్య పరికరాల కొరకు మరియు సాంప్రదాయ ఔషధాల తయారీలో అలాగే మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు.

ఔషధ ప్రాముఖ్యత.
రెడ్ సాండర్స్ కున్న యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన విరివిగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు . చైనాలో ఎర్ర సాండర్ చెట్ల సారాన్ని అంగస్తంభన సమస్యను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారని కొన్ని నివేదికలు వెలువడటంతో దాని ప్రామాణికతను అంచనా వేయడానికి ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) వారి సహాయం తీసుకుంది. IICT, అంగస్తంభన సమస్య (Erectile Disfunction) కోసం రెడ్ సాండర్స్ సారం యొక్క సంభావ్య ఔషధ విలువను అంచనా వేసింది. వీరి పరిశోధనలో అంగస్తంభన సమస్య చికిత్సకు రెడ్ సాండర్స్ సారం వాడకాన్ని సమర్ధించే శాస్త్రీయ ఆధారాలు లేవని IICT యొక్క శాస్త్రీయ మూల్యాంకనం ద్వారా తేల్చింది.
ఎర్రచందనం కలపకు వున్న బలం మరియు దాని మన్నిక వలన ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి, ఆ చెట్టు యొక్క ప్రత్యేకమైన భౌతిక మరియు రసాయన కూర్పుతో పాటు అది పెరిగే పర్యావరణ పరిస్థితులు కూడా కారణమని చెప్పవచ్చు.
ఎర్రచందనం కలపకు వున్న విపరీతమైన సాంద్రత మరియు కాఠిన్యం వలన అవి ఎన్ని సంవత్సరాలు అయినా పాడు అవకుండా ఉంటాయి, అందుకే దానితో తయారు చేయబడిన ఫర్నిచర్ చాలా మన్నికైనది మరియు దీర్ఘకాలం ఉంటుంది మరియు అంతేకాకుండా కలపలో ఉండే సహజ నూనెలు మరియు రెసిన్లు చెదపురుగులు మరియు కలప తొలుచు పురుగులు వంటి తెగుళ్ళ నుండి రక్షణగా పనిచేస్తాయి. ఈ నూనెలు ఫర్నిచర్ పాడవకుండా కాపాడతామేకాకుండా, సవాలుతో కూడిన పర్యావరణ పరిస్థితులలో కూడా ఫర్నిచర్ యొక్క జీవితకాలాన్ని పెంచుతాయి. ఎర్రచందనం కలప నుండి వచ్చే ఎరుపు రంగు డై ను వస్త్రాలు, ఔషధం మరియు ఆహార పరిశ్రమలలో రంగు కారకంగా ఉపయోగిస్తారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం దుంగలకు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే దాని అరుదైన లభ్యత, ఈ ఎర్రచందనం దుంగలకు వున్న ప్రత్యేక లక్షణాలు మరియు సాంస్కృతిక, ఔషధ మరియు ఆర్థిక ప్రాముఖ్యత కారణంగా దీనికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం మూలాన అక్రమ కలప రవాణాకు దారి తీస్తుంది.
వ్యవస్థీకృత స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, శేషాచలం కొండల వంటి మారుమూల మరియు రక్షిత అటవీ ప్రాంతాలలో చెట్లను దోపిడీ చేస్తున్నాయి. ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికివేయడం వలన అటవీ నిర్మూలన మరియు అటవీ పర్యావరణ వ్యవస్థల క్షీణత గణనీయంగా పెరిగింది. స్మగ్లర్ల అధిక దోపిడీ కారణంగా ఎర్రచందనం చెట్ల సంఖ్యా బాగా తగ్గి, అడవిలో దాని మనుగడకు ముప్పు కలిగిస్తోంది.
కనుమరుగుకు కూతవేటు దూరంలో వున్నా ఈ విలువైన వృక్ష జాతిని పెంచడానికి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ భూములలో ఎర్రచందనం చెట్లను పెంచడాన్ని ప్రోత్సాహిస్తున్నది.

పరిరక్షణ సవాళ్లు మరియు చట్టపరమైన రక్షణ.
ఎర్ర చందనం యొక్క అధిక ఆర్థిక విలువ అక్రమ చెట్ల నరికివేతకు మరియు వాణిజ్యానికి దారితీసి ఆ విలువైన చెట్ల ఉనికికె ముప్పు కలిగిస్తున్నాయి.
దీనిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ జాతిని CITES అనుబంధం IIలో జాబితా చేర్చింది.
CITES అంటే ఏమిటి?
(CITES) అనేది వన్యప్రాణులు మరియు మొక్కల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి మరియు అవి అంతరించిపోయే ముప్పును నివారించడానికి ప్రభుత్వాల మధ్య చేసుకొన్న ఒక అంతర్జాతీయ ఒప్పందం.

ఎర్రచందనం చెట్లను ఈ జాబితాలో చేర్చడం మూలాన దీని ఎగుమతిని అంతర్జాతీయంగా నియంత్రిస్తుంది. CITES నివేదికల ప్రకారం 19,049 టన్నులకు పైగా రెడ్ సాండర్స్ దుంగలను 28 సార్లు స్మగ్లేర్ ల పై దాడి చేసిన సంఘటనల ద్వారా స్వాధీనం చేసుకోనట్టు నమోదు చేసింది. కొన్ని నివేదికల ప్రకారం స్మగ్గలర్లు వీటిని 2016 మరియు 2020 మధ్య అడవి నుండి చట్టవిరుద్ధంగా సేకరించిన తర్వాత భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.

స్వాధీనం చేసుకొన్న ఎర్రచందన దుంగలతో అటవీశాఖ సిబ్బంది
అధికారిక లెక్కల ప్రకారం, చైనా 13,618 టన్నులకు పైగా ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది, హాంకాంగ్ 5,215 టన్నులు మరియు సింగపూర్ 216 టన్నులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో టన్ను ఎర్రచందనం దుంగ ధర రూ.25 లక్షలు పలుకుతుంది. చైనాలోని బీజింగ్, షాంఘై, గ్వాన్‌జౌ మొదలైన స్థానిక గిడ్డంగులలో టన్నుకు రూ.1 కోటి ఉండేది. 2014 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 4000 టన్నులకు పైగా రెడ్ శాండర్స్‌ను విక్రయించిన తర్వాత ధర రూ.40 లక్షలకు తగ్గింది.
విలువైన జాతి సంపాదను రక్షించే ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టుతూ కఠినమైన పరిరక్షణ చట్టాలను కూడా అమలు చేసింది. వీటిలో
వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972, అటవీ సంరక్షణ చట్టం, 1980 మరియు స్థిరమైన తోటల పెంపకం కార్యక్రమాలు మరియు వీటికి అదనంగా, అటవీ శాఖ సిబంది, టాస్క్ ఫోర్స్ బలగాలు అడవిలో కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయడం వలన చెట్ల అక్రమ నరికివేత మరియు చట్టవిరుద్ధ కలప వ్యాపారం బాగా తగ్గింది.
విదేశీ వాణిజ్య విధానం ప్రకారం భారతదేశం నుండి రెడ్ శాండర్స్ ఎగుమతిని నిషేధించడం ద్వారా మరియు ఆపరేషన్ రక్త్ చందన్ రెడ్ శాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF)ను 2014లో ప్రారంభించడం ద్వారా ఎర్రచందన కలప అక్రమ వాణిజ్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్( RSASTF ) స్థాపించినప్పటి నుండి, రాష్ట్రంలో అనేక దాడులను నిర్వహించి స్మగ్గలర్ ల నుంచి పెద్ద మొత్తంలో రెడ్ సాండర్స్‌ను స్వాధీనం చేసుకుంది.
బాలపల్లి రేంజ్ ఆఫీసర్ టి. ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ, ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేతను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కఠినమైన చర్యలు అమలు చేస్తుందని వెల్లడించారు. అక్రమ రవాణా మరియు అనధికార కలప నరికివేత నుండి విలువైన జాతులను రక్షించడానికి నిరంతర పర్యవేక్షణ, మెరుగైన పెట్రోలింగ్ మరియు చట్టపరమైన చర్యలు అమలు చేయబడుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు.
స్వభావరీత్యా ప్రకృతి ప్రేమికుడు అయిన ప్రభాకర్ రెడ్డి, పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అనేకసార్లు అడవిలోకి వెళ్లేవారు, అలాగే క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న ప్రయత్నాలు సమర్థవంతంగా జరుగుతున్నాయో లేదో స్వయంగా అడవిలోకి వెళ్లి నిర్ధారించుకొనేవారు. ఆయన మాట్లడుతూ ఎర్రచందన అక్రమ వ్యాపారాలలో పాల్గొనే వారికి నేరం నిరూపణ అయితే ఇప్పుడు వున్న శిక్షను 3 నుండి 10 సంవత్సరాల వరకు పెంచారని , జరిమానా రూ. 10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

T. ప్రభాకర్ రెడ్డి, బాలపల్లి రేంజ్ ఆఫీసర్
మృత్యుఘంటికలు మోగించిన ఎర్రచందనం
దేశ సంపద అయినటువంటి ఈ అరుదయిన వృక్ష జాతిని కాపాడే ప్రయత్నం లో అసువులు బాసిన అటవీ అధికారులను స్మరించుకోవాలి.
జులై 12, 2011 లో వెంకటగిరి అటవీ ప్రాంతంలోని యేర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగురూ గ్రామంలో అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన ఎం. శ్రీనివాసులును తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన మోటార్ సైకిల్ పై వెళ్తుండగా స్మగ్లర్ల ముఠా ఆయనను అడ్డగించి ఇనుప రాడ్లు మరియు కర్రలతో నిర్దాక్షిణ్యంగా అతిక్రూరంగా కొట్టడం మూలాన అసువులు బాసారు.
డిసెంబర్ 2013లో, శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు అటవీ అధికారులను, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కుమార్‌లపై దాడి చేసి అతి క్రూరంగా పొట్టన పెట్టుకొన్నారు. ఇలా ఎందరో అటవీ శాఖ సిబ్బంది విధి నిర్వాహణలో దేశ సంపదను రక్షించే ప్రయత్నానా ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు
ఈ విలువైన జాతి మనుగడను నిర్ధారించడంలో అటవీ శాఖలు, చట్ట అమలు సంస్థలు మరియు శాస్త్రీయ పరిశోధనలు చాలా కీలకమైనవి.
ముగింపు
శేషాచలంలోని ఎర్రచందనం చెట్లు వృక్షశాస్త్ర సంపద మాత్రమే కాదు, ఆర్థిక మరియు సాంస్కృతిక ఆస్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా దీని డిమాండ్ పెరుగుతూనే ఉన్నప్పటికీ, వీటి దోపిడీని నిరోధించడానికి మరియు స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి పరిరక్షణ వ్యూహాలను బలోపేతం చేయాలి. జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత మరియు భవిష్యత్ తరాలకు ఎర్ర చందనం చెట్లను రక్షించడం చాలా అవసరం.