
షర్మిలపై తిరుగుబాటు, 19 న విశాఖలో ఏపీపీసీసీ రెబెల్స్ సమావేశం
షర్మిల ను తొలగించాలని డిమాండ్… ఆ తర్వాత ఏమిటో ఎవ్వరికీ తెలియదు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వుందా... ప్రజాక్షేత్రంలో పార్టీ కనిపిస్తోందా? అంటే అందరూ క్వెశ్చన్ మార్క్ పెట్టాల్సిందే.. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ పనితీరును పదేళ్లలో మెరుగుపరుచుకోలేదు. కానీ రాష్ట్ర యూనిట్ హై డ్రామా మాత్రం కొనసాగుతోంది. అసలే జీరో ఫర్ఫార్మెన్స్ లో వున్న పార్టీలో అసమ్మతి పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టింది.
అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. ఇదెంతో పార్టీకి ఉపయోగమని , కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆమెపై ఆశలు కూడా పెట్టుకుంది. వైఎస్ షర్మిల నియామకం తరువాత మళ్లీ వైఎస్ అభిమానులు కాంగ్రెస్ గూటికి తిరిగి చేరతారని భావించినా అంతా రివర్స్ గా మారిందని ఆ పార్టీ సీనియర్లు ఘంటాపథంగా చెబుతున్నారు.
షర్మిల ను తొలగించాలని డిమాండ్
ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైఎస్. షర్మిల ను తొలగించాలని ఆ పార్టీలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఆ వర్గం మరింత బలం పెంచుకోవడానికి చర్యలు చేపట్టింది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నేతృత్వంలో
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, పి. రాకేష్ రెడ్డి ఇతర నేతలు ఈనెల 19న విశాఖపట్నం లో సమావేశ మవుతున్నారు. ఈ సమావేశానికి ఎక్కువ మంది సీనియర్లు, డిసీసీ నేతలు హాజరయ్యేలా చూస్తున్నారు.ఈ సమావేశం ద్వారా మరోమారు అధిష్టానానికి షర్మిలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.ఇంతకుముందే కిల్లి కృపారాణి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో పాటు పార్టీ అధ్యక్షుడు ఖర్గే ను కలిసి ఏపీ పార్టీ పరిస్థితి ని వివరించారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, పి. రాకేష్ రెడ్డి ఇతర నేతలు కూడా పార్టీ అధిష్టానానికి షర్మిలపై ఫిర్యాదు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కారణమని, టిక్కెట్ల కేటాయింపులో ఆమె వ్యక్తిగత బృందం చేసిన తప్పులకు ఆమె కారణమని ఆరోపించారు.ఆ లేఖల తర్వాత, పిసిసి చీఫ్ షర్మిల రాష్ట్ర యూనిట్‌లోని అన్ని కమిటీలను రద్దు చేసి, విజయవాడలోని పిసిసి కార్యాలయంలోని నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల గదులకు తాళాలు వేయించారు.
పిసీసీ ప్రక్షాళనకు రాహుల్ హామీ
షర్మిలకు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు పై పార్టీ అధిష్టానం స్పందించిందని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫెడరల్ తెలంగాణ కు తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులు , కీలకమైన జాతీయ అంశాల కారణంగా ఏపీ పై అధిష్టానం దృష్టి పెట్టడానికి ఆలస్యం అవుతోందని ఆమె తెలిపారు. తాము చేసిన ఫిర్యాదుకు రాహుల్ గాంధీ నుంచి ప్రతిస్పందన వచ్చిందని, ఒక కమిటీ వేసి అన్ని విషయాలపై సమగ్ర నివేదిక తెప్పించుకుంటామని తమకు పంపిన రిప్లైలో హామీ ఇచ్చారని అన్నారు. అధిష్టానం పై వత్తిడి తెచ్చేందుకు ఈసారి అందరం విశాఖలో సమావేశం అవుతున్నామని, షర్మిలను పిసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఆ సమావేశంలో తీర్మానం చేసి, మరోమారు అధిష్టానానికి పంపుతామన్నారు.
అన్ని కమిటీలను రద్దు చేసిన పిసిసి అధ్యక్షుడిని ఏఐసిసి చరిత్రలో తామెప్పుడూ చూడలేదని , పార్టీకోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులను పట్టించుకోకుండా, తన అనుచర గణానికే షర్మిల పదవులు కట్టబెడుతున్నారని, తన ఆస్తులు, అన్న జగన్ పై విమర్శలు తప్ప షర్మిల పార్టీ ఎదుగుదలకు చేస్తున్నది ఏమీ లేదని సుందర పద్మశ్రీ ఆరోపించారు.ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌కు రాసిన లేఖలో, షర్మిల వ్యక్తిగత బృందం తెలంగాణకు చెందినదని, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చతురత లేదని, అభ్యర్థులకు పార్టీ నిధులు కూడా ఇవ్వలేదని , అభ్యర్థుల నుండి బి ఫారమ్ ల కోసం డబ్బులు వసూలు చేశారని కూడా పద్మశ్రీ పేర్కొన్నారు.
ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ కు నోటా ఆప్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు నోటా కంటే తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. షర్మిల తాను పోటీ చేసిన కడప లోక్‌సభలో ఓడిపోవడమే కాకుండా, టీడీపీ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద 1.72 శాతం ఓట్లను సాధించింది, ఇది 2019 పోల్స్ కంటే కేవలం 0.55 పాయింట్లు ఎక్కువ. నోటా కు 1.09 శాతం ఓట్లు పడ్డాయి. 2019 పోల్స్‌లో కాంగ్రెస్ దాదాపు 1.17 శాతం ఓట్లను పొందగా, నోటా 1.28 శాతం ఓట్లను పొందింది. గతంలో రాహుల్ జోడో యాత్రతో ఏపీలో కూడా కాంగ్రెస్ కొద్దిగా పుంజుకుందని, షర్మిల పీసీసీ అధ్యక్షురాలైన తరువాత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, కాంగ్రెస్ సీనియర్లు కూడా ఇతర పార్టీలను చూసుకున్నారని ఒక వర్గం వాదిస్తోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర, పాడేరు, చీరాల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండేదని, వాటిపై దృష్టి పెట్టకపోవడంతో కనీసం ఒక్క సీటు గెలవలేక పోయామంటున్నారు.పార్టీ ఓట్ల వాటాను ప్రస్తుతమున్న 1.7 శాతం నుంచి 5 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని చెబుతున్నారు. వైసీపీ కూడా రాష్ట్రంలో పట్టు కోల్పోతోందని ఈ అవకాశాన్ని కాంగ్రెస్ సద్వనియోగం చేసుకోవాలంటున్నారు.అయితే షర్మిల వర్గం నేతలు ఆ వాదనను కొట్టిపడేస్తున్నారు. షర్మిల నాయకత్వంలో అన్ని సమస్యలపై గళం ఎత్తుతూ ప్రజలలోకి వెళుతున్నామంటున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్ కూడా సీనియర్లు మళ్లీ యాక్టివ్ అయ్యేలా చూస్తున్నారని తెలిపారు.
పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఉంటాయి. పీసీసీ చీఫ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ప్రచార కమిటీ, ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, జనరల్ సెక్రెటరీలు, ఉపాధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షలు ఇలా పార్టీలో కీలకమైన పోస్టులు చాలా ఉంటాయి.అవేవీ ఏపీలో కన్పించడం లేదు.దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకోసం శాంపిల్‌గా గుజరాత్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరుకాబట్టి అధిష్టానం ఏపీ కాంగ్రెస్ ను పట్టించుకుంటుందో లేదో చూడాలి.