అంత బలమైన కోట గోడలూ, కొత్త నగరాలూ ఎలా పుట్టుకొచ్చాయి?
x

అంత బలమైన కోట గోడలూ, కొత్త నగరాలూ ఎలా పుట్టుకొచ్చాయి?

రామాయణంలో నిరుత్తరకాండ-35


అది వరమా, శాపమా అనేది అలా ఉంచితే…

మనం మన మనుగడ చుట్టూ రకరకాల కంచెలు కట్టుకుంటాం. నివసించే ఇంటితో మొదలు పెట్టి; స్త్రీ, పురుషభేదం, భాష, మతం, ప్రాంతం, దేశం, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం- ఇలా కంచెల సంఖ్యను అంచలంచెలుగా పెంచుకుంటూ పోతాం. విస్తరించడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మనిషి చివరికిలా కుంచించుకుపోయే దశకు ఎందుకు వచ్చాడు; అది తిరోగమనమా, పురోగమనమా అనేవి ఆసక్తిగొలిపే ప్రశ్నలు. వాటినలా ఉంచితే, కంచెలు లేని జీవితాన్ని ఈరోజున మనం ఊహించను కూడా ఊహించలేం. మన చూపులు, మన ఆలోచనలు సహా దేనికిబడితే దానికి, ఎక్కడ వీలైతే అక్కడ కంచెలు...కంచెలు...

బహుశా ఒక్కటే దీనికి మినహాయింపు; అది మన జీవితకాలానికి మనం కంచె వేసుకోలేకపోవడం; కాలం మాత్రమే వేయగలిగిన కంచె అది.

వేల సంవత్సరాల వెనక్కి వెడితే, పైన చెప్పినన్ని కంచెలు లేనేలేవు. మనిషినీ, ప్రకృతిలోని ఇతర జీవజాలాన్నీ వేరుపరిచే ఒకే ఒక్క కంచె మాత్రమే ఉండేది. ఆ తర్వాత క్రమంగా స్త్రీ, పురుషభేదం రూపంలో రెండవ కంచె ఏర్పడింది. అప్పుడు కూడా చిరకాలంపాటు, మనిషి నడవగలిగింత మేరా, ఈ భూమి సమస్తం అతనిదిగానే ఉండేది. ఎటువంటి సరిహద్దుల ఊహారేఖలూ లేకుండా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లిపోగలిగి ఉండేవాడు. పునరుత్పాదకశక్తి కలిగిన ప్రకృతికి ప్రతిరూపంగా స్త్రీ నాయకత్వంలోనే మనిషి మనుగడ సాగుతూ ఉండేది. ఆ దశలో స్త్రీ, పురుషుల మధ్య హెచ్చుతగ్గులకు భిన్నంగా సమతూకంతో కూడిన, ప్రకృతిసిద్ధమైన శ్రమవిభజన మాత్రమే ఉండేది. మళ్ళీ అలాంటి ప్రకృతిసిద్ధమైన కారణాలతోనే ఆ సమతూకానికి దెబ్బ తగిలి స్త్రీ, పురుషుల మధ్య హెచ్చుతగ్గులు వచ్చాయి; అక్కడినుంచి ఒకటొకటిగా మిగతా కంచెలన్నీ ఏర్పడుతూవచ్చాయి...

విలియం ఇర్విన్ థామ్సన్ వెలుగులో ఈ పరిణామక్రమం గురించి ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. వేల సంవత్సరాల సుదీర్ఘ, అజ్ఞాతగతం నుంచి, అంటే చరిత్రపూర్వకాలంనుంచి మనకు ఎంతోకొంత తెలిసిన చరిత్రకాలంవైపు మొత్తం విషయాన్ని ఆయన నడిపిస్తూ అంతిమంగా నాయకత్వం స్త్రీ చేతిలోంచి పురుషుడికి చేతిలోకి ఎలా బదిలీ అయిందో; మాతృస్వామ్యం స్థానాన్ని పితృస్వామ్యం ఎలా ఆక్రమించుకుందో చెప్పి ముగిస్తాడు.

అదిగో, అక్కడికి చేరుకునే ప్రయత్నంలోనే అసలు విషయమైన రామాయణం నుంచి పక్కకు జరిగి ఇంతదూరం రావలసివచ్చింది. రామాయణం మాత్రమే కాదు; ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాణ, ఇతిహాసగాథలూ, ధర్మశాస్త్రాలూ మాతృస్వామ్యాన్ని పితృస్వామ్యం ఆక్రమించుకున్న వైనాన్ని చెబుతాయి; ఆ చెప్పడంలో మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య కొనసాగిన ఘర్షణను అంతర్లీనంగానూ, స్పష్టాస్పష్టంగానూ మన దృష్టికి తెస్తూ ఉంటాయి. పాశ్చాత్యుడైన థామ్సన్ కు మన పురాణ, ఇతిహాస, కావ్యాలతో, ధర్మశాస్త్రాలతో; అలాగే, మనకు పాశ్చాత్యంతో సహా భారతీయేతరవాఙ్మయంతో లోతైన పరిచయం ఉండకపోవచ్చు. అయినా సరే, ఆయనా, మనమూ కూడా వాటిలో ఉమ్మడిగా గుర్తించగలిగిన సూత్రం- మాతృస్వామ్యంపై పితృస్వామ్యస్థాపనే; ఉభయుల అవగాహనకూ ఉమ్మడి ప్రాతిపదికను కూర్చేది అదే.

***

పరిమిత ఆహారాన్ని సమకూర్చే వేటకే పురుషుడు వేల సంవత్సరాలపాటు అంకితమై ఉండగా; ఆహారసేకరణను పెరటిసాగువైపు, అంతిమంగా వ్యవసాయంవైపు నడిపించి అన్నపుష్కలత్వాన్ని సాధించడంలో కీలకపాత్ర స్త్రీదేనని చెప్పుకున్నాం. ఆవిధంగా ‘అన్నపూర్ణ’ అన్న అభివర్ణనకు స్త్రీ అన్నివిధాలా అర్హత పొందింది. ఇలా స్త్రీ వేసిన ప్రతి ఒక్క ముందడుగూ పురుషుని ఆహాన్ని దెబ్బతీసింది; మరోవైపు అతనిలో ఆత్మన్యూనతనూ పెంచింది. స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు పై చేయిని చాటుకునే దిశగా పెనుగులాట అప్పుడే ప్రారంభమై, క్రమంగా స్త్రీపై పురుషుడు ఆధిక్యాన్ని స్థాపించుకునే వైపు నడిపించింది.

ఈ పరిణామక్రమం మొత్తాన్ని రెండే రెండు గొలుసుకట్టు వాక్యాలకు కుదించి చెబుతాడు థామ్సన్; వాటిని విడగొట్టి చెప్పుకుంటే ఇలా ఉంటుంది:

కొత్తరాతియుగానికి చెందిన సాంప్రదాయికసమాజంలో స్త్రీలే అగ్రస్థానంలో ఉన్నారు; అయితే మతమూ, మాంత్రికతారూపంలోని స్త్రీల ఆధిపత్యం స్థానాన్ని పురుషుల సైనికాధిపత్యం ఎప్పుడైతే ఆక్రమించుకుందో, అప్పటినుంచి స్త్రీల పలుకుబడి క్షీణించిపోయింది; వర్తకమూ, దాడులూ పరిపాటిగా మారిన కొత్తసమాజంలో స్త్రీలు పురుషుని సొంత ఆస్తిగా మారిపోయారు. మధ్యరాతియుగంలో జంతువులను, కొత్తరాతియుగంలో ఆహారపు మొక్కలను మచ్చిక చేసుకున్నట్టే; కొత్తరాతియుగపు అనంతరకాలంలో పురుషుడు స్త్రీని మచ్చిక చేసుకున్నాడు!

స్త్రీ, పురుషజీవితాల్లోని ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని థామ్సన్ మన దృష్టికి తెస్తాడు. ఆహారసేకరణను వ్యవసాయంవైపు మళ్ళించి అన్నపుష్కలత్వాన్ని సాధించడం ద్వారా స్త్రీ తను నిర్మించిన ఆర్థికసామ్రాజ్యంలో చివరికి తనే బందీ అయినట్టే; పురుషుడు తనకు ఏమాత్రం ఇష్టంలేని ఈ పరిణామాల పునాదులపైనే తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఉదాహరణకు, వ్యవసాయ, పట్టణీకరణల దిశగా కొట్టుకుపోవడం పురుషుడికి ఎంతమాత్రం ఇష్టంలేదని థామ్సన్ అంటాడు. దానిని నిరోధించి తన వెనకటి వేటజీవితాన్ని తిరిగి గెలుచుకోవాలని పురుషుడు తపించిపోయాడు కానీ కృతకృత్యుడు కాలేకపోయాడు. చిత్రమేమిటంటే, పురుషుని ఇష్టానికి విరుద్ధంగా అన్నపుష్కలత్వం వైపు స్త్రీ వేసిన ప్రతి ఒక్క అడుగూ, స్త్రీ-పురుషుల మధ్య శ్రమవిభజనలో అంతవరకూ ఉన్న సమతూకం భగ్నమై పురుషుని చేయి పైదీ; స్త్రీ చేయి కిందిదీ అవడం మొదలైంది.

వేల సంవత్సరాల వేటజీవితంలో తను సాధించిన జంతుసంబంధమైన అన్నాన్నే అసలైన అన్నంగానూ, ‘పౌరుషా’న్నంగానూ పురుషుడు భావించి గర్వించడం సహజమే. అలాంటివాడు వ్యవసాయాన్నంతో రాజీపడడానికి మానసికంగా ఎంత పెనుగులాడి ఉంటాడో, అందుకు ఎంత కాలం పట్టి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికీ పూర్తిగా రాజీపడ్డాడని చెప్పలేం. ఇల్లాలు తృణధాన్యాలతో కాచి ఇచ్చిన గంజిని చూసి మొహం చిట్లించుకుని, ‘ఆడదాని ఆహారం’గా దానిని నిస్సందేహంగా తీసిపారేసే ఉంటాడని థామ్సన్ అంటాడు. విశేషమేమిటంటే, నిన్నమొన్నటివరకూ, బహుశా ఇప్పటికీ వ్యవసాయాన్ని నామోషిగా భావించే తెగలు మన దగ్గరా ఉండడం గురించి ‘ఏన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’(An Introduction to the Study of Indian History)లో డి.డి. కోశాంబి రాస్తాడు. మధ్య, తీరభారతాల్లోని అటవీప్రాంతాల్లో జీవించే ముండాలు, ఓరాన్లు, భిల్లులు, తోడాలు, కదర్ల వంటి ఆదిమ తెగలను ఆయన ఉదహరిస్తాడు. వీళ్ళు వ్యవసాయంలాంటి ఆహారోత్పాదకపద్ధతులవైపు మళ్లడానికి ఇప్పటికీ నిరాకరిస్తూ, ఆహారసేకరణ లాంటి ఆదిమపద్ధతులనే అంటిపెట్టుకుని శిలాజాల్లా ఉండిపోయారని ఆయన అంటాడు. ఆహారసేకరణ సాధ్యం కానప్పుడు దొంగతనాలకు దిగడం వీరికి అనివార్యమవుతుందనీ, దానిని వారు తప్పుగా భావించరనీ, అందుకే నేరస్థజాతులుగా పోలీసు రికార్డులకెక్కుతారనీ ఆయన వివరణ,

తిరిగి థామ్సన్ అధ్యయనానికి వెడితే; స్త్రీలు అభివృద్ధి చేసిన వ్యవసాయసంపదను తనదిగా భావించడానికి పురుషుడికి అహం అడ్డొచ్చినా; ఆ సంపదకూ, దానిని సృష్టించిన స్త్రీకీ కాపలాదారుగా మారడానికి అదే పురుషత్వం అతనికి అక్కరకొచ్చింది. అంతేకాదు, స్త్రీ ఆధిపత్య, ఆభిజాత్యాలకు దూరంగా వర్తకమూ, యుద్ధాల రూపంలో పురుషుడు సొంతదారి పట్టడానికి అదే వ్యవసాయం తాలూకు మిగులు పెట్టుబడి అయింది. ఆ క్రమంలో స్త్రీ ఆధిపత్యంనుంచే కాదు; ఆమె ప్రాతినిధ్యం వహించే అమ్మమతపు నిర్బంధాలనుంచి కూడా పురుషుడు బయటపడి మరింతగా సాంస్కృతికవైవిధ్యమున్న విశాలప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ అడుగు పూర్తిగా తనదైన ముద్ర ఉన్న సరికొత్త ఆర్థికవ్యవస్థవైపు నడిపించింది. మధ్యప్రాచ్యమంతటా వర్తకసంబంధాలు అల్లుకోవడం మొదలైంది. ఆ సంబంధాల నుంచి సరికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు. అమ్మమతానికి చెందిన నైతికవ్యవస్థనుంచి సాంకేతికవ్యవస్థ వేరుపడింది. ఈ కొత్త నైపుణ్యాలలో లోహపరిశ్రమ భాగమైంది. ఇవన్నీ కలసి, స్త్రీ సాధించిన వ్యవసాయసంపదకు పోటీగా వర్తకంపై ఆధారపడిన పురుషుని సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచాయి. దానినుంచే సైనికవ్యవస్థ అభివృద్ధి చెందింది.

ఈ పరివర్తన మొత్తాన్ని ఇటీవలి పారిశ్రామికవిప్లవంతో పోలుస్తాడు థామ్సన్. ఈ నూతన ఆర్థిక, సాంకేతిక నైపుణ్యాలకు చెందిన వర్గం అంతిమంగా అమ్మమతపు ఆధిపత్యం వెన్ను విరిచిందంటాడు. తొలి విశ్వజనీనమతమైన అమ్మమతానికి అధిష్ఠానంగా ఉన్న చాటల్ హ్యుయక్ ఉజ్జ్వలంగా వెలుగుతూ వెలుగుతూ ఆరిపోయిన నక్షత్రమైందంటాడు.

***

చాటల్ హ్యుయక్ కు దగ్గరలోనే ఉన్న హజిలర్(Hacilar) అనే, క్రీ.పూ.5400కు చెందిన గ్రామం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. హజిలర్ మాతృస్వామ్యానికి చెందిన ఒక వ్యవసాయగ్రామమైతే, చాటల్ హ్యుయక్ అంతకన్నా సంపన్నమైన సంకీర్ణసంస్కృతిని ప్రతిబింబించే ఒక మాతృస్వామికపట్టణమనుకున్నాం. క్రీ.పూ. 5250కి వచ్చేసరికి వర్తకం ద్వారా పోగుబడిన సంపద అందించిన దన్నుతో యుద్ధాలు, దాడులు ఎలా సర్వసాధారణంగా మారాయో చెబుతూ హజిలర్-2 ను థామ్సన్ ఉదహరిస్తాడు. వ్యవసాయగ్రామంగా ఉన్న హజిలర్ అప్పటికి చుట్టూ రక్షణవ్యవస్థ ఉన్న ఓ దుర్గంలా మారిపోయింది. నిర్మాణశైలి, ప్రతిమాకల్పన, కుండల తయారీలలో భిన్న భిన్న సంప్రదాయాలకు చెందిన కొత్తజనాలు ఆ గ్రామంపై దాడి చేసి, దగ్ధం చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. అంతేకాదు, రాళ్ళు రువ్వడానికి ఉపయోగించే ఒడిసెల అనే కొత్త ఆయుధం దుర్గాల నిర్మాణంతోనే అడుగుపెట్టింది. ఈవిధంగా క్రీ.పూ. 5200 నాటికి చాటల్ హ్యుయక్ ప్రాభవం పూర్తిగా ముగిసి అనటోలియాగా పిలిచే నేటి తుర్కియే(టర్కీ) ప్రాంతం మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది.

చాటల్ హ్యుయక్ పతనమూ, యుద్ధాలూ, దాడులూ మరో సామాజికపరివర్తనకు ఎలా దారితీయించాయో థామ్సన్ చెబుతాడు. ఎలాగంటే, కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్ లాంటి నగరాలు శాంతియుతవర్తకసంబంధాలను, సహజీవనాన్నీ పెంపొందించడమే కాకుండా; చుట్టుపక్కల ఉన్న వ్యవసాయగ్రామాలకు సాంకేతికతను, విత్తనాల వంటి ఇతర వనరులను అందించి ఆదుకుంటూ ఉండేవి. అలాంటి నగరాల పతనంతో గ్రామాలు అనాధలుగా మారాయి. నగరాల విధ్వంసం జరిగినప్పుడల్లా గ్రామాలు ఇలా చితికిపోవడం పరిపాటి అయిందని థామ్సన్ అంటాడు. వ్యవసాయానికి నగరాల చేయూత లభించని పరిస్థితిలో గ్రామాలు పూర్తిగా పశుపోషణ మీదే ఆధారపడుతూవచ్చాయి. పశుపోషణే ప్రధానవ్యాపకం అయినప్పుడు పచ్చికభూములను వెతుక్కుంటూ సంచారం సాగించడం తప్పనిసరి అవుతుంది. ఈవిధంగా పశుపాలక సంచారజీవనం మధ్యయుగాలకు చెందిన వేటజనాల వారసత్వంగా కాక, నగరాల పతనంనుంచి పుట్టి ఉంటుందన్న అభిప్రాయాన్ని థామ్సన్ ఉటంకిస్తాడు.

పశుపాలక సంచారజీవులనగానే అనంతరకాలంలో రష్యా-ఉక్రెయిన్ గడ్డిభూములనుంచి అటు యూరప్ వైపూ, ఇటు భారత్ సహా దక్షిణాసియావైపూ వ్యాపించి చరిత్ర సృష్టించిన ఇండో-యూరోపియన్ జనాలు గుర్తుకువస్తారు; అది వేరే కథ.

పై పరిణామక్రమం అంతిమంగా మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యాన్ని ఎలా పాదుగొలిపిందో థామ్సన్ చెబుతాడు; రామాయణం గురించి చెప్పుకుంటూ ఇన్ని చుట్లు తిరిగి ఇంత దూరం వచ్చింది ఈ సంగతి చెప్పుకోవడానికే! తృణధాన్యాల సేకరణ వేట, ఆహారసేకరణ జనాలను స్థిరజీవనులైన వ్యవసాయదారులుగా మార్చివేసినట్టే; వర్తకమూ, దాడులూ, యుద్ధాలూ మాతృపారంపర్యానికి, పెరటిసాగుకు చెందిన సమాజాలను పితృస్వామిక, వ్యావసాయిక, సైనిక, నాగరికసమాజాలుగా మార్చివేసాయని థామ్సన్ అంటాడు. ఆవిధంగా క్రీ.పూ. 4000 నాటికల్లా పురుషాధిపత్యంతో కూడిన నూతనప్రపంచం అవతరించింది. అంతకుముందు చిరకాలంపాటు ప్రధానసంస్కృతిగా ఒక వెలుగు వెలిగిన పెరటిసాగు, కుండల తయారీ వంటి స్త్రీల కార్యకలాపాలు ఉపసంస్కృతిగా మారి, సంచారజీవనాన్ని కూడా కలుపుకున్న పురుషుల సైనికీకరణ ప్రధానసంస్కృతిగా పరిణమించింది.

***

ఇంతకీ దేవాలయం ముందు పుట్టిందా, లేక రక్షణదుర్గం ముందు పుట్టిందా అన్న ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ముందుకు తెస్తాడు థామ్సన్. చాటల్ హ్యుయక్ అవతరించడానికి కొన్ని వేల సంవత్సరాల ముందునుంచే అమ్మమతమూ, ఆ మతానికి సంబంధించిన తంతులూ ఉన్నాయి, చాటల్ హ్యుయక్ అమ్మమతానికి ముఖ్యకేంద్రమూ అయింది; కానీ అప్పటికి విడిగా దేవాలయమంటూ ఒకటి నిర్మాణం కాలేదు. ఇల్లూ-దేవాలయమూ ఒకటిగానే ఉండేవి. దేవత కొలుపు కోసం ఇంటికి అనుబంధంగా కొన్ని మందిరాలు మాత్రమే ఉండేవి. కనుక మొట్టమొదట విడిగా నిర్మాణం అయింది దేవాలయం కాదనీ, రక్షణదుర్గమనీ థామ్సన్ అంటాడు.

హజిలర్-2 దగ్గరికి వచ్చేసరికి ఇల్లూ, దేవతామందిరమూ ఒకటిగానే ఉన్న చాటల్ హ్యుయక్ వాస్తుశైలి స్థానంలో గ్రామం చుట్టూ పటిష్ఠమైన గోడ కట్టాల్సిన అవసరం హఠాత్తుగా తోసుకొచ్చింది. దుర్గం, లేదా కోట నిర్మాణంతో పాటు, రాళ్ళు విసరడానికి ఉపయోగించే ఒడిసెల అనే సరికొత్త ఆయుధాన్ని క్రీ,పూ. 5000-4000 మధ్యకాలంలో అనటోలియా అనబడే నేటి తుర్కియే(టర్కీ)ప్రాంతమే ప్రపంచానికి అందించిందని థామ్సన్ అంటాడు.

క్రీ.పూ.10,000-8000 సంవత్సరాల మధ్యకాలంలోని మధ్యరాతియుగం తర్వాత, యుద్ధపర్వానికి తెర లేపిన క్రీ.పూ. 6000-4000 సంవత్సరాల మధ్యకాలం మనిషి మనుగడను మరో మలుపు తిప్పిన క్లిష్టకాలంగా ఆయన అభివర్ణిస్తాడు. యుద్ధాలు మానవసంస్కృతీవికాసంపై పెనుభారం మోపాయంటాడు. క్రీ.పూ.6000 చివరినాటికి అనటోలియా యుద్ధసంస్కృతి ప్రభావం యూఫ్రటిస్ నదీతీరాలకు; ఉత్తరసిరియా, ఇరాక్ లకు విస్తరించింది. ఇదే కాలంలో పాలస్తీనా, దక్షిణసిరియాలలోని కొన్ని జనావాసాలు సంచారజీవనంవైపు మళ్ళాయి. గ్రామాల చుట్టూ మరింత పెద్ద ఎత్తున కోటగోడలు లేవడం, పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరడం మొదలైంది. ఆ గ్రామాలే రక్షణవ్యవస్థ కలిగిన నగరాలుగా మారుతూవచ్చాయి. ఈ కొత్త నగరాల అవతరణతో మానవసంస్కృతీ సరికొత్తమార్పులకు లోనవుతూ, కొత్తనైపుణ్యాలు పుట్టుకొచ్చాయి. అమ్మమతానికి చెందిన ప్రశాంతగ్రామజీవనం అంతమైపోయింది.

కొత్త నగరాలు పుడుతూనే లిపినీ, లేఖనాన్నీ తీసుకొచ్చాయి; అవి జనంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులనే కొత్త విభజన తెచ్చాయి. నేడు నాగరికతగా చెప్పుకునే పరిణామానికి ఇదే నాంది. మరోవైపు ప్రత్యేకనైపుణ్యాలలో భాగంగా సేద్యపునీటి సాంకేతికత అభివృద్ధి చెంది వ్యవసాయం బలోపేతమైంది. ఈ పరివర్తన మొత్తాన్ని పుణికిపుచ్చుకుంటూ, ఒకప్పుడు మెసపొటేమియాగా పిలిచిన నేటి ఇరాక్ ప్రాంతంలో, ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా గుర్తింపు పొందిన నాగరికత వెలిసింది.

అదే సుమేరియా నాగరికత!

ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాన్స్ లోని లస్కో గుహాచిత్రాలనుంచో, అనటోలియాలోని చాటల్ హ్యుయక్ గోడచిత్రాలనుంచో పౌరాణికకల్పనలను ఊహించుకోవలసిన అవసరం తప్పిపోయిందని థామ్సన్ అంటాడు. లిపి, లేఖనం అడుగుపెట్టాయి కనుక అప్పటి మట్టిపిడకలపై ఉన్న రాతలను అనువదించి చదువుకోవచ్చు. ఆ రాతల్లో ఒక విప్లవం తాలూకు అవశేషాలు కనిపిస్తాయని ఆయన అంటాడు. కొత్తరాతియుగపు గ్రామీణవ్యవస్థలో చక్రం తిప్పిన అమ్మదేవత స్థానాన్ని మరింత వ్యవస్థీకరణ, నియంత్రణ కలిగిన పురుషదేవుళ్లు ఆక్రమించుకున్న వైనాన్ని అవి చెబుతాయంటాడు.

సుమేరుకు చెందిన అలాంటి ఒక పురుషదేవుడే, మనం ఇంతకుముందు శివుడితో పోల్చి చెప్పుకున్న ఎంకి! ఈ పురుషదేవుళ్ళ విజృంభణ సుమేరుకే పరిమితం కాదనీ, అది ప్రపంచవ్యాప్తమనీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సామాజిక అభివ్యక్తి అయిన పితృస్వామ్యమూ అంతే. రామాయణ, మహాభారతాలతో సహా ప్రాచీన భారతీయవాఙ్మయాన్నే కాక, ప్రాచీనప్రపంచవాఙ్మయం మొత్తాన్ని ఒకటిగా ముడివేసే ఉమ్మడి సూత్రం ఇదే!

మిగతా విశేషాలు తర్వాత...

Read More
Next Story