పుదుచ్చేరి ఎన్నికలు: నిధుల కోసం బీజేపీతో జతకట్టక తప్పదు
x

పుదుచ్చేరి ఎన్నికలు: నిధుల కోసం బీజేపీతో జతకట్టక తప్పదు

ఆర్థిక కారణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీతో పొత్తును సమర్థించిన ఏఐఎన్ఆర్సీ మంత్రి కె. లక్ష్మీనారాయణన్..


Click the Play button to hear this message in audio format

"ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పుదుచ్చేరి కేంద్రంలోని పార్టీతో పొత్తు పెట్టుకోవాలి," అని కేంద్ర నిధులపై ఆ ప్రాంతం ఆధారపడి ఉందని నొక్కిచెబుతూ మంత్రి కె. లక్ష్మీనారాయణన్ అన్నారు. 2026 ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పొత్తుల సమీకరణాలు, రాష్ట్ర హోదా డిమాండ్లు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీఏతో పొత్తు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, పుదుచ్చేరి రాజకీయ భవిష్యత్తుపై ఏఐఎన్ఆర్సీ (All India N.R. Congress) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కె. లక్ష్మీనారాయణన్‌తో 'ది ఫెడరల్' మాట్లాడింది.

ఏఐఎన్ఆర్సీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మీకెలా అనిపిస్తుంది?

చూడండి, పుదుచ్చేరి జనాభా 14 లక్షలు. పరిమిత ఆదాయ వనరులున్న చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఫ్రెంచ్ కాలనీ నుంచి ఇండియన్ యూనియన్‌లో విలీనమైనప్పటి నుంచి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై ఎక్కువగా ఆధారపడి ప్రాంతం. కాబట్టి సహజంగానే కేంద్రంలోని పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అది సంకీర్ణమైనా, మరేదైనా సరే, పొత్తులో ఉండటం వల్ల మనకు మరిన్ని నిధులు వస్తాయి. పరిమిత జనాభా కారణంగా మనం ఎక్కువగా పన్నులు విధించలేము. కాబట్టి, కేంద్రంలోని అధికార పార్టీతో ఉండటం మనకు సౌకర్యవంతంగా, అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ ప్రాతిపదికన మా పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది.

అయితే, కాలక్రమేణా పుదుచ్చేరికి కేంద్ర కేటాయింపులు తగ్గాయని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ స్పందన ?

అవును, అది పూర్తిగా నిజం. ఒకానొక సమయంలో కేంద్ర నిధులు సుమారు 65–75 శాతం ఉండేవి. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవి తగ్గడం ప్రారంభించాయి. మొదట్లో ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ కాలక్రమేణా, విధానాలు, నిబంధనల కారణంగా పుదుచ్చేరిని ఒక ప్రత్యేక రాష్ట్రంగా కాకుండా ఇతర రాష్ట్రాల మాదిరిగానే పరిగణించారు. ఫలితంగా, కేటాయింపులు సుమారు 17 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు, ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేటాయింపులు సుమారు 27 శాతానికి పెరిగాయి.

పొత్తు విషయంలో ఏఐఎన్ఆర్సీ-బీజేపీకి మధ్య విభేదాలొచ్చాయని వార్తలొచ్చాయి? నిజమేనా?

లేదు, ఎలాంటి ఘర్షణ లేదు. మేము 2014 నుంచి బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ - అది జాతీయమైనా, ప్రాంతీయమైనా - పొత్తులను ఖరారు చేసే ముందు సంప్రదింపులు జరుపుతుంది. ఒకసారి కుదిరాక, ఎటువంటి సమస్య ఉండదు. మేం ఐదేళ్లుగా స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ అవి సుపరిపాలన అందించాలనే మా లక్ష్యాన్ని ఎన్నడూ ప్రభావితం చేయవు.

కూటమిలో ఎల్‌జేకే(Latchiya Jananayaga Katchi)ను చేర్చుకోవడంపై మీ అభిప్రాయం?

అవును, అది ఒక వివాదాస్పద అంశమే. కానీ కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని, దశాబ్ద కాలంగా ఉన్న ఈ కూటమికి ఎలాంటి నష్టం జరగదని మా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హోం మంత్రి, ప్రధాని కూడా భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.

ఎల్‌జేకేకి చోటు కల్పించమని ఏఐఎన్ఆర్సీపై బీజేపీ ఒత్తిడి తెచ్చిందని మీరు భావిస్తున్నారా?

నిజం చెప్పాలంటే, మా పొత్తు బీజేపీతో మాత్రమే. మా ఒప్పందంలో కూడా ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నాం. బీజేపీకి రిజర్వేషన్ లాంటి అంశాల్లో ఇంటర్లల్ అరెంజ్‌మెంట్స్ ఉండవచ్చు. దానిని మనం ప్రశ్నించలేం. మా పొత్తు కేవలం బీజేపీతో మాత్రమే.

మీరు అధికారంలోకి వస్తే, ఎల్‌జేకే డిమాండ్ల విషయంలో ఇలాంటి ఒత్తిళ్లే తలెత్తుతాయా?

అది తర్వాత చూడవచ్చు. చర్చలలో బీజేపీ మరిన్ని సీట్లు కోరవచ్చు. కానీ పుదుచ్చేరిలో ఎన్డీఏకు ఏఐఎన్ఆర్సీ నాయకత్వం వహిస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామిదే తుది నిర్ణయం. రాజ్యాంగం ప్రకారం, మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారం ఉంటుంది. కాబట్టి, ఒత్తిడి పరిపాలనపై ప్రభావం చూపదు. తన 20 ఏళ్ల అనుభవంతో ఆయన అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించారు.


బీజేపీ క్రమంగా ప్రాంతీయ పార్టీలను తనలో కలుపుకుంటుందని విమర్శలొస్తున్నాయి. అలా జరుగుతుందని మీరు భావిస్తున్నారా?

పరిణామంలో ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు మార్పులు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ పార్టీలు బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. కాబట్టి విమర్శకులు భావిస్తున్న పరిస్థతి ఇక్కడ లేదు.


బీజేపీతో మీకు బలమైన పొత్తు ఉన్నప్పటికీ, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా లేదా మరింత స్వయంప్రతిపత్తి ఎందుకు లభించలేదు?

గత 30 ఏళ్లలో, కాంగ్రెస్ పుదుచ్చేరిని పాలించినప్పుడు కూడా వారు దీనిని సాధించలేకపోయారు. ఇప్పుడు మనం పొత్తులో ఉన్నప్పటికీ, కేంద్రం ఒక విభిన్నమైన సంస్థ. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా, మరిన్ని అధికారాలను అప్పగించడానికి విముఖత చూపుతున్నారు. ఇది ఒక పార్టీకే పరిమితం కాదు. అన్ని ప్రభుత్వాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

అయితే పుదుచ్చేరి స్వయంప్రతిపత్తిపై కేంద్రం వైఖరి ఏమిటి?

రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు తమ పాలనలోనే ఉండాలని కేంద్రం వాదిస్తోంది. ఆర్థిక సాయం చేస్తు్న్నా.. పాలనా నియంత్రణ కేంద్రం చేతిలోనే ఉండాలని వారు అంటున్నారు. మరిన్ని అధికారాలు అవసరమైతే రాజ్యాంగాన్నే సవరించాల్సి ఉంటుంది.


కానీ, రాష్ట్ర హోదా కోరుతూ అనేక తీర్మానాలు ఆమోదం పొందాయి. అయినా ఎందుకు పురోగతి లేదు?

అవును, అది నిజమే. ఇన్నేళ్లుగా వివిధ ప్రభుత్వాలు ఎన్నో తీర్మానాలను ఆమోదించాయి. కానీ కేంద్రంలోని ఏ పార్టీ కూడా వాటిని అంగీకరించడానికి సుముఖంగా లేదు. ఇది అందరికీ తెలిసిన రహస్యం. అయినప్పటికీ, ఆ డిమాండ్ కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే పాలన ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి.

Read More
Next Story