
పాలకుల చేతిలో పోలవరం చితికి పోతున్నది....
తాజాగా ఎగువ కాఫర్ డ్యాం ఒక చోట కుంగిన ఫోటోలు బయటపడ్డాయి. అవి ఫేక్ ఫోటోలని జల వనరుల శాఖ ఖండించలేదు.
దశల పేరిట నిర్వాసితులను గాలికి వదిలేస్తారా?
వి. శంకరయ్య
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైసిపి ఏలుబడిలో కునారిల్లిన పోలవరం ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు హడావుడి చేశారు.
వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం రెండవ దశ అని పేరు పెట్టి, మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి మొదటి దశకు నిధులు విడుదల చేస్తున్నది. 46.72 మీటర్లు నిర్మించవలసిన పోలవరం ప్రాజెక్టును తొలి దశ అనే పేరుతో 41.15 మీటర్లకు పరిమితం చేసి నిర్మించేందుకు సిద్ధమైనారు. ఈ విషయంలో అటు వైసిపి ప్రభుత్వం ఇటు కూటమి సర్కారు దొందు దొందే. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ 2028 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మార్లు వెళ్లిన ఢిల్లీ పర్యటనల్లో ప్రధాన మంత్రిని, కేంద్ర జల వనరుల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులను కలుస్తున్నా ఒక్క దఫా కూడా పోలవరం పూర్తి స్థాయి డిపిఆర్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కేంద్ర ప్రభుత్వానికి ఇంత వరకు అభ్యర్ధన వెళ్ల లేదు. 2014-19 మధ్య కాలంలో టిడిపి హయాంలోనే ఇందుకు భిన్నంగా జరిగింది. ఒకవైపు ప్రాజెక్టు పనులు జరుగుతున్నా రెండవ డిపిఆర్ ఆమోదానికి సాంకేతిక సలహా కమిటీ సమావేశమైంది. ఈ కమిటీకి సమాచారం ఇచ్చేందుకు రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు నానా తంటాలు పడ్డారు. 2019 ఫిబ్రవరిలో సమావేశమైన సాంకేతిక సలహా కమిటీ 55,548.83 కోట్ల రూపాయల వ్యయంతో రెండవ డిపిఆర్ ఆమోదించింది. ఇందులో నష్టపరిహారం పునరావాసానికే 33,868, 23 కోట్లు. ఇది గతం. ఇప్పుడు ఈ అంచనాలు భారీగా పెరిగి వుంటాయి. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది రైతులు వ్యవసాయం చేయడం ఎప్పుడో! ఈ లోపు ప్రథమ లబ్ధిదారులు కావలసిన నిర్వాసితులు అన్యాయమై పోతున్నారు. ప్రస్తుతం 41.15 కాంటూరు వరకు నిర్వాసితులకు అరకొరగానైనా నష్టపరిహారం పునరావాసం కల్పిస్తామంటున్నారేగాని ఇచ్చింది అరకొరే! అయితే గోదావరికి వరదలు వచ్చిన రోజుల్లో అంత వరకే గిరి గీసినట్లు వరద ప్రవాహం వుండదు.
41.15 కాంటూరు మించి వరడ చుట్టుముడితే ఏం కాను? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్లు లేదు. 2022 వరదల్లో పరీవాహ ప్రాంత ప్రజల బాధలు
2017-18 నాటి అంచనాల మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాసానికి పెరిగిన అంచనాలు కలుపుకొని ఇంకా రూ.30వేల కోట్లు అవసరమౌతాయి. దాన్ని తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తొలి దశ అని పేరుబెట్టి మ మ అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం కూడా ఇది సాధ్యం కాదని భావించే బనకచర్ల అనుసంధానం తలకెత్తుకున్నదనే అనుమానాలు లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా జిమ్మిక్కులు చేస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆంధప్రదేశ్ కు జీవనాడి అనే నినాదం పోయింది. గేమ్ చేంజర్ అంటూ బనకచర్ల అనుసంధానం తెర మీదకు వచ్చింది.
దురదృష్టమేమంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు తరచూ సంభవిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. తదుపరి స్పిల్ వే కు రక్షణగా నిర్మించిన గైడ్ బండ్ నిర్మాణ దశలోనే కూలి పోయింది. దీనికి బాధ్యులెవరనే దానిపై సాగిన చర్చ అంతిమంగా డిజైన్ లోపమని నెట్టి వేసి చేతులు దులుపుకున్నారు. నిర్మాణంలో నాణ్యత గురించి అందరూ గప్ చుప్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఎగువ కాఫర్ డ్యాం ఒక చోట కుంగిందని చెప్పబడినా బద్దలు బద్దలుగా పగుళ్లు వచ్చిన ఫోటోలు బయటపడ్డాయి. అవి ఫేక్ ఫోటోలని జల వనరుల శాఖ ఖండించలేదు. ఇది పోలవరం పరిస్థితి.
( ‘ప్రజాశక్తి’ సౌజన్యం)
(రచయిత విశ్రాంత పాత్రికేయుడు)