గురుశిష్యుల స్క్రిప్ట్ ఇలా రివర్స్ అయ్యిందేంటి!?
x

గురుశిష్యుల స్క్రిప్ట్ ఇలా రివర్స్ అయ్యిందేంటి!?

మీరు గమనించారో, లేదో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఒక తమాషా పరిస్థితి ఉంది. రెండు చోట్లా గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న గురుశిష్యులు..


మీరు గమనించారో, లేదో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఒక తమాషా పరిస్థితి ఉంది. రెండు చోట్లా గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న గురుశిష్యులు (వాళ్లు ఒప్పుకోరేమో గాని, జనం దృష్టిలో ఇదే ఉంది) ఓడిపోగా, మరో గురుశిష్యుల జంట కొత్త ముఖ్యమంత్రులుగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువుగా పరిగణించి సలహాలు తీసుకునేవారని తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్‌ను ఈ ఏడాది జనవరిలో కలిసిన జగన్ రెండు గంటలపాటు చర్చించి, ఆయన సలహాతోనే ఏపీలో ఎమ్మెల్యేల మార్పును అమలు చేశారు. ఇక ప్రస్తుత తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గతంలో శిష్యుడు అన్న సంగతి కూడా తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఒకటే తేడా. అప్పుడు గురువు తెలంగాణ ముఖ్యమంత్రి కాగా, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి.

మాజీ గురుశిష్యుల జంటలోని కేసీఆర్-జగన్‌లను గమనిస్తే చాలా పోలికలు కనబడతాయి. ఒకానొక సమయంలో వీరి ఇద్దరి పాపులారిటీ, పబ్లిక్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇద్దరికీ వారి వారి రాష్ట్రాలలో ఎదురు లేదు, వారిని కొట్టే మొనగాడే లేడు అన్న పరిస్థితి ఉండింది. అయితే, ఇవాళ వారిద్దరి ఇమేజ్ అనూహ్య స్థాయిలో అధఃపాతాళానికి దిగజారిపోయింది. వారి పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది, వారి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది.

ఎవరూ ఊహించని ఓటమి

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. కానీ, అతి భారీ విజయాలను దక్కించుకుని, ప్రజల మన్ననలను కనీవినీ ఎరగనివిధంగా చూరగొన్న ఇలాంటి నేతలకు ఈ స్థాయిలో, ఇంత దారుణ, ఘోర పరాజయం దక్కటం చాలా తక్కువగా చూస్తాము. ఎంత ఎత్తులకు వెళ్ళారో, అంతే లోతులకు పడిపోయారు. ప్రజల చేతిలో దారుణమైన చావుదెబ్బ తిన్నారు. ఇంత ఘోర పరాజయం ఎదురవుతుందని వీరే కాదు, వీరి ప్రత్యర్థులు కూడా ఊహించలేదు. తెలంగాణ జాతిపితగా బీఆర్ఎస్ శ్రేణుల చేత అభివర్ణించబడే కేసీఆర్ ఇప్పుడు దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఒకవైపు ఘోర పరాజయం బాధిస్తుంటే, మరోవైపు కూతురు జైలులో ఉండటం, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వివాదంలో అరెస్ట్ అవుతారన్న వాదనలు వినబడటం వంటి విషయాలు ఒక్కసారే చుట్టుముట్టాయి.

2018 ఎన్నికల్లో 119 స్థానాలకుగానూ 88 గెలుచుకున్న బీఆర్ఎస్, గత డిసెంబర్‌లో 39 స్థానాలకు పడిపోయింది. ఇక నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. పైగా 2 స్థానాలలో తప్పితే మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటిలో మూడోస్థానానికి పడిపోయింది. ఎనిమిది నియోజకవర్గాలలో డిపాజిట్ దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో తాను చక్రం తిప్పబోతున్నానని, ప్రధాని పదవి రేసులో ఉంటానని ఇటీవల బీరాలు పలికిన కేసీఆర్‌కు ఇప్పుడు లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవటానికి పలు కారణాలు చెబుతున్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్న కారణం ఏమిటంటే - కవితను బయటకు తీసుకురావటంకోసం కేసీఆర్ పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహకరించారు అని. ఏది ఏమైనా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నట్లుగా ఉంది.

మరోవైపు జగన్‌ను చూస్తే, 2019లో దాదాపు 50 శాతం ఓట్లతో ప్రజలు అతనికి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. నాడు 151 సీట్లు వస్తాయని ఆయన, ఆయన పార్టీవారే ఊహించలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంత భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుని, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలాలని గ్రాండ్ ప్లాన్స్ వేసిన జగన్, ఐదేళ్ళలోనే అదే జనంతో ఛీ కొట్టించుకున్నారు. గతంలో 151 సీట్లు గెలిచిన జగన్‌ను మధ్యలో 5 తీసేసి 11కు కుదించి కూర్చోబెట్టారు.

పాత జిల్లాలలో ఎనిమిదింటిలో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. జగన్‌కు కంచుకోటగా భావించే రాయలసీమలో 52 స్థానాలకుగానూ కేవలం 7 సీట్లు దక్కాయి. వైనాట్ 175, వైనాట్ కుప్పం అని నినాదాలు ఇచ్చిన జగన్‌కు సొంత జిల్లాలోనే ఘోర పరాభవం ఎదురయింది.

ఈ ఓటమికన్నా మించినట్లుగా - చంద్రబాబుకు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశం రావటంతో జగన్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఉంది. ఇప్పటివరకు జగన్‌ను దత్తపుత్రుడిలా చూసుకున్న మోది ఇప్పుడు చంద్రబాబును పక్కన పెట్టుకుని ఎక్కడలేని గౌరవాన్నీ ఇవ్వటం వైసీపీ అధినేత జీర్ణించుకోలేని విషయమని చెప్పాలి.

మరోవైపు, సీబీఐ, ఈడీ కేసుల ముప్పు మళ్ళీ జగన్‌‌కు తలపై కత్తిలాగా వేలాడబోతోంది. కేంద్రంలో చంద్రబాబు హవా సాగనుండటంతో ఆయన జగన్‌ను కేసులతో కట్టడిచేసి జైలుకు పంపే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఒకవైపు తల్లి, చెల్లి దూరమైన జగన్‌కు ముందు ముందు పరిస్థితులు గడ్డుగా మారే అవకాశం బలంగా ఉంది.

తమను తాము ఎక్కువగా ఊహించుకోవటమే కారణమా?

ఇద్దరూ కన్నూ మిన్నూ కానరానంతగా అహంకారంతో చెలరేగిపోయారు. తమను తాము రాజుల కాలంనాటి చక్రవర్తులలాగా ఎక్కువగా ఊహించుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కీలుబొమ్మలుగా మార్చి, తమను చూసే ప్రజలు ఓటు వేస్తారని ఊహించుకున్నారు. ప్రత్యర్థులను, విమర్శించినవారిని తొక్కేయాలని చూశారు. ఇద్దరూ సంక్షేమ పథకాలపైనే ఆధారపడ్డారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో, పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఉన్నాయని నివేదికలు వచ్చినా, జనం తన ముఖం చూసి ఓటు వేస్తారని కేసీఆర్ భావించారు. దళితబంధు పథకం ఎంపికకోసం లంచాలు తీసుకున్నారని 30 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయని పార్టీ సమావేశంలో చెప్పిన కేసీఆర్, వారికే టిక్కెట్లు ఇచ్చారు.

దళితబంధే కాదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అనేక పథకాల లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు భారీగా లంచాలు తీసుకోవటంతో గ్రామీణప్రజలలో బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దానికితోడు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగా లాభపడిందని జనం నమ్మారు.

కేటీఆర్, హరీష్ రావు తప్పితే ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరినీ కీలుబొమ్మల్ని చేశాడు. సొంతపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. గడీ దొరలాగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు.

సచివాలయానికి ఏడాదికి ఒకసారి వెళితే గొప్ప అన్నట్లుండేది. కాంగ్రెస్ లోని 12 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి బీజేపీకి ప్రాణం పోశాడు. కొంతకాలం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని బయలుదేరి, కవిత కేసుల కోసం మళ్ళీ మాట మార్చి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాడు. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణకు తానే దిక్కు అనుకున్నాడు, తెలంగాణ గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అన్నాడు.

ఇటు జగన్ కూడా గురువు అడుగుజాడలలోనే నడిచాడు. ఇంకా చెప్పాలంటే అహంకారంలో గురువుకంటే రెండాకులు ఎక్కువే చదివాడు. తన ముఖం చూసే ఓటేస్తారని కేసీఆర్ అనుకున్నాడుగానీ ఎక్కడా బయటకు అనలేదు. జగన్ బాహాటంగా ప్రకటించేశాడు తనను చూసే జనం ఓటు వేస్తారు అని, రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదు అని ఎవ్వరూ చెప్పలేరు. కానీ శిష్యుడి రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి శూన్యం. అతను మాత్రం ఏం చేస్తాడు, సంక్షేమ పథకాలకే ఎక్కడెక్కడి నిధులూ సరిపోనప్పుడు అభివృద్ధికి నిధులు ఎక్కడ ఉంటాయి. కేసీఆర్ అధికారంలోకి రాగానే తనను విమర్శించే ఛానల్స్‌ రెండింటిపై అప్రకటిత నిషేధం విధించి మీడియాకు సంకేతాలు పంపారు. ఇక్కడ జగన్ తన ఫ్యాక్షన్ శైలి చూపించాడు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర నుంచి, రఘురామకృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, అచ్చెంనాయుడు వంటి ద్వితీయశ్రేణి నాయకులవరకు తనకు నచ్చని నేతలందరినీ జైలు మెట్లు ఎక్కించాడు.

సోషల్ మీడియాలో వైసీపీని, తనను విమర్శించే సామాన్యులనూ వదలలేదు. సీఐడీని ప్రైవేట్ ఆర్మీలాగా వాడుకుని కక్షపూరిత రాజకీయాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్ళాడు. ఆయనే స్వయంగా అలాంటి పనులు చేస్తూ ఆదర్శంగా నిలవటంతో పార్టీలోని మిగిలిన నాయకులు, కార్యకర్తలు ఆయన అడుగుజాడలలో నడిచారు. తమ ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఒక అరాచక వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని సామాన్యులు ఒక్కమాట అనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.

జగన్ కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నాడు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ పథకాల రూపంలో జనానికి డబ్బులు విరజిమ్మాడు. ఏపీ ప్రజలు మాత్రం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు తమ సొమ్మే తమకు ఇస్తూ పన్నులరూపంలో లాగేసుకుంటున్నాడని అర్థం చేసుకున్నారు. అందుకే లబ్దిదారుల ఓట్లు కూడా వైసీపీకి పడలేదు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే మొత్తం పాలనను నడిపిస్తే, ఇక్కడ జగన్ సజ్జలతో నడిపించాడు. ఆ సజ్జలేమో రాష్ట్రంలో ఏ వర్గం సమ్మె చేసినా, ఆ వర్గం ఓట్లు తమకు అవసరంలేదంటూ చులకనగా మాట్లాడాడు. ప్రభుత్వోద్యోగులు, టీచర్‌లు, అంగన్‌వాడీలు, నిరుద్యోగులు ఆయన మాటలను శిరసావహించారు.

గురువులాగే జగన్ జనానికి, సొంతపార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చివరికి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై పోయాడు. మరోవైపు పథకాల లబ్దిదారుల ఎంపికలో తెలంగాణలో జరిగినట్లే, ఏపీలో జగనన్న ఇళ్ళు, ఇళ్ళపట్టాల కేటాయింపు వంటి పథకాల లబ్దిదారుల ఎంపికలో స్థానికనేతలు పెద్ద ఎత్తున దండుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకూడా అవినీతి బాగా పెరిగిపోయింది. ఇక మధ్యతరగతి ప్రజలపై పన్నులభారం విపరీతంగా పడింది. చివరికి చెత్తపై కూడా పన్ను విధించి చెత్తపేరును మూటగట్టుకున్నారు. ఎన్నికలముందు తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని బీరాలు పలికి, గెలిచిన తర్వాత తన కేసులు, వివేకా కేసు కోసం మోది తదితర బీజేపీ పెద్దలముందు మోకరిల్లాడు. కేంద్రంలో బీజేపీ బిల్లులకు అన్నింటికీ మద్దతు ఇచ్చాడు. అందుకే మైనారిటీలు అతనిని నమ్మలేదని రాయలసీమలో ముస్లిమ్ నియోజకవర్గాలలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోవటాన్నిబట్టి అర్థమవుతోంది.

తెలంగాణకు తానే దిక్కు అని కేసీఆర్ అనుకుంటే, జగనేమో లక్షలకోట్ల రూపాయలను ఇచ్చానుకనుక తాను దైవదూతనని, 30 ఏళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకున్నాడు. మొత్తానికి ఇరువురు నేతలకూ తగిన గుణపాఠం చెప్పారు. మరి గురుశిష్యులు తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని, భవిష్యత్తులో పుంజుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

కొసమెరుపు: విచిత్రమేమిటంటే, ఈ గురుశిష్యులకు తోడుగా మరో పెద్దాయన కూడా ఉన్నాడు. ప్రధానమంత్రి మోది కూడా ఈ తానులోనివాడే. ఆయన అహంకారాన్ని కూడా జనం బాగా కిందకు దించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాడు. కాకపోతే, వీరిద్దరి స్థాయిలో కాకుండా, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా మిత్ర పక్షాలసాయంతో బయటపడ్డాడు. బోర విరుచుకుని నడిచే ఆ 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు మిత్రపక్షాలకు వంగివంగి నమస్కారాలు చేస్తోంది. కర్మ ఒక బూమరాంగ్, ఎవరినీ వదిలిపెట్టదు.

Read More
Next Story