
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ జనాదరణ కోల్పోతున్నాడా?
జనసేకు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే శక్తి ఉందా?
2014 ఎన్నికల ముందు పుట్టుకొచ్చిన జనసేన పార్టీ (Jana Sena Party) అవశేష ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తుందా లేక పరాన్నజీవి రాజకీయాలు చేస్తుందా అనే ప్రశ్నను పరిశీలించవలసిన అవసరం ఉంది.
జనసేన పార్టీ పుట్టుకకు ముందు 1950 వ దశకం నుండి కూడా కోస్తాంధ్రలోని కాపు సామాజిక వర్గం (Kapu Caste) ప్రధానంగా కాంగ్రెసు ఓటు బ్యాంకు (Vote Bank) ఉండింది. అదే విధంగా ఆ పార్టీలోనే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కూడా లభించింది.
కాపు రాజకీయాలు ప్రారంభం
అయితే 1980 వ దశకంలోనే కాంగ్రేసు పార్టీలోనే ఉంటూ వంగవీటి మోహన్ రంగారావు “ఆంధ్రప్రదేశ్ కాపు మహానాడు” (Kapu Mahanadu)ను ఏర్పాటు చేసి కాపుల అస్థిత్వం కోసం ప్రయత్నం చేసారు. కాని తదనంతర రాజకీయాలు హింసాత్మక రూపం తీసుకోవడం వల్ల ఆయన హత్యకు గురయ్యారు. అటు తర్వాత ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు 1990 వ దశకంలో నల్గొండ జిల్లా సూర్యపేట లో జరిగిన “సామాజిక న్యాయ” (Social Justice) బహిరంగ సభలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. అయితే వెంటనే కాంగ్రేసు పార్టీ తనను రాజ్యసభ సభ్యుణ్ణి చేసి కేంద్రంలో మంత్రిని చేయడం వల్ల పార్టీ ప్రస్తావన ముందుకు సాగలేదు. కాపు సామాజిక వర్గంలో వున్న రాజకీయ చైతన్యం వ్యర్థమవుతుందన్న ఆలోచనతో ముద్రగడ పద్మనాభం (Mudragada Padmnabham) లాంటి వారు కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్పించమని ఆందోళన ప్రారంభించగా అది ‘ఆర్ధికంగా బలహీన వర్గాల కోటా’(Economically weaker sections)గా జాతీయ స్థాయిలో ప్రభుత్వ విధానంగా వచ్చింది.
చిరంజీవి రంగ్ర ప్రవేశం
కోస్తాంధ్ర (Coastal Andhra) లోని కాపు సంపన్న వర్గం, యువత,అభిమానుల వత్తిడి వల్ల సినీనటుడు చిరంజీవి ( Mega Star Chiranjeevi) 2009 ఎన్నికల ముందు ‘ప్రజారాజ్యం’ (Prajarajyam) అనే రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో 37 మంది కాపులు పోటీ చేశారు. ఒక ప్రక్క సామాజిక న్యాయాన్ని అజెండాగా పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీ వెనుకబడిన కులాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల 294 స్థానాలకు గానూ కేవలం 18 శాసన సభ స్థానాలను 16.32 % ఓట్లను పొందింది.
ప్రజారాజ్యం పార్టీ ఆదిలోనే సామాజిక న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించడం వల్ల వెనుకబడిన తరగతులు,దళితులు, ఆదివాసులల్లో పెద్దగా ఆదరణ పొందకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా 16.32 %ఓట్లను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నుండి కొల్లగొట్టడం వల్ల ఆ పార్టీ ఓడిపోగా, కాంగ్రేసు పార్టీ అధికారంలోకి వచ్చింది. వై యస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ నాయకుడు చిరంజీవికి కేంద్రంలో కాంగ్రేసు పార్టీ మంత్రి పదవి యివ్వడం వల్ల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసారు. చిరంజీవి అధికార కాంక్ష ఎత్తుగడ వల్ల తెలంగాణలో ఎంతో ప్రాబల్యం కలిగిన దేవేందర్ గౌడ్, ఉత్తరాంధ్రలో ప్రాధాన్యత కలిగిన తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు రాజకీయంగా నష్టపోయారు. అలాగే పరకాల ప్రభాకర్ లాంటి వారు ప్రజారాజ్యంపై ఆ పార్టీలోని అవకతవకలపై పెద్ద ఎత్తున విమర్శ లకు దిగారు. కొంతమంది పూర్తిగా రాజకీయాలనుండి వైదొలగారు. ఫలితంగా 2014 ఎన్నికలనాటికి ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర రాజకీయాల నుండి నిష్క్రమించడం వల్ల, అదే సంవత్సరంలో కొణిదల చిరంజీవి సోదరుడు కొణిదల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ పెట్టారు.
జనసేన సంక్షోభం
2014 లో ఒక ప్రక్క తెలంగాణ (Telangana) ఏర్పాటు కోసం రాష్ట్ర విభజన మరొక ప్రక్క వై యస్ ఆర్ కాంగ్రెసు (YSR Congress) పార్టీ రావడం వల్ల జనసేన పార్టీ సంక్షోభంలో పడి ఎన్నికల్లో పోటి చేయకుండా తెలుగుదేశం,భారతీయ జనతా పార్టీ (BJP) కూటమికి మద్దతు యిచ్చింది.
2014 నాటికల్లా ప్రజారాజ్యం పార్టీ కనుమరుగవ్వడం వల్ల నాటి ఎన్నికల్లో పరాజయం తప్పదనుకున్న జనసేన ఎన్నికలలో పోటికి నిరాకరించింది.
2014 శాసనసభ,లోక్ సభ ఎన్నికల్లో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినప్పటికీ ,2018 నాటికి రెండింటి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు తారాస్థాయికి చేరడం చంద్రబాబునాయుడు కేంద్రీకృత రాజధానిపై ధ్యాస పెట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది. దీనితో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని 2019 ఎన్నికల్లో ఎవ్వరు ఆపలేకపోయారు.
2019 నాటి శాసనసభ,లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్లమెంటరీ వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీ పొత్తులతో పోటి చేసి ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఓడిపోవడంతో పాటు జనసేన కనీసం 6% ఓట్లు కూడా పొందలేకపోయింది. 2014 ఎన్నికల్లో తనపై తనకే నమ్మకం లేక ఎన్నికల్లో పోటికి దూరంగా వుండగా, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడడం వల్ల చాలా నిరాశ,నిస్పృహకు గురవ్వడం వల్ల కూటమి రాజకీయాలకు దూరంగా ఉండలేకపోయారు పవన్.
సొంతకాళ్ల మీద నిలబడే శక్తి లేని జనసేన
ఫలితంగా 2024 ఎన్నికల్లో 5% లోపు ఓటు బ్యాంకు తో పాటు 21 శాసన సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ ఫలితాలను విశ్లేషించినప్పుడు ప్రతివారికి అర్థమయ్యేది ఒకటి: జనసేన పార్టీకి తన కాళ్ళపై తానూ నిలబడే శక్తి లేదు. అందువల్ల ఈ పార్టీ నిరంతరం ఇతరులపై ఆధారపడే ‘పరాన్నజీవి ‘లాంటి పార్టీ. ఇందుకు అనేక కారణాలు వున్నాయి.
ఇందులో ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ గానీ, జనసేన పార్టీ గానీ తమకు రాజకీయాలు చేయగల యుక్తి పరిపాలన చేయగల శక్తి ఉన్నదన్న నమ్మకం గానీ కలిగించకపోగా, కేవలం సినిమా గ్లామర్ తో రాజకీయాలు చేయవచ్చు అనే విషయాన్ని ఓటర్లు విశ్వసించడం లేదు. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని రాజకీయ అజెండాగా ప్రకటించినప్పటికీ,అది ఆచరణలో సత్యదూరమని జనం నమ్మడం, అలాగే కొణిదల కుటుంబంలో వున్న మగవారంతా సినిమాల్లో హీరోలు అయినట్లుగానే ,ఆ కుటుంబంలోని అందరు రాజకీయాలలో పదవులు కావాలని ఆశిస్తున్నట్లు జనం అర్థం చేసుకుంటున్నారు.
రెండు, జనసేన భౌగోళిక,సామాజిక పునాది కోస్తా ఆంధ్రా,కాపు సామాజిక వర్గం దాటి ముందుకు రావడం లేదని రాయలసీమ,ఉత్తరాంధ్ర వాసులు విశ్వసిస్తూ ఉండటం వల్ల ,ఇది తమ ప్రాంతం పార్టీ అని అనుకోవడం లేదు. అలాగే జనసేనలో ఒకే సామాజిక వర్గానికి లేక కొంతమేరకు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభిస్తుండటం వల్ల ప్రముఖ రాజకీయ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న లాంటి వారి నుండి ప్రభావితులైన వెనుకబడిన తరగతులు,దళితులు దగ్గర కాలేకపోతున్నారు.
పేదలకు హాని చేస్తున్న పవన్ ‘ఉపాధి కల్పన’ విధానాలు
మూడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్ననాటి నుండి తానూ తీసుకుంటున్న పాలనా పరమైన విధానాల వల్ల వెనుకబడిన ప్రాంతాలలో గ్రామీణ నిరుపేదలు పెద్ద ఎత్తున నష్టపోతున్నామని అనుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కోస్తాంధ్రాలోని సంపన్న ధనిక రైతాంగం అజమాయిషీలోని ఉద్యానవనాలకు వర్తింపజేయడం.ఫలితంగా ఉద్యానవనాలలో పెంచి మొక్కలను వర్షాలు లేక కరువును ఎదుర్కుంటున్న ప్రాంతాలలో వాటిని అమ్మి ,ఆ డబ్బును ఈ వర్గాలకు చేరే విధంగా చేయడం జరుగుతున్నది. దీని వల్ల కరువు ప్రాంతాల్లో ఒక పక్క జీవన ఉపాధి లేక వలసలు వెళ్ళేవారి సంఖ్యను పెంచడం,అదే విధంగా అక్కడ నాటిన మొక్కలు నీళ్ళు లేక ఎండిపోవడం జరుగుతున్నది. చట్టబద్ధంగా కరువుప్రాంత ప్రజలకు అందవలసిన జీవనోపాధి అందకపోవడం వల్ల పిల్లలు మధ్యలోనే చదువు ఆపేసి వలసలు వెళ్తున్నారు.
నాలుగో కారణం, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా,రాజకీయ రంగాలకు రాకముందు తానూ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కావడం వల్ల తన శాఖల పరిధిలో పని చేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినట్లుగా, గ్రామీణ ప్రజలు,పంచాయితి రాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కరించలేకపోవడం. పంచాయితి రాజ్ సంస్థల ప్రజా ప్రతినిధులు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామిణాభివృద్ధి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఒక్కరోజు గ్రామసభను నిర్వహించి అంతర్జాతీయ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్ పై చూపించే ఆసక్తి నిరంతరం గ్రామసభలు నిర్వహించడం పై లేదని విమర్శిస్తున్నారు.