నిర్దోషి అయినా సరే అరెస్టుతో బతుకుని బజారు కీడ్చనున్న కొత్త చట్టాలు
కొత్త క్రిమినల్ లా ప్రకారం ఎవరినైనా 30 నుంచి 90 రోజుల దాకా కస్టడీ కింద బంధించవచ్చు. ఆ పై నేరం లేదని తెలిస్తే ఎవరిని శిక్షిస్తారు, పోలీసులనా లేక ప్రభుత్వాన్నా?
మూడు కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చాయి. వాటి పేర్లు: భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగ్రిక సుర్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్యం అభియాన్ (BSA). ఇవి పౌరుల బతుక్కి భద్రత కల్పిస్తాయా, లేక బతుకుల్ని బుగ్గిపాలు చేస్తాయా అనే విషయాన్ని ఇక్కడ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ చర్చిస్తున్నారు.
కస్టడీ నియమాలూ, కఠినమైన కొత్త క్రిమినల్ చట్టాలు
కొత్త నేరాల చట్టాలు పాతవే అనడానికి వీల్లేదు. పోలీసు కస్టడీ, కోర్ట్ కస్టడీ పేరుతో లాకప్ లో లేదా జైళ్లలో కూడా బంధించే నియమాలనేవి ఇప్పుడు మన కొత్త కస్టడీ చట్టాలని అర్థం చేసుకోవాలి. ఈ చట్టాల పరిణామాలు మాత్రం పౌర హక్కులకు ప్రమాదకరమైనవి. ఈ నేరాల కొత్త చట్టాలు, ఆశ్చర్యకరమైన రూల్స్, ప్రియమైన (అంటే ఎక్కువ ఖరీదైన) లాయర్లు, పోలీసు కస్టడీలు, (అంటే లాకప్ లో) కోర్టు కస్టడీలు (అంటే న్యాయఅధికారులు సమీక్షించే దశలో బంధించడం), ఇవిగాక లంచాలు, రాజకీయాలు కలిసిన ఓ కొత్త రకం సమాజం ఏర్పడుతున్నది.
అమాయకుడికే సమస్య
ప్రభుత్వ పెద్దలు (అంటే పోలీసులు, మంత్రులు వగైరా) ఎవరినైనా అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకునే విస్తృతమైన అధికారాలను అన్యాయంగా ఇచ్చేస్తున్నారు. అమాయకుడు అని తెలిసినా కావాలని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు.
ఆ తరువాత ఎప్పుడో నేరం ఆరోపణ చేసి కోర్టులో వేస్తారు, ఆరోపణ ఎన్నేళ్లో ఎప్పుడు ఆ వ్యక్తికి చివరకు నేరం రుజువు కాలేదని, ఎవరూ జవాబు ఇవ్వరు, ఒక వేళ నేరస్తులు అని కోర్టు తీర్పు ఇస్తే ఇక అప్పీళ్లలో గెలవడం అనేది డబ్బుతో కూడుకున్నదై, వకీళ్లకు సంబంధించిన డబ్బు, లంచాగాళ్లను మేపడానికి చెల్లించడాలు ఉంటాయి.
అధికారంలో ఉన్న పార్టీ వారైతే, మరో పక్షానికి చెందిన వారిని జైలు పాలుచేయవలసిందే. చిదంబరం, చంద్రబాబు వంటి వివిఐపి పెద్దలకైతే, యుఎపిఎ వంటి పెద్ద చట్టాల కింద వారు కూడా కష్టపడ్డారు. ఇంకా పెద్దవారైతే హోంమంత్రి లేదా వారికన్న పెద్ద మంత్రిగారిని కాళ్లు పట్టుకోవడం కోసం, పార్టీ మార్చుకోవడం, సంకీర్ణ కూటమి లోకి మార్చుకోవడం వంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయి.
పోలీసులు జైల్లో పడిపోయిన తరువాత, ఇంక కోర్టులగురించి తిరగడం తప్పదు. అప్పుడు అటు తరఫు లాయర్లు, ఇటుతరఫు వకీళ్లు, అప్పీళ్లు కూడా సమస్యలే. బాగాడబ్బున్న వారు డిల్లీనుంచి హైదరాబాదో లేక అమరావతికో పెద్ద లాయర్లు వస్తారు. అక్కడ ఓడిపోయినా అటువారు ఇటువారు డిల్లీకి లాయర్లకు డబ్బే డబ్బు ఇవ్వవలసి వస్తుంది.
అన్యాయంగా జైలులో పడేసిన అమాయకులకు ప్రభుత్వానికి, పోలీసులు దానికి పరిష్కారం లేదా నష్టపరిహారాలు ఇస్తారా? 20 ఏళ్ల జైలు తరువాత అమాయకుడని తేలితే ఆ బాధితుడికి సమాజం ప్రభుత్వం, పోలీసులు ఏ విధంగా సమాధానం చెబుతారు? ఎవరు దానికి బాధ్యులవుతారు?
ఈకొత్త క్రిమినల్ నియమాల ప్రకారం నెలరోజులు నుంచి 90 రోజుల దాకా జైల్లో కస్టడీకింద బంధిస్తే, ఆ తరువాత ఆయనకు నేరం లేదని తెలిస్తే అందుకు ఎవరిని శిక్ష ఇస్తారా? పోలీసులనా లేక ప్రభుత్వానికా? ఎవరిస్తారు, అసలు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు? ఈ దారుణాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు.
న్యాయస్థానాల్లో త్వరగా నేరాలను పరిష్కరించనంతవరకు నేరస్తులు ఎన్నికల్లో కూడా గెలిచి, అధికారం సాధించి, రాజ్యాలను పరిపాలించే ప్రమాదం కనబడుతూనే ఉంది. మరో వైపు పాపం అమాయకులు అనేకానేక సంవత్సరాలు జైళ్లలో ఉంటూనే ఉన్నారు.
సుదీర్ఘ ఆలస్యం ఒక రుగ్మత
నేరాలు దర్యాప్తుచేయడానికి సుదీర్ఘ ఆలస్యం అనేది ఒక రుగ్మత, రోగం లేదా బలహీనమైన దారుణం. అందాకా ‘‘కొందరిని అరెస్టు చేసి పడేస్తే సరిపోతుంది’’ అని ప్రభుత్వం కొత్త చట్టాలు చేసి ‘ఓ పని అయిపోయింది’ అంటున్నారు. అవే కొత్త నేరాల చట్టాలు. వాటితో భయానకమైన నియమాలు రూపొందించారు. (చట్టం అంటే పార్లమెంట్ చేసే శాసనాలు, నియమాలు అంటే చట్టం కాకుండా చట్టం కింద ప్రభుత్వం, లేదా హోం మినిస్టర్ వంటి వారి కింద పనిచేసే ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ బ్యూరోక్రట్ లు రూపొందించే నియమాలు, మనం రూల్స్ అని న్యాయపరిభాషంలో అంటాం)
లంచాలు ఇస్తే కొంచెం న్యాయాన్ని కొనుక్కోవచ్చా?
మంత్రులు, ఎంఎల్యేలు సిఫార్సు ద్వారా రక్షిస్తే, లేక లంచాలు సమర్పించుకుంటే, కొంచెం ఖరీదైన మార్కెట్ లో ఎంత నాణ్యతమైన న్యాయాన్ని కొనుక్కోవచ్చు. పోలీసులకు కస్టడీలో బంధించే అధికారం ఈ పరిస్థితులలో వస్తాయి: 1. నిందితులకు 2. ముద్దాయిలు, కేవలం అనుమానంతో నేరాలు చేసేవారని పోలీసులు అనుకుంటే, కనీసం 15 రోజులకు మాత్రమే, అదీ అవసరం అనుకుంటేనే, వారిని కస్టడీలో రూల్స్ కింద బంధించడానికి అధికారాలున్నాయి. ప్రస్తుతం ఈ నియమాల ప్రకారం 15 నుంచి 60 రోజుల దాకా, ఆతరువాత నుంచి 90 రోజుల దాకా కూడా బంధించే అధికారం ఇచ్చారు. ఇది ఈనాటి సామాన్య (అ)న్యాయం. చట్టాల ద్వారా జరిగే అన్యాయాల గురించి చర్చిస్తే మనముందుకు వచ్చే సమస్య కొత్త నేర చట్టాలలో, ముఖ్యంగా (పాత సిఆర్ పి సి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) ఇప్పడి భాసుస (మొదటి అక్షరం లెక్కేసుకుంటే) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 ప్రమాదకరమైంది. వాటి రూల్స్ మరీ ప్రమాదకరమైనవి.
అది 1973 చట్టమైనా, పాతదైనా..
పాత బ్రిటిష్ చెత్త చట్టాలని, ఎన్ డి ఏ ప్రభుత్వం సంస్కరణ చేసినట్టు ప్రగర్భాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన తరువాత కొత్త చట్టాలు తయారు చేసారు. కాని సిఆర్ పిసి చట్టం పాతది కాదు. అవి బ్రిటిష్ చట్టాలు కాదు, భారత స్వాతంత్ర్యానికు పూర్వమైనది కాదు, ఈ మధ్య 1973లో తయారుచేసినవానిని ‘పాత’వి అనలేము. ఇటీవల అంటే 1973న వచ్చిన చట్టాన్ని కొత్త చట్టం అని అర్థం చేసుకోవాలి? కాని కొంపముంచే రూల్స్ (సూత్రాలన్నీ) ఇప్పుడు మార్చిపారేసింది భారతీయ సురక్ష సంహిత. ఎన్నికల ముందు చట్టాలు చేసారు, ఎన్నికల్లో గెలిచిన తరువాత కొత్త నియమాలు తయారు చేసారు.
కొత్త నేర భయానక చట్టాలు వారి నియమాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఏమాత్రమూ ఆలోచించడం లేదు. బిజెపికి పూర్తి మెజారిటీ లేకపోయినా, ఎన్నికలముందు ఏర్పాటయిన ఎన్ డి ఏ సంకీర్ణ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ వంటి పెద్దలు కలిసి వస్తే అయిదేళ్లపాటు అధికారం చలాయించే అవకాశం ఉంది. ఈ చట్టాలు తేకూడదు, లేదా కూడదు అని ప్రభుత్వాన్ని వత్తిడి చేసే పార్టీలు వారూ లేరు. ఒక్క ఎంపీగారూ ఎంఎల్యేగారూ, ముఖ్యమంత్రులుగారూ మంత్రులుగారూ కిమ్మనకుండా, పోతే పోనీ అన్నట్టు కూడా ఈ దారుణమైన చట్టాలు, రూల్స్, కస్టడీ, లాకప్ నియమాలు ప్రతి క్షణాన ఎవరో ఒక అమాయకుడు పోలీసు స్టేషన్ లో చిక్కి పడిపోతారు. కిమ్ అనే వారెవరూ లేరు.
ఇవన్నీ రాజ్యాంగ పౌరహక్కులే
అందరికన్న ముందు పాత సిఆర్ పిసి 1973 కింద ‘‘అత్యధికంలో అధికం’’ 15 రోజులకు మించి ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇది చట్టానికే పరిమితమైన హక్కు అనుకోవడానికి వీల్లేదు. అంటే ఆక్ట్ కింద పార్లమెంట్ చేసిన చట్టం కాదు. అంతకుముందు రాజ్యాంగ నిర్ణాయక సభ, 1950 నాడే నిర్ణయించింది. మూడో భాగం, ఆర్టికిల్స్ 21, 22 కింద కీలకమైన ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం నిర్ధారించింది. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల లోగానే కోర్టుముందుకు ఖచ్చితంగా హాజరు చేయాలని అంటుంది. ఈ రాజ్యాంగం హక్కుతోపాటు, చట్టాలలో కూడా నియమాలు వివరిస్తున్నాయి. దీనికి కారణమేమిటంటే పోలీసుల కస్టడీలో దర్యాప్తు (ఇన్వెస్ట్ గేషన్) ను ఒక్క 24 గంటలు చాలని, సుప్రీంకోర్టు తీర్పుల చరిత్ర వివరిస్తున్నది.
అయితే దానికి వేరే కారణాలేవో చెబుతూ ఉండడమే కాకుండా, ఏ కారణాలు ఇవ్వకుండానే అరెస్టు చేసి కస్టడీ చేసేందుకు పోలీసులకు ఈ నేర చట్టాల ద్వారా విపరీతమైన అధికారాలను హస్తగతం చేసుకున్నారు ‘‘తరువాత చూద్దాంలే, ముందు కస్టడీలో పడేయండి’’ అనే అధికారం ఇస్తున్నాయీ చట్టాలు. ఇదెవరికోసం ఇంత అధికారం? అంటే దాని అర్థమేమంటే, ఎంపీలు, డబ్బున్నవారు, ఎంఎల్యేలు మంత్రుల పలుకుబడిన వారు బైట పడిపోగలుగుతారని తెలుస్తుంది. కాని కనీసం జరిమానా కూడా చెప్పలేక, బెయిల్ కండిషన్ల కింద డబ్బు చెల్లించలేకుండా జైల్లోనూ పడిపోవలసిందే అని అర్థం కావడం లేదు. భారతీయ సురక్ష సంహిత కింద 15 రోజుల నుంచి, కొన్ని కొన్నిభాగాలలో, విడిగా లేదా కలిపి 40 రోజులు, 60 రోజుల దాకా, ఇంకా కొన్ని 90 జ్యుడిషియల్ కస్టడీ (అంటే కోర్టు సమీక్షించే కస్టడీ) పెంచడానికి చట్టాన్ని తయారు చేసారు.
బందీ కాలం పెరిగే కస్టడీ
పోలీసు కస్టడీ అయితే ఇంకా మరీ ఇబ్బంది. పోలీసు జైలు 15 రోజుల నుంచి 60 రోజుల దాకా పెరుగుతుంది. ఆ కస్టడీ ఓసారి తక్కువ రోజులు, మరో సారి ఎక్కువరోజుల చొప్పున మొత్తం 60 రోజుల్లో జైల్లో పడేస్తే సామాన్యుడి గతి ఏమిటి? వారి బంధువులు పిల్లలు, ఏమయిపోవాలి? అంటే రుజువు చేయకముందే, సాక్ష్యాలు లేకపోయినా, 60 రోజుపాటు జైల్లో పడేస్తారు, మరి సందర్బాల్లో 90 రోజుల దాకా కస్టడీలో ఉండాలంటే ఎంత దారుణం.
ఈ నియమాల ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష విధించగలిగిన సెక్షన్ కింద 40 రోజుదాకా పోలీసు జైల్లో పెట్టుకునే అధికారం ఇస్తున్నారు.
చట్టాలు సరే, నియమాలు కూడా కొంపలు ముంచేవే
మరో మార్పులు కూడా చేసారు. మన భారతీయ రాజ్యాంగానికి గతి లేదు. చట్టాలు కొన్ని బాగానే ఉన్నాయని అనుకున్నా, లాభం లేదు. ఆ చట్టాలకింద చేసే నియమాలను (రూల్స్) పోలీసు కస్టడీ భయానకంగా మార్పు చేసారు. అరెస్టు చేస్తారైతే, మొదట 15 రోజుల దాకా కస్టడీలో పడేస్తారు. తర్వాత పోలీసుల దర్యాప్తుచేయడానికి మాకు సరిపోదని అంటే సురక్ష సంహిత కింద నియమాల ప్రకారం మరో 15 రోజులు కస్టడీకి పంపుతారు. ఆ తరువాత ఇంకో సారి కొన్ని, మరో సారి ఇంకొన్ని అంటూ కొనసాగుతూ 60 రోజులదాకా జైల్లో పడేస్తారు.
డబ్బు ప్రతాపాల గురించి చెప్పవలసిందేమీ లేదు కదా. లంచగొండి కష్టాలు అదనంగా ఉంటాయి. అందరు పోలీసులు నేరస్తులనీ లంచగొండులనీ ఎవరూ అనకూడదు. మంచి వారు కూడా ఉంటారనే నమ్మకం ఇంకా మిగిలే ఉంది. శాంతియుతంగా బయటపడడానికి ఒకే దారి లంచాలు. ఆ లంచాలకు చెల్లించే శక్తి దాటిపోతే స్వేచ్ఛ అనీ, రాజ్యాంగం అనీ, పౌర హక్కులనీ ఆలోచించేదాకా, మళ్లీ ఎన్నికలు వస్తాయి కదా.
హక్కులను భయపెట్టి న్యాయాన్ని అణచివేసే ప్రయత్నాలు ఈ కొత్త చట్టాలు.