
Gen-Z ఐఎఎస్ లతో చంద్రబాబు కొత్త ప్రస్థానం
ఈ రోజు కలెక్టర్ల ప్రారంభ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ- “మీరు పుట్టేనాటికి నేను ముఖ్యమంత్రిని... ” అన్నారు.
ఎక్కువ సార్లు వాటిని మనం రాజకీయాలు అనుకుంటాము కాని, అవి రాజకీయాలు కాదు. అది కాలాన్ని వెనక్కి నెట్టి దాన్ని ఆపాలనే వృధా ప్రయత్నం, అలా జరగాలని కోరుకుంటున్న వర్గానికి ప్రతినిధి చంద్రబాబు నాయుడు కావడంతో, వాటిని- రాజకీయాలు అనే ఎవరైనా అనుకుంటారు. అయితే ఆ పని చేయడం కోసం ఆయనే ఎందుకు అంటే, రాజ్యాంగంలో ఉన్నవి వాటి వాస్తవ స్పూర్తితో జరగకుండా ఉండేట్టు చూడాలి అంటే, ఎవరైనా రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడే చేయగలరు. కనుక, 1994 నవంబర్లో టిడిపి అధికారంలోకి వస్తే, ఏడాది లోపే 1995 సెప్టెంబర్ నాటికి ఎన్టీఆర్ స్థానంలోకి నాయుడు అందుకోసం ఎంపిక చేయబడ్డాడు.
ఆ అవసరం అప్పుడే ఎందుకు కలిగింది అంటే, అప్పటికి నాలుగేళ్ల ముందు 1991లో కేంద్రంలో పి. వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా, డా. మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాయి. దాంతో- ‘ప్రపంచీకరణ’, సరళీకరణ’, ప్రైవేటీకరణ’ అనే మూడు ఆధునిక వ్యూహాలు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలోకి ప్రవేశించాయి. అలా రాజ్యాంగ వ్యవస్థ దాని పాత నిర్మాణాలు, ఈ కొత్త లక్ష్యాల సాధన కోసం పనిచేయాల్సి వచ్చింది. ఏముంది వాటిలో అంటే- ‘సరళీకరణ’ అనే లిబరలైజేషన్, అంటే ఆ పదంలోనే దాన్ని ఉద్దేశించిన లక్ష్యం ఉంది. అప్పటివరకు ‘యాక్సెసెస్’ లేని వాటిలోకి, అది లేనివారికి స్వేచ్చగా వాటిలోకి ప్రవేశానికి అనుమతి దొరికింది.
దీనర్ధం ఇందుకు ‘అనుమతి’ దొరికిన నాటికి మన పురోగమనం ఎక్కడ ఉంటే, అక్కణ్ణించి దాని ‘వేగం’ పెరుగుతుంది. దీనివల్ల అందరూ ప్రయోజనం పొందుతారు, ఎందుకంటే ‘సోర్స్’ (వనరు) వద్దకు వెళ్ళడానికి ఎటువంటి ఆంక్షలు లేవు, అందరూ వెళ్ళవచ్చు. కాకపోతే, అప్పటికి నీళ్ళ కోసం చెరువు దగ్గరకు బిందె పట్టుకుని వెళ్ళిన వారు బిందెతో నీళ్లు తోడుకుంటే, గ్లాస్ తీసుకెళ్లిన వాళ్ళు గ్లాస్ తోనే తోడుకున్నారు. సమస్య అంతా అక్కడే ఉంది. దాంతో ఇక్కడే, ప్రభుత్వాల జోక్యం అవసరమైంది. ఈ ‘జోక్యం’ వద్దనే ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క మాదిరిగా మారింది. ప్రభుత్వం జోక్యం కొంచెం ఎక్కువైతే, దాన్ని ‘సంక్షేమం’ అంటున్నారు. దాన్ని పూర్తిగా తగ్గిస్తే, దాన్ని ‘అభివృద్ది’ అంటున్నారు. ఎలాగోలా గెలిచి ప్రభుత్వంలో ఉంటేనే దీన్ని చేయవచ్చు కనుక, ముప్పై ఏళ్లపాటు నాయుడు ఒక ‘పొలిటీషియన్’ అనే అదనంగా తగిలించుకున్న ‘ముఖం’తో (‘మాస్క్’)తో ప్రభుత్వంలో ఉండి ఇలా సంస్కరణల వక్రీకరణను విజయవంతంగా అమలు చేయగలిగాడు. ఈ కాలంలోనే రాష్ట్రం రెండు అయింది అంటే, అందులో కూడా మన ‘పనితనం’ ఉందనే అర్ధం.

ఇప్పుడు ఇక ఆయన తన వారసుడికి పగ్గాలు అప్పగిస్తారు అనే వాతావరణం సర్వత్రా ముసురుకుంటున్న వేళ, ముప్పై ఏళ్ల క్రితం తనకు అప్పగించిన పనిని నాయుడు ఏ మేరకు పూర్తి చేశారు, ఎటువంటి స్థితిలో దాన్ని తన వారసుడికి ఆయన అప్పగిస్తున్నారు, అనేది కొంచెం లోపలికి చూడాల్సిన అంశం. ఇక్కడే మరొక వివరణ కూడా అవసరం, అస్సలు ఆయనకు ఈ పని అప్పగించింది ఎవరు? అనేదానికి కూడా ఇక్కడ జవాబు వెతకాలి. అది తెలిసినప్పుడే నాయకుని ‘నాయకత్వ’ లక్షణాలు స్పష్టంగా అర్ధమవుతాయి.
సంస్కరణలో ఉన్నవి మొత్తం మూడు అంశాలు అంటూనే పైన ఒకదాని గురించే కొంత మేర చెప్పుకున్నాము. ఇంకా- ‘ప్రపంచీకరణ’ ‘ప్రైవేటీకరణ’ అనేవి రెండు మిగిలాయి. ‘సరళీకరణ’ వల్ల ఊరంతా చెరువు వద్దకు గ్లాస్ పట్టుకుని తమ ‘షేర్’ కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకా చెరువు దగ్గరే ఉంటే, బిందెతో నీళ్ళు తోడుకున్నవాళ్ళు కొందరు ‘ప్రపంచీకరణ’ వల్ల విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. మరికొందరు ‘ప్రైవేటీకరణ’ వల్ల ప్రభుత్వ యంత్రాంగాల్లోకి చొరబడి, లోపల ఉండి మరీ రాజ్యాంగ పరిధికి ‘బయట’ పనులు చేస్తున్నారు.
ఇలా ముప్పై ఏళ్ల తర్వాత 2025 నాటికి నాయుడి ‘మిషన్’ కొనసాగించే వారసుడి ప్రకటనకు తగిన నేపధ్యం (స్టేజ్ సెట్టింగ్) తయారీ మొదలయింది. అదేంటి? మూడు దశబ్ధాల అనుభవం ఉన్న బాబు వంటి నాయకుడికి అందుకు తాత్సారం ఎందుకు? ఆయన అనుకున్నది అనుకున్నట్టు సునాయాసంగా చేయగలడు కదా? సహజమైన సందేహమిది. ఇక్కడే 2019-24 మధ్య వైఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం కాలం ఆయనకు అడ్డంకి అయింది. జగన్ ‘సెట్’ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతురస్రం అయినా ఉంచాలి, లేదు జగన్ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా కుదరక, అంచులు బయటకు ఉంటున్నాయి. జగన్ ఇంజనీరింగ్ మారడంతో పరిపాలనా నిర్మాణం మారింది.
యూ.ఎన్.వో.కు అనుబంధంగా పనిచేసే, వరల్డ్ బ్యాంక్, యూ.ఎన్.డి.పి.లు ఆర్ధిక సంస్కరణల అమలు ఆలస్యంగా మొదలెట్టిన దేశాలలో ఉండే ఈ రాజకీయాల గోల తెలిసే- ‘సస్టెయిన్బుల్ డెవలప్మెంట్ గోల్స్’ (SDGs) ప్రాతిపదికన ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించుకుని, ‘నీతి ఆయోగ్‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా రాష్ట్రాలు పనిచేయాలి అని మొత్తం సభ్య దేశాలను ఆదేశించింది. ఆ జాబితాలో మొత్తం 17 అంశాలు ఉంటే, వాటిలో ఎక్కువ అంశాలు పైన చెప్పుకున్న ‘గ్లాసు’ పట్టుకుని చెరువు వద్ద మిగిలిపోయిన వారి కోసమే ఉన్నాయి! వాటికి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలకు వెళ్ళే పార్టీలు తమవైన ఏవో పేర్లు- ‘నవరత్నాలు’ అనో లేదా ‘సూపర్ సిక్స్’ అనో పెట్టుకోవచ్చు. కానీ వాటి వెనకున్న ఆదేశాలు మాత్రం పై నుంచి వచ్చినవి. ఇంత వివరం తెలియనివారు దాన్ని- ‘సంక్షేమం’ అన్నారు.
రాష్ట్రం విడిపోయాక, ఎక్కడో ఒక చోట ‘వర్క్ స్టేషన్’ పెట్టుకుని ప్రభుత్వం పని చేయక తప్పదు. మొదటి అయిదేళ్లలో వెలగపూడిలో ఆ పని పూర్తి చేశారు కూడా. కానీ ‘అమరావతి’ ఇప్పుడు పెద్ద విషయం అయిపోయి, సగం పైగా మన ప్రాధాన్యతలను అది మింగేసింది. మూడు పార్టీల కూటమితో నడుపుతున్న ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ‘స్టేజ్ సెట్టింగ్’ కోసం, రెండవ ఏడాది ప్రవేశానికి ముందే ‘బాదులు’ పాతడం మొదలయింది. అందుకోసం 12 మంది కొత్త కలక్టర్లు, కొత్త ఎస్పీలు పోస్టింగులు తీసుకుని తమ జిల్లా కేంద్రాలకు వెళ్లారు. వీరిలో ఎక్కువమంది 2015 బ్యాచ్ అధికారులు. అంటే ‘పోస్ట్-స్టేట్ బైఫర్ కేషన్’ ప్రభుత్వ సర్వీస్ లో చేరిన వాళ్ళు. జిల్లా కేంద్రాల్లో వీళ్ళు చార్జి తీసుకున్న వెంటనే వాళ్ళను సెప్టెంబర్ 15-16న సమీక్ష అంటూ కలక్టర్ల మీటింగ్ కోసం పిలిపించారు. ఈ రోజు దాని ప్రారంభ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ- “మీరు పుట్టేనాటికి నేను ముఖ్యమంత్రిని... ” అన్నారు. అవును, నిజమే వాళ్ళు- ‘జెన్ జడ్’ (Gen Z) ‘అల్ ఇండియా సర్వీస్’ అధికారులు. ప్రతి కాలము తనకు కావాల్సిన వ్యక్తుల్ని తయారు చేసుకుంటుంది, అది దాని సహజ లక్షణం.