
రక్తరహిత రాజకీయ నరమేధమే ఓటర్ల తొలగింపు !
పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సులో డాక్టర్ పరకాల ప్రభాకర్-
‘‘ఓటర్ల జాబితా నుంచి పౌరులను తొలగించడమంటే వారిని చంపేయడమే! ఇది రక్తపాతం లేకుండా చేసే రాజకీయ నరమేధమే ! ప్రజాస్వామ్యాన్ని ఒక్కసారిగా నరికి వేయడమే! నెమ్మదిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తీసేయడమే కదా!’’ అని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుకు వ్యతిరేకంగా పోరాడకపోతే, భవిష్యత్తులో మనం పోరాడడానికి ఏమీ ఉండదు. ఇవాళ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పొచ్చింది. రెండు చేతులతో వాటిని కాపడకపోతే మనకు భవిష్యత్తు లేదు’’అని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని టౌన్ క్లబ్ హాల్ లో పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షత జరిగిన పౌరచైతన్యవేదిక ప్రథమ రాష్ట్ర సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సులో పరకాల ప్రభాకర్ ప్రసంగం వారి మాటల్లోనే.
‘‘స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘ కాలం సాగింది. కొంత మంది సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకుంటే , మరికొంత మంది సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఇసుమంత పాత్ర కూడా లేని వారు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారు. దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దీన్ని చాలా మంది నమ్ముతున్నారు. ఇంత కంటే విడ్డూరం ఏముంటుంది?
రెండేళ్ళుగా మణిపూర్ మండుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గుడారాల్లో తలదాచుకుంటున్నారు. గుండెల మీద చేయివేసుకుని చెప్పండి ! మనమేమైనా పట్టించుకుంటున్నామా? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరారు. మనకు 150 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాలో రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. మనలో ఒక్కరైనా రోడ్డెక్కారా!? సుప్రీం కోర్టు న్యాయమూర్తి పైన చెప్పు విసిరితే హోం మంత్రికి కానీ, న్యాయ శాఖా మంత్రికి కానీ అసలు పట్టిందా?
డాలరు ధర బ్యాంకుల్లో 90 రూపాయలైంది. పెట్రోల్ ధర, గ్యాస్ ధర పెరిగింది. ఎంత పెంచినా కిక్కురు మనకుండా వాడేస్తున్నాం. ఎవరైనా అడిగారా? ఇన్ని సమస్యలుంటే, వీటిపైన మాట్లాడకుండా వందేమాతరంపై మన పార్లమెంటులో పదిగంటలు చర్చించారు. ఆశ్చర్య పోయాను. ఇవ్వన్నీ మానవహక్కులకు సంబంధించిన రాజకీయాలు కావా?
ఐక్యరాజ్య సమితి వెలువరించిన మానవ హక్కుల ప్రకటనలో ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్’ అని ఉంది. ‘‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ కాదు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్’’ అని భారతదేశానికి చెందిన మహిళ హన్స్ జీవరాజ్ మెహతా ఐక్యరాజ్య సమితిలో నిలదీస్తే, అప్పుడు మాత్రమే ‘ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్‘ అని మార్చారు. ఇదొక విప్లవాత్మక చర్య. ఒక భారతీయ మహిళ ఈ విషయం ప్రతిపాదించింది కదా! మహిళా దినోత్సవం నాడైనా ఎవరైనా ఆమెను గుర్తు చేసుకుంటున్నామా!? మణిపూర్ ను కానీ, డాలర్ విలవను కానీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైన చెప్పు విసరడాన్ని కానీ ఎవరైనా గుర్తు చేసుకుంటున్నామా!?
ప్రభుత్వ ఓటర్లుగా ఎవరుండాలి? ఎవరుండకూడదు? వీటినిప్పుడు నిర్ణయించేదాని పేరు ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్). ఓటర్లను ఎస్ ఐ ఆర్ ఎట్లా గుర్తు పట్టాలి? బట్టలను బట్టి గుర్తు పట్టాలి. మస్తానమ్మ చీరకట్టుకుంది కాబట్టి ఆమె ఓటరుగా ఉంచుదామా? ఆమె పేరును బట్టి ఆమెను ఓటరుగా తీసెయ్. పోనీ శ్రీధర్ గారిని ఓటరుగా గర్తు ఉంచుదామా ? ఆయన హక్కుల గురించి మాట్లాడతారు కనుక ఆయన్ని తీసెయ్. పోనీ రాఘవ శర్మ పేరు మనకు చాలా బాగుంది. ఓటరుగా ఉంచుదామంటే, ఆయన వరవరరావు లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తారు. అబ్బే అస్సలు కుదరదు. తీసెయ్. ఇలా ఉందండి ఎస్ ఐ ఆర్ వ్యవహారం. అసలు ఎవరు పౌరులో ఎవరుపౌరులు కాదో తేల్చే హక్కు ఎన్నిక కమిషన్ కు ఎవరిచ్చారు?
పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సుకు హాజరైన ప్రజలు
మనకు ఓటు వేస్తారు పరవాలేదు అనుకున్న వారినందరినీ ఉంచేసి, ఓటు వేయని కొందరిని తీసేస్తే, ప్రతిపక్షానికి కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. అంటే బీజేపీ, ఎన్ డీఏకి నూకలు చెల్లిపోతున్నట్టే కదా! మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా వంచిస్తున్నారో, రాజ్యాంగాన్ని ఎలా వంచిస్తున్నారో చెప్పుకోవాలి.
మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఎవరు పౌరులు, ఎవరు పౌరులు కాదు అన్న చర్చ జరిగింది. చాలా దేశాల్లో తోలును బట్టి, భాషను బట్టి, మతాన్ని బట్టి, నైసర్గికతను బట్టి పౌరసత్వం లభిస్తుంది. ఇవి కానటువంటి వాళ్ళు ఏమైపోవాలి? గెటౌట్! లేదా వెంటనే చంపేయాలి! కొన్ని దేశాల్లో వారిని గెంటివేశారు, వారిని చంపేశారు. కానీ అందుకు భిన్నంగా ఈ దేశంలో ఉన్న వారంతా ఈ దేశ పౌరులే అని తొలిసారిగా నిర్ణయించిన దేశం భారత దేశం. చర్మపు రంగు, మతం, సంస్కృతి, భాషలనే తేడా లేకుండా అందరినీ అంటిపెట్టుకున్నది భారత దేశం. ‘అందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఒక దారి’ అనే నానుడి ఉంది కదా. అసలు ఉలిపి కట్టె అంటే ఏమిటి? ఈ దేశం హిందువులది అనే వాళ్ళే ఆ ఉలిపి కట్టెలు.
‘ఈ దేశంలో అందరూ ఉండాలి. ఈ దేశంలో ఉండే వారందరూ ఈ దేశ పౌరులే. అందరూ ఈదేశంలో భాగస్వాములే’ అన్న మన నాయకులు, మన రాజ్యాంగం ఉత్కృ ష్టమైంది. చదువు ఉన్నా, లేకున్నా, ఆస్తి ఉన్నా లేకున్నా, ఏ మతమైనా, ఏకులమైనా ప్రతి మనిషికీ ఓటు ఉంటుందని చెప్పారు. అది సూత్రం. ఎవరికీ ఓటు హక్కు తీసేయలేదు. ఎప్పుడూ ఓటరు నమోదుకు అప్లికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికీ వెళ్ళి ఓటర్ల పేర్లను నమోదు చేసి, ‘హౌటు బ్రింగ్ ది పీపుల్’ అన్నారే కానీ ‘హౌటు ఎలిమినేట్ పీపుల్’ అనలేదు. చనిపోయిన వారిని తీసేయడానికి అభ్యంతరం లేదు.
ఎస్ఐఆర్ తరువాత ఎన్నికల కమిషన్ తయారు చేసిన జాబితా ఎలా ఉందంటే, ఒక ఇంట్లో 500 మంది ఓటర్లున్నారు. చాలా మంది పౌరులను ఓటర్లుగా తీసేశారు. అంటే పౌరులను చంపేయడమే కదా! అంటే రక్తపాతం లేకుండా చేసే రాజకీయ నరమేధమే కదా ఇది! ప్రజాస్వామ్యాన్ని ఒక్కసారిగా నరికి వేయడమే కదా! నెమ్మది నెమ్మదిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తీసేయడమే కదా! చాలా మంది తమకేమీ పట్టనట్టు గిరిగీసుకుని కూర్చున్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుకు వ్యతిరేకంగా పోరాడకపోతే, భవిష్యత్తులో మనం పోరాడడానికి ఏమీ ఉండదు. ఇవాళ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పొచ్చింది. రెండు చేతులతో వాటిని కాపడకపోతే మనకు భవిష్యత్తు ఉండదు.
ఇలా మాట్లాడే అవకాశం ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. నేను ఏ క్షణమైనా లోపలికి(జైల్లోకి) వెళ్ళిపోవచ్చు. ఈ సభకు వచ్చినందుకు మీలో కూడా చాలా మంది లోపలికి వెళ్ళిపోవచ్చు. దేశంలో జరుగుతున్న రాజకీయాలను మనం వినోదంగా చూడడం కాదు. కార్యరంగంలోకి దిగాలి. ఎన్నికలు నిష్పక్ష పాతంగా ఉండాలి. బీజేపీకి మహిళా మోర్చా, యువ మోర్చా, మైనారిటీ మోర్చా, విద్యార్థి మోర్చా లాగానే దానికి ఎన్నికల మోర్చా కూడా ఉంది.
ఇది వరకు ఓటు హక్కు ఎలా ఉందో, అలా ఉంటేనే ఎన్నికలకు వెళతామని పౌరులంతా అడగాలి. ఉదాసీనత వదిలేయండి. స్పెక్టేటర్ గా గేమ్ చూడడం ఆపేయండి.’’ అంటూ ముగించారు.
పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సు లో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ కుంచె శ్రీధర్
పౌరసత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు సంబంధ ఏమిటి ? ప్రొఫెసర్ కుంచె శ్రీధర్
చొరబాటు దారులను ఏరి వేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఏర్పాటు చేశామని చెపుతున్న ఎలక్షన్ కమిషన్ కు ఎవరు పౌరులో, ఎవరు పౌరులు కాదో తేల్చే బాధ్యత దానిక ఎవరిచ్చారు ? అని ‘సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం(సీపీడిఆర్ ఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ సదస్పులో ప్రసంగిస్తూ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ తప్పులపైన తప్పులు చేస్తోందని బీహార్ ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.
బీహార్ ఓటర్ల జాబితాలో 65 లక్షల మంది పేర్లను తొలగించారని, దీనిపై సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే తీసేసిన జాబితాను 50 లక్షలకు కుదించారని అన్నారు. యాభై లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తీసివేస్తే, ఎందుకు తీసేశారో కారణం చెప్పాలి కదా అని అడిగారు. చదువుకున్న వారే ఓటరు నమోదు ఫారం నింపలేకపోతుంటే, చదువుకోని వారు ఎలా నింపగలుగుతారని ప్రశ్నించారు.
బూత్ లెవల్ ఆఫీసర్ ఇంటింటికీ వెళ్ళి కొత్త వారిని ఓటర్లుగా చేర్చుకోవాలి, మరణించిన వారి పేర్లను తొలగించాలి. వలసదారులుంటే, పిర్యాదు చేస్తే, ఆ విషయం పోలీసులు చూసుకోవాలి కానీ, ఎలక్షన్ కమిషన్ కేం పని? అని ప్రశ్నించారు. ముస్లింలను, మైనారిటీలను, దళితులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికే ఎస్ఐఆర్ ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు.
వలసదారులనే సాకుతో ఓటర్లను తొలగించి, ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నదని బిజేపీని విమర్శించారు. మానవ హక్కు అనేది అత్యవసరమైందని అన్నారు. ఎస్ ఐ ఆర్ అంటే ఫ్యాసిజానికి బాట వేసే వారని వ్యాఖ్యానించారు.
పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సు లో అధ్యక్షోపన్యాసం చేస్తున్న వాకా ప్రసాద్
ఈ సదస్సులో పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావం గురించి వివరించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి 1948 లో ప్రపంచ శాంతి కోసం, దేశాల మధ్య భద్రత కోసం, దేశాల మధ్య సహకారం కోసం డిసెంబర్ 10 వ తీదీన మానవహక్కుల ప్రకటనను చేసిందని గుర్తు చేశారు. ఆ ప్రకటన వెలువడిన రోజునే అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. పౌర చైనత్య వేదిక లక్ష్యాలను, కర్తవ్యాలను కూడా వివరించారు.
పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు రాఘవ ఆహ్వా నం పలికిన ఈ సభలో ముగ్గురు మూడు తీర్మానాలను ప్రవేశ పెట్టారు. పౌరచైతన్య వేదిక విశాఖ పట్నం జిల్లా అధ్యక్షలు ప్రొఫెసర్ కోల వెన్ను చాంద్ ఎస్ ఐ ఆర్ ను ఉపసంహరించుకోవాలని, వేదిక కర్నూలు అధ్యక్షులు ఓంకార్ వివాదాస్పదమైన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ, తిరుపతి జిల్లా కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వరరావు పెగాసెస్ వైరస్ ను పోలిన సంచార సాథి యాప్ ను వ్యతిరేకిస్తూ పెట్టిన తీర్మానాలను సభ చప్పట్లతో ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో ఆరుగురు వేసిన సందేహాలను పరకాల ప్రభాకర్ వివరించి చెప్పారు. మధ్యాహ్నం పౌరచైతన్య వేదిక ప్రతినిధుల సమావేశం జరిగింది.

