సొమ్ము ఆంధ్రా సర్కారుది.. సోకు భూయజమానులది.. కష్టం కౌలు రైతులది
x

సొమ్ము ఆంధ్రా సర్కారుది.. సోకు భూయజమానులది.. కష్టం కౌలు రైతులది

ఆంధ్రాలో చాలా మంది యజమానులు భూములు కౌలు ఇచ్చి ఇతర నగరాలకు వెళ్ళిపోయారు. కానీ ప్రభుత్వం వ్యవసాయానికి అందించే అన్ని రకాల సహాయాన్ని నిస్సిగ్గుగా పొందుతున్నారు.


ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా ఆవిర్భవించి 2024 జూన్ 2 నాటికి పదేళ్ళు గడిచిపోయాయి. 2014, 2019 లలో నిర్ధిష్ట కాల పరమితిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వాలు మారాయి. జూన్ 12 న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ముచ్చటగా మూడవసారి నూతన ప్రభుత్వం కొలువు తీరింది.

ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలపై ముందుగా దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. ఈ కీలక సమస్యలలో మొదటి స్థానంలో నిలిచేది రాష్ట్ర గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కౌలు రైతుల సమస్య. ఆంధ్ర ప్రదేశ్.. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. బహుళ పంటలు పండే రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా రాష్ట్రంలో స్వంత భూమి ఉన్నసాగు దారుల కంటే, ఎక్కువగా కౌలు రైతులే పంటలు సాగు చేస్తున్నారు.

2018-2019 అధ్యయనం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ (NSSO) 2022 లో ప్రకటించింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 31 శాతం మాత్రమే. అన్నపూర్ణగా చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికీ ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే, అందులో 80 శాతం కౌలు రైతులవే.

రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో 2015 లో రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్యపై ఒక అంచనా వేశారు. ఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో 16 లక్షల 25 వేల మంది కౌలు రైతులు ఉంటారు. 2021 లో వేసిన మరో అంచనా ప్రకారం కూడా రాష్ట్రంలో 16 లక్షల 483 మంది కౌలు రైతులు ఉంటారు. నిజానికి ఈ అంచనాల కంటే, మరింత పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉంటారని క్షేత్ర స్థాయి అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి , గుంటూరు, కృష్ణా జిల్లాలకే కౌలు రైతుల సమస్య పరిమితం కాకుండా , రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ సమస్య విస్తరించి ఉంది.

నాబార్డ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు- రుణ వ్యవస్థ అంశంపై SRM యూనివర్సిటీ చేసిన అధ్యయన నివేదిక 2023 లో వెలువడింది. గుంటూరు జిల్లాలో 8 గ్రామాలలో 240 మంది రైతులతో (120 మంది కౌలు రైతులు+ 120 మంది సొంత భూమి యజమానులు) ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం చేసిన గ్రామాలలో 49 శాతం కౌలు రైతులు ఉంటే, 40 శాతం సొంత భూమి యజమానులు ఉన్నారు.

ఈ అధ్యయనం ప్రకారం ఆయా గ్రామాల్లో 88 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. కౌలు రైతు సగటు అప్పు 2 లక్షల 7 వేల 444 రూపాయలు కాగా, భూ యజమాని సగటు అప్పు 76 వేల 306 రూపాయలు. కోస్తా ఆంధ్రా వరి రైతులలో 65 నుంచి 80 శాతం కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతు కుటుంబాలలో తలసరి ఆదాయ లోటు 33 వేల 913 రూపాయలు కాగా, భూ యాజమానులలో కూడా తలసరి అదనపు ఆదాయం కేవలం 3 వేల 467 రూపాయలుగా ఉంది. అంటే, సొంత భూమి ఉన్న రైతులకైనా, కౌలు రైతులకైనా మొత్తంగానే వ్యవసాయంలో ఆదాయం తగినంతగా లేదని అర్థం చేసుకోవచ్చు .

సాగు చేస్తున్న సొంత భూమి యజమానులకు కూడా 48.5 శాతం రుణాలు బ్యాంకుల నుండీ అందుతుంటే, కౌలు రైతులు మాత్రం 60 శాతం పైగా ప్రైవేట్ రుణాలపై ఆధారపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులకు హక్కులు కల్పించడానికి 1956 ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ప్రాంతపు) కౌలుదారీ చట్టం, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ఉండేవి. 1956 చట్టం ఆచరణలో అసలు అమలే కాలేదు. 2011 లో వచ్చిన చట్టం మాత్రం 2012 నుండీ 2018 వరకూ కౌలు రైతులను గుర్తించి, రుణ అర్హత కార్డులు (LEC) ఇవ్వడానికి తోడ్పడింది. ఈ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం కౌలు రైతు గుర్తింపు కార్డు కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. రెవెన్యూ శాఖ గ్రామ సభలలో ఈ దరఖాస్తులను పరిశీలించి , కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసేది. మొత్తం కౌలు రైతులకు గుర్తింపు దక్కకపోయినా, ఈ చట్టం అమలైనన్ని రోజులూ ముఖ్యమైన జిల్లాలలో కౌలు రైతులకు ఏదో ఒక మేరకు గుర్తింపు దక్కింది.

2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పై రెండు కౌలు రైతు చట్టాలనూ రద్ధు చేసి, కొత్తగా పంట సాగుదారుల హక్కు చట్టాన్ని (CCRC) తీసుకు వచ్చింది. కానీ ఈ చట్టం అమలులో ఒక మెలిక పెట్టారు. కౌలు రైతుకు CCRC కార్డు దక్కాలంటే, భూమి యజమాని అనుమతించాల్సి ఉంటుంది. ఫలితంగా ఎక్కువమంది భూమి యజమానులు కౌలు రైతుకు CCRC కార్డు దక్కకుండా అడ్డుకున్నారు. రైతు భరోసాకు, పంటల బీమాకు, పంట రుణానికి, పంట ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఈ గుర్తింపు కార్డే ముఖ్యం. భూమి యాజమానుల నిర్హేతుక భయాల వల్ల, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల మంజూరు తగినంతగా జరగక పోవడంతో, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కౌలు రైతులకు అందకుండా పోయింది.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 17వేల 649 గ్రామాలలో 16 లకషల 483 మంది కౌలు రైతులు ఉంటారని అంచనా వేస్తే, 2019-2020 లో కేవలం 2 లక్షల 72వేల 679 మంది కౌలు రైతులకు, 2020-2021 లో 4 లక్షల 14 వేల 795 మంది కౌలు రైతులకు, 2021-2022 లో 5 లక్షల 22 వేల 683 మంది కౌలు రైతులకు మాత్రమే CCRC కార్డులు అందాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అంటే,అంచనా వేసిన కౌలు రైతులలో కేవలం 33.66 శాతం మందికే గుర్తింపు దక్కింది.

CCRC కార్డులు పొందిన కౌలు రైతులలో కేవలం 22 శాతం మందికి రైతు భరోసా సహాయం అందిందని, 3 శాతం మందికి పంటల బీమా పరిహారం అందిందని, 2 శాతం మందికి పంట నష్ట పరిహారం అందిందని, 3 శాతం మందికి వ్యక్తిగత పంట రుణాలు అందాయని, మరో మూడు శాతం మందికి గ్రూప్ లోన్ అందిందని ఈ అధ్యయనంలో తెలిసింది. మిగిలిన వాళ్ళకు ఏ సహాయమూ అందలేదు. ప్రభుత్వ ఇతర సబ్సిడీ పథకాలు, ముఖ్యంగా మార్కెటింగ్ సదుపాయం కౌలు రైతులకు అందుబాటులో లేవు.

SRM యూనివర్సిటీ తమ అధ్యయనంలో భాగంగా, ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఏమిటని అడిగినప్పుడు, 43 శాతం మంది భూమి యజమానులు అంగీకరించకపోవడం వల్లనే అని చెప్పారు. కార్డులు వచ్చినా, ప్రయోజనమేమీ దక్కడం లేదనే నిరాశతో అసలు కార్డుల కోసం తాము దరఖాస్తు చేయలేదని 32 శాతం మంది కౌలు రైతులు చెప్పారు. ఈ చట్టం గుర్తించి తమకు అవగాహన లేదని 10 శాతం మంది కౌలు రైతులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల స్థితి గతులు –CCRC చట్టం అమలు తీరుపై 2022 ప్రారంభంలో రైతు స్వరాజ్య వేదిక కూడా 12 జిల్లాలలో , 34 గ్రామాలలో, ఇంటింటి సర్వే పద్ధతిలో 4వేల 154 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి సర్వే నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ సర్వే ఫలితాలు మరింత విస్తృతంగా ఉన్నాయి. కేవలం దక్షిణ కోస్తా జిల్లాలలోనే కాకుండా, రాయలసీమ జిల్లాలలో కూడా 30-40 శాతం వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారని బయట పడింది. ఎంచుకున్న కౌలు రైతులను మాత్రమే కాకుండా, మొత్తం గ్రామాన్ని సర్వే చేయడం వల్ల, కేవలం 8.8 శాతం మందికే CCRC కార్డులు అందాయని బయట పడింది. కార్డులు రాకపోవడానికి భూమి యాజమనులే ప్రధాన అడ్డంకి అని 90 శాతం మంది కౌలు రైతులు చెప్పారు. రైతు భరోసా సహాయం కూడా కేవలం మూడు శాతం మంది కౌలు రైతులకే అందిందని తేలింది.

రాష్ట్రంలోని అనేక జిల్లాలలో సొంత భూములు ఉన్న భూ యజమానులు వ్యవసాయం మానేశారు. తమ పేరున రెవెన్యూ రికార్డులలో ఉన్న భూమిని కౌలుకు ఇస్తున్నారు. చాలా మంది భూ యజమానులు స్థానికంగా జీవించడం లేదు. ఇతర దేశాలకు, ఇతర నగరాలకు కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం అందించే అన్ని రకాల సహాయాన్ని నిస్సిగ్గుగా పొందుతున్నారు. “సొమ్ము ప్రభుత్వానిది, సోకు భూ యాజమనులది , కష్టం మాత్రం కౌలు రైతులదీ “ అనే విధంగా పరిస్థితి మారింది.

నిజానికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే చట్టాలన్నీ, ఈ గుర్తింపు కార్డు, కౌలు రైతులకు భూమిపై హక్కు కల్పించదు అని స్పష్టంగా ప్రకటించాయి. ప్రభుత్వం పదేపదే ఈ విషయాన్ని అసెంబ్లీ లోపలా, బయటా కూడా ప్రకటించింది. గత 70 ఏళ్లలో ఒక్క కౌలు రైతు కూడా, భూ యాజమానుల భూమి తనదే అని ప్రకటించి, కోర్టుకు వెళ్లలేదు. ఆక్రమించుకోలేదు. రైతు సంఘాలు కూడా ఈ విషయాన్ని రైతులకు నచ్చ చెప్పడానికి అనేక విధాలుగా ప్రకటించాయి. కానీ, భూ యజమానులు ఏ మాత్రం పట్టించుకోకుండా, తమ మొండి వాదనకే కట్టుబడి ఉంటున్నారు. వ్యవసాయం చేయకపోయినా, భూమి తనకే ఉండాలి, వ్యవసాయం చేయకపోయినా, ప్రభుత్వ సహాయం తమకే అందాలనే దురాశ తప్ప ఇందులో వేరే భయం ఏదీ కనిపించడం లేదు. అత్యంత నాగరిక సమాజంగా అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ గురించి, గొప్పగా చెబుతారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల విషయంలో భూ యాజమానులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అనైతికమైనది, అనాగరికమైనది.

ప్రస్తుత పరిస్థితిని లోతుగా పరిశీలించి, కొత్త రాష్ట్ర ప్రభుత్వమైనా, లక్షలాది మంది కౌలు రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రైతు ఆత్మహత్య కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. కౌలు రైతులకు భరోసా కల్పించడానికి యాత్ర కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి కొత్త క్యాబినెట్ లో ఈ అంశాలు చర్చించి, ఈ ఖరీఫ్ సీజన్ నుండే కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలి,

Read More
Next Story