‘జన్ పోషణ్’ షాపులను పేదల ‘సూపర్ బజార్’ గా మార్చడం ఎలా?
x

‘జన్ పోషణ్’ షాపులను పేదల ‘సూపర్ బజార్’ గా మార్చడం ఎలా?

ఈ కేంద్రాలలో ఏదో ఒక సరుకు అమ్మడం కాకుండా, రైతు, మహిళా సహకార సంఘాల ఉత్పత్తులను అమ్మడం ద్వారా, చాలా ప్రయోజనాలను సాధించవచ్చు.


భారత దేశంలో ఆహార భధ్రత చట్టం క్రింద ప్రతి నెలా బియ్యం, గోధుమలు లాంటి ఆహార ఉత్పత్తులను చవక ధరలకు పేద ప్రజలకు అందిస్తున్నవిషయం మనకు తెలుసు. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశ వ్యాపితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 5,37,627 రేషన్ షాపులు ఉన్నాయి.

ఈ రేషన్ షాపుల ద్వారా, ప్రజలకు, బియ్యం, గోధుమల లాంటివి రేషన్ కార్డులపై పంపిణీ చేస్తున్న డీలర్లకు కార్డుల సంఖ్య, పంపిణీ చేసిన బియ్యం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. అయితే రేషన్ కార్డులపై పంపిణీ చేసే సరుకులు క్రమంగా తగ్గిపోవడంతో, తమ ఆదాయలు పడి పోయాయని, కాబట్టి రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచాలని, లేదా నెలవారీ వేతనం అందించాలని చాలా కాలంగా రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.

రేషన్ డీలర్లకు ప్రభుత్వం అందించే కమిషన్ మాత్రమే కాకుండా , వారికి మరి కొంత ఆదాయం పెరిగేలా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. దేశ వ్యాపితంగా ఉన్న రేషన్ షాపులను క్రమంగా ‘జన్ పోషణ్’ కేంద్రాలుగా తీర్చిదిద్దాలనేది ఈ నిర్ణయం సారాంశం. రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులే కాకుండా, ఇతర పోషకాహార సరుకులను కూడా రేషన్ షాపులలో అందుబాటులో ఉండేలా చూస్తే, వినియోగ దారులకు ఉపయోగం, రేషన్ డీలర్ లకు మరింత ఆదాయం కల్పించవచ్చని కేంద్రం ఆలోచిస్తున్నది.

ఈ ఆలోచనలో భాగంగా గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ,ఉత్తర ప్రదేశ్ లలో పైలట్ గా 60 రేషన్ షాపులను ‘జన్ పోషణ్’ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రానికి 15 చొప్పున రేషన్ షాపులను ఎంపిక చేసింది. ఆయా రేషన్ షాపుల డీలర్ లకు దేశ రాజధాని ఢిల్లీలో 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. 2024 ఆగస్ట్ 20 నుండీ ఈ కేంద్రాలను ప్రారంభించింది.

ఈ కేంద్రాలలో రేషన్ సరుకులతో పాటు , పప్పులు,చిరు ధాన్యాలు, నూనెలు, లాంటి 50 శాతం ఆహార ఉత్పత్తులు, మరో 50 శాతం ప్రజలకు అవసరమైన ఇతర ఉత్పత్తులు అమ్మకానికి ఉంటాయి. మార్కెట్ ధరల కంటే, తక్కువ ధరలకు ఈ సరుకులను అమ్ముతామని రేషన్ డీలర్లు చెబుతున్నారు.

రేషన్ షాపుల ద్వారా ప్రజలకు చవక ధరలకు సరుకులు అందించడం మంచి నిర్ణయమే. అయితే ఈ నిర్ణయాన్ని అడ్డు పెట్టుకుని, రానున్న రోజుల్లో , రేషన్ షాపులు బడా రిటైల్ చైన్ ల ఉత్పత్తులు అమ్మి పెట్టే ఫ్రాంచైజ్ షాపులు గానో, లేదా కేవలం రేషన్ డీలర్ల లాభాపేక్ష కోసం నడిచే కిరాణా దుకాణాలుగానో మారిపోకూడదు.

ఈ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నడుస్తున్నవి కనుక, రాబోయే రోజుల్లో ప్రజలకు, ఉత్పత్తి దారులకు మరింత మేలు చేసే విధంగా రూపొందాలి.

తెలంగాణ రాష్ట్రంలో 17,332 రేషన్ షాపులు ఉన్నాయి. ఇవి మొత్తం 2,81,63,759 మందికి రేషన్ సరుకులు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆహార బధ్రత చట్టం క్రింద బియ్యం సేకరించి, భారత ఆహార సంస్థకు అప్పగిస్తున్నది. కొన్ని సందర్భాలలో నాఫెడ్ కోసం పప్పు ధాన్యాలు, జొన్నలు సేకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే, ఆహార బధ్రత చట్టం క్రింద చిరు ధాన్యాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా సహకరిస్తుంది.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలను, మిరప, పసుపు లాంటి సుగంధ ద్రవ్యాలను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నేరుగా రైతు సహకార సంఘాల నుండీ సేకరించవచ్చు. ఈ పంటల విస్తీర్ణం ఇప్పటికే బాగా పడిపోయింది. ప్రభుత్వం ఈ పంటలను రైతుల నుండీ కనీస మద్ధతు ధరలకు సేకరించడం మొదలు పెడితే, ఆ పంటల వైపు కూడా రైతులు ఉత్సాహం చూపించి పండిస్తారు. ఇప్పుడు ఈ పంటల కొరత తీవ్రంగా ఉండి , ఇతర రాష్ట్రాల నుండీ దిగుమతి చేసుకుంటున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం తాను సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులలో, కొన్ని ఉత్పత్తులను తానుగా , జన్ పోషణ్ కేంద్రాలకు సరఫరా చేయవచ్చు. రైతు బజార్ ల తరహాలో నేరుగా రిటైల్ దుకాణాలు నిర్వహించవచ్చు. రైతులకూ, వినియోగదారులకూ ఆర్ధిక ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమం ఆర్ధికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారం కాదు.

రాష్ట్రంలో సుమారు 900 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, మరో 800 వరకూ రైతు ఉత్పత్తి దారుల సంఘాలు , గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వందలాది మహిళా సమాఖ్యలు, వేలాది మహిళా సంఘాలు ఉన్నాయి. వేల సంఖ్యలో పాల సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వీటిని కొత్తగా ఏర్పడే జన్ పోషణ్ కేంద్రాలకు అనుసంధానించాలి. కేంద్రం పంపిణీ చేసే రేషన్ సరుకులు కాకుండా, ఈ కేంద్రాలలో అమ్మే మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులను, ఇతర సరుకులను స్థానిక సహకార సంఘాల నుండీ సరఫరా చేయాలి. ఈ మేరకు ఆయా సహకార సంఘాలకు, రేషన్ షాపులకు మధ్య వాణిజ్య ఒప్పందం జరగాలి.

ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సమన్వయంతో వ్యవహరించి ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళాలి. ఆయా ప్రాంతాలలో కొన్ని ఉత్పత్తులు లభ్యం కానప్పుడు, స్థానిక సహకార సంఘం వాటిని కూడా ఇతర సహకార సంఘాల నుండీ సేకరించి ఈ కేంద్రాలకు సరఫరా చేయాలి.

రేషన్ షాపులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి , స్థానిక సహకార సంఘాలకు, ఉత్పత్తిదారుల కంపెనీలకు అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లు సమకూర్చుకోవడానికి (ఆయిల్ మిల్లులు, పప్పులు, పిండి, కారం, రవ్వ మిల్లులు) తక్కువ వడ్డీలతో నాబార్డ్ రుణం అందించాలి. లేదా కేంద్రం కొంత గ్రాంట్, కొంత లోన్ గా అందిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుండి కూడా పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. ఈ రుణాలపై సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండీ నిధులు కేటాయించి వడ్డీ రాయితీ కల్పించవచ్చు. ఈ కేంద్రాలకు ఉండే స్థలం అందుబాటును బట్టి , అన్నీ రకాల పండ్లు, కూరగాయలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు. కోల్డ్ చైన్ నిర్మించి, పాలు లాంటి ఉత్పత్తులను కూడా అమ్మవచ్చు.

అలాగే మహిళా సహకార సంఘాలు , ఈ కేంద్రాలకు పచ్చళ్లు, పిండి వంటలు, బిస్కట్లు, సబ్బులు లాంటివి సరఫరా చేయవచ్చు. తేనె లాంటి అటవీ ఉత్పత్తులు కూడా అటవీ ప్రాంతాల సహకార సంఘాల నుండీ సేకరించి సరఫరా చేయవచ్చు.

ఈ కేంద్రాలకు సరఫరా చేయడానికి రైతు, మహిళా సహకార సంఘాలు మౌలిక వసతులను, ప్రాసెసింగ్ యూనిట్లను సమకూర్చుకుంటే క్రమంగా, అంగన్ వాడీ సెంటర్ లకు, మధ్యాహ్న భోజన పథకానికి, ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు ఆహారం అందించే క్యాంటీన్ లకు కూడా వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయగలుగుతాయి.

గత ప్రభుత్వ కాలంలో రైతు సమన్వయ కమిటీల ద్వారా , రిటైల్ షాపులు కూడా నిర్వహిస్తామని జీవో అయితే తీసుకు వచ్చారు, కానీ అమలు చేయలేదు. ఒకవైపు రాష్ట్రంలో గత ఐదు దశాబ్ధాలుగా పని చేస్తున్న రైతు సహకార సంఘాలు, ప్రస్తుతం ఏర్పడుతున్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, మహిళా స్వయం సహాయక బృందాలతో ఏర్పడిన గ్రామ మహిళా సహకార సంఘాలు ఆర్ధిక వనరుల కొరతతో, తాము పండించే, తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కొరతతో తగిన ఆదాయం లేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. మరోవైపు, బడా రిటైల్ చైన్లు చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తూ వినియోగదారుల మార్కెట్ ను అధిక ధరలతో కొల్లగొడుతున్నాయి.

ఒక వైపు రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, కనీస మద్ధతు ధరలు కూడా అందక నష్ట పోతుంటే, మరో వైపు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల భారంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ రెండు సమస్యలను పరిష్కరించుకోవడానికి , ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన జన్ పోషణ్ కేంద్రాలను వేదికగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఈ కేంద్రాలలో ఏదో ఒక సరుకులను అమ్మడం కాకుండా, రైతు,మహిళా సహకార సంఘాల ఉత్పత్తులను అమ్మడం ద్వారా, బహుళ ప్రయోజనాలను సాధించవచ్చని, రేషన్ షాపుల డీలర్లకు నచ్చ చెప్పడం తేలికే.

ఈ ప్రక్రియను ముందుకు తీసుకు పోవడానికి తక్షణం ప్రభుత్వ శాఖలు స్పందించకపోతే, రానున్న కాలంలో బడా కార్పొరేట్ రిటైల్ సంస్థలు, ఈ కేంద్రాలను ఆక్రమించుకుని, తమ మార్కెట్ ను విస్తరించుకుంటాయి. ఆ తరువాత వాటిని ఖాళీ చేయించడం అంత తేలిక కాదు .

Read More
Next Story