
రిపబ్లికన్ పార్టీ భవిష్యత్ ను ట్రంప్ పణంగా పెడుతున్నాడా?
మధ్యంతర ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తున్న ఇరాన్ పై దాడులకే సిద్ధమవుతున్న అధ్యక్షుడు
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఇరాన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి యుద్ధ వ్యూహాన్ని నిర్ణయించనున్నాయా? ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గుతారా? లేక ఫలితాలతో సంబంధం లేకుండా తన సైనిక చర్యలను కొనసాగిస్తారా? ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.
నవంబర్ 3న జరుగుతున్న మధ్యంతర ఎన్నికల ఫలితాలు పశ్చిమాసియా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ట్రంప్ విధానాలకు అడ్డుకట్ట వేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దేశీయ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలే ప్రధాన చర్చగా ఉంటాయి. కానీ ఈసారి ఇరాన్‌తో యుద్ధం ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారింది. ఇరాన్‌పై సైనిక దాడులను కొనసాగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని అమెరికన్లలో మెజారిటీ వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దాదాపు 60 శాతం మంది యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కథనం పేర్కొంది.
ఇరాన్ యుద్ధం.. అమెరికన్లపై ఆర్థిక భారం
ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించినప్పుడు ఈ యుద్ధాన్ని త్వరగా ముగిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ దాదాపు పది నెలలు గడుస్తున్నా సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై కూడా పడింది. గ్యాస్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎగబాకాయి. దీంతో ఇరాన్ యుద్ధం కేవలం విదేశాంగ విధానానికి సంబంధించిన అంశంగానే కాకుండా, అమెరికా ఓటర్ల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో రిపబ్లికన్లు సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ మెజారిటీ నిలబెట్టుకుంటే ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందా? ఒకవేళ రెండు సభల్లోనూ ఆధిపత్యం కోల్పోతే ఇరాన్‌పై దాడుల విషయంలో ఆయన వెనక్కి తగ్గుతారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
డెమోక్రాట్ల ఆధీనంలోకి కాంగ్రెస్ వెళ్తే ట్రంప్ నిర్ణయాలకు అడ్డంకులు ఎదురుకావచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడికి ఉన్న విస్తృత అధికారాలను కూడా విస్మరించలేం. సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడిగా ట్రంప్ ఒక సైనిక చర్యను పరిమిత యుద్ధంగా పేర్కొంటే, దానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి కాకపోవచ్చు. అంతేకాకుండా కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ వచ్చే ఏడాది జనవరిలోనే బాధ్యతలు చేపట్టనుంది. అప్పటివరకు ప్రస్తుత రిపబ్లికన్ మెజారిటీ కాంగ్రెస్ కొనసాగుతుంది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ట్రంప్ యుద్ధ నిర్ణయాలపై రాజకీయ ప్రభావం పడుతుందన్న గ్యారంటీ లేదు.
ఇజ్రాయెల్ రాజకీయాల ప్రభావం కూడా కీలకమే
మరోవైపు ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. మరోవైపు 19 స్థానాలు గెలుచుకున్న ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ అరబ్ కూటమి రాజకీయ సమీకరణాల్లో కీలకంగా మారింది.
నెతన్యాహుకు ప్రత్యర్థిగా ఉన్న గడి ఐసెన్‌కోట్ జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహును పదవి నుంచి తప్పించాలన్న ఒత్తిడి కూడా పెరుగుతోంది.
ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో ఐసెన్‌కోట్ వైఖరి నెతన్యాహుతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్లు కథనం విశ్లేషించింది. టెహ్రాన్ నుంచి ఇజ్రాయెల్‌కు స్పష్టమైన ముప్పు ఎదురైనప్పుడు మాత్రమే దాడులు చేయాలన్నది ఆయన అభిప్రాయంగా పేర్కొంది. అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది.
అయితే నెతన్యాహూ, ఐసెన్‌కోట్ ఇద్దరూ భావజాలపరంగా కుడిపక్ష నేతలుగానే పరిగణించబడుతున్నారు. గాజా, ఇరాన్ యుద్ధం, జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించిన అనేక అంశాల్లో వీరి అభిప్రాయాలు దగ్గరగా ఉన్నాయని విశ్లేషణ చెబుతోంది.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడులకు ముందు కూడా న్యాయవ్యవస్థను బలహీనపరిచే చట్టాల విషయంలో నెతన్యాహూ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అక్కడి కొత్త సమీకరణాలు ఇరాన్ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చూడాలి.
హర్ముజ్ జలసంధి.. ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు
ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరిచేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు ఖతార్, పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటే ప్రపంచ వాణిజ్యంపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది.
అయితే ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. హర్ముజ్ జలసంధిని తెరవడంతో పాటు శాశ్వత కాల్పుల విరమణ కూడా ఒప్పందంలో భాగం కావాలని ఇరాన్ కోరుతోంది. మరోవైపు మొదట జలసంధిని తెరిచి వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని, ఆ తర్వాత అణు కార్యక్రమం సహా ఇతర అంశాలపై చర్చలు జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
మరోసారి అమెరికా దాడులు జరిగే అవకాశాన్ని ఇరాన్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. గతంలో ఎదుర్కొన్న క్షిపణి దాడుల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, మూడో విడత దాడులు జరిగినా మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సైనికాధికారులు సంకేతాలిస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీలోనూ అసంతృప్తి
ఇదిలా ఉంటే, ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలన్న ట్రంప్ నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐయోవాకు చెందిన యాష్లే హిన్సన్, మిషిగన్‌కు చెందిన మైక్ రోజర్స్ వంటి రిపబ్లికన్ నేతలు బహిరంగంగానే యుద్ధ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరికొందరు నేతలు ట్రంప్ పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.
దీంతో ట్రంప్ ముందున్న రాజకీయ సవాళ్లు మరింత పెరిగాయి. ఎన్నికల్లో రిపబ్లికన్లు మంచి ఫలితాలు సాధిస్తే ఇరాన్‌పై తన వైఖరిని కొనసాగించే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే యుద్ధం నుంచి వెనక్కి తగ్గి రాజకీయ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.
ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినా, ఆయన తీసుకునే నిర్ణయాలు రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. అందువల్ల మధ్యంతర ఎన్నికల ఫలితాలే కాకుండా, ఇరాన్‌తో దౌత్య చర్చలు, ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పరిణామాలు కూడా కీలకం కానున్నాయి.
మొత్తంగా ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగాలా? లేక దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలా? అన్న విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమెరికా రాజకీయాలతో పాటు పశ్చిమాసియా భద్రత, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం చూపనుంది.
