కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనా తీరు మెరుగైందా..?
x

కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనా తీరు మెరుగైందా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలి ఏడాది పాలనపై కన్నెగంటి రవి విశ్లేషణ

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల ముందు భీకర ప్రకటనలు చేస్తుంటాయి. అప్పటి వరకూ సాగిన అధికార పక్ష పాలనను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చీల్చి చెండాడుతాయి . అన్ని పార్టీలూ ఎన్నికల మానిఫెస్టో పేరుతో రాష్ట్ర బడ్జెట్ ను మించి, లక్షల కోట్ల విలువైన వాగ్ధానాలను వరదలా పారిస్తాయి. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా, అధికారం చేపట్టడమే పరమావధిగా భావిస్తాయి.

ఎన్నికలు పూర్తయి, మొత్తం స్థానాలలో సగం కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన ఏదో ఒక రాజకీయ పార్టీ, కూటమి అధికారం, చేపడుతుంది. అధికారం చేపట్టడానికి అవసరమైన తగినన్ని స్థానాలు స్వంతంగా సాధించ లేకపోతే , కూటమిగా పని చేసిన మిత్ర పార్టీల సహకారం తీసుకోవడం, లేదా, ఇతర పార్టీల నుండీ గెలిచిన వారిని ప్రలోభ పెట్టి, తమ పార్టీలో చేర్చుకోవడం చాలా సాధారణ వ్యవహారంగా మారిపోయింది. తెలంగాణ కూడా ఈ పరిణామాలకు మినహాయింపుగా లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక, 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్ / BRS పార్టీ స్వంతంగా అధికారం చేపట్టడానికి అవసరమైన స్థానాలను గెలుపొందినా, తెలుగుదేశం, కాంగ్రెస్ , సిపిఐ , బిఎస్పి పార్టీల నుండీ గెలుపొందిన అభ్యర్ధులను, ప్రలోభ పెట్టి చాలా అనైతికంగా తన పార్టీలో చేర్చుకుంది. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఇవన్నీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకమైనా, ప్రతిపక్షాన్ని బలహీనపరచడం, తద్వారా తన పార్టీని రాజకీయంగా, నిర్మాణ పరంగా బలపరచుకోవడం కోసం ఆ పనులను నిస్సిగ్గుగా చేసింది.

నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా, సాధారణ మెజారిటీ కంటే కొన్ని స్థానాలు మాత్రమే అదనంగా వచ్చాయి. మిత్ర కూటమిలో ఉన్న సిపిఐ పార్టీ ఒక స్థానాన్ని గెలుపొందింది. మరో వైపు BRS, బిజేపి, MIM పార్టీలు కూడా తగినన్ని స్థానాలు గెలుపొంది, బలమైన ప్రతిపక్షంగా ముందుకు వచ్చాయి.

పైగా BRS, బిజేపి పార్టీలు తమ ఓటమిని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ గెలుపును స్వాగతించలేక, ఫలితాలు వెలువడిన తొలి రోజుల నుండీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవడానికి, ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ ప్రయత్నాలు తాము చేశాయి, పైగా ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని, పదే పదే బహిరంగం గానే ప్రకటించాయి. ఎన్నికలలో గెలుపొందిన వారిలో ఏ విలువలకూ కట్టు బడని అవకాశవాద రాజకీయ నాయకులే ఎక్కువ ఉండడంతో, ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రేవంత్ సర్కార్, కూడా తనదైన మైండ్ గేమ్ ప్రారంభించి, ప్రతిపక్షంలో గెలిచిన వారిని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్దమని ప్రకటించింది. పార్టీ ఫిరాయింపులను బహిరంగంగానే ప్రోత్సహించింది. కొద్ది మంది ప్రతిపక్ష శాసనసభ్యులకు అధికార పార్టీ కండువాలు కూడా కప్పింది.

మొత్తం మీద రాష్ట్రంలో అధికార పార్టీ సాపేక్షికంగా స్థిరపడింది. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్ట పరంగా, రాజకీయ, నైతిక ప్రమాణాల పరంగా, ఇవాళ మనం ఎన్నయినా చర్చలు సాగించవచ్చు కానీ, అధికారం చేపట్టిన తొలి రోజుల్లో రేవంత్ ప్రభుత్వం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తుంటే, మెజారిటీ పౌర సమాజం వ్యతిరేకించకుండా మౌనంగా ఉండి పోయిందన్నది వాస్తవం. గత పదేళ్ళ BRS, బీజేపీ పార్టీల వ్యవహార శైలి, అనైతిక పోకడలు, నిరంకుశ, ఫాసిస్టు పాలనలు చూసిన పౌర సమాజం, రాష్ట్రంలో అధికార మార్పు కోసం తనదైన కృషి చేసిన పౌర సమాజం – తక్కువ మెజారిటీ తో అధికారం చేపట్టీన కాంగ్రెస్ పార్టీ, తన అధికారాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా, ఈ ఫిరాయింపులను చూసింది. ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యానికి చిహ్నంగా ఈ ఫిరాయింపు రాజకీయాలను అర్థం చేసుకుని ఇప్పుడు వ్యాఖ్యానించగలం తప్ప, పౌర సమాజం తన నైతిక ప్రమాణాల కోణం నుండీ వీటిని వ్యాఖ్యానించే పరిస్థితి ఆనాడు లేదు. అది పౌర సమాజ బలమా ? బలహీనతా ? అనేది చాలా చర్చ సాగాలి.

అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు సంవత్సర కాలం గడిచాక ఒక మౌలిక ప్రశ్న ఇప్పుడు వేసుకోవచ్చు. పాలనా పరంగా స్థిర పరుచుకున్న అధికారాన్ని, ఈ ప్రభుత్వం ఎందు కోసం ఉపయోగిస్తుంది ? ఒక రాజకీయ పార్టీగా రాజకీయ స్థిరత్వం సాధించిన పార్టీ, సమాజంలో మౌలిక సమస్యల పరిష్కారానికి , చిత్తశుద్ధి , సాహసంతో కూడిన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దంగా ఉందా ? అనేది కూడా మనం బేరీజు వేయవచ్చు . అలాంటి రాజకీయ చిత్తశుద్ధి, నిజాయితీ, ధైర్యం చూపించకుండా , సాధారణ మూస పద్ధతిలో, ఇప్పటి వరకూ కొనసాగిన అభివృద్ధి నమూనానే ముందుకు తీసుకు వెళుతుంటే స్థిరత్వం సాధించిన పాలన వల్ల ప్రజలకు పెద్దగా మేలు జరగదు.

సమాజాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్న చట్టాలను అమలు చేయడానికి, కొత్త చట్టాలు చేయడానికి , పథకాల అమలు మార్గదర్శకాలలో లోప భూయిష్టంగా ఉన్న వాటికి అవసరమైన మార్పులు చేయడానికి, ప్రభుత్వ పథకాల అమలు తీరును అత్యంత పారదర్శకంగా మార్చేందుకు అవసరమైన వేదికలను నిర్మించడానికి, ప్రభుత్వ గణాంకాలలో లోపాలు సవరించి, సరైన లెక్కలు మాత్రమే ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వానికయినా , అధికార పార్టీ కయినా సాహసం కావాలి.

అధికారం ఉంది కదా అని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, మొత్తంగా పౌర సమాజాన్ని ఆయా సందర్భాలలో విధాన పరమైన చర్చలలో భాగస్వాములను చేసే తెగింపు కావాలి. ఈ సమావేశాలలో వచ్చే సూచనలను సీరియస్ గా తీసుకునే నిజాయితీ కూడా ఉండాలి. BRS, బీజేపీ లాంటి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసే రాజకీయ ప్రేరేపిత, కువిమర్శలకు ఎక్కువ విలువ ఇవ్వనవసరం లేదు కానీ, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, ఆయా రంగాలలో విషయ నిపుణులు, ప్రజా పక్ష ఆర్ధిక వేత్తలు, పర్యావరణవేత్తలు చేసే సూచనలను, విమర్శలను లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ప్రారంభ దశలో వివిధ రంగాలపై ఆ పని ఒక మేరకు జరిగినట్లు కనపడినా, క్రమంగా ఆ ధోరణి తగ్గి పోతున్నది.

ప్రజలు, తమ స్వంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి, హైదరాబాద్ లో ప్రజావాణి పేరుతో వారానికి రెండు రోజులు ఒక నిరంతర ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, ప్రతి సోమవారం అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాలలో ప్రజల నుండీ దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. వ్యక్తులకు సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నప్పటికీ, దరఖాస్తులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ సరైన రశీదు ఇవ్వకపోవడం ( ఫోన్ కు మెసేజ్ రావడం తప్ప ) , తమ దరఖాస్తు ఏ కార్యాలయంలో , ఏ అధికారి ధగ్గర, ఏ స్థాయిలో నిలిచిపోయిందో, ఎందుకు తమ సమస్య పరిష్కారం కావడం లేదో, సమస్య పరిష్కారానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో , అసలు సమస్య పరిష్కారం అవుతుందో లేదో, తమ దరఖాస్తు ఎందుకు తిరస్కరణకు గురైందో, , ఒక వేళ తిరస్కరణకు గురైతే, ఎవరికి అప్పీల్ చేసుకోవాలో – ప్రజలకు ఇప్పటికీ స్పష్టత లేదు. చాలా మంది మండల కార్యాలయం నుండీ , రాష్ట్ర ప్రజావాణి వరకూ పదే పదే తిరుగుతూ ఉండడం ఈ పరిస్థితికి చిహ్నంగా ఉంది. సంవత్సర పాలన ముగించుకుని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ లోపాలను పరిమితులను అధిగమించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.

ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజావాణి ప్రక్రియను మెరుగు పరచడానికి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆయా శాఖల సమాచారం ప్రజల ముందుకు తెచ్చి, సమస్యల పరిష్కారానికి ఆ సమాచారాన్ని ప్రజలు సులువుగా పొందేలా చేయడానికి పౌర సమాజ ప్రతినిధులు అనేక మంది గత సంవత్సర కాలంగా ప్రభుత్వ అధికారులతో చర్చిస్తూ, పని చేస్తూ వస్తున్నారు. ప్రజా వాణి నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి జీవోను ప్రభుత్వం వెలువరించేలా చేయడం కోసం, గ్రామ స్థాయిలో క్రింది స్థాయి సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా వాణి ప్రక్రియను పైలట్ గా నిర్వహించడానికి కూడా పౌర సమాజ బృందం నిజాయితీగా కృషి చేస్తున్నది. ఇది బయటకు కనిపించే రాజకీయ ప్రక్రియగా ఉండదు కానీ, విలువైన పని సాగుతున్నది. ఫలితాలు బయట సమాజానికి కనిపించడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. బ్యూరోక్రసీ పని తీరు పట్ల, ఆయా శాఖలలో ప్రభుత్వ సిబ్బంది అవినీతి పట్ల అవగాహన ఉన్న వారికి ఇది ఎంత శ్రమతో కూడుకున్న పనో తేలికగా అర్థమవుతుంది.

గత ప్రభుత్వ పదేళ్ళ పాలనతో పోల్చినప్పుడు, కొన్ని సమయాలలో ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలసి మెమోరాండం ఇవ్వడం, ఆయా శాఖల మంత్రులను కలసి కొన్ని విషయాలు చర్చించగలగడం, రాష్ట్ర సెక్రటేరియట్ కు నిర్ధిష్ట సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా వెళ్లగలగడం ప్రజల కోణంలో తప్పకుండా సానుకూల అంశాలు.

అయితే, ఇప్పటికీ, ప్రజల ఉమ్మడి సమస్యలపై, విధానపరమైన అంశాలపై ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో చర్చలు నిర్వహించడానికి ఒక శాశ్వత యంత్రాంగం, విధానం ఏర్పడలేదు. ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట కాల పరిమితి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినా, క్యాబినెట్ లో తీర్మానం చేసినా, ఉన్నత స్థాయి అధికార బృందం చట్టబద్ధం గానే వేగంగా చర్యలు తీసుకోవడం కానీ, అవసరమైన జీవో లు వెలువరించడం కానీ జరగడం లేదని విమర్శలు ఉన్నాయి.

ప్రజాపక్షపాతులుగా, పౌర సమాజ ప్రతినిధులుగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు తమ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికీ , మంత్రుల దృష్టికీ, అధికారుల దృష్టికీ నిరంతరం తీసుకు వెళుతున్నా, వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిన మంత్రులు, అధికారుల పని తీరు చాలా నిరుత్సాహకరంగా ఉందని ఆరోపణలున్నాయి.

అభయ హస్తం మానిఫెస్టో పేరుతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో లో మొదటి చాప్టర్ లోనే , సుపరిపాలన అంశం క్రింద తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తాం అని ప్రకటించారు. ఈ ప్రజాస్వామిక పాలనను అందించడంలో వ్యక్తమవుతున్న ఒడిదుడుకులను నేను నా మొదటి భాగం విశ్లేషణలో ప్రస్తావించాను. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ “ ప్రజా దర్భార్ “ నిర్వహిస్తాం అని హామీ ఇచ్చారు.

రోజూ ముఖ్యమంత్రి గారిని కలిసే వారిలో అనేక మంది ఉండవచ్చు కానీ, అందులో సాధారణ ప్రజలెంతమంది ? ప్రజాసంఘాల ప్రతినిధులు ఎంతమంది ? ప్రజాపక్ష రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎంత మంది ? కార్పొరేట్ ప్రతినిధులు, కాంట్రాక్టర్ లు ఎంతమంది అనేది , ముఖ్యమంత్రి గారి కార్యాలయం రెగ్యులర్ గా బయటకు ప్రకటించే మెకానిజం ఉంటే కానీ, ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం లేదు.

గత సంవత్సర కాలంగా అనేక సార్లు ముఖ్యమంత్రి గారి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేసినా తెలంగాణ మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీకి అపాయింట్ మెంట్ దొరకలేదని సీనియర్ సామాజిక కార్యకర్త వి. సంధ్య లాంటి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారంటే, అనేక ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే “ప్రతి రోజూ ప్రజా దర్బార్” హామీ ఎలా అపహాస్యానికి గురైందో తెలుస్తుంది.

MLA లు తమ నియోజక వర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, ప్రజా దర్బార్ లు నిర్వహిస్తారు అనేది కూడా మరో హామీ.కానీ రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ శాసన సభ్యులు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని తీవ్ర విమర్శలున్నాయి. ఉదాహరణకు నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినప్పుడు , అప్పటి BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో కలసి మాట్లాడిన, పోరాటానికి సంఘీభావం తెలిపిన, ఈ కారణంగా BRS ను ఓడించి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలిచి ప్రయోజనం పొందిన ఆ ప్రాంత ప్రస్తుత శాసనసభ్యులు , ప్రస్తుతం కాలుష్య కారక పరిశ్రమపై నోరెత్తడం లేదు. తాము కలిసి మాట్లాడతామని కోరినా ప్రజా సంఘాలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. ప్రజలు చైతన్యవంతంగా పోరాడిన చోటే పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన నియోజక వర్గాలలో MLA లు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

“పౌరసేవల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్ ను ఏర్పాటు చేసి, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం” అనేది కూడా అభయ హస్తం మానిఫెస్టో ఇచ్చిన మరో హామీ. సంవత్సర కాలం గడిచినా ఇంత వరకూ పౌర సేవల చట్టం రాకపోగా, దాని గురించిన చర్చ కూడా ప్రారంభం కాలేదు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు పోర్టల్ తయారు కాలేదు. మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా, ప్రజా ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి రాలేదు. అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఆ వైపు చర్చ కూడా జరిగినట్లు లేదు. వాలంటరీ వ్యవస్థకు విధి విధానాలు కూడా తయారు కాలేదు. గ్రామ స్థాయిలో ఆదర్శ రైతు వ్యవస్థను ఏర్పాటు చేస్తామనే హామీ కూడా ఇచ్చారు.

కానీ గ్రామీణ వాలంటీర్లు, ఆదర్శ రైతులు లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేటప్పుడు, ఈ వ్యవస్థలన్నీ చట్ట పరంగా ఏర్పడి ఉండాలి. నియామక నియమాలు స్పష్టంగా, పార దర్శకంగా ఉండాలి. వారి పని తీరుకు జవాబు దారీ తనం ఉండాలి. రాజకీయ విమర్శలకు తావిచ్చే విధంగా ఉండకూడదు. లేకపోతే, ఇవన్నీ ఒకప్పుడు చంద్రబాబు పాలనలో ఏర్పాటు చేసిన జన్మ భూమి కమిటీలుగా, BRS ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులుగా మారిపోతాయి. వీటివల్ల ప్రజలకు ఒరిగే మేలేమీ ఉండదు.

రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లో పౌర సమాజ బృందంతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ , విద్యా రంగాలకు ప్రత్యేక కమిషన్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొంత ఆలస్యంగా అయినా కమిషన్ లు ఏర్పాటు చేస్తూ జీవో లు విడుదల చేశారు. విద్యా కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారిని ఛైర్మన్ గా నియమిస్తూ జీవో ఇచ్చారు. మరి కొంత కాలానికి మరో ముగ్గురిని కమిషన్ సభ్యులుగా నియమిస్తూ మరో జీవో జారీ చేశారు. విద్యా రంగంలో అపార అనుభవజ్ఞులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పి. ఎల్. విశ్వేశ్వరరావు గారు ఈ ముగ్గురులో ఒకరు.

కాగా, మరో ఇద్దరిని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ నియామకంగా చేశారు. తెలంగాణ విద్యా రంగంలో అనేక మంది అనుభవజ్ఞులు , విద్యా వంతులు ఉండగా ఇలా రాజకీయ నియామకాలు చేపట్టడం వల్ల ఆ కమిషన్ స్థాయిని తగ్గించినట్లు అయింది. కమిషన్ కు కార్యాలయం ఏర్పడినా , ఇంకా పూర్తి స్థాయిలో ఆర్ధిక వనరులు కమిషన్ కు సమకూరినట్లు లేవు. కమిషన్ సభ్యులు, పని ప్రణాళిక చేసుకుని విద్యా రంగంలో తమ పనిని ప్రారంభించి క్షేత్ర స్థాయికి వెళుతున్నారు. అయితే ఒక్కోసారి, విద్యా రంగంలో ప్రభుత్వ పని తీరు విద్యా కమిషన్ ఉనికిని పూర్తి స్థాయిలో గుర్తించకుండా పక్కన పెట్టినట్లుగా ఉంటున్నది.

తెలంగాణ విద్యా రంగంలో ప్రభుత్వం ఏదైనా విధానాలు ప్రకటించాలన్నా, కార్యక్రమాలు, పథకాలు అమలు చేయాలన్నా, ముందుగా కమిషన్ ముందు చర్చకు పెడితే, కమిషన్ అందరితో చర్చించి, అభిప్రాయాలు తీసుకుని, తమ అభిప్రాయాలు కూడా క్రోడీకరించి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికపై ఆధారపడి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటే, ఎక్కువమందికి ఆమోదయోగ్యంగా ఉండవచ్చు. పని ప్రణాళిక కూడా సమగ్రంగా తయారవుతుంది. ఫలితాలు కూడా బాగుంటాయి. అలా కాకుండా, కమిషన్ తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారే ( ఆయనే విద్యా శాఖా మంత్రి కూడా) స్వయంగా విధాన నిర్ణయాలు ప్రకటించడం విద్యా కమిషన్ గౌరవానికి, ఉనికికి భంగం కలిగించడమే.

ఉదాహరణకు మొత్తం విద్యా రంగ ప్రక్షాళన కోసం రాష్ట్ర పౌర సమాజ ప్రతినిధులు, విద్యావంతులు , ముఖ్యమంత్రి గారితో సమావేశంలో అనేక సూచనలు చేశారు. వాటన్నిటినీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, విద్యా రంగ ప్రక్షాళనకు రోడ్ మ్యాప్ ప్రకటించకుండా, ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమీకృత విద్యాలయాల నిర్మాణం పేరుతో ఒక విధానం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి నివాస ప్రాంతంలోనూ తప్పకుండా ప్రభుత్వ స్కూల్ నడుపుతామని, లేని చోట కొత్తవి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చేసిన ప్రకటనకు ఈ సమీకృత విద్యాలయాల ప్రకటన భిన్నమైనది. అలాగే స్కూల్స్ లో మధ్యాహ్న భోజన సరఫరా బాధ్యతను ఇప్పుడున్న పద్ధతి నుండీ మార్చి సెంట్రల్ కిచెన్ లకు అప్ప చెబుతామని ప్రకటించడం, ఈ మేరకు ముఖ్యమంత్రి గారి స్వంత నియోజక వర్గం కొడంగల్ లో అక్షయ పాత్ర ఫౌండేషన్ కు పైలట్ ప్రాజెక్టు అప్ప చెప్పడం, విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్ యాజమాన్య కమిటీ లు ఏర్పాటు చేయకుండా, స్కూల్స్ లో మౌలిక వసతుల కల్పన బాధ్యతలను, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో కూడిన అమ్మ ఆదర్శ స్కూల్ కమిటీలను ఏర్పాటు చేసి అప్పగించడం, ప్రస్తుతం ఉన్న ఉన్నత విద్యా సంస్థలను బాగు చేయడానికి తగిన చర్యలు తీసుకోకుండా, నిధుల కేటాయింపు చేయకుండా, ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ పై దృష్టి కేంద్రీకరించి, పిపిపి మోడల్ లో ముందుకు వెళ్ళడం – ఇవన్నీ ప్రభుత్వం వైపు నుండీ దొర్లిన తొందరపాటు నిర్ణయాలే.

విద్యా కమిషన్ కు పూర్తి మానవ వనరుల సామర్ధ్యం, వసతులు కల్పించి, ఆ కమిషన్ ను పని చేయించకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇలా విద్యా రంగంలో విధాన నిర్ణయాలు ప్రకటిస్తే, ఆ కమిషన్ సభ్యులకు కూడా ఇబ్బంది గానే ఉంటుంది. కమిషన్ నుండీ ఆశించిన ఫలితాలు కూడా రావు. అందుకే కొత్త సంవత్సరంలో అయినా, విద్యా కమిషన్ పని తీరును బలోపేతం చేసేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలని మనం కోరుకోవాలి.

రాష్ట్రంలో రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని అభయ హస్తం మానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని పదే పదే ప్రకటించారు. కానీ కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం తీసుకున్నారు. ఈ కమిషన్ కు కూడా మొదట ఛైర్మన్ ను ప్రకటించారు. ఆ తరువాత కొంత కాలానికి మరో ఆరుగురు సభ్యులను ప్రకటించారు. కమిషన్ ఏర్పాటు జీవో లో చెప్పినట్లుగా , ఇంకా ఇప్పటికీ, కమిషన్ కు పూర్తి స్థాయిలో మానవ వనరుల కేటాయింపు జరగలేదు.

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. కోదండ రెడ్డి గారిని కమిషన్ ఛైర్మన్ గా ప్రకటించడం మంచి విషయం. ఆయన అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గత పదేళ్లకు పైగా అన్ని రైతు సంఘాలను కలుపుకుని రాష్ట రైతాంగ సమస్యలపై స్పందించి పని చేసిన అనుభవం ఉంది. భూ చట్టాల నిపుణులు ఎం. సునీల్ కుమార్ ను కూడా మరో కమిషన్ సభ్యులుగా నియమించినప్పటికీ, మిగిలిన ఐదుగురు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుండీ రాజకీయ నియామకంగా కమిషన్ సభ్యులుగా వచ్చారు. చట్టబద్ధ అధికారాలతో కమిషన్ ఏర్పాటు అనే హామీని పక్కన బెట్టి , కేవలం జీవో ద్వారా కమిషన్ ఏర్పాటు చేయడమే ఒక వెనకడుగు అయితే, ఈ కమిషన్ లో రాజకీయ నియామకాలు చేపట్టడం సరైంది కాదు. కమిషన్ స్థాయిని ఆ మేరకు తగ్గించినట్లుగానే భావించాలి. వ్యక్తిగతంగా కమిషన్ సభ్యులను తప్పు పట్టేదేమీ లేదు కానీ, వాళ్ళు తమ పార్టీ కోసం కాకుండా, పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించి పని చేయగలుగుతారా, ఆ మేరకు కమిషన్ ఛైర్మన్ కు బలాన్ని ఇవ్వగలుగుతారా అనేది ప్రశ్న . ఈ మేరకు కమిషన్ మొదటి సమావేశం లోనే రైతు స్వరాజ్య వేదిక సహా, ఇతర రైతు సంఘాలు అనేక సూచనలు చేశాయి.

TPJAC విజ్ఞప్తి మేరకు కమిషన్ రెండవ సమావేశం ఇథనాల్ పరిశ్రమ-- పర్యావరణం పై ప్రత్యేకంగా నిర్వహించారు.రైతులను , కంపనీల ప్రతినిధులను, అధికారులను, ప్రజా సంఘాలను పిలిచి అభిప్రాయాలు సేకరించారు. క్షేత్ర స్థాయి పర్యటన కూడా చేసి నివేదిక ఇస్తామని కమిషన్ ఛైర్మన్ ప్రకటించారు. కమిషన్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఇదే చొరవను ప్రదర్శిస్తే , ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇస్తే, మంచి ఫలితాలు ఉంటాయి. అయితే, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు , కాంగ్రెస్ పార్టీ మీటింగులకు దూరంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పత్రికా విలేఖరుల సమావేశాలు పెట్టకుండా స్వతంత్రంగా వ్యవహరించడం, కమిషన్ కు మరింత బలాన్ని, నైతికతను ఇస్తుంది.

రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ సమస్య తలెత్తినా, రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ స్వతంత్రంగా కదిలి పని చేస్తే, రైతులకు, గ్రామీణ ప్రజలకు ఎంత ఉపయోగమో, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే ఉపయోగం.

ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి , మంత్రులు , అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, అన్ని స్థాయిల అధికార గణం. అందరూ, వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎలా పని చేస్తున్నారు అన్నది ప్రభుత్వ పని తీరుకు నిదర్శనంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ లను ఎంత స్వతంత్రంగా పని చేయనిస్తున్నారు అనేది, ప్రభుత్వ ప్రజాస్వామిక స్వభావానికి నిదర్శనంగా ఉంటుంది. ఈ విషయంలో గత సంవత్సర కాలంలో ఏం జరిగిందో చూడడానికి నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు కొంత వెలుతురు ప్రసరిస్తాయని ఆశిస్తున్నాను. ఇంకా లోతైన పరిశీలనలు చేయాల్సి ఉంది.

Read More
Next Story