ఆంధ్రాలో బీసీ ఉద్యమం కలేనా? ఆ రెండు కులాలే దిక్కా?
x
బీసీ ఉద్యమాలకు సంబంధించిన ప్రతికాత్మక చిత్రం

ఆంధ్రాలో బీసీ ఉద్యమం కలేనా? ఆ రెండు కులాలే దిక్కా?

139 దాకా బీసీ కులాలు ఉన్నా పట్టుమని 10 కులాలకు కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం దక్కలేదు. కానీ రెడ్ల నుంచి 658 మంది, కమ్మ నుంచి 549 మంది ప్రాతినిధ్యం వహించారు. ఎలా?


ఆంధ్రప్రదేశ్ లో తక్కువ జనాభా వున్న అగ్ర కులాలే రాజ్యధికారాన్ని అనుభవిస్తున్నాయి. అధిక జనాభా వున్న వెనుకబడిన వర్గాలకి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి రాజ్యాధికారం దక్కడం లేదంటూ ఒక పార్టీ నేత ఒక నివేదికను మీడియా ముందు పెట్టారు. అందరికీ తెలిసిన పాత లెక్కల్నే- బయటకు రాని నివేదిక- అంటూ కులాల వారీగా ఎమ్మెల్యేల సంఖ్యను విడుదల చేశారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టారు. బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు వెల్లడించిన వివరాలు అన్నీ కరెక్టే కానీ ఏపీలో బీసీ ఉద్యమం వచ్చే పరిస్థితి లేదు. మరో 50 ఏళ్లయినా ఏపీలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో వున్న సామాజిక పరిస్థితులకు , ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో వున్న పరిస్థితులకూ స్పష్టమైన తేడా ఉంది. రాష్ట్రం విడిపోయినా ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి రాజకీయ పరిణామాలు కనిపిస్తుండగా, తెలంగాణలో కులాల కుంపట్లు లేని రాజకీయాలు నడుస్తూ వచ్చాయి. అయితే తెలంగాణ లో జీవన పరిస్థితులు ,సంస్కృతి కారణంగా రాజకీయాలలోనూ వెనుకబడిన కులాల చైతన్యం కనిపిస్తోంది. అది భవిష్యత్ లో బీసీ ఉద్యమానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇది పూర్తి భిన్నంగా వుంది. బ్రిటిష్ హయాంలో జరిగిన ఎన్నికలను గమనించినా ఆంధ్రాలో కుల రాజకీయాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో కులాల ప్రత్యక్ష పెత్తనాలు లేవు. కొన్ని కులాలు బ్రాహ్మణ, వెలమ, రెడ్డి పరోక్షంగా అధికారం తమదే అనుకున్నా, వారి ఆధిపత్యం ముస్లిం నవాబులకు లోబడి ఉండేది.
కులాల వారి ఎమ్మెల్యేల లెక్కలేంటి?
ఆంధ్రలో పరిస్థితి విభిన్నం. ఎన్నికల రాజకీయాలు తొలినాళ్ళ నుంచి బలంగా ఉండేవి. కులాల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది. కులంతో పాటు ఆర్ధికంగా బలంగా వున్న సామాజిక వర్గం రాజకీయాలను శాసిస్తూ వస్తోంది. ఇప్పుడు బీఎస్పీ నేత తాను నివేదిక బయటపెడుతున్నాను. ఏదో కుల కంపం వచ్చేస్తుందంటే పొరబాటే. అసలు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే...
రాజ్యాధికారం విషయంలో వెనుక బడిన కులాలకు తీవ్ర అన్యాయం అంటూ బీఎస్పీ నేత లెక్కల చిట్టా విప్పారు. కులాల వారి జనాభా లెక్కలు అధికారికంగా లెక్కించి ప్రకటించకున్నా వైఎస్సార్ సీపీ హయాంలో ఈ నివేదిక రూపుదిద్దుకుందని జగన్ బయటపెట్టలేదన్నారు.
మొదటి నుంచి రాజ్యాధికారం తక్కువ జనాభా వున్న కమ్మ, రెడ్ల చేతిలోనే వుందని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కులాల వారీగా ఎన్నికైన ఎమ్మల్యేల లెక్కలు చూస్తే అత్యధిక సంఖ్యలో రెడ్డి కులం నుంచి 658 మంది, కమ్మ కులం నుంచి 549 మంది ఎన్నికయ్యారు.
తర్వాత స్ధానంలో కాపు కులస్తులు 314 మంది ఎమ్మెల్యేలయ్యారు. జనాభా పరంగా చూస్తే రెడ్లు 20 లక్షల 84 వేల 416 ఉండగా ఆ కులం నుంచి ఏకంగా 658 మంది ఎమ్మెల్యేలు గా ఎన్నికయ్యారు. 14 లక్షల32వేల 725 గా వున్న కమ్మ వర్గం నుంచి 549 మంది ఎమ్మెల్యేలు , కాపుల జనాభా 41లక్షల 73 వేల 211 వుంటే ఆ వర్గం నుంచి 314 మందే ఎమ్మెల్యేలు గా ఎన్నికయ్యారు.
ఇక తూర్పు కాపుల జనాభా 16 లక్షల పైగా వుంటే వారి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు కేవలం80 మందే వున్నారు. అదే ఏకంగా విడివిడిగా కమ్మ, రెడ్ల కంటే ఎక్కువగా 24 లక్షల జనాభా వున్న ముస్లిం షేక్ ల నుంచి 54 మంది, 10 లక్ష వరకూ వున్న గౌడ ల నుండి 50 మంది , 26 లక్షల జనాభా వున్న యాదవుల నుంచి 46 మంది, 8 లక్షలుగా వున్న పద్మశాలీల నుంచి 21 మంది , శెట్టి బలిజలు 5 లక్షల జనాభా వుంటే 18 మంది ఎమ్మెల్యేలు అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.
13 లక్షల జనాభా వున్న వాల్మీకి బోయ వర్గం నుంచి 17 మంది, 12 లక్షల జనాభా వరకూ వున్న రజక కులస్తుల నుంచి ఒక్కరు ఎమ్మెల్యే అయ్యారు. వడ్డెర్లు 10 లక్షల జనాభా వుంటే వారికి అసెంబ్లీలో ఇంత వరకు ప్రాతినిధ్యం లభించలేదు. 7.5 లక్షలకు పైగా వున్న వైశ్యులు, 3లక్షల 63 వేల వరకూ వున్న బ్రాహ్మణ జనాభాకు అసెంబ్లీలో తక్కువ ప్రాధాన్యతే లభించింది. ఈ రెండు కులాలు అగ్ర కులాలే కాబట్టి ఎవరూ పట్టించుకోవడంలేదు.
స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి లెక్కలు
వర్గం జనాభా ఎమ్మెల్యేలు
..............................................................................
రెడ్లు. 20లక్షలు. 658
కమ్మ. 14 లక్షలు 549
కాపులు. 40 లక్షలు. 314
తూర్పు కాపు. 16 లక్షలు. 80
ముస్లిం షేక్. 24 లక్షలు. 54
గౌడ. 10 లక్షలు. 50
యాదవ. 26 లక్షలు. 46
పద్మశాలి. 8 లక్షలు. 21
శెట్టిబలిజ. 5 లక్షలు. 18
వాల్మీకి బోయి. 13లక్షలు. 17
రజక. 12లక్షలు. 1
వడ్డెర. 10 లక్షలు. ౦

............
ఏపీలో వాస్తవ పరిస్థితులు ఏంటి?
ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త MN శ్రీనివాస్ విశ్లేషించినట్లు "ఆధిపత్య కులం" అనే భావన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్య కులాలుగా రెడ్లు, కమ్మలను ఆయన ప్రస్తావించారు. భూమి యాజమాన్యం, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రభావం సామాజిక స్థితి ద్వారా ఈ రెండు కులాలు గణనీయమైన శక్తిని కలిగి ఉన్నాయి. వారి సామాజిక స్థితిని మరింత మెరుగుపరచు కోవడానికి ఆర్థిక బలాన్ని ఉపయోగిస్తారని అభిప్రాయపడ్డారు. అందుకే ఏపీలో రాజ్యాధికారం లెక్కలలోనూ ఆ రెండు కులాలే డామినేటెడ్ గా కనిపిస్తాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రెడ్డి, కమ్మతో పాటుగా కాపులు కూడా ప్రభావిత రాజకీయాలను చేస్తున్నారు. ఈ మూడింటితో పాటు వెలమ, క్షత్రియ కులాలు కూడా కొన్ని ప్రాంతాలలో తమ ప్రాబల్యాన్ని చాటుతున్నాయి.
బీసీ వర్గాల నుంచి రాజకీయంగా రాణించిన వారు లేరా అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు వున్నారు. గౌతు లచ్చన్న, ప్రగడ కోటయ్య లాంటి వ్యక్తులు సామాజికంగా , రాజకీయంగా తమ సత్తా చాటారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా గౌతు లచ్చన్న రాణించిన తీరు.. ఆయనకు సర్దార్ పేరు వచ్చేలా చేసింది.
బీసీలకు దేవుడుగా సర్దార్ గౌతు లచ్చన్నను చెప్పుకోవాలి. లచ్చన్న అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడి స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎపుడూ అధికార పార్టీల విధానాలనే విమర్శించారు.. ఇక లచ్చన్న జీవితం మొత్తం బడుగు బలహీనుల కోసం అంకితం చేసిన నేత. అటువంటి లచ్చన్నను అంతా బీసీ నేతగా కొలుస్తారు. వారిని కూడా పార్టీల పరంగా వాడేసుకున్నారు. వాడుకుంటున్నారు కూడా.బీసీ లీడర్లంతా తమకు వచ్చిన అవకాశాలతో తమ సామాజిక వర్గాల ,బడుగుల శ్రేయస్సు కోసం పనిచేశారే తప్ప బీసీలకు రాజ్యాధికారం అనే కాంసెప్ట్ ను ఎప్పుడూ తీసుకురాలేదు. ఆ తరువాత బీసీ నేతలుగా ఎదిగిన టీడీపీ నేత ఎర్రంనాయుడు మరి కొందరి పరిస్థితి కూడా అదేరీతిలో సాగింది. ప్రస్తుతం పార్టీల వారీగా ప్రజాప్రతినిధులుగా వున్న బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా పార్టీ గీతకు లోబడే రాజకీయాలు చేయగలుగుతున్నారే గాని, గీతదాటి సామాజిక రాజకీయాలు చేసే పరిస్థితులు ఏపీలో లేవు. ఇప్పట్లో రావుకూడా.
అద్దంపడుతున్న స్థానిక పరిస్థితులు ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామాన్ని తీసుకున్నా కొన్ని కులలాల అధిపత్యమే కనిపిస్తుంది. జనాభా పరంగా ఆ గ్రామంలో ఆకులం వారు ఎక్కువగా లేకున్న గ్రామంలో వున్న ఒకటిరెండు పెత్తందారీ ఇళ్ల వారే రాజకీయం చేస్తారు. స్థానిక రాజకీయాలతో పాటు , అధికారులను శాసిస్తారు. పాలక వర్గంతో సత్సంబంధాలు నెరుపుతూ గ్రామంలో అందరినీ చెప్పుచేతలలో పెట్టుకుంటారు. పోలీసు వ్యవస్థ, మిగిలిన అధికార వ్యవస్థ వారి మాట వినాల్సిందే.. అందుకు కారణం ఆ కుటుంబాలకు వున్న భూ యాజమాన్య హక్కులతో పాటు ఆర్ధికంగా ఎదుగుదలే అని చెప్పవచ్చు. అందుకే రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, కొన్నిచోట్ల వెలమ వర్గాల డామినేషన్ కనిపిస్తుంది. మిగిలిన కులాల నుంచి కొందరు నేతలు వున్నా, రాజ్యాధికారంలో కమ్మ, రెడ్డి లదే శాసనం. అనాదిగా వస్తున్న ఈ పరిస్థితులలో మార్పు రావడం కూడా కష్టమే.
బీసీ లకు బీసీ నేతలే ద్రోహం చేస్తున్నారా?
బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు గా ఎంపీలుగా ఎన్నికైన వారు కూడా ఆ తరువాత మిగిలిన వర్గాలను పట్టించుకోవడం లేదన్న విమర్శ వుంది. అగ్రకులాలతోనే అంటకాగుతూ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే బీసీ ప్రజాప్రతినిధులు తమకు సీటిచ్చిన పార్టీలకు కట్టుబడి వుండాల్సిందే. అందుకే పార్టీల వద్ద బీసీ వర్గాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యం గా బీసీ సంఘాల నాయకులలో సోదరభావం అసలు కన్పించడం లేదని ఒక బీసీ వర్గానికి చెందిన ఏపీ ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్ దస్తగిరి అన్నారు. ఒక బీసీ నేత రాజకీయంగా ఎదిగితే కనీసం నామినేటెడ్ పోస్టులు అయినా మిగిలిన బీసీ వర్గాల వారికి ఇప్పించే ప్రయత్నం చేయడం లేదని దస్తగిరి అన్నారు. బీసీలలో 139 దాకా ఉప కులాలు వున్నా ఐకమత్యం అసలు లేదని అందుకే బీసీలకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తాను పుట్టిన గ్రామంలో పరిస్థితి ఇందుకు నిదర్శనంగా తెలిపారు. 2వేల జనాభా వరకూ వున్న గ్రామంలో తమ కులం వాళ్లే 1500 వరకూ వుంటారని అయినా అధికారం తక్కువ జనాభా వున్న ఆ రెండు అగ్రకులాల వాళ్ల చేతిలోనే వుంటుందన్నారు. సోదర బీసీ కులాల నుంచి ఎదిగిన వారూ మిగిలిన వారిని పట్టించుకునే పరిస్థితులు లేవన్నారు. మరో బీసీ నేత యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి చంద్రబోస్ తన అభిప్రాయంగా నేతలలో కాదు, బీసీ ప్రజలలో చైతన్యం రావాల్సి వుందన్నారు. బీసీ ప్రజలలో రాజ్యాధికార కాంక్ష లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రకులాలే కమ్మ, రెడ్డి వర్గాలు రాజ్యాధికార కాంక్షతో నెగ్గుకొచ్చారని, ఆ వర్గాలను ద్వేషంతో చూడకుండా వారిలోని పోరాటతత్వాన్ని ఆదర్శంగా బీసీలు వర్గాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఏదేమైనా తెలంగాణ లో కుల గణన తరువాత బీసీలకు రాజ్యాధికారమనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా వున్నా కొందరు నేతలు వాస్తవాల పేరిట వినిపిస్తున్న మాటలు కార్యరూపం దాల్చడం సులభం కాదు. ఏపీకి సంబంధించి కేవలం బీసీలకే ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు కూడా లేవు.
Read More
Next Story