
క్లైమేట్ ఫైనాన్స్ సంక్షోభానికి పరిష్కారం సాధ్యమేనా ?
ప్రశ్నార్థకంగా మారిన పేద దేశాల భవిష్యత్తు
-ప్రొఫెసర్ తాడ ప్రభాకర్ రెడ్డి
ఈ మధ్య కాలంలో ఢిల్లీలో వాతావరణం ఏ విధంగా కాలుష్యంతో నిండిపోయి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందో అర్థం చేసుకున్నట్లయితే, క్లైమేట్ ఫైనాన్స్ (వాతావరణ ఆర్థిక సహాయం) ఎంత అవసరమో గుర్తుంచుకోవాలి.దీనిలో భాగంగా, కాప్ 30 (COP 30) సమావేశం నవంబర్ 10 నుండి 21 వరకు బేలెం, బ్రెజిల్‌లో జరగబోతోంది. అందులో 19 అంశాలపై చర్చ జరగనుంది. అయితే వీటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. ఎందుకంటే చివరికి వాతావరణ ప్రభావాలను అరికట్టాలి. వాటికి పెద్దఎత్తున నిధులు కావాలి. అయితే ఇవి కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇవ్వగలవు.
ఒక అంచనా ప్రకారం, మనకు ప్రస్తుతం 10 నుండి 12 ట్రిలియన్ డాలర్లు కావాలి. కానీ 2024 లో అన్ని దేశాలు కలిసి 1,500 మిలియన్ డాలర్లు మాత్రమే సమకూర్చగలిగాయి. ఇవి సమస్య తీవ్రతకు ఏ మాత్రం సరిపోలేదు. ఇకపోతే, అభివృద్ధి చెందిన దేశాలు మరియు కాలుష్యానికి కారకులైన కెనడా, అమెరికా, యూరప్, చైనా, ఇతరులు ససేమిరా సహాయం చేయమని చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా, అమెరికా ధనవంతమైన దేశం, ఒక రకంగా సూపర్ పవర్ అయి ఉండి, పారిస్ ఒప్పందం నుండి తొలగిపోవడం శోచనీయం.
ఇదిలా ఉంటే, ప్రపంచంలోని ఎక్కువ దేశాలు టారిఫ్ యుద్ధంలో తలమునకలవుతున్నాయి. అమెరికా విధించిన షరతులు మరియు సుంకాలు చెల్లించలేక, వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అగ్రరాజ్యాలు వాతావరణంలో మార్పుల గురించి కాకుండా వేరే అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. అందువల్ల, కాప్ 30 సమావేశానికి ఎంతమంది అగ్రనేతలు హాజరు కాగలరో తెలీదు. ఇంకా చెప్పాలంటే, వారి బదులు రెండో తరగతి నాయకులు హాజరు అయితే, వారు క్లైమేట్ ఫైనాన్స్‌కి నిధులు ప్రకటించగలరా? కావున ఇది ఒక క్లిష్ట సమస్య.
ఇదిలా ఉంటే, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ యొక్క రిపోర్ట్, స్టేట్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ద్వారా సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఒక వైపు గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెలువడటం తీవ్రంగా ఉండడం, వాతావరణ ప్రభావం పెరుగుతుండడం, మరియు రాజకీయ నిబద్ధత తగ్గడం, ముఖ్యంగా అమెరికా మరియు కెనడా లాంటి దేశాలు వెనక్కి తగ్గడం ఒక తీవ్రమైన పరిణామంగా గుర్తుంచుకోవాలి.
క్లైమేట్ ఫైనాన్స్ సమీకరణకై మేము మూడు మార్గాలను సూచిస్తున్నాం.
1. పొల్యూషన్‌కి కారకులు చెల్లించడం: ఏ విధంగా చూసినా అగ్రరాజ్యాలు చెల్లించాలి. చారిత్రకపరంగా వారే ఎక్కువ కాలుష్యం వెదజల్లారు, పరిశ్రమలను స్థాపించారు. ఇకపోతే, ఈ రోజుకీ ఒక్కో వ్యక్తి పేరునా ఉద్గారాల వెదజల్లడం (per capita emissions) చూసినట్లయితే కెనడా, అమెరికా, చైనా, యూరప్ మరియు ఇతర దేశాల ప్రభావం ఎక్కువ. . భారత్ లో ఇది 2.9 టన్నులు కార్బన్ డయాక్సైడ్ ఉండగా కెనడా లో 20.4, అమెరికా లో 17.2, జపాన్ 8.3, యూరోపియన్ యూనియన్ 6.9, ప్రపంచ సగటు రేట్ 6.7 గా ఉన్నవి. ఇప్పుడు చెప్పండి ,ఎవరు కార్బన్ కాలుష్యానికి కారకులు? కావున మా వాదన ఏమిటంటే, కాలుష్యానికి కారకులు వాతావరణంలో వచ్చే మార్పులకై నిధులు చెల్లించాలి. లేనిచో ఇది బలహీనులైన దేశాలకు వారు అన్యాయం చేసినట్టు అవుతుంది.
2. భాగస్వామ్య శ్రేయస్సు (Shared Prosperity): ప్రపంచంలో ఏదో ఒక మూలన సంపద కూడగట్టుకుంటే, అది అందరికీ పంచాలి. ఎందుకంటే వారు అవలంబించిన పారిశ్రామికీకరణ వాతావరణంలో మార్పులు తెచ్చింది.
3. డైలాగ్- చర్చలు: ఐక్యరాజ్యసమితి తమ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రకారం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి, వారికి లాబీయింగ్ మరియు అడ్వకేసీ బాధ్యతలు ఇచ్చి, వారి ద్వారా కాప్ 30 లో చర్చలు జరిపి ధనిక దేశాలను ఒప్పించాలి. అప్పుడు నిధుల సమీకరణ జరుగుతుంది, పేద దేశాలకు న్యాయం జరుగుతుంది. అంతేకాని, ప్రతి సంవత్సరం సమావేశానికి వెళ్లడం, రావడం వల్ల ఒరిగేది లేదు.ఇక పోయిన సంవత్సరం అనగా 2024 లో జర్మనీ 703 మిలియన్ ల డాలర్లు ఇచ్చి మొదటి స్థానం లో ఉంది. పిదప స్థానం లో స్వీడెన్ 207, స్పేయిన్ 151, అమెరికా 100 మిలియన్ డాలర్స్ ఇచ్చాయి. ఆ తరువాత స్థానం లో ఇటలీ 72, యూరోపియన్ కమిషన్ 55, నార్వే 48, బెల్జియం 40 మిలియన్స్ అందించారు.
దీన్ని బట్టి చూస్తే, ధనిక మరియు పెద్ద రాజ్యాలు క్లైమేట్ ఫైనాన్స్‌కి సుముఖంగా లేవు. కావున, అగ్రరాజ్యాలను ఈ సమావేశంలోనే ఒప్పించి నిధులు కూడగట్టి, యుద్ధ ప్రాతిపదికన ఎదుగుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించాలి. లేనిచో వారు మరిన్ని సమస్యలలోకి నెట్టివేయబడతారు. తద్వారా సమాజంలో సామాజిక కోహెషన్ (cohesion) స్ఫూర్తి పోయే ప్రమాదం పొంచి ఉంది.ఇవే కాకుండా, క్లైమేట్ ఫైనాన్స్ అంటే కేవలం గ్రాంట్స్ రూపంలో రావాలి కానీ ఋణం లా రాకూడదు. వాటి లెక్కింపు పద్ధతులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. రెండు మార్లు లెక్కించే పద్ధతులు ఉండకూడదు.మరి ముఖ్యం గా, ప్రపంచ బ్యాంకు ఒక రిపోర్ట్ ప్రకారం, లాస్ అండ్ డ్యామేజ్ (Loss and Damage) నిధులను మేనేజ్ చేస్తూ 17 శాతం తీసుకోవడం సబబు కాదు. పారదర్శకంగా లెక్కలు చూపించాలి మరియు చిన్న, పేద దేశాలకు సహాయం అందించాలి.ఇకపోతే, ప్రైవేట్ రంగం నుండి నిధులు పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే అభివృద్ధిలో మొదట లబ్ధిదారులు వారే. భారత్‌లో ప్రైవేట్ రంగం చాలా తక్కువ నిధులు ఇవ్వడం వారి స్వార్థం మరియు సమాజ శ్రేయస్సుకై పాటుపడడం లేదని తెలియజేస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ మరియు నూతన పద్ధతులలో ఫైనాన్స్ వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడే మనమందరం క్లైమేట్ చేంజ్ సమస్య నుంచి బయటకు రావడానికి సాధ్యపడుతుంది.అందరం కలిసి మన బాధ్యతగా కాప్ 30 లో డబ్బులు సేకరించి వాతావరణంలోని మార్పులను అధిగమిద్దామని ఆశిద్దాం.

