భారత్ నుంచి మాల్దీవులు దూరంగా జరుగుతున్నదా, ఎందుకు?
x

భారత్ నుంచి మాల్దీవులు దూరంగా జరుగుతున్నదా, ఎందుకు?

అంతా ముస్లింలే ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవులతో ఉన్న ఈ దేశానికి ఎవరితో సరిహద్దు తగాదాలు లేవు.అయితే, ఈ దేశంమీద పట్టుకోసం ఆగ్రరాజ్యాలు పోటీ పడే పరిస్థితి ఉంది.


ఎం కోటేశ్వరరావు

2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి తాము వైదొలుగుతున్న మాల్దీవులు 2023 డిసెంబరు 14న మనదేశానికి తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం మన నౌకాదళం మాల్దీవుల తీర ప్రాంతంలో నౌకల ప్రయాణ రక్షణ గురించి పరిశీలనలు జరుపుతుంది. పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత యాజమాన్యం, శాస్త్రీయ పరిశోధన వంటి సంబంధిత అంశాలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. మిలిటరీ కోణంలోే చూస్తే జలాంతర్గాములు ఎక్కడి నుంచి ప్రవేశించవచ్చు, ఎటు నుంచి బయటకు వెళ్ల వచ్చు అన్నది కూడా ఈ పరిశోధనల్లో ఉంది. తమ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు తప్ప చైనాకు దగ్గరవుతున్నందున ఈ నిర్ణయం తీసుకోలేదని మాల్దీవుల అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి అధికారిక పర్యటన భారతదేశంలో జరపటం సాంప్రదాయంగా వస్తోంది. దానికి కూడా నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్వస్తి పలికి టర్కీ వెళ్లాడు.

అంతే గాక మాల్దీవుల్లో ఉన్న మన సైనికులు కూడా వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో అట్టడుగు జలాల్లో పరిశోధనలు చేసేందుకు తమ యువాన్‌ వాంగ్‌ నౌక లంగరు వేసేందుకు అనుమతించాలని మాల్దీవులను చైనా కోరటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు మాల్దీవుల మొగ్గు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో మాల్దీవులు ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశ నిర్ణయాలు ప్రపంచ వ్యూహకర్తలు, ప్రత్యేకించి మనదేశ విధానరూపకల్పన యంత్రాంగంలో ప్రస్తుతం ఒక అంశంగా మారాయి.

దేశం చిన్నదే అయినప్పటికీ పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది.మహమ్మద్‌ ముయిజ్జు 2023 సెప్టెంబరు 30న జరిగిన ఎన్నికల్లో 54.04 శాతం ఓట్లతో నెగ్గి నవంబరు 17 నుంచి అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. స్థానిక అంశాలతో పాటు తమ దేశం నుంచి భారత్‌ వెళ్లిపోవాలన్న ప్రచారంతో ఎన్నికల్లో గెలిచాడు. ఇది చైనాకు విజయం, భారత్‌కు ఎదురుదెబ్బ అని ప్రపంచ మీడియా వర్ణించింది.

హిందూ మహా సముద్రంలో భారత దేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో నామమాత్రంగా క్రైస్తవులు తప్ప నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశం మాల్దీవులు. ఈ దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. అయినా సార్వభౌమత్వ రక్షణకు పదకొండు వేల మంది రెగ్యులర్‌ జాతీయ రక్షణ సిబ్బంది, ఎనిమిదివేల మంది రిజర్వు దళాలు ఉన్నాయి. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది.

చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్లనూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశం మాల్దీవులు. ఈ దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దూరంలో ఉంది. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావం ఉంది అన్నది కూడా ఎంతో కీలకమైనదే. ఈ కారణంగానే మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి.

సెప్టెంబరు 30న జరిగిన ఎన్నికలు ఒక విధంగా చెప్పాలంటే చైనా - భారత్‌ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి చెబుతున్నాయి. 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. గయూమ్‌ విజ్ఞప్తి మేరకు ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి మనదేశం ఐదు వందల మంది పారా ట్రూపర్లను మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది.

2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి '' భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) '' అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.

విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు.

అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు చైనా అనుకూలత, భారత వ్యతిరేకతను ప్రచారం చేసిన మాట నిజం. అతని ఎన్నికను భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం వలన ప్రయోజనం లేదు. మాల్దీవులే కాదు ఇరుగుపొరుగున ఉన్న మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి. దూరాన్ని పెరగనివ్వకూడదు, శత్రువులుగా చూడకూడదు.

(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తి గతం. ఫెడరల్- ఆంధ్రప్రదేశ్ కి వాటితో సంబంధం లేదు)

Read More
Next Story