మోర్గన్ అద్దంలో ఋగ్వేద, రామాయణ ప్రతిబింబాలు
రామాయణంలో నిరుత్తరకాండ-17: మన కుటుంబ వ్యవస్థలో వావివరసలనేవి ఎపుడూ మొదలయ్యాయి. రక్త సంబంధీకుల మధ్య వివాహాల చరిత్ర ఏమిటి?
అన్నాచెల్లెళ్ల మధ్య వివాహమనే ఊహే ఈరోజున మనకు ఎంతో చేదుగానూ, కంపరంగానూ, సాంస్కృతికమైన తీవ్రఅఘాతంగానూ అనిపిస్తుంది, నిజమే. సహజమనిపించే ఒక పోలికద్వారా దీనిని జీర్ణించుకోడానికి కాసేపు ప్రయత్నిద్దాం. ఒక వైద్యుడినే తీసుకోండి.. ఎదురుగా ఉన్న రోగి తన తల్లి, తండ్రి, భార్య, అక్క, చెల్లి అయినా; గొప్ప రచయితా, కళాకారుడు, జ్ఞాని, విజ్ఞాని, తపస్వి, దేశానికి ప్రధానమంత్రి అయినా కేవలం వివిధ అవయవాలు కలిగిన ఒక శరీరంగానే చూస్తాడు. ఆ శరీరంతో, ఆ శరీరధారితో ముడిపడిన గౌరవమర్యాదలు కానీ, సాంస్కృతిక, సామాజిక విధినిషేధాలు కానీ, భావోద్వేగాలు కానీ ఆ క్షణాన అతని ఊహలోకే రావు. హృద్రోగనిపుణుడే అయితే, గుండెను శరీరంలోని ఒక అవయవంగానే చూసి అది ఎలా పనిచేస్తోందో చూసి అవసరమైతే దానిని కోసి సక్రమంగా పనిచేసే ఏర్పాటు చేస్తాడు తప్ప; కవులు, కళాకారులు, ప్రేయసీప్రియుల ఊహనుంచి దానిని చూడనే చూడడు...
అలాగే, అన్నాచెల్లెళ్ల వివాహాన్ని కూడా ఒక సామాజికశాస్త్రవేత్త దృక్కోణంనుంచి మాత్రమే చూసి చెప్పుకోడానికి ప్రయత్నిద్దాం.
రామాయణంనుంచి ఒకసారి ఋగ్వేదానికి వెడితే, అందులోని 10వ మండలంలోని 10వ సూక్తంలో 14 ఋక్కులు యమునికీ, అతని సోదరి అయిన యమికీ జరిగిన సంవాదాన్ని చెబుతాయి. వారిద్దరూ వివస్వంతుడనే పేరు కలిగిన సూర్యునికీ, విశ్వకర్మ కూతురైన సంజ్ఞకీ కలిగిన కవలలు. మళ్ళీ దశరథుని వంశానికి మూలపురుషుడిగా రామాయణం చెప్పిన వైవస్వతమనువు కూడా సూర్యుని కుమారుడే. పై సంవాదంలో యమి తన సోదరుడైన యమునితో సంపర్కాన్ని, సంతానాన్ని కోరుకుంటుంది. సృష్టికర్త అయిన ప్రజాపతి కూడా తన కూతురితో సంపర్కం చెందాడని అంటుంది. సోదరీసోదరుల మధ్య అలాంటి సంపర్కం తప్పనీ, నువ్వు వేరొక పురుషునితో అలాంటి సంబంధం పెట్టుకోమనీ యముడు చెబుతాడు. అయినా యమి వినకుండా పట్టుబట్టడం, యముడు తన వాదాన్ని నొక్కిచెప్పడం రూపంలో ఆ సంవాదం సాగుతుంది...
దీనిని సాధారణార్థంలో తీసుకుంటే, ఒకప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి సంబంధం ఉండేదనీ, క్రమంగా అది తప్పని గ్రహించి దానిని నిషేధించారనే- రెండు సూచనలూ ఇందులో కనిపిస్తాయి. ఆవిధంగా అది అతిపురాతనకాలపు ఆనవాయితీనీ, ఆ తర్వాత దానిలో జరిగిన సంస్కరణనూ కూడా చెబుతోందన్నమాట. ఇలాంటి సాధారణ, లేదా లౌకికార్థంనుంచి తప్పించి- యమి అధర్మానికీ, యముడు ధర్మానికీ ప్రతినిధులనీ; వారిని కవలలుగా చెప్పడంలో ఉద్దేశం- ధర్మమూ, అధర్మమూ అనేవి రెండూ ఒకే వ్యక్తిలో జంటగా ఉంటాయనీ, వాటి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుందనీ, అధర్మం ధర్మాన్ని కూడా తనవైపు ఆకర్షించుకోడానికి చూస్తుందనీ; అలాంటి అధర్మంపై ధర్మం గెలుపును ఇది సంకేతిస్తుందనీ చెప్పి ఈ సంవాదానికి విశేషార్థాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది. పోనీ ఆ విశేషార్థాన్ని చెప్పడానికైనా ఇంకేదైనా తగిన పోలిక తీసుకోవాలి తప్ప సాంస్కృతికంగానూ, ఆచారపరంగానూ విపరీతంగా తోచి మన మనసుల్లో చేదునింపే అన్నాచెల్లెళ్ల లైంగిక సంవాదంగా దానిని ఎందుకు మలచాలన్న ప్రశ్న ఎదురవుతుంది. అంతిమంగా దీనిని సాధారణార్థంనుంచి చూడాలో, విశేషార్థంనుంచి చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎవరికివారికే ఉంటుంది.
డి.డి. కోశాంబి తన ‘మిత్ అండ్ రియాలిటీ’ లో సోదరీసోదరుల వివాహానికి ఋగ్వేదంనుంచే మరో ఉదాహరణ ఇస్తాడు. భూమ్యాకాశదేవత అయిన రోదసిని సూర్యచంద్రుల సోదరిగానే కాక భార్యగా కూడా ఋగ్వేదం చెబుతుందని ఆయన అంటాడు. మళ్ళీ ఈ రోదసియే సోదరులూ, గణదేవతలూ అయిన 49 మంది మరుత్తులను పెళ్లాడినట్టు ఋగ్వేదం చెప్పడాన్ని ఆయన ఉదహరిస్తూ, ఇది ఆర్యులలో ఉన్న గుంపు పెళ్లిళ్లను సూచిస్తూ ఉండవచ్చునంటాడు...
ఇప్పుడు ఈ వేద, ఇతిహాస, పౌరాణిక ఉదాహరణలనుంచి ఒకసారి ఆధునికసామాజికశాస్త్రపరిశీలనల వైపు; చరిత్రా, చరిత్రపూర్వకాలాలవైపు ఒకసారి తొంగిచూద్దాం. అనడమైతే తేలిగ్గా అనేసుకున్నాం కానీ, ఆ తొంగిచూడడం అంత తేలికేమీ కాదు. మన వేద, ఇతిహాస పురాణాలు, వాటితో గాఢంగా అల్లుకున్న మతవిశ్వాసాలు; అవి మన చూపులకు, ఆలోచనలకు విధించిన విధినిషేధాలు హిమాలయపర్వతాల్లా అడ్డుపడతాయి...
‘హోమో సేపియన్స్’ అనబడే నేటి మనిషి ఇప్పటి రూపాన్ని సంతరించుకున్నది ఏడునుంచి అయిదు లక్షల సంవత్సరాల క్రితమని శాస్త్రజ్ఞులు తేల్చారు. మెదడు అభివృద్ధి చెంది, బుద్ధిజీవిగా మారి; సమాజమూ, దేవుడూ, ప్రాథమికరూపంలో మతవిశ్వాసమూ, మతపరమైన తంతులు, నీతినియమాలు, పౌరాణికకల్పనలవైపు మనిషి అడుగువేసి లక్షసంవత్సరాలు కూడా కాలేదని అంచనావేశారు. ఈ మధ్యలో ఎన్నో మంచుయుగాలను, అగ్నిపర్వతవిస్ఫోటాలను, ఇంకా అనేకానేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అంతరించేవాళ్లు అంతరిస్తూ, మిగిలినవారు ఎలాగో అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఆ ప్రయత్నంలో భూభ్రమణం చేస్తూ మనుషులు విస్తరించారు.
దాదాపు పన్నెండువేల సంవత్సరాల క్రితం చివరి మంచుయుగం ముగిసి ప్రపంచం తిరిగి ఉష్ణవాతావరణంలోకి రావడం, ‘హలోసీన్’ గా పిలిచే ఆ వాతావరణదశే నేటికీ కొనసాగుతూ ఉండడం, ఇప్పటి మన ఆహారపు అలవాట్లు, ఆహారోత్పత్తి పద్ధతులు, సామాజికవ్యవస్థలు, సంస్కృతి, కళలు, మతవిశ్వాసాలు, ప్రాచీనమైన వాఙ్మయం సహా నేటి మన మనుగడకు సంబంధించిన అనేక విషయాల మూలాలు ఈ పన్నెండు వేల సంవత్సరాల కాలంలోనే ఉండడం సంభవించాయి.
ఈ క్రమంలో ఏం జరిగిందన్నమాట? లక్షల సంవత్సరాల మనిషి అస్తిత్వంలో, కేవలం పైన చెప్పిన పన్నెండు వేల సంవత్సరాలకు చెందిన వారసత్వమే ఇప్పుడు మన ఊహలో నిలువుగా, అడ్డంగా హిమాలయాల్లా విస్తరించిపోయింది. మనకు అర్థమయ్యే సాధారణకాలమానాన్ని పక్కన పెట్టి గతాన్ని కల్పాలు, యుగాలు, మన్వంతరాల పేరిట లక్షల సంవత్సరాలకు పొడిగించింది. ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, సామాజికశాస్త్రజ్ఞులు ఈ హిమాలయాలనే అడ్డుగోడల్లో సన్నని కంతలను వెతికి పట్టుకుని వాటి నుంచి గత పన్నెండువేల సంవత్సరాల వెనకటి మానవగతాన్ని, సామాజికపరిణామగమనాన్ని చూడడానికి ప్రయత్నించారు. ఆపైన, అమెరికాను కనిపెట్టడం, అక్కడ వివిధ అభివృద్ధిదశలకు అద్దంపడుతున్న ఆదివాసీల సామాజికనిర్మాణాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం, మనిషి ఇంతవరకూ గడిచివచ్చిన భిన్నభిన్న సామాజికదశలకు అది సజీవసాక్ష్యాలను అందించడం శాస్త్రజ్ఞుల పరిశీలనకు తిరుగులేని ప్రామాణికతను కల్పించాయి...
ఆ దిశగా ముందడుగు వేసిన వ్యక్తిగా మొట్టమొదట చెప్పుకోవలసిన పేరు లూయీ హెన్రీ మోర్గన్! వృత్తిరీత్యా ఆయన న్యాయవాది అయినా అమెరికాలోని ఆటవికజాతులకు సన్నిహితంగా మెలగుతూ, పన్నెండేళ్ళపాటు వారి జీవనవిధానాన్ని అధ్యయనం చేసి 1877లో ‘పురాతన సమాజం’ అనే గ్రంథాన్ని వెలువరించాడు. ఆ వెలుగులో ఆ తర్వాత అనేకమంది ఆ అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్ళారు. మోర్గన్ పుస్తకం లోంచి, ప్రస్తుత మన సందర్భానికి అవసరమైన మేరకు కొన్ని మౌలిక అంశాలను చెప్పుకుందాం.
మోర్గన్ మానవజాతి చరిత్రను మూడు దశలుగా విభజించాడు. అవి: 1. ఆటవికదశ 2. అనాగరికదశ 3. నాగరికదశ. మళ్ళీ మొదటి రెండు దశలనూ 1.దిగువ 2. మధ్య 3. ఎగువదశల పేరుతో మూడు అంతర్దశలుగా విభజించాడు. ఇలాగే, మానవజాతి ప్రారంభంనుంచీ ఉన్న కుటుంబరూపాలను నాలుగుగా విభజించాడు. అవి ఇలా ఉంటాయి:
1.రక్తసంబంధీకుల కుటుంబం: ఇదే ప్రథమకుటుంబరూపం. ఒకే గుంపునకు చెందిన సోదరీ, సోదరుల వివాహం దీనికి పునాది. ఇది ఒకప్పుడు ప్రపంచమంతటా ఆచరణలో ఉంది. మోర్గన్ నాటికి ఈ రూపం మలయా ఆదివాసుల్లో కొనసాగుతోంది. 2. పునలాన్ కుటుంబం: ‘పునలా’ అనేది హవాయి ద్వీపవాసులు అనుసరిస్తూవచ్చిన బంధుత్వాన్ని సూచించే మాట. ఇందులో అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉమ్మడిగా వివాహసంబంధంతో ఉంటారు. అయితే, ఇక్కడ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళనే మాటలు దూరపు బంధుత్వం ఉన్న సోదర, సోదరీలకు కూడా వర్తిస్తాయి. వారు తమను సోదరీ, సోదరులుగానే పిలుచుకుంటారు. 3. సింద్యాస్మియన్ కుటుంబం; జతకూడడం అనే అర్థం కలిగిన ‘సింద్యాజో’ అనే మాట నుంచి వచ్చిన పేరిది. ఒక ఆడ, ఒక మగ జతకూడే వివాహరూపమిది. ఆ ఇద్దరూ ఇష్టమున్నన్నాళ్ళు కలసి ఉండవచ్చు; ఏ ఒకరికి ఇష్టం లేకపోయినా విడిపోయి ఇంకొకరిని చేసుకోవచ్చు. నేడు ప్రాచుర్యంలో ఉన్న దంపతీవివాహానికి ఇది బీజరూపం. 4. పితృస్వామిక కుటుంబం: ఒక మగవాడు అనేకమందిని వరించడాన్ని సూచించే కుటుంబరూపం ఇది. హిబ్రూ పశుపాలక తెగల్లో ఈ వివాహరూపం కనిపిస్తుంది కనుక దీనిని ఒక కుటుంబరూపంగా చెబుతున్నాననీ, ఇది సార్వత్రికం కాదనీ, దీని ప్రభావం తక్కువనీ మోర్గన్ అంటాడు. ఆయన అలా ఎందుకన్నాడో కానీ; ఈ వివాహరూపం మన దగ్గర ఇతిహాస, పురాణకాలం నుంచి, చరిత్రకాలం పొడవునా, ఆధునికకాలం వరకూ ప్రబలంగా కనిపిస్తూనే ఉంది. 5. దంపతీకుటుంబం: మూడో మనిషితో సంపర్కం లేకుండా ఒక పురుషుడూ, ఒక స్త్రీ పెళ్లి చేసుకోవడం దీనికి ప్రాతిపదిక. ఇది నాగరికసమాజంలో వచ్చిన కుటుంబరూపం. ఇది స్వతంత్రంగా తనదైన కొత్త రక్తసంబంధవ్యవస్థను నిర్మించుకుంది.
రాంభట్ల కృష్ణమూర్తిగారు మోర్గన్ తోపాటు జార్జి థామ్సన్, తాపీ ధర్మారావు వంటి మరికొందరి అధ్యయనాల వెలుగులో ఈ వివాహరూపాలను మన సందర్భానికి అన్వయిస్తూ ‘జనకథ’, ‘వేదభూమి’ తదితర రచనలు చేశారు. మోర్గన్ చెప్పిన అయిదు కుటుంబరూపాలనూ ఆయన మూడుకు తగ్గిస్తూ ఇలా చెప్పారు:
1.విశ్వకుటుంబిని: మోర్గన్ కుటుంబాన్ని పురుషపరంగా చూశాడనీ, ఆచారం ఎలా ఉన్నా మనవారు స్త్రీపరంగా లెక్కించారనీ రాంభట్ల అంటూ, రక్తసంబంధరూపంగా మోర్గన్ చెప్పిన తొలి కుటుంబరూపం నాటికి స్త్రీ స్వైరిణి కనుక దానికి విశ్వకుటుంబినిగా ఆయన పేరు పెట్టారు. 2. గుంపు కుటుంబరూపం, లేదా గుంపు మనువు: దీనినే గణవివాహం అంటారు. ఇది రెండు వేర్వేరు గణాల మధ్య ఏర్పడే వివాహసంబంధం 3. జంట కుటుంబం, లేదా జంట మనువు: ఇదే మోర్గన్ చెప్పిన దంపతీ కుటుంబరూపం. పురుషకౌటిల్యంవల్ల ఇది ఏకపత్నీవ్రతం అనిపించుకుంటోందనీ, నిజానికిది స్త్రీకి ఏకపతివ్రతమే తప్ప, పురుషుడికి ఏకపత్నీవ్రతం కాదనీ రాంభట్ల అంటారు.
ఈ వ్యాసకర్త కూడా ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే రచనలో మోర్గన్, జార్జి థామ్సన్ తదితరుల అధ్యయనాంశాలను మహాభారతసందర్భానికి అన్వయిస్తూ విపులంగా రాయడం జరిగింది. మానవజాతికి చెందిన మొత్తం చారిత్రకమూలాలను తడిమే ఈ అంశాలలోకి మరీ లోతుగా, విస్తృతంగా వెళ్లడానికి ఇప్పుడు అవకాశం లేదు కనుక రేఖామాత్రంగానే చెప్పుకుంటూ ముందుకు వెడదాం...
మానవప్రస్థానంలో మూడు దశలనూ, అయిదు కుటుంబరూపాలనూ చెప్పిన మోర్గన్; సామాజికవ్యవస్థలు, రాజకీయసంస్థల పరిణామక్రమాన్ని కూడా ఇలాగే వర్గీకరిస్తూ, నిర్వచిస్తూ వెడతాడు. ఆయన ప్రకారం, సామాజికవ్యవస్థ నాలుగు రూపాలలో అంచలంచెలుగా పరిణామం చెందుతూ వచ్చింది. అవి: 1. గణం 2. ఫ్రాట్రే(సోదరసంస్థ) 3. తెగ. 4. జాతి. ఇవి ఒక్కొక్కచోట ఒక్కొక పేరుతో ఉన్నాయి. రాంభట్ల మన సందర్భానికి అన్వయిస్తూ చేసిన వర్గీకరణ ప్రకారం అవి ఇలా ఉంటాయి: 1. గణం 2. వ్రాతం 3. మహాగణం, లేదా జనం.
మోర్గన్ వివరణలు, విశ్లేషణలు, నిర్వచనాలు, నిర్ధారణలు ఎంతో లోతూవైశాల్యాలతోనూ, కొత్తగానూ, ఆశ్చర్యం గొలిపేలానూ మానవచరిత్రపరిణామక్రమం మొత్తాన్ని మనముందు ఆవిష్కరిస్తాయి. మోర్గన్ యూరప్ కు చెందినవాడైనా, అమెరికా ఆదివాసీసమాజాలను విశేషంగా అధ్యయనం చేసినవాడైనా ఆయన రాతలో ప్రపంచంలోని ప్రతి ప్రాంతమూ తన ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు. సామాజికవ్యవస్థలకు, రాజకీయసంస్థలకు మధ్య ఉన్న తేడాను ఆయన ఎత్తిచూపిన తీరు వినూత్నమైన అవగాహనతో మన చూపుల్ని తటిల్లుమనిపిస్తుంది...
ఉదాహరణకు, ప్రాచీనసమాజంలో భూభాగపరిమితమైన రాజ్యం అనేది లేదనీ, ప్రాచీన సమాజం నుంచి ఆధునికసమాజాన్ని వేరుపరిచేది అలాంటి రాజ్యమేనని ఆయన అంటాడు. సామాజికవ్యవస్థ గణాలు, ఫ్రాట్రేలు, తెగలు(కొన్ని చోట్ల తెగల సమాఖ్యలు), జాతుల ప్రాతిపదిక మీద; అంటే మనుషుల ఆధారంగా ఏర్పడితే; రాజకీయసంస్థలు భూభాగం మీద, ఆస్తి మీద ఏర్పడ్డాయంటాడు. సామాజికసంస్థలు నేరుగా వ్యక్తుల పాలనను నిర్వహిస్తే; రాజకీయసంస్థలు పట్టణం, జిల్లా, రాష్ట్రాలతో గల సంబంధాల ద్వారా వ్యక్తులపై పాలన సాగిస్తాయి. అంటే, సామాజికవ్యవస్థలు వ్యక్తి కేంద్రితాలైతే, రాజకీయసంస్థలు ప్రాదేశికంగా పనిచేస్తాయన్నమాట.
ఆయన ప్రకారం, రాజకీయసమాజం ఏర్పడకపూర్వం గణసంస్థలు ఉన్న ప్రతిచోటా ప్రజలు గణసమాజాల్లోనే ఉండేవారు, గణవ్యవస్థ పూర్తిగా ప్రజాస్వామికంగా ఉండేది. అయితే, గణం కన్నా ప్రాచీనమైన నిర్మాణరూపం స్త్రీ-పురుషపరంగా జరిగిన విభజన. పైన చెప్పుకున్న రక్తసంబంధకుటుంబరూపానికి సరిపోయే విభజన అది. గణం అనేది అంతిమంగా రక్తసంబంధం, స్త్రీవైపునుంచి పారంపర్యం, అంతర్వివాహనిషేధం(ఒకే గణంలోపల వివాహసంబంధాన్ని నిషేధించడం) అనే మూడు ముఖ్యసూత్రాలపై ఏర్పడింది...
అంతకంటె కీలకంగా మోర్గన్ ఏమంటాడంటే, మానవజాతి చరిత్రకంతటికీ మూలం ఒక్కటేననీ; అందరి అనుభవమూ, అభివృద్ధీ ఒక్కలాంటివేనానీ; అనాగరికదశ అంతటా ఎక్కడెక్కడి మనుషులూ గణాలు, ఫ్త్రాట్రేలు, తెగలుగానే ఉన్నారనీ; అవే ప్రాచీనకాలంలో సమాజాన్ని నిలబెట్టాయని....
అమెరికాను కనుగొనేనాటికి పై మూడు మానవదశలూ అక్కడి ఆటవికజాతుల్లో సజీవంగా ఎలా ఉన్నాయో ప్రత్యక్షోదాహరణలతో మోర్గన్ చూపించాడు. ఇంకా విశేషంగా గ్రీకు, రోమన్, జర్మన్ తెగలు పై దశలన్నింటినీ యథాతథంగా చూశాయనీ, చిట్టచివరి దశ జరుగుతుండగా చరిత్ర వెలుతురు వాటిమీద పడిందనీ అంటాడు. హోమర్, రోమన్ల కాలంనాటి గ్రీకు, ఇటాలియన్ తెగలను అనాగరికయుగం ఎగువదశకు మంచి ఉదాహరణలుగా ఆయన చూపుతాడు.
ప్రత్యేకించి మనతో కూడా ముడిపడిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తాడాయన. అదేమిటంటే, ఈనాడు అమెరికా, ఆస్ట్రేలియా, పోలినీషియా ఆటవిక, అనాగరిక తెగల అనుభవాలే ఆర్యజాతుల పురాణపురుషులవి కూడా; అనాగరికయుగం ఎగువదశతో సహా ప్రాచీన, ఆధునిక నాగరికదశల గురించి చెప్పడానికి కావలసిన ఉదాహరణలు నేటి ఆర్యజాతుల అనుభవాలలో దొరుకుతాయి; ఆటవిక, అనాగరిక తెగల్లో మిగిలి ఉన్న నీతినియమాలలాంటివే ఆర్యులలో నేటికీ ఉన్నాయి...
ఆర్యులన్నప్పుడు ఆయన గ్రీకు, ఇటాలియన్, లాటిన్, జర్మన్ లను మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు; మన ఆర్యవారసత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. వాళ్ళతో సంస్కృతం మాట్లాడిన ఆర్యగణాలను కూడా కలిపాడు. ఆర్యన్ కుటుంబానికి చెందిన లాటిన్, గ్రీకు, సంస్కృతం మాట్లాడే ప్రజలు ఒకటిగా కలసి ఉన్నప్పుడే వారిలో గణం ఉందనీ; వారి మాండలికాలలో ఆ సంస్థ పేరు ఒకే తీరుగా ఉందనీ అంటూ, లాటిన్ లోని ‘జెన్స్’, గ్రీకులోని ‘జెనోస్’, సంస్కృతంలోని ‘గణం’ అనే మాటల్ని సాక్ష్యంగా చూపాడు...
***
ప్రస్తుతానికి వస్తే, మోర్గన్ ఋగ్వేదాన్ని చదివాడని కానీ, పైన చెప్పుకున్న అందులోని యమీ-యమ సంవాదం ఆయనకు తెలుసునని కానీ చెప్పలేం. తెలిసుంటే తప్పక ఉదహరించి ఉండేవాడు. కానీ ఆయన చెప్పిన స్త్రీ-పురుషవిభజనపై ఏర్పడిన రక్తసంబంధీకుల కుటుంబమనే వర్గీకరణకు అది సరిగ్గా సరిపోవడమే కాదు; దాని అభివృద్ధిదశకు చెందిన గణవ్యవస్థ అలాంటి సంబంధాన్ని నిషేధించిన సంగతినీ స్పష్టంగా చెబుతోంది.
అలాగే, జైనుల ప్రథమతీర్థంకరుడైన ఋషభుడు ఒకే తల్లి బిడ్డలు భార్యా,భర్తలు కావడంలోని అనర్థాన్ని గుర్తించి ఆ ఆచారాన్ని నిషేధించాడనీ; తండ్రి ఒకడే అయినా తల్లులు వేరయ్యే విధంగా దానిని సవరించాడనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇలాంటి ఎన్నో వివాహాలను మోర్గన్ ఎత్తిచూపుతూ, గ్రీసుకు చెందిన అథీనియన్లలో క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికి కూడా వేలువిడిచిన అన్నాచెల్లెళ్ల మధ్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయనీ, ఇంకో పక్క వాటి పట్ల వ్యతిరేకతా వ్యక్తమవుతోందనీ అంటాడు...
Images of Rgveda and Ramayanam in LH Morgan's Ancient Society