
అమరావతికి మరొక 44 వేల ఎకరాలు. అంత భూదాహమెందుకు?
బిజెపి నాయకులు 2018 లో కర్నూలు కూర్చుని చేసిన రాయలసీమ డిక్లరేషన్ ఏమయింది?
-తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి
2014లో తెలంగాణ విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలో నిర్ణయించేందుకు కేంద్రం శివారామ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించింది. అందులో అమరావతి ఒకటి. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే అక్కడ వరదలు, భూకంపాలు, తుఫాన్ లు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు,రాయలసీమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగడం సహజ న్యాయంగా ఉంటుందని, రాయలసీమలో రాజధానిని నిర్మిస్తే సీమాంధ్రుల శ్రీ బాగ్ ఒప్పందం అమలు జరుగుతుంది రెండు ప్రాంతాలకు సమ న్యాయము జరుగుతుందని పేర్కొంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను గమనించి అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ కేవలం ‘చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి’ ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయానికి సహకరించలేదు.
ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తిరిగి అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కేంద్రీకరణే ఏకైక లక్ష్యంతో ముందుడుగు వేస్తున్న విషయము గమనించాలి. అయితే, పాత సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడగానే భారీ వరదలతో విజయవాడ అమరావతి ప్రాంతాలను జలమయము చేసి వరుణుడు మెుదటి హెచ్చరికను జారీ చేసాడు. ఇప్పుడు భూకంపము రూపంలో హెచ్చరికలు వస్తున్నాయి.
ప్రకృతి విపత్తుల నుండి అమరావతి రాజధానిని నిర్మించక ముందే రక్షించడానికి నిర్మించే రక్షణ కరకట్టలకు, వరదల నీళ్లని కృష్ణానదిలోకి నేరుగా ఎత్తిపోయడానికి అమరావతి ప్రాంతంలో నిర్మించే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులకు తెస్తున్న అప్పులు తీర్చడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వంద సంవత్సరాలు పడుతుంది.
అలాంటప్పుడు ఎన్నో త్యాగాలు చేసి నేడు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ఏం కావాలి.
ఇపుడు మళ్లీ అమరాతి కోసం అదనంగా 44 వేల ఎకరాల భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర సంస్థలను నయానోభయానో అమరావతికి తరలిస్తున్నారు.
రాజధాని విషయంలో తప్పుచేసామనే పశ్చాతాపం ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కనపడక పోవడం విచిత్రం. ప్రకృతి విపత్తులకు నిలయమైన ఆ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 33వేల ఎకరాలు రైతులతో సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి సారవంతమైన బంగారు డెల్టా భూములను ద్వంసం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఈ సారవంతమయిన భూములలొ కాంక్రీటు జంగిల్ నిర్మిస్తున్నారు. అది కూడా చాలదన్నట్లుగా మరో 44వేల ఎకరాల భూమిని సేకరించడానికి ఈ ప్రభుత్వం రైతులతో చర్చిస్తోంది. 2014-19 లో అప్పటి ఎన్ డి ఏ ప్రభుత్వం శ్రీ బాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కడానికి బీజాలు వేస్తే నేడు ఏర్పడిన ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం కూడా మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ మొత్తం ఆ అమరావతిలోనే కేంద్రీకృతం చేయడానికి సిద్ధం అవుతున్నది.
ఎన్నో త్యాగాలు చేసిన రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతూనే ఉన్నా భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంది. కానీ ఈ పార్టీ 2018 లో కర్నూలు సమావేశమై ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ను ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1. రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 2. ఈ ప్రాంతంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి. 3. ఆరు నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. 4.అధికారమంతా ఒకే చోట కేంద్రీకృతం చేయవద్దు.
రాయలసీమ డిక్లరేషన్ అమలు చేయిస్తామన్న నాడు శపథం చేసిన బిజెపి కేంద్ర రాష్ట్ర నాయకత్వం నేడు మౌనము వహించింద. కర్నూల్ లో సమావేశమై రాయలసీమ డిక్లరేషన్ ను ఆమోదించామన్న విషయమైనా బిజెపికి గుర్తుందో లేదో. ఆ డిక్లరేషన్ లోని అంశాలను ప్రస్తావించడమేలేదు. ఇది అవకాశ వాదం కాదా?
అమరావతి రాజధానిని ఇంకా విస్తరింప చేసేందుకు భూములు కబళించాలని రెండు చేతులు బార్లాచాస్తున్న టిడిపి అభివృద్ధి కేంద్రీకరణకు పూర్తిగా సహకరించడమంటే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ మైన చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా నాంది పలికినట్లవుతారు. ఇలాంటి వాతావరణం నుంచి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వంటి నినాదాలు వస్తాయి. అందుకే ప్రభుత్వాలు అభివృద్ధి వికేంద్రీకరణకు పూనుకోవాలి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే డెవెలప్మెంటల్ నమూనాలను ఎన్నుకోవాలి.
(తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు)