
వారసత్వపు సంపదను మరచిన ఆధునిక నాగరికత
260 ఏళ్ల చరిత్ర ఉన్న క్రైస్తవుల సిమెట్రీ చెప్పే విశేషాలెన్నో..
బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు
ప్రాణం ఎవరి సొమ్ము భక్తి సేయ
ధనము ఎవరి సొమ్ము ధర్మమే
తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ
ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. సాధారణంగా శ్మశానంలో మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చిన చోట సమాధిని నిర్మిస్తారు. కొందరు తమ కుటుంబ సభ్యులు ఏవరైనా చనిపోతే తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత స్థలములలో చనిపోయిన వ్యక్తి యొక్క మృత శరీరమును పూడ్చి, చనిపోయిన వారికి గుర్తుగా సమాధిని నిర్మిస్తారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి.
కొందరు తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు, లేదా తమ అభిమాన నాయకుల సమాధుల వద్దకు ప్రతి సంవత్సరం చనిపోయిన వ్యక్తి యొక్క పుట్టినరోజు అనగా జయంతి రోజు, అలాగే చనిపోయిన రోజు అనగా వర్ధంతి రోజు ఆ సమాధి వద్దకు వచ్చి పూజలు చేసి మేము బాగుండాలని దీవించమని వేడుకుంటారు. గుత్తి కోట ప్రధాన మార్గానికి ఎడమ వైపు క్రైస్తవుల సిమెట్రీ ఉంది. ఇది సుమారు 260 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. మూడు నెలల శిశువు నుండి ఈ ప్రాంతాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులలో ముఖ్యుల సమాధులు మనకు కనపడతాయి. ఈ సమాధులను చూసినప్పుడు మనకు స్వర్గీయ ఎంఎస్ రామారావు ఆలపించిన ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..నిదురించు జహాపనా పాట స్ఫురణకు వస్తుంది.
దత్త మండలాలకు ఆనాటి కలెక్టర్ శ్రీ థామస్ మన్రో సమాధి జులై 6 1827 లో ఖననం చేసి తర్వాత వారం రోజులకు ఇక్కడి నుంచి తరలించి మద్రాస్ నగరంలో ఫోర్ట్ లో భద్రపరిచారు. కరువు నివారణకు ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, గంజి కేంద్రాలు నెలకొల్పి, యాత్రికులకు సత్రాలను కట్టి, చెరువులను పునరుద్ధరించిన వ్యక్తి సర్ థామస్ మన్రో. ఈ ప్రాంత దళాధిపతి కెప్టెన్ అర్చిబైద్ మెక్లాడ్ సమాధి మరియు పీటర్ బ్రూస్, విలియం రాబర్ట్సన్ సమాధులు సెప్టెంబర్ నెల 1821 లో ఖననం చేశారు. బ్రూస్ పేట వీరి పేరుతో బళ్లారిలో ఇప్పటికీ ఉంది. ఎఫ్ డబ్ల్యూ రాబర్ట్ సన్ పాత బళ్లారి జిల్లాకు పదిహేను సంవత్సరాలు కలెక్టర్ గా పనిచేసి అనంతపురం జిల్లా కేంద్రంగా ఉండే వారు, వీరు 16 డిసెంబర్ 1838 లో చనిపోయాడు. ఆయన సమాధి ఇక్కడే ఉంది.
1859లో పొరపాటున అప్పటి ప్రభుత్వం పత్తికొండలో వెలసిన మన్రో మెమోరియల్, రాబర్ట్ సన్ కు సంబంధించిన వస్తువులు అమ్మివేశారు. తర్వాత తప్పు గ్రహించి 1867 లో కొంత రాబట్టగలిగారు. ఈ సమాధులు 260 సంవత్సరాల పూర్వం నాటివి, పలు తరాలకు చెందిన పైగా అధికారులు, కమాండెంట్ మరియు మొదటి తరం రైల్వే అధికారులు ఇక్కడ సమాధి చేశారు. వీటిలో ఎక్కువగా మూత రాళ్ళతో, మూత రాళ్ళు లేకుండా, కొన్ని బంతి రాళ్ళతో నిర్మించిన సమాధులు ఉన్నాయి. మరిన్ని బంతి రాళ్ళ కైరన్లు, రాళ్ళ కుప్పలు లేని బంతి రాళ్ళ సమాధులు. కొన్ని కంతలతో, కంతలు లేకుండా కూడా ఉన్నాయి.
కొన్ని సమాధులకు నాలుగు దిక్కులలో నాలుగు రాతి సలుపులు క్రాస్ ఆకారంలో నిలిపి వున్నాయి. కొన్ని సమాధులు ఎంపిక చేసి తవ్వించినపుడు సమాధులలోని అడుగు బండ మీద రకరకాల సైజులో ఉన్నాయి. వీటిపై ఇంగ్లీషులో వారి పేర్లు హోదా చక్కగా శిలాఫలకాలపై చెక్కబడింది. బ్రిటిష్ వారు కమాండర్ల జనరల్స్, సెర్జెంట్స్, కలెక్టర్లు , రైల్వే అధికారులు మరియు తెలియని స్వదేశీయులతో సహా ఆంగ్ల పురుషులు మరియు మహిళలు సమాధులు మరియు స్మారక కట్టడాలు గుత్తి కోట ప్రాంతంలో చూడవచ్చు . 1770 వ సంవత్సరంలో క్రైస్తవ స్మశానం ఏర్పాటు చేసారు.
గుత్తి కోటకు సుదూరంగా ఉన్న కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, బళ్లారి, గుంతకల్లు, అనంతపురం లో చనిపోయిన ప్రముఖ అధికారులు, వారి కుటుంబ సభ్యులు పార్థివ దేహాలను ఇక్కడ ఖననం చేయడం ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ స్మశానవాటికలో వందకు పైగా ఇంగ్లీషు పురుషులు మరియు మహిళల సమాధులు ఉన్నాయి. 1890 లో స్మశానవాటిక చుట్టూ ఒక రాతి గోడ నిర్మించారు. దీనిని మరియు గుత్తి కోటను రాష్ట్ర ప్రభుత్వం ఒక రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు సమాధులు విసిరేసినట్టు, పట్టించుకోని ప్రదేశంలా కనిపించినా పాతబడ్డ స్థితిలోనూ ఇవి అందంగా కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
సమాధుల నిర్మాణంలో అద్భుతమైన నైపుణ్యం, పూల డిజైన్లు విశిష్టత, మొజాయిక్ పలకలు చేర్చిన పద్ధతి ఈ కట్టడాలకు అందం తీసుకువస్తోంది. సమాధులు, వాటి గోడలు సునిశితంగా చెక్కి, పాలరాతి ముక్కలతో అలంకరించారు. ప్రశాంతతకు మారుపేరు ఈ సమాధుల తోట. గుత్తి కోట, ఈ ప్రాంతంలో నివసించే ప్రజల నాగరికత, ఆహార అలవాట్లు, జీవన విధానం, వ్యవసాయం, నీటి వనరులు, కళలు, జీవ వైవిధ్యం పై ఒక మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ప్రాంత వాసులు ప్రసిద్ధి చెందిన వ్యక్తుల చరిత్రను పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్ర మారిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడి వారసత్వపు సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి.

