ప్రభుత్వ విధానాలతో  చిక్కి శల్యమవుతున్న చేనేతల బతుకు. 
x
Source: noyamora.blogspot

ప్రభుత్వ విధానాలతో  చిక్కి శల్యమవుతున్న చేనేతల బతుకు. 

ఆప్కో సంస్థ " నేడు అవినీతిలో కూరుకుపోయి చేనేతకు గుదిబండగా మారింది.

మన కళాకారుల శైలి నైపుణ్యం మన దేశానికి కీర్తిని సంపాదించి పెట్టిన చేనేత రంగం నేడు పాలకుల విధానాలతో చిక్కి శల్యం మయ్యింది మన దేశ స్వాతంత్ర ఉద్యమం కూడా చేనేత ఆలంబనగా స్వదేశీ ఉద్యమ రూపంలో కొనసాగింది . మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగం. చేనేత రంగంలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి మనం కాదనలేని నిజం. స్వదేశంలో, విదేశాల్లోనూ చేనేత ఉత్పత్తుల అమ్మకాలు మన దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందన్న సంగతి తెలియనిది కాదు. భారత ప్రధాని మోదీ మొన్న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తే రానున్న పది సంవత్సరాలలో భారత్ స్వయం సమృద్ధి చెందుతుందని ఊకదంపుడు లెక్చర్లు ఇస్తారు.

చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ‌ 5 శాతం నుండి 12 శాతం వరకు పెంచడం ద్వారా చేనేత రంగం మరణ శాసనం గా మారుతుందని కేంద్రం గ్రహించి తక్షణమే ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. జిఎస్టీ పెంపు నిర్ణయం తో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లటంతో పాటు ఆ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పేయే ప్రమాదం ఉంది.

దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావం చేనేత పరిశ్రమ, దానిపై ఆధారపడి బతుకుతున్న కార్మికులపై స్పష్టంగా కనిపిస్తోంది. పనులు లేక ఇప్పటికే వందల మంది వృత్తిని వదలి ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లారు. గద్వాల్, పోచంపల్లి, ధర్మవరం, పెద్ద పుత్త, నందవరం మాస్టర్ వీవర్స్, చేనేత కార్మికులు తక్కువయ్యారు.

చేనేత వృత్తి రక్షిస్తే అది వృత్తిదారులను పోషిస్తుంది. చేనేతను రక్షించడం- మానాన్ని కాపాడటం. చేనేత వృత్తి రక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలకించినప్పుడే పరిశ్రమ మరికొంత కాలం బతికి బట్ట కడుతుంది. వ్యవసాయదారులు పండించే పత్తి , చేనేతకు ముడి సరుకు. ఆ పత్తి నుంచి వచ్చే నూలులో 50% చేనేతకు ఉపయోగించే చిలప నూలు తయారు చేయాలి. అది చేనేత రంగం హక్కు. అందుకు అనుగుణంగా నూలు మిల్లులు యాజమాన్యాలు ఖచ్చితంగా 50% చిలప నూలు తయారు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. అమలు జరపని నూలు మిల్లు యాజమాన్యాలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అలాంటి పత్తిని దేశీయ అవసరాలు తీర్చకుండా, విదేశాలకు ఎగుమతి చేయరాదు. అలా చేయడం చేనేతకు ద్రోహమే కాదు, దేశద్రోహం కూడా.

స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇంతవరకు పత్తి ఎగుమతులపై వచ్చిన విదేశీ మారక ద్రవ్యంలో 50% వాటా చేనేత రంగానికి దక్కాలి. దీనిని చేనేత రంగం మౌలిక సదుపాయాలకు వినియోగించాలి. చేనేత సంఘాలు చిలప నూలును "ఎక్స్ ఫాక్టరీ", (అనగా ఫ్యాక్టరీలో నూలు తయారైన) రేటుకే విక్రయించాలి. బ్రిటిష్ ప్రభుత్వం 1941లో నియమించిన "హంటర్ కమిటీ నివేదిక" లోని సిఫార్సులను ఇప్పటికైనా అమలు జరపాలి.అందులో చేనేత రంగాన్ని బతికించుకునే అనేక మార్గాలను, సూచనలను పొందుపరచడం జరిగింది.

చేనేతలకు సంక్షేమ పధకాలలో భాగంగా కేటాయించే ఇళ్ళకు బదులుగా , వారికి అపార్ట్మెంట్ లు కట్టించి గ్రౌండ్ లెవెల్లో మగ్గాలు ఏర్పాటు చేయాలి. మిగిలిన ఖాళీ స్థలంలో చేనేత ఉప వృత్తుల వారి వృత్తి పనుల నిర్వహణ ,చేనేత వృత్తి ఆధునీకరణ, నైపుణ్యం పెంపుదల శిక్షణా తరగతులు కార్యక్రమాలకు, మిగిలిన స్థలం చేనేత పిల్లల స్కూల్ కి, ఆట స్థలానికి కేటాయించాలి. చేనేత సహకార సొసైటీ "మూలధనం"తో ఏర్పాటైన "ఆప్కో సంస్థ " నేడు అవినీతిలో కూరుకుపోయి చేనేతకు గుదిబండగా మారింది.ఆ సంస్థను రద్దు చేసి , అవినీతి నాయకులు, అధికారులను కఠినంగా శిక్షించాలి. అవినీతికి ఆస్కారం లేని "మరో విక్రయ సంస్థ"ను దాని స్థానంలో ఏర్పాటు చేయాలి. నూలు దారం అతకడం చేతకాని, "పడుగు - పేక" అంటే ఏమిటో తెలియని నాయకులు, అధికారుల సూచనలను ప్రభుత్వాలు అమలు చేయకుండా, ప్రజల డబ్బు వృధా చేయరాదు. "వృత్తిని రక్షిస్తే , అది వృత్తిదారులను పోషిస్తుంది! "

"చేనేతను రక్షించడం - మానాన్ని కాపాడటం!". చేనేత ఒక కుల వృత్తి కాదు,19 ఉపకులాల తో పాటు, 13 ఇతర కులాల వారికి జీవనోపాధి చూపిస్తున్న వృత్తి. ఒకప్పుడు బంగారు నాణాలకు, సమాన తూకం విలువ గడించిన వృత్తి. ఒక్క చేనేత పరిశ్రమే కాదు దేశంలో స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. దీంతో అనేకమంది ఉపాధి కోల్పోయి, నిరుద్యోగులుగా మారుతున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. స్పిన్నింగ్ మిల్లుల్లో దాదాపు మూడోవంతు మూతపడే స్థితిలో ఉన్నాయి. రూ.80,000 కోట్లు విలువైన పత్తిని కొనేవారు లేరు.

ప్రభుత్వం ముడి పదార్థాల ధరను తగ్గించి, ఎగుమతులపై పన్ను తగ్గించాలి. ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు అందేలా చూడాలి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా నుంచి ముడి పదార్థాల దిగుమతిని నిషేధించాలి. సూరత్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వస్త్ర పరిశ్రమలో స్తబ్దత, ఉద్యోగాల కోత పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అయినా, ఈ సమస్యను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు . ఎందుకంటే, ఈ రంగంలో ఎక్కువ భాగం అసంఘటిత రంగం కిందకు వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందడం లేదు. ప్రభుత్వ జౌళీ, చేనేత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో దొరికే డేటాను పరిశీలిస్తే, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో నిరుద్యోగం, స్తబ్దత లాంటి విషయాల్లో పెద్దగా మార్పు లేదని అర్థమవుతుంది.

Read More
Next Story