గుల్లలమోద మిసైల్ పరీక్షా కేంద్రం:పాత కానుక కొత్త ప్యాకేజీ
x

గుల్లలమోద మిసైల్ పరీక్షా కేంద్రం:పాత కానుక కొత్త ప్యాకేజీ

నాగాయలంక సమీపాన మిసైల్ టెస్ట్ రేంజ్ దేశంలో రేండోది...


అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ అధ్యక్షతన విల్మింగ్టన్ నగరంలో 21 సెప్టెంబర్ ‘24న జరిగిన నాలుగు ‘క్వాడ్’ దేశాలైన ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా సమావేశం తర్వాత- ‘విల్మింగ్టన్ డిక్లరేషన్’ పేరుతో ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. మన విదేశాంగ శాఖ కూడా అధికారికంగా వెల్లడించిన ఆ ప్రకటనలో- ‘మేము... ఇండో ఫసిఫిక్ ప్రాంతంలోని నాలుగు సముద్రతీర ప్రజాస్వామ్య దేశాలుగా ...’ అంటూ ఈ దేశాలు తమను తాము అభివర్ణించుకున్నాయి. దీనిపై మాజీ జాతీయ భద్రతా అంశాల సలహాదారుడు ఎం. కె. నారాయణన్ ఈ వారం స్పందిస్తూ, ‘వీరి లక్ష్యం ఈ నాలుగు దేశాలు కలిసి, చైనా ఆధిపత్యాన్ని నిలువరించాలి... అయితే, ఇండియా విషయంలో అదేమంత తేలికైంది కాదు, అది ఈ ‘గ్రూపు’లోని సభ్య దేశాలతో సఖ్యతతో ఉంటూనే, చైనాతో కూడా ఎంతో జాగ్రత్తగా తన సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

ఇది జరిగాక, అక్టోబర్ 14న డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘కేబినేట్ కమిటీ ఆన్ సెక్యురిటీ’ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలలో- కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద కొత్తగా ‘మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ సెంటర్’ ఏర్పాటుకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే, ఈ పాత విషయాన్ని ఇదేదో కొత్తది అన్నట్టుగా జాతీయ మీడియా ‘హైలైట్’ చేసింది. అలవాటు మేరకు అది చేయడం అయితే చేసింది కానీ, కానీ దీనివల్ల ‘ఎన్డీఏ’కి ఒక సమస్య కూడా లేకపోలేదు. గత నెల ‘క్వాడ్’ సమావేశం అయిన వెంటనే వేగంగా ఇండియా రంగంలోకి దిగి ‘ఆసియా-ఫసిఫిక్’ ప్రాంతంలో పాత ప్రాజెక్టుతో తన సిద్దబాటును చూపించి, ఉనికిని కాపాడుకోవడానికి చేసిన ఒక బలహీన ప్రయత్నం ఇది అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.

అయితే ఈ విషయంలో గతంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ప్రదర్శించిన దూరదృష్టిని ఇక్కడ మనం గుర్తుచేసుకోక తప్పదు. సుదీర్ఘకాలం మన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యాక, ఇక ముందు మన విదేశీ విధానం- ‘లుక్ ఈస్ట్’ (తూర్పు చూపు) అని ఆయన అన్నారు. ఆ తర్వాత వాజపేయి ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగించింది. అయితే తూర్పు ఆసియాదేశాల ‘జియో పొలిటికల్’ అనివార్యత, మరొక అడుగు ముందుకేసి, ఇప్పుడు ‘యాక్ట్ ఈస్ట్’ ను అది అనివార్యం చేసింది.

దాంతో మునుపటికంటే మరింత చురుగ్గా వడివడిగా అడుగులు వేస్తూ డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన పదవీ కాలం ముగిసే ముందు, దక్షణాదిన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి జరిగే లాభనష్టాల బేరీజుకు వెరవక, రాష్ట్రాన్ని విభజించి తెలంగాణను 2014 జూన్ నాటికి కొత్త రాష్ట్రంగా ప్రకటించింది. అలా ఆంధ్రప్రదేశ్ ను సముద్రతీరం రాష్ట్రం చేసి, దక్షణ భారత ప్రధాని గుర్తించిన ‘పి.వి. తూర్పు చూపు’ అమలుకు మన్మోహన్ మార్గం సుగమం చేసారు. ఈరోజున భారత ఆగ్నేయ-ఆసియా ముఖద్వారంలో 970 కి.మీ. తీరం ఉన్న ఏకైక రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ మారిన ‘జియో-పొలిటికల్’ ముఖచిత్రంలో- ‘ఇండో-ఫసిఫిక్’ ప్రాంతంలో దేశానికి పెద్ద అండగా మన రాష్ట్రం మారింది.

అయితే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక, దివంగత ప్రధాని వాజ్ పాయి ప్రధమ వర్ధంతి సందర్భంగా, మన దేశం 1998 లో తొలి అణ్వస్త్ర ప్రయోగం చేసిన రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ వద్ద రక్షణ మంత్రి రాజనాధ సింగ్ మాట్లాడుతూ- ‘ముందుగా మేము దాడి చేయం అనే ఒకప్పటి మా అణ్వాయుధ విధానం, పరిస్థితులను బట్టి అది మారితే మారవచ్చు’ అంటూ అక్కడ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు. ఆ ఇది జరిగిన పదిరోజులకు మన నాగాయలంక వద్ద ప్రతిపాదిత రాకెట్ ప్రయోగ కేంద్రం స్థలం వద్దకు సింగ్ రావాలి. అందుకోసం నిర్ణయించిన తేది 26 ఆగస్టు 2019 ఆ రోజు దివిసీమ ప్రాంతంలోని గుల్లలమోద గ్రామంలో లాంచనంగా శంకుస్థాపన జరగాలి.

అప్పటికి ఇక్కడ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం స్థానంలోకి వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం వచ్చింది. ఏ.పి. నుంచి మోడీ ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉన్న నాయకుడు కేబినేట్ మంత్రి పదవి నుంచి రాజ్యంగ పదివిలోకి మారారు. అయిన ఇది తన సొంత రాష్ట్రంలో మొదలవుతున్న ప్రతిష్టాత్మక రక్షణ రంగ ప్రాజెక్టు కావడంతో, దీనికి హాజరు కావడానికి ఆసక్తి చూపారని అప్పట్లో అన్నారు. మొత్తానికి ఏవో కారణాలతో రాజనాథ్ సింగ్ సందర్శన అయితే వాయిదా పడింది గానీ, దానికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 351.61 ఎకరాల్లో జరగవలసిన భవన నిర్మాణాలు యధావిధిగా జరుగుతూనే వున్నాయి.

రక్షణ మంత్రిత్వ శాఖలో డిల్లీ కేంద్రంగా పనిచేసే ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డి.ఆర్.డి.ఓ.) రూ.100 కోట్లతో ఆగ్నేయాన నిర్మించనున్న ఈ ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ ప్రతిపాదిత రాష్ట్ర రాజధాని అమరావతికి 50 కి.మీ. విమాన దూరాన (‘ఎయిర్ డిస్టెన్స్’) బంగాళా ఖాతం తీరంలో ఒకనాటి డచ్చి సెటిల్మెంట్ ప్రస్తుత కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద గ్రామం వద్ద దీన్ని నిర్మిస్తున్నారు. నిజానికి మెరైన్ పోలీస్ అకాడమీ కూడా ఇదే తీరాన రావలసి వుంది. కానీ, ‘పెప్పర్ స్ప్రే ’ ఉపయోగించి అయినా సరే రాష్ట్ర విభజన ఆపుతాం అంటూ మనవాళ్ళు చేసిన హంగామా చేస్తున్న రోజుల్లో దాన్నికాస్త మన బందరు నుంచి గుజరాత్ పట్టుకుపోయారు.

ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్లి మనం గతం నెమరు వేసుకోవాలి. యు.పి.ఏ-2 లో రక్షణ మంత్రిగా ఉన్న ఏ.కె. అంటోనీ 2013 నాటికి, డిల్లీ ‘వార్ రూమ్’ వద్ద ఎంతటి ఉద్రిక్త పరిస్థితి ఉన్నా ఏ దశలోనూ తాను మాత్రం మీడియా ముందుకు రాకుండా, తను అధ్యక్షుడిగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన కొరకు ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ని ముందు పెట్టి మొత్తం విభజన కధ నడిపించారు. రక్షణ శాఖ వ్యూహాలు అంటే ఇలాగే ఉంటాయి కావొచ్చు. ఇక్కడ మనవాళ్ళు అయితే, కొందరైతే ‘తెలంగాణ’ను సోనియా గాంధీకి ఇచ్చిన ‘బర్తడే గిఫ్ట్’ అని కూడా అన్నారు.

దక్షణ భారతదేశంలో ఒక రాష్ట్ర విభజన, ఈదేశ తూర్పుతీర రక్షణ దృష్టితో జరగడం, అది అప్పటికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక అవసరం కనుక అయితే కావచ్చు కూడా. ప్రతి రాజ్యానికి తన ప్రాదేశిక రక్షణ కోణంలో తమవైన వ్యూహాత్మక అనివార్యతలు వుంటాయి. ప్రభుత్వంలో ప్రతిదీ అప్పటికప్పుడు బహిర్గతం కావాలని ఏమీ లేదు. డిల్లీలో అప్పట్లో షిఫ్ట్ వారీగా ‘వార్ రూమ్’ బీట్ డ్యూటీ చేసిన తెలుగు టివి చానళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక దశలో కేంద్ర మంత్రి వాయలార్ రవి – ‘రాష్ట్రాన్ని విభజించడం అంటే, దోసెలు వేయడం కాదు గదా...’ అన్నది ఎందుకో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తు చేసుకోవలిసి వుంది.

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళ తర్వాత ఈ గతం ప్రస్తావన అంతా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే, ఐదేళ్ళ విరామం తర్వాత మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ‘ఎన్డీఏ’ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కారణంగా ఇప్పుడు ఇదేదో మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన, బాబు తెచ్చిన కొత్త ‘ప్రాజెక్టు’ అన్నట్టుగా ‘మిస్సైల్ స్టేషన్’ వార్తలు తెలుగు మీడియా రాస్తుంటే, దీని గురించి మాట్లాడక తప్పడం లేదు. డిల్లీ ప్రభుత్వాన్ని సమర్దిస్తున్న ‘మీడియా’ అంటే సరే, మొదటి నుంచి అది ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రదర్శిస్తున్న లౌక్యం సంగతి అంటే అది తెలిసిందే. కనీసం మన తెలుగు ‘మీడియా’ అయినా ‘ఇదేమన్నా కొత్తదా?’ అని ప్రశ్నించడం మాని, నిజంగానే అదేదో కొత్త ‘శాంక్షన్’ అన్నట్టుగా వార్తలు రాసి, రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తే ఎలా? మనం ఎవరినీ మోసం చేస్తున్నట్టు? ఇదేమో 2019 ఆగస్టు నుంచి ఇక్కడ నిర్మాణంలో ఉన్న కేంద్ర రక్షణ శాఖ ప్రాజెక్టు. అటువంటప్పుడు, ఇక్కడ రాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే దానికి ఏమయింది?

అయినా మళ్ళీ ‘నార్మన్ ఫోస్టర్’ డిజైన్లుతోనే అమరావతి వద్ద నిర్మిస్తాము, అని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నప్పుడు, 2019 తర్వాత టిడిపి ప్రభుత్వం అధికారంలో లేని కాలంలో ఇక్కడ నిర్మాణం మొదలైన ఈ రక్షణ శాఖ మిస్సైల్ కేంద్రానికి బహుళ అంతస్తుల (టవర్స్) భవన సముదాయం ఇంత తక్కువ ‘ఎయిర్ డిస్టెన్స్’లో ఉండడం అంటే, రేపు అది ఎంత మేర భద్రం అనేది ఆయా రంగాల నిపుణులు మాత్రమే స్పష్టం చేయవలసిన అంశం.

Read More
Next Story