ప్రజాస్వామ్యాన్ని పరిమళించిన తీర్పు...
x

ప్రజాస్వామ్యాన్ని పరిమళించిన తీర్పు...

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబును నిర్దోషిగా గుర్తించి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిఢమిల్ల చేసింది.


-రమణాచారి

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబుతో పాటు మహేష్ టిర్కి, ఏం.కేశవ్ దత్త, ప్రశాంత్ రాహి, విజయ్ నాన్ టిర్కి లను నిర్దోషులుగా గుర్తించి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, వాల్మీకి ఎస్సే మేనేజె లు సంచలనాత్మక తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిఢమిల్ల చేసింది.

కాగా ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న పాండు పోరా నురాటే ఆగస్టు 2022 సంవత్సరంలోనే మరణించడం అత్యంత బాధాకరం. 2014 సంవత్సరంలో మోపబడిన ఈ కేసులో,గడ్చిరోలి సెషన్స్ కోర్టు మార్చి,2017న ప్రొఫెసర్ సాయిబాబుతో సహా ఆరుగురుని ముద్దాయిలుగా గుర్తించి జీవిత ఖైదు విధించింది. 90% శాతం వికలాంగుడు, పలు రకాల జబ్బులతో,తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసిన సూచనలను పాలకులు పట్టించుకోక పోవడం అత్యంత విచారకరం.

దేశంలో అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ విశ్లేషకులను , విమర్శకులను అక్రమకేసులతో వేధించడం, జైలుపాలు చేయడం సాధారణం అయిపోయింది చంపాలనుకున్న కుక్కను పిచ్చికుక్క అని పేరు పెడితే ప్రజా ఆమోదం ఉంటుందన్నట్లు,ప్రత్యర్థులకు నిషేధిత సంస్థల సంబంధాలు ఉన్నాయన్న పేరుతో వేధింపులు కొనసాగుతున్నాయి.


ప్రధానంగా మావోయిస్టులతో సంబంధాల పేరుతో బుద్ధి జీవులను, రాజకీయ విశ్లేషకులను, కవులను, కళాకారులు,మేధావులను అక్రమ కేసులతో ఇరికించి వేధింపులకు గురి చేయడం పాలకులకు ఆనవాయితీగా మారింది. తమ రాజకీయ ప్రత్యర్థులపైన కూడా అక్రమ కేసులుమోపి , పౌర సమాజంలో భయాందోళన రేకెత్తించే ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతుంది.

చట్టాలలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని, వ్యక్తులను టార్గెట్ చేసి ఎలాంటి సాక్షాలు, రుజువులు లేకుండానే ఏళ్ల తరబడి జైల్లోని నిర్బంధించడం సర్వసాధారణమైంది. పాలకులు తీసుకొస్తున్న, పదులు పెడుతున్న నల్ల చట్టాలు,పౌర సమాజానికి ఇబ్బందికరంగా, పాలకులకు తలవొంపులు తెచ్చేవిగా మారుతున్నాయి. అయినా పాలకులు బరితెగించి ఎలాంటి దుర్మార్గానికైనా ఒడి కట్టడం చూస్తుంటే, ప్రస్తుత పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీని తలపింప చేస్తున్నది వాస్తవం.

ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను అండా సెల్లో నిర్బంధించి,సరైన సదుపాయాలు లేకుండా వైద్యం అందించకుండ, సహాయకుడ్ని ఏర్పాటు చేయకుండ, అనేక ఇబ్బందులకు గురి చేశారు. విపరీతమైన చలిని, విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకొని చావు నిరాకరిస్తున్నానన్న ప్రొఫెసర్ సాయిబాబు ను బాంబే హైకోర్టు 2022 లోనే నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా తిరిగి విచారించమని బాంబే హైకోర్టును ఆదేశించింది.

ఆనాటి నుండి విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో ఉన్న వారందరినీ ఈరోజు అనగా 5/3/2024 నిర్దోషులుగా ప్రకటించి వెంటనే విడుదల చేయాలని ఆదేశించడం హర్షించదగ్గ విషయం. కాకపోతే ఇన్నేళ్లు అక్రమ నిర్బంధంలో,ఇబ్బందుల్లో జీవించిన సాయిబాబు ఆత్మ నిర్భరత స్లాఘ నియమైనది. జైళ్లలో నిర్బంధ సమయంలో నిందితులుగా ఉన్నవారు ,కోల్పోయిన జీవితాన్ని, విలువైన కాలాన్ని, కుటుంబ సభ్యులు పొందిన ఆవేదనకు మూల్యం ఎవరు చెల్లించాలి. ముఖ్యంగా సాయిబాబు సహచరి వసంత, కూతురు, బాధ్యత కుటుంబ సభ్యులు పొందిన మనోవేదన వెల కట్టలేనిది.

అక్రమంగా మోపబడిన కేసును కొట్టివేసి విడుదల చేయడానికి ఆహ్వానిద్దాం. ఆమనెస్టీ ఇంటర్నేషనల్ సూచనలు కూడ పాటించని వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి. గడ్చిరోలి కేసు విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పాలకుల కుట్రలకు, అప్రజా స్వామిక చర్యలకు చంపపెట్టుగా భావించక తప్పదు.

ప్రభుత్వాలు ఇప్పటికైనా, ఈ తీర్పును గుణపాఠంగా తీసుకొని పౌర ప్రజాస్వామ్యవాదుల పైన అక్రమంగా మోపిన కేసులను బేషరతుగా ఉపసంహారించు హించుకోవాలని డిమాండ్ చేయాలి. బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను, మరింత పదును పెట్టి అమలుపరుస్తున్న పాలకుల విధానాలను పౌర సమాజం ఎండగట్టాలి .

ఉపా లాంటి క్రూర చట్టాలను వెంటనే రద్దు చేయాలనే నినాదంతో ఉద్యమించాలి . కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపా చట్టాన్ని ప్రవేశపెట్టిన హోం శాఖామంత్రి చిదంబరానికి కూడ, దాని బారిన పడ్డాకే దాని క్రూరత్వాన్ని అర్థం అయ్యిందన్న విషయం గమనంలోకి తీసుకోవాలి. అధికారంలో రాజకీయ పార్టీలు మారుతున్నాయి తప్ప ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ముందడుగు పడడం లేదు. ప్రశ్నించే గొంతుకలపై క్రూర చట్టాల కత్తులు వేలాడుతున్నంత కాలం ప్రజాస్వామ్యం అపహస్యం అవుతూనే ఉంటుంది.

మీ తీర్పును మీరు గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. భీమా కోరేగాం కేసుతో సహా ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రూర చట్టాల అమలుతో, నిర్బంధంలో ఉన్న వారందరరిని తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్ తో జాతీయస్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టి పోరాడటం, పౌర సమాజం చారిత్రక కర్తవ్యంగా గుర్తించాలి.

(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal.)

Read More
Next Story