రైతుల ఆత్మహత్యలు ఆగినప్పుడే రైతు దినోత్సవానిక అర్థం
x

రైతుల ఆత్మహత్యలు ఆగినప్పుడే రైతు దినోత్సవానిక అర్థం

డిసెంబర్ 23 రైతు దినోత్సవ సందర్భంగా ప్రత్యేకం

భారతదేశ ఐదవ ప్రధానమంత్రిగా పని చేసిన చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజు డిసెంబర్ 23 ను భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవం గా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2023-2024 నాటికి 332.2 మిలియన్ టన్నులకు చేరింది. 2020-2021 లో 310.7 మిలియన్ టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిందని, ఇందుకు కారణం తాము అనుసరించిన రైతు అనుకూల విధానాలేనని, అధికారికంగా ప్రకటించుకుంటున్నది. దేశ భూభాగంలో 54.8 శాతం – అంటే 328.7 మిలియన్ హెక్టార్లు వ్యవసాయ సాగు భూమిగా ఉందని, దీని ద్వారా దేశ GDPకి 17.7 శాతం వ్యవసాయ రంగం నుండి విలువ చేరుతున్నదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

దేశ అభివృద్ధిలో,దేశానికి ఆహార భద్రత చేకూర్చడంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, సాధారణంగా వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని ఎవరైనా భావిస్తారు. దేశంలో ప్రజలు ఆకలి లేకుండా ఉంటారని కూడా అందరూ అంచనాకు వస్తారు.

కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. వ్యవసాయ కుటుంబ సగటు అప్పు 74,121 రూపాయలు. 28 రాష్ట్రాలలో , రైతు కుటుంబాల అప్పుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ 93.2 శాతం కుటుంబాలతో కనీస అప్పు 2,45,000 రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 91.7 శాతం కుటుంబాలతో, సగటు అప్పు 1,50,000 రూపాయలతో రెండవ స్థానంలో ఉంది. కేరళ 69.9 శాతం కుటుంబాలతో మూడవ స్థానంలో ఉంది. హర్యానా, పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు లక్షకు పైగా సగటు అప్పుతో తరువాత స్థానాలలో ఉన్నాయి. 11 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ అప్పును కలిగి ఉన్నాయి.

దేశంలో జాతీయ నమూనా సర్వే సంస్థ ( NSSO) 2019 జనవరి 1-2019 డిసెంబర్ 31 మధ్య 77 వ రౌండ్ సర్వే గా రెండు విడతలుగా చేసిన సర్వే లో దేశ వ్యవసాయ కుటుంబాల స్థితిగతులపై వెలువడిన అంశాలు, ప్రభుత్వం చెప్పుకుంటున్న విజయాలకు భిన్నంగా ఉన్నాయి.

దేశంలో వ్యవసాయ రంగం బాగుండడం అంటే , కేవలం వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణం పెరగడం కాదనీ, వ్యవసాయ కుటుంబాల సంక్షేమం ప్రధాన ప్రాతిపదికగా చర్చ జరగాలనీ 2006 లోనే జాతీయ వ్యవసాయ కమిషన్ స్పష్టంగా చెప్పినప్పటికీ, ఇప్పటికీ ప్రభుత్వాలు, రైతు, వ్యవసాయ కూలీ, మొత్తంగా గ్రామీణ కుటుంబాల సంక్షేమం ప్రాతిపదికగా మాట్లాడడం లేదు.

NSSO అంచనా ప్రకారం దేశంలో 93.09 మిలియన్ల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయ కుటుంబం అంటే, నెలకు నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని(పంటల సాగు , ఉద్యాన పంటల సాగు, పశువుల మేత సాగు, పశు సంవర్ధన, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం, తేనె తీగల పెంపకం, వర్మి కల్చర్, పట్టు పురుగుల పెంపకం) పొందడం.

దేశ వ్యవసాయ కుటుంబాల సగటు ఆదాయం నెలకు 2013 లో 6426 రూపాయలు ఉండగా, 2019 నాటికి అది నెలకు 10,218 రూపాయలకు పెరిగింది. అయితే ఉద్యోగులకు 2018 లో ప్రకటించిన 7 వ పే కమిషన్ సిఫారసు ప్రకారం నెలకు 18,000 వేతనం ఉందని గుర్తు పెట్టుకోవాలి. పైగా వ్యవసాయ కుటుంబానికి వచ్చే నెలసరి ఆదాయంలో అధిక భాగం 4063 రూపాయలు కూలి ద్వారా వస్తుందని గుర్తిస్తే, నిజంగా రైతులకు పంటల ఉత్పత్తి ద్వారా అతి తక్కువ ఆదాయం మాత్రమే వస్తుందని మనకు అర్థమవుతుంది.

వ్యవసాయ కుటుంబాలకు అతి తక్కువ ఆదాయాలు ఉండడం వల్లనే, ఆయా కుటుంబాలు అప్పుల ఊబి నుంచి బయట పడలేకపోతున్నాయి. 1995 నుండి 3 లక్షలకు పైగా దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే గత పదేళ్ల లోనే ( 2013 నుండి 2022 వరకు ) మోడీ ప్రభుత్వ కాలంలో 1,20,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో స్వంత భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఉంటున్నారు. ఈ రైతు ఆత్మహత్యలు ఆగకుండా, దేశంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం అర్థం లేనిది.

దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రకారం PM కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుండి 11 కోట్ల మంది రైతులకు మూడు లక్షల 46 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం క్రింద 2016 నుండి 68 కోట్ల 85 లక్షల మంది రైతు దరఖాస్తుకు ఒక లక్షా 65 వేల కోట్ల రూపాయల క్లైమ్స్ చెల్లించినట్లు ప్రకటించింది.

వ్యవసాయ రంగ అభివృద్ధికి, తాను చాలా ముఖ్యమైన పథకాలుగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే ఈ పథకాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. 2018లో pm కిసాన్ లబ్ధి దారులుగా ఉన్న రైతులే ఇప్పటికీ ఈ పథకం లబ్ధిదారులుగా ఉండడం ఈ పథకానికి ఉన్న పరిమితి. గత ఆరేళ్లలో దేశంలో సన్న, చిన్నకారు రైతుల సంఖ్య పెరుగుతున్నా, అందరినీ , ఈ పథకం పరిధిలోకి తీసుకు రావడం లేదు. దేశంలో 14 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉంటాయని చెప్పుకుంటున్నప్పటికీ, అత్యధికంగా 2022-2023 నాటికి 10,71,63,60 కుటుంబాలు మాత్రమే పథకం పరిధిలోకి వచ్చాయి. తెలంగాణలో రైతు బంధు పథకం పరిధిలో 69 లక్షల మంది రైతులు ఉంటే, PM కిసాన్ పథకంలో 2022-2023 నాటికి 35,81,172 మంది మాత్రమే కవర్ అయ్యారు. పైగా కేంద్రం ఈ పథకం క్రింద అందించే సంవత్సరానికి 6000 రూపాయల సహాయం కూడా మూడు విడతలుగా ఇవ్వడం వల్ల, రైతుల పెట్టుబడికి పెద్దగా ఉపయోగపడడం లేదు పైగా ఈ పథకం వ్యవసాయం చేసినా, చేయకపోయినా, భూమి యజమానులకు మాత్రమే అందుతున్నది, భూమి లేని కౌలు రైతులకు అందడం లేదు.

ప్రధానమంత్రి పంటల బీమా పథకం కూడా ఇంకా కొన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాలు స్వంత బీమా పథకాలు పెట్టుకున్నాయి. అసలు పంటల బీమా పథకం లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. 2020 ఖరీఫ్ లో KCR ప్రభుత్వం ఆపేసిన పంటల బీమా పథకాన్ని, 2023 ఖరీఫ్ నుంచి PMFBY పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం గడిచినా పథకాన్ని మళ్ళీ ప్రారంభించలేదు. డిసెంబర్ 22న తాజాగా అసెంబ్లీ లో ఒక ప్రకటన చేస్తూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, ఈ పథకాన్ని 2024 ఖరీఫ్ నుంచి అమలు చేస్తామని చెప్పారు.

2016-2017 నుండీ 2020-2021 వరకూ రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, బీమా కంపెనీలకు 1,26,500 కోట్లు ప్రీమియం చెల్లించగా, రైతులకు అందిన పరిహారం మాత్రం కేవలం 87,320 కోట్లు మాత్రమే. అంటే ఆచరణలో ఈ పథకం రైతులకు పెద్దగా ఉపయోగపడక పోగా, ప్రైవేట్ బీమా కంపెనీలకు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నది.

2024 మార్చ్ 31 నాటికి 7 కోట్ల, 75 లక్షల మందికి కిసాన్ క్రీడిట్ కార్డులు పంపిణీ చేసినట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి (AIF) పథకం క్రింద, 2024 నవంబర్ 24 నాటికి 84,333 ప్రాజెక్టులకు 51,448 కోట్ల సహాయం చేసినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది.

దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య పెరుగుతున్నా, బ్యాంకుల నుంచి రైతులకు అందే రుణాలు పరిమాణం పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆ రుణాలు కూడా నిజమైన రైతులకు అందడం లేదు. ఎక్కువమంది రైతులు ఇప్పటికీ, ప్రైవేట్ ఋణాల పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని మనకు క్షేత్ర స్థాయి, అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.

అలాగే AIF పథకం సరిగా అమలు చేస్తే , గ్రామాలకు రైతులకు ఉపయోగం. కానీ పథకం అమలు తీరు కూడా నాసి రకంగా ఉంది. లక్ష కోట్లతో ఈ పథకాన్ని 2020 లో ప్రవేశపెట్టిన, ఇప్పటివరకూ లక్ష్యాన్ని చేరుకోలేదు. పైగా అనేక రైతు సహకార సంఘాలు ఈ పథకం క్రింద మౌలిక సదుపాయాల నిధి కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నాయి. కార్పొరేట్లకు వేల కోట్ల పన్ను రాయితీలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం , ఈ పథకం క్రింద , కేవలం 3 శాతం వడ్డీ రాయితీతో రుణాలు మాత్రమే రైతు సహకార సంఘాలకు బ్యాంకుల నుండి ఇప్పిస్తున్నది. కనీసం సగం పెట్టుబడి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్లాసి గ్రాంట్ గా ఇవ్వగలిగితే, రైతు సహకార సంఘాలకు ఎక్కువ ప్రయోజనం. అలాగే, రైతులు, రైతు సహకార సంఘయాలూయ కొనుగోలు చేసే యంత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లపై GST రద్ధు చేస్తే రైతులకు ఎక్కువ ఉపయోగం.

పురుగు విషాలు స్ప్రే చేసే సమయంలో రైతులకు రక్షణ కల్పించడానికి కిసాన్ కవచ్ పేరుతో రైతులకు ఒక మాస్క్ ను సరఫరా చేయడానికి మరో పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టింది.

అలాగే, 2024 ఆగస్టు 9 నుండీ 1765.67 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ పథకం ఉద్దేశం రైతులకు ఉద్యాన పంటలలో నాణ్యమైన ఉత్పత్తులు రావడం, , సగటు దిగుబడులు పెంచడం, వాతావరణ మార్పులకు తట్టుకునే రకాలను ప్రోత్సహించడం, తెగుళ్లు, రోగాలు లేని నారును సరఫరా చేయడం.

WDRA ( వేర్ హౌసింగ్ డెవెలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ) క్రింద నిర్మించిన గోదాములలో రైతులు తమ ఉత్పత్తులను దాచుకుంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ( e – NWRs ) పథకం క్రింద క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద రుణాలు ఇవ్వడానికి 2024 డిసెంబర్ 16 న కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకాలు రైతులకు ఉపయోగకరమే అయినా, ఇవి రైతులకు ఎప్పుడు చేరతాయో తెలియదు. ఎక్కువ భాగం ఈ పథకాలను, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. అలాగే ఈ పథకాలన్నీ, సొంత భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి. భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయంలో కీలకమైన పనులు చేసే వ్యవసాయ కూలీలకు, ముఖ్యంగా మహిళా వ్యవసాయ కూలీలకు తక్షణమే అందుబాటులోకి రావడం లేదు.

తాజాగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒకటి , రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలనీ, రైతులకు ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని సిఫారసు చేసింది. ఈ రైతు దినోత్సవం సందర్భంగా అయినా కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను అమలు చేయడానికి పూనుకోవాలి.

Read More
Next Story