నబార్డ్  చెప్పిన పల్నాటి  కౌలు రైతు కథ విన్నారా!
x
Representative Image. Source: Press Institute of India

నబార్డ్ చెప్పిన పల్నాటి కౌలు రైతు కథ విన్నారా!

P-4 రాష్ట్రంలో పేదరైతుల కష్టాలు


గుంటూరు పల్నాడు జిల్లాలో, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉండవచ్చు.

NABARD వారు 2023 లో, ఉమ్మడి గుంటూరు-పల్నాడు ప్రాంతంలో చేపట్టిన ఒక అధ్యయనం ఆధారంగా తెలిసిన ఆసక్తికరమైన విషయాలు:

ఆ ప్రాంతంలో 88% రైతులు, అందులో 90% కౌలు రైతులు, అప్పులు పాలు అయ్యారు. సగటున, కౌలు రైతు కుటుంబాల తలసరి అప్పు 2 లక్షల రూపాయలకు పైగా ఉంది, కాని, వ్యవసాయం మీద వారు చేసే ఖర్చు మినహాయిస్తే, వారికి మిగిలిన ఆదాయం, అటువంటి అప్పులు తీర్చడానికి సరిపోవడం లేదు. బ్యాంకుల నుంచి సులభంగా రుణ సహాయం రాక పోవడం కారణంగా, వారు 60% కు పైగా, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి, అధికమైన వడ్డీ రేట్లకు అప్పు తీసుకోవలసి వస్తున్నది. వ్యవసాయ ఖర్చులు పెరగడం, అందుకు అనుగుణంగా, వారి వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరగకపోవడం, ఆ విషయంలో, ప్రభుత్వం వారికి కావాల్సిన సహాయం అందించలేకపోవడం కారణంగా, వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న విషయం, NABARD అధ్యయనం ద్వారా తెలుస్తున్నది.

ప్రభుత్వ విధానం కారణంగా, రైతులు గుంటూరు ప్రాంతంలో, మిరప, పత్తి వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గుతున్నారు. కాని, వాణిజ్య పంటల ధరలు హెచ్చు తగ్గులకు గురి అయ్యే అవకాశం ఉంది. ధరలు అధికంగా ఉన్నప్పుడు, వారి ఆదాయం పెరిగి, వారు పెట్టుబడి చేయడం కోసం అప్పులు చేయడం, ధరలు అకస్మాత్తుగా తగ్గినప్పుడు, వారు నష్టపోవడం జరుగుతున్నది. ధరలలో అటువంటి హెచ్చు తగ్గులను, చిన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తట్టుకోలేకపోతున్నారు.

NABARD వారి అధ్యయనం ద్వారా తెలుస్తున్న ఇంకొక విషయం, సుమారు 50% కి పైగా కౌలు రైతులకు Crop Cultivator Rights Cards (CCRCs) ల భించడంలేదు. ఆ కారణంగా వారికి బ్యాంకుల వద్ద నుంచి ఋణం అందడం లేదు. వారికి, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన క్రింద, ఇన్సూరెన్స్ రక్షణ కలగడం లేదు. ఆ విషయంలో, ప్రభుత్వం కౌలు రైతులకు కావాల్సిన సహాయం అందించడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన క్రింద, ప్రస్తుతం లాభాలు గణిస్తున్నది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే, రైతులకు పెద్దగా ఉపయోగం కలగడం లేదు.

గుంటూరు పల్నాడు జిల్లాలో, కౌలు రైతుల దైన్య మైన ఆర్థిక పరిస్థితి మీద, ఆ కారణంగా, వారిలో చాలామంది ఆత్మహత్యలకు గురి అవ్వడం గురించి, ఇటీవల, ఒక విలేఖరి ప్రచురించిన కథనం ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉండవచ్చు.

సమాచార హక్కుల చట్టం క్రింద, "రైతు స్వరాజ్య వేదిక" అనే ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన దరఖాస్తు కు స్పందిస్తూ, జిల్లా Crime Records Bureau నుంచి లభించిన సమాచారం ప్రకారం, పల్నాడు జిల్లాలో, 2014-2025 సంవత్సరాలలో 399 రైతు ఆత్మహత్యలు జరిగాయి. అందుకు ముఖ్యమైన కారణం, ఆ కుటుంబాలు అప్పులపాలు అవ్వడం. ఆ అప్పులు తీర్చడం వారికి సాధ్యం కాకపోవడం. అటువంటి రైతు ఆత్మహత్యలు, పల్నాడు-బాపట్ల, కర్నూల్-అనంతపురం ప్రాంతాల్లో అధికంగా రిపోర్టు అవుతున్నాయి.

ఆ ప్రాంతాల్లో 2024-24 లో 39 మాత్రమే ఆత్మ హత్యలు అయినట్లు, Crime Records Bureau వారి దృష్టికి వచ్చాయి.

కాని, అసలు విషయం, స్వచ్ఛంద సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, అదే సంవత్సరంలో 399 ఆత్మ హత్యలు జరిగాయి. అందులో, చాలామంది కౌలు రైతులని తెలుస్తున్నది.

ఆ స్వచ్ఛంద సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం, 2022 లో, కేవలం 9% కౌలు రైతులకు మాత్రమే CCRC లు లభించాయి. CCRC పొందలేని కౌలు రైతులు, తప్పనిసరిగా, అప్పుల కోసం, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వచ్చింది. వడ్డీ భారానికి గురి అయి, అటువంటి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది.

అప్పులపాలైన రైతుల భవిష్యత్తు, ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తు, అనిశ్చితంగా మారడం ప్రభుత్వం గుర్తించాలి.

రాష్ట్ర ప్రభుత్వం లో వ్యవసాయ విభాగం వారి నియమాల ప్రకారం, అటువంటి రైతు ఆత్మహత్య జరిగిన 24 గంటల్లో, జిల్లా రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. ఆత్మహత్యకు గురియైన రైతు కుటుంబానికి, ప్రభుత్వం GOMs No. 43 ప్రకారం, వారం రోజుల్లో, 7 లక్షల రూపాయల సహాయం అందించాలి. కాని, వాస్తవంగా, అటువంటి సహాయం పొందిన కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి అని తెలుస్తున్నది.

ఆత్మహత్యలు జరిగిన తర్వాత, రైతు కుటుంబాలకు సహాయం అందించే బదులు, రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం.

మీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కారణంగా, ఐదారు నెలల క్రింద, కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే మిరప పంటకు, quintal కు 11,781 రూపాయలు మద్దతు ధర ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను.

ప్రత్తి పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించింది. కాని, రైతులు మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వ సంస్థలు, వారి పంటలను మద్దతు ధరకు కొనే అవకాశం సులభంగా అందించినప్పుడే, వారికి లాభం కలుగుతుంది. అటువంటి సహాయం ప్రస్తుతం లభించడం లేదని, మీద సూచించిన రిపోర్టుల ద్వారా అర్థమవుతున్నది.

మన రాష్ట్రం నుంచి మిరప, పత్తి ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడం కారణంగా, ఆ పంటల ధరలు, విదేశీ మార్కెట్ ధరల మీద ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, అటువంటి ఎగుమతుల మీద, 50% సుంకం విధించిన కారణంగా, ఆ రెండు పంటల ధరలు తగ్గే అవకాశం ఉంది. అది కాకుండా, కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా, అమెరికా నుంచి దిగుమతి అయ్యే ప్రత్తిమీద, ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా తీసివేసిన విషయం మీ దృష్టికి వచ్చి ఉండవచ్చు. ఆ కారణంగా, మన రాష్ట్రంలో పత్తి పండించే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది.

మీద సూచించిన పరిస్థితులను గుర్తించి ప్రభుత్వం, రైతుల విషయంలో, ముఖ్యంగా, కౌలు రైతుల విషయంలో, ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం అవసరం.

పెట్టుబడులను ఆకర్షించే ముసుగులో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలకు, ప్రత్యక్షంగా, మరియు పరోక్షంగా ఎంతో అధికంగా ఇస్తున్న రాయితీలతో పోల్చి చూస్తే, ఆహార భద్రతకు, రాష్ట్ర పురోగతికి ఎన్నో విధాలుగా బాధ్యులైన రైతులకు, వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయ కార్మికులకు, ఇతరులకు ఇస్తున్న సహాయం ఎంతో తక్కువ అని ప్రభుత్వం గుర్తించాలి.

ఉదాహరణకు, ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం, నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కారేడు పంచాయతీ లో, 16 గ్రామాల్లో, 8,348 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను ఇండొ సోల్ అనే ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేయడమే కాకుండా, ఆ కంపెనీకి 14,152 కోట్ల రూపాయలు రాయితీలు కూడా ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం, ఆ కంపెనీకి ప్రత్యక్షంగా 5,175 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నది. పరోక్షంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ కంపెనీకి అంతకు రెండు రెట్లు రాయితీలు ఇస్తున్నాయి. అటువంటి రాయితీలతో పోల్చి చూస్తే, మన రాష్ట్రంలో, రైతులకు, తీరప్రాంతంలో మత్స్యకార కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిలో భాగస్వాములైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం అతి తక్కువ గా ఉంది.

రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు, స్వామినాథన్ కమిటీ వారి సలహా ఆధారంగా, అంటే వ్యవసాయ ఖర్చులే కాకుండా, వారి కుటుంబ సభ్యుల కనీస వేతనాలు కూడా లెఖ్ఖ లోనికి తీసుకుని, వారి భూమి మార్కెట్ ధర, వ్యవసాయంలో ఉపయోగిస్తున్న ఇతర స్థిరాస్తుల మీద, ప్రైవేట్ కంపెనీలు లెఖ్ఖలు వేసే తీరులో ఖర్చులు పరిగణలోనికి తీసుకుని, అంతకు 50% పైగా మద్దతు ధర నిర్ణయిస్తే, వ్యవసాయ కార్యక్రమాలు, ప్రైవేట్ పరిశ్రమల లాగే లాభదాయక అయ్యే అవకాశం ఉంది. కాని, ప్రైవేటు కంపెనీల మీద ప్రభుత్వం చూపిస్తున్న వ్యామోహం, రైతుల పట్ల చూపించకపోవడం బాధాకరం.

విశాఖపట్నంలో, 12,000 మందికి ఉద్యోగాలిస్తామని ఇచ్చే హామీ నెపంతో, మీ ప్రభుత్వం, 21-4-2025 న, GOMs No. 7 ద్వారా టాటా కంపెనీకి కేవలం 99 పైసలకు, రుషికొండలో, వేలకోట్ల రూపాయల విలువ ఉన్న 21.16 ఎకరాల భూమిని ధారాదత్తం చేయడం జరిగింది. అదే కంపెనీ, దేశంలో ఇతర ప్రాంతాల్లో, నిర్దాక్షిణ్యంగా, ఇటీవల 12,000 మందిని, వారి ఉద్యోగాల నుంచి తీసివేయడం, మీ ప్రభుత్వానికి తెలుసని అనుకుంటున్నాను . ఆ కంపెనీ తన హామీని నెరవేర్చే పరిస్థితి లేనప్పుడు, వారికి, అదే విధంగా ఇతర ప్రైవేటు కంపెనీలకు, చవుకగా భూములను ప్రసాదించడం, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అటువంటి వ్యామోహం, ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కలిగించి, ప్రజల ఆహార భద్రత కు దోహదం చేసే వ్యవసాయ రంగం పట్ల, చూపకపోవడం బాధాకరమైన విషయం.

రాష్ట్రంలో రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం అవసరం. వారి విషయంలో, తీసుకోవాల్సిన చర్యలను క్రింద సూచిస్తున్నాను:

  1. ఈ రోజు వరకు, ఆత్మహత్యలకు గురియైన రైతు కుటుంబాలను ప్రభుత్వం తత్ క్షణం గుర్తించి, ప్రతి కుటుంబానికి GOMs No. 43 ప్రకారం, ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారి కోసం, వారి పిల్లల భవిష్యత్తు విషయంలో, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం అవసరం.
  2. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం బాధాకరమైన విషయం. అటువంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకునే దిశలో, ఆత్మ హత్యకు గురి అయిన ప్రతి కుటుంబం విషయంలో అందుకు కారణాల మీద రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల సహాయంతో అధ్యయనం చేపట్టి, రెండు నెలల్లో, ఆ అధ్యయనం ఆధారంగా, వ్యవసాయరంగం లో చేపట్టవలసిన ప్రత్యేకమైన విధానాన్ని ప్రకటించాలి.
  3. రాష్ట్రంలో AP Crop Cultivator Rights Act, 2019 సరిగ్గా అమలు కావడం లేదు. ఆ చట్టాన్ని, కౌలు రైతుల పక్షంలో బలపరచాలి. 100% కౌలు రైతులకు, Crop Cultivator Rights లభించే దిశలో, ఆ చట్టాన్ని అమలు పరిచి, వారికి సులభంగా, బ్యాంకు రుణాలు, పంట భీమా పరిరక్షణ కలిగించకపోతే, వారి పరిస్థితి మెరుగుపడదు. ఆ దిశలో, ప్రభుత్వం మార్పులు చేయడం అవసరం.

మన రాష్ట్రంలో, వ్యవసాయ రంగం, మత్స్య సంపద, పాడి పరిశ్రమలు, రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక వంటివి. ఆ కార్యక్రమాల వలన కలిగే ఉద్యోగావకాశాలు, బహుముఖ అభివృద్ధి, ఇతర పరిశ్రమలు కలిగించలేవని ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున, వేలాది ఎకరాల విలువైన వ్యవసాయ భూములను, పరిశ్రమల కోసం తరలించడం, ఏళ్ల తరబడి ఆ భూములను, ప్రైవేట్ యజమానులు, తమ వద్ద నిరుపయోగకరంగా పెట్టుకుని, లక్షలాది మంది రైతులను నిర్వాసితులు చేసి, వారి జీవితాలను అయోమయం చేయడం, సరి అయిన విధానం కాదు. రైతుల, సంప్రదాయ మత్స్యకారుల, పాల ఉత్పత్తి దారుల సంక్షేమం, రాష్ట్ర పురోగతికి పునాది వంటిది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అందుకు అనుగుణం ఉండాలి.

(ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాసిన లేఖ)

Read More
Next Story