చంద్రబాబు, నితీష్‌లపై ఆశలు పెట్టుకోవటం దండగ!
x

చంద్రబాబు, నితీష్‌లపై ఆశలు పెట్టుకోవటం దండగ!

చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఫక్తు రాజకీయ నాయకులకు సిసలైన ఉదాహరణలు. వారికి తమ రాజకీయ ప్రయోజనాలకు మించినది ఈ ప్రపంచంలో మరేదీ ఉండదు.


చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఫక్తు రాజకీయ నాయకులకు సిసలైన ఉదాహరణలు. వారికి తమ రాజకీయ ప్రయోజనాలకు మించినది ఈ ప్రపంచంలో మరేదీ ఉండదు. మోది 3.0 ప్రభుత్వంలో వీరిద్దరిదీ కీలకపాత్ర కనుక వారు ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు కృషి చేస్తారని ఆశించటం పొరపాటు. ప్రజాస్వామ్యవాదులు సొంతంగా కృషి చేసుకోవలసిందేగానీ వీరిని నమ్ముకోవటం శుద్ధ దండగ.

ఛత్తీస్‌గడ్‌లో ఒక లారీలో గేదెలను తరలిస్తున్న ఇద్దరు పశువుల వ్యాపారులను నరికి చంపటంపైగానీ, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేయటంపై గురించిగానీ, ముఖ్యమంత్రుల అరెస్టులపైగానీ చంద్రబాబు, నితీష్ నోరు మెదపలేదు. మోదితో సత్సంబంధాలు నెరపాలని మాత్రమే వారు ప్రస్తుతానికి కోరుకుంటున్నట్లు కనబడుతోంది.

రామ్‌విలాస్ పాశ్వాన్ 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు నిరసనగా ఎన్‌డీఏ ప్రభుత్వంనుంచి వైదొలిగారు. అయితే నాడు వాజ్‌పేయి ప్రభుత్వంలోనే రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ మాత్రం తన పదవిలో కొనసాగారు.తన సొంత రాష్ట్రం బీహార్‌లో శాంతి భద్రతలు బాగున్నప్పుడు రాజీనామా అవసరం లేదని సమర్థించుకున్నారు.

1996-98 కాలంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆ కూటమికి కన్వీనర్‌గా ఉన్నారు. 1998-2004 మధ్య ఆయన ఎన్‌డీఏ కూటమితో పొత్తులో ఉన్నప్పటికీ ప్రభుత్వంలో చేరలేదు.

బీజేపీతో గతంలో చాలా పార్టీలు సన్నిహిత సంబంధాలు నెరిపాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉండేది. ఆ పార్టీకి చెందిన మురసోలి మారన్ వాణిజ్యమంత్రిగా పని చేసి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సదస్సులలో తనదైన ముద్ర వేశారు. 1998లో గద్దెనెక్కిన వాజ్‌పేయి ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండింది, గత పదేళ్ళుగా మిత్రపక్షంగా ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండింది.

బీజేపీతో పాటే వామపక్షాలు కూడా నాడు కేంద్రంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. ఉత్తర భారతదేశంలో రామజన్మభూమి ఉద్యమం మొదలవటం, మత కలహాలు రేగటం, ఆ ఉద్యమం పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయిలో ఒక బలమైన సంస్థగా ఎదగటం అంతా ఆ సమయంలోనే జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బిజూ జనతాదళ్ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో, గత పదేళ్ళుగా మోది నేతృత్వంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండింది. జనతాదళ్ ఎస్ కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండింది, ప్రస్తుతం కొలువు తీరిన ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

కాంగ్రెస్ కాకుండా బీజేపీతో చేతులు కలపని ప్రధాన రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ మాత్రమే. అయితే కాంగ్రెస్ లోని చాలా మంది నాయకులు మాత్రం గోడదూకి బీజేపీలో చేరిపోయారు. వారు నెహ్రూ రకం సామ్యవాద సిద్ధాంతానికి తిలోదకాలు వదిలి, దేశంలో హిందువులు మాత్రమే మొదటి తరగతి పౌరులుగా ఉండాలి, మైనారిటీలు వారి ఆధిపత్యాన్ని అంగీకరించాలి అని కోరుకునే ఆరెస్సెస్ భావజాలానికి త్వరగానే షిఫ్ట్ అయిపోయారు.

మోది నేతృత్వంలోని బీజేపీతో జట్టుకట్టటం వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీతో జట్టుకట్టటంకంటే తక్కువ ప్రమాదకరం అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే దానికంటే తెలివి తక్కువ మరొకటి ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, పెద్ద పులి ప్రమాదకరం అని తెలిసినా, పులి పిల్ల ముద్దుగా ఉందంటూ దానిని పెంచటంలాగా.

ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో దీర్ఘకాలంగా అంటకాగుతున్న ఇద్దరు పార్టీ అధినేతలు తమ సీనియర్ భాగస్వామి అయిన మోదిని ప్రజాస్వామికంగా వ్యవహరించాలని కోరతారని ఆశించలేము. అది జరగని పని. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని విస్తరించటంకోసం తెలుగుదేశం నుంచి నాయకులను లాగేసుకోవటం వంటి చర్యలకు పాల్పడితే తప్ప టీడీపీ-బీజేపీ పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉండబోదు.

ముస్లిమ్ రిజర్వేషన్ అంశం

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు కొనసాగించాలని టీడీపీ కోరుకుంటోందా? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పొందే హక్కు ఉందని, ఆ క్యాటగరీలోకి వచ్చే కొన్ని ముస్లిమ్ ఉపకులాలు వాటికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో సంబంధం లేకుండా ముస్లిమ్‌లకు టీడీపీ రిజర్వేషన్ కల్పిస్తేనే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.

ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికలు మోది ఒక అనితరసాధ్యుడు అనే భావనను తుత్తునియలు చేశాయి. దళితులు మాయావతి ఆధిపత్యాన్ని సహించబోమని ఈ ఎన్నికల ద్వారా ప్రకటించేశారు, యాదవుల నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

మోది ప్రభుత్వం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలని చూసిన నేపథ్యంలో, ఈ ఎన్నికల్లో రాజ్యాంగం ఒక చర్చనీయాంశం అయింది. మోది చేసిన ఆ ప్రయత్నాలను జనం తిప్పికొట్టినట్లయింది. ఇది ఒక శుభపరిణామం.

Read More
Next Story