నోబెల్ బహుమతి వెల్లడించిన జగన్ ‘విధ్వంసం’ మూలాలు
x

నోబెల్ బహుమతి వెల్లడించిన జగన్ ‘విధ్వంసం’ మూలాలు

అమరావతిలో జరిగిందని చెబుతున్న ‘విధ్వంసం’ గురించిన ఒక చిన్న ముచ్చట

రాజధాని అభివృద్ది యాత్ర ఆరంభం అంటూ అమరావతిలోని కొత్త సిఆర్ డిఏ భవనం ముందు చంద్రబాబు నాయుడు నిలబడిన ఫోటోతో 14 అక్టోబర్ పత్రికల్లో బ్యానర్ వార్తా కధనాలు కనిపించిన రోజునే ‘సృజనాత్మక విధ్వంసం’ విశదీకరణకు పట్టం, అంటూ మొదటి పేజీలో కనిపించిన ‘నోబెల్ ఎకనామిక్స్’ అవార్డు వార్త చూస్తే, ఎవరికి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పౌరసమాజానికి అది ఆసక్తిని కలిగించే అవకాశం ఎక్కువ.

ఎందుకంటే, 2024 ఎన్నికల వరకు ఐదేళ్లపాటు ‘విధ్వంసం’ అనే పదంతో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. నిజానికి ఆ కాలంలో ‘విధ్వంసం’ అనేది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆయన విమర్శకులకు అదొక ఊత పదంగా మారింది.

హైదరాబాద్ నుంచి ‘విధ్వంసం’ పేరుతో ఒకరు పుస్తకం కూడా తెచ్చి, దాన్ని విజయవాడలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు బాబుతో విడుదల చేయించారు.

జగన్ వల్ల ‘విధ్వంసం’ జరిగింది అనేది ఆ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, అదేమిటో ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టంగా ఒక్కరూ చెప్పేవారు కాదు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును సమీక్షించే ‘నీతి ఆయోగ్’ ‘కాగ్’ లను ఉటంకిస్తూ జరిగిన ‘విధ్వంసం’ గుర్తులు కూడా చూపించలేకపోయారు. దాంతో చివరికి వాళ్ళు అంటున్న ‘విధ్వంసం’ మానవ మాత్రులకు కనిపించని ఒక బ్రహ్మపదార్ధంగా మిగిలింది. నిజానికి రాజ్యంలో భాగమైన- లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడూ సమాంతరంగా పనిచేయాలి. మరి ఈ 'విధ్వంసం' అనేది ఎక్కడ జరిగిందో తెలియదు. ఏ ప్రభుత్వంలో అయినా అధికారికంగా విధ్వంసం జరగాలి అంటే, అధికారులు లేకుండా అది సాధ్యం కాదు. అయితే అధికార యంత్రాంగం, నిబంధనల ప్రకారం వాళ్ళు ఒక పరిధిలో మాత్రమే పని చేయవలసి ఉంటుంది. పోనీ పాత అధికారులను మార్చి తమదైన అధికారుల ఎంపికతో పరిపాలన మొదలు పెట్టాక, గతంలో జరిగింది అంటున్న ‘విధ్వంసాన్ని’ ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలికదా.

ఇప్పుడు ఈ ‘విధ్వంసం’ మళ్ళీ ఎందుకు విషయం అయింది అనే సందేహం రావడం సహజం. జరిగింది ఇది వెలువడిన ఆర్ధిక రంగంలో ‘నోబెల్’ బహుమతి గ్రహీతలు ఏమి చెప్పారు అంటే- “కాలక్రమంలో పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్తవి భర్తీ చేయడం, తద్వారా పాతవాటిని రూపుమాపడం సహజం. ఆర్థిక శాస్త్రంలో దీన్నే 'సృజనాత్మక విధ్వంసం’ (క్రియేటివ్ డిస్ట్రక్షన్)'గా పరిగణిస్తారు” అంటూ 2025 ఆర్ధిక శాస్త్రంలో ‘నోబెల్’ బహుమతి గ్రహీతల ఆవిష్కరణ వివరాలను స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన ‘సృజనాత్మక విధ్వంసం' అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన జోయెల్ మాకిర్, ఫిలిప్ అఫియన్, పీటర్ హౌవిట్లను అర్ధ శాస్త్రంలో నోబెల్ వరించింది. మోకిర్ ఆర్థిక చరిత్రకారుడు. చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ.. దీర్ఘకాలిక ధోరణులపై ఆయన పరిశోధనలు సాగించారు. హౌవిట్, అఫియన్ అందుకు భిన్నమైన పంథాను అనుసరించారు. ‘సృజనాత్మక విధ్వంసం’ ఎలా పనిచేస్తుందో వివరించేందుకు గణిత శాస్త్రంపై వారు ఆధారపడ్డారు.

జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త 1942 నాటి తన 'క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ' పుస్తకంలో ఈ భావనను ప్రాథమికంగా ప్రస్తావించారు. మోకీర్ హౌవిట్, అఫియన్ 'క్రియేటివ్ డిస్ట్రక్షన్ ' ను మెరుగ్గా వివరించారని సోమవారం పురస్కార ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ ప్రశంసించింది. ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావ పరిణామాన్నీ వారు లెక్కించ గలిగారంటూ కొనియాడింది. “కొత్త ఆవిష్కరణలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నప్పుడు- అవి ఎంతవరకు ప్రయోజనకరమో చూసుకోవడమే కాకుండా, అందుకు కారణాలనూ శాస్త్రీయంగా విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకతను మోకిర్ నొక్కిచెప్పారు. మరోవైపు- సుస్థిర వృద్ది వెనుక ఉన్న క్రియావిధానాలను హౌవిట్, అఫియన్ అధ్యయనం చేశారు. సృజనాత్మక విధ్వంసానికి గణాంక నమూనాను 1992లో వారు సూత్రీకరించారు” అని నోబెల్ కమిటీ వివరించింది. ఆర్థిక వ్యవస్థను స్తబ్దత ఆవహించకుండా చూసుకునేందుకు.. ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్లో’ని క్రియా విధానాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని వీరి పరిశోధనలు చాటి చెప్తున్నాయని కమిటీ ఛైర్మన్ జాన్ హాస్లర్ పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక రంగ ఆవిష్కరణలు ఇలా ఉన్నప్పుడు, అదే కాలంలో ఏపీలో ఒక యువ ముఖ్యమంత్రి ప్రభుత్వం విషయంలో వారంటున్న ‘విధ్వంసం’ సృజనాత్మకం కాకుండా అందుకు భిన్నంగా అది ఎలా ఉంటుంది. నిష్పాక్షిక దృష్టితో దాన్ని చూసినప్పుడు, వారు అంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా ఒక చోట నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్ గ్రామపాలనకు రాష్ట్రం నాలుగు అంచుల వరకు పటిష్టమైన పరిపాలనా సంబంధమైన పునాదులు వేశాడు. అందువల్ల అధికారిక అంచెలు (‘హైరార్కీ’) తగ్గాయి. ‘ఆన్ లైన్’ సౌలభ్యంతో ప్రజావసరాలు గ్రామ సచివాలయాల్లోనే పరిష్కారం అయ్యాయి. ప్రజాప్రతినిధుల వరకు అవి పిర్యాదులుగా రాలేదు. దాంతో వైసీపీతో సహ అన్ని పార్టీల నాయకులు ఈ “విధ్వంసం” తెచ్చిన కొత్త నొప్పిని మౌనంగా భరించారు. ఇదే కాలంలో ఈ ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న మరొక అంశం, ఇది సంక్షేమ పథకాలను అమలు చేయడం. స్థానిక పరిపాలనలో మౌలిక సంస్కరణలు సూక్ష్మ స్థాయి నుంచి అమలు అవుతున్నప్పుడు, బిపిఎల్ వర్గాలకు ఒక దశ వరకు చేయూత (హ్యాండ్ హోల్డ్) ఇవ్వడం తప్పదు. అదే జరిగింది. మరి 2024 లో ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో ఈ పాలనా సంస్కరణలు మార్చలేదు సరికదా వాటిని పటిష్టం చేశాడు. అందుకు ఈ కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ తేదీ: 12.6.’25న జారీ చేసిన ‘జీవో’ 57ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో’ నెం. 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే ఆ 77 మంది అధికారుల పరిధిలోకి జగన్ గ్రామసచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ది, సంక్షేమ అభివృద్ది పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్ చార్ట్’తో బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్రంగా ఆయా కార్యాలయాల పోస్టల్ అడ్రెస్ కూడా బాబు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటిపైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత ఇలా హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది. పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనేదాంతో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది.

గతంలో మనం చూసింది సాంప్రదాయ అధికార నిర్మాణచట్రం ఎప్పుడు భద్రత కోరుకోవడం. కానీ జగన్ పాలనలో ఏపిలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలయ్యాయి. యిందువల్ల సాంప్రదాయ ‘పవర్ పాలిటిక్స్’ బహుళ అంచెలు (‘హైరార్కీ’) కొంతమేర నిర్వీర్యం కావడం నిజమే. కానీ, ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి నిరలక్షిత వర్గాలకు పరిపాలన చేరువై ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ వచ్చాయి. జగన్ పార్టీ తీసుకున్న ఈ కొత్త వైఖరి వల్ల, అది తన ఓటర్లకు- ‘మీ మెడమీద ఇకముందు ఏ కాడి ఉండదు…’ అని భరోసా ఇచ్చింది. ఈ మార్పులు తెచ్చి చివరకు ఆయన గెలిచారా ఓడారా అనేది అటుంచితే, రూపాంతర ప్రజాస్వామ్యం (‘ట్రాన్సఫార్మింగ్ డెమోక్రసీ’) దృష్టి నుంచి చూసినప్పుడు ఇది ఆహ్వానించదగిన పరిణామం.

ఇన్నాళ్ళూ కనిపించని చట్రాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్చగా బ్రతకమని పంజరం నుంచి వాటిని బయటకు వదలడం వంటిది. ఇంత చేసి- ‘మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని జగన్ ‘ఆప్షన్’ ఇవ్వడం- ‘లిబరల్ డెమోక్రసీ’ వైఖరికి పరాకాష్ట. జనానికి అది అర్ధం కాకపోతే, రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావొచ్చు. కానీ, 2025 ఆర్థిక శాస్త్రం ‘నోబెల్’ అవార్డుకు 'సృజనాత్మక విధ్వంసం’ విశదీకరణకు పట్టం కావడంతో, దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం మున్ముందు ఒక ‘కేస్ స్టడీ’ కావొచ్చు.

Read More
Next Story