రాజకీయ సామాజిక మద్దతుతో సమగ్ర కుల గణన సాధ్యం
x

రాజకీయ సామాజిక మద్దతుతో సమగ్ర కుల గణన సాధ్యం

సమగ్ర కుల గణనకు కేంద్ర మద్దతు చారిత్రాత్మకం

భారతదేశ సామాజిక రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్వచించేందుకు రాబోయే జాతీయ జనాభా గణనలో కుల ఆధారిత గణనను చేర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యను అన్ని రాజకీయ సామాజిక వర్గాలు స్వాగతించారు. మేధావులు, నిపుణులు ప్రతిపక్ష నాయకులు దీనిని డేటా ఆధారిత సామాజిక న్యాయం, సమాన విధాన రూపకల్పన వైపు చాలా అవసరమైన అడుగు అని ప్రశంసించారు. భారతదేశంలో కులం అత్యంత ప్రభావవంతమైన సామాజిక నిర్మాణాలలో ఒకటిగా ఉంది, కానీ కుల జనాభాపై సమగ్ర డేటా దాదాపు ఒక శతాబ్దం గా లేదు. జనాభా గణన 1951 నుంచి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలపై డేటాను సేకరిస్తూనే ఉన్నప్పటికీ, ఇతర వెనుకబడిన తరగతులు మరియు ఇతర కుల సమూహాలపై సమాచారం అధికారికంగా నమోదు చేయబడలేదు. ఇలాంటి డేటా లేకపోవడం వలన ప్రభావవంతమైన విధాన రూపకల్పన, వనరులు, రిజర్వేషన్ల సమాన పంపిణీకి ఆటంకం కలిగించిందని సామజిక శాస్త్రవేత్తలు మేధావులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. భారతదేశ జనాభా గణన ఇప్పటికే వయస్సు, లింగం, విద్య, మతం వృత్తి వంటి పారామితులపై సమాచారాన్ని సేకరిస్తుంది. ఓబిసిలు ఇతర కుల సమూహాల కోసం ఒక కాలమ్‌ను జోడించడంతో ఓబీసీలు ఎంత శాతం ఉన్నారని తెలుస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు అలాగే భారతదేశ విభజనకు ముందు చివరి కుల ఆధారిత జనాభా గణన 1931లో జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత, ఎస్సిలు ఎస్టీలు తప్ప, కుల గణన ను తొలగించారు. 2011లో, యుపిఏ ప్రభుత్వం సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించింది, కానీ డేటా ఖచ్చితత్వం లేకపోవడం, అంతర్గత వ్యత్యాసాలపై ఆందోళనల కారణంగా కుల డేటాను విడుదల చేయలేదు.

2011 డేటాను విశ్లేషించడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2015లో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, ఫలితాలు వెలుగులోకి రాలేదు. పరిపాలనా సంక్లిష్టత, సామాజిక సున్నితత్వాన్ని పేర్కొంటూ, కేంద్రం సంవత్సరాలుగా కుల గణన కోసం పెరుగుతున్న డిమాండ్లు ప్రతిఘటించింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రకటన ఒక ముఖ్యమైన విధాన మార్పును సూచిస్తుంది. దశాబ్ద జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చడాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. సామాజిక అసమానతను నివారించడానికి ఇది పారదర్శకంగా, నిర్మాణాత్మక పద్ధతిలో జరుగుతుంది అని నొక్కి చెప్పారు.

ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఇది సమానమైన, లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ విధానాలు రూపొందించడానికి వీలు కల్పిస్తుంది, బీహార్, కర్ణాటక మరియు తెలంగాణ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సర్వేలు ఏకరీతి ప్రమాణాలను కలిగి లేవని, గందరగోళాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు. బీహార్‌తో సహా కీలకమైన రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నందున, ప్రతిపక్షాల కుల-కేంద్రీకృత ప్రచారాల పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. వెనుకబడిన వర్గాలు జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఉన్నారని బీహార్ రాష్ట్ర సర్వే వెల్లడించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పారదర్శక కుల సర్వేకు నాయకత్వం వహించి డేటాను ప్రచురించారు, ఈ చర్య రాష్ట్ర స్థాయి ప్రయత్నాలకు ధృవీకరణగా పరిగణించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తన మ్యానిఫెస్టోలో చేర్చింది. రాహుల్ గాంధీ కుల గణనను జాతీయ సమస్య గా మార్చారు. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సమగ్ర కులగణన చేసి మార్గాన్ని చూపించాయి, ఇప్పుడు కేంద్రం కూడా దానిని అనుసరించింది.రాహుల్ గాంధీ మాట్లాడుతూ చాలా కాలంగా ఈ నిర్ణయాన్ని కేంద్రం పట్టించుకోలేదు ఇప్పుడు దీన్ని జాతీయ సమస్యగా గుర్తించి ముందుకు తీసుకువచ్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ విధానాన్ని సవరించడానికి శాస్త్రీయ ఆధారాన్ని సృష్టించడానికి సమాంతర సామాజిక, ఆర్థిక విద్యా సర్వే అవసరాన్ని నొక్కి చెప్పారు.తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సామాజిక-ఆర్థిక డేటాను ఉపయోగించుకుని రిజర్వేషన్లపై 50% పరిమితిని సవరించాలని ఒత్తిడి చేశారు.

జాతీయ స్థాయిలో ఇలాంటి సర్వేలను అమలు చేయడం ద్వారా మరింత ముందుకు సాగాలని అక్కడి నాయకులు కేంద్రాన్ని కోరారు.ఈ డేటా రాబోయే సంవత్సరాల్లో రిజర్వేషన్ కోటాలు, సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపులను ప్రభావితం చేస్తుంది. రిజర్వేషన్ సంబంధిత కేసులలో అనుభావిక డేటా అవసరాన్ని సుప్రీంకోర్టు పదే పదే నొక్కి చెబుతుండటంతో గత్యంతరం లేక కేంద్రం సమగ్ర కులగణన కు ఒప్పుకుంది. భారతదేశం తన తదుపరి జనాభా లెక్కలకు సిద్ధమవుతున్న తరుణంలో, కుల గణనను చేర్చడం కేవలం అధికారిక నవీకరణ మాత్రమే కాదు - ఇది దేశం సామాజిక సమానత్వాన్ని సాధించడంలో కీలకమైన క్షణం. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి, దేశంలో ఆయా వర్గాల వారీగా ప్రజల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం సేకరించాలి .

ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి తో పాటు వారి ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అని పూర్తి వివరాలు సేకరించాలి. దీని వల్ల ప్రస్తుతం అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అవకతవకలు జరుగుతున్నాయా? అన్న విషయాలపై ఓ క్లారిటీ రావడమే కాకుండా ప్రభుత్వం అమలు చేసిన కొత్త పథకాల విషయంలో ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారం కూడా దొరుకుతుంది. దీంతో అన్యాయం జరిగిన వర్గాలకు కూడా న్యాయం చేకూరే ఛాన్స్ ఉంటుంది. రాజకీయపరంగా ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది అన్న అంశంపై కూడా ఓ స్పష్టత వస్తుంది. ఆధిపత్య శక్తులు తమ దామాషాకు మించి మూడు నాలుగు రెట్ల అవకాశాలను నొక్కుతున్న నేపథ్యంలో, గత ఏడు దశాబ్దాల రాజ్యాంగ పాలన లో, ఎవరి హక్కుల కోసం వారు, ఎవరి ఆధిపత్యం కోసం వారు పరిమితం అయిపోతుండగా, యితరులకు కరివేపాకు లాగే మిగిలి పోతున్న బీసీ వర్గం, తమ హక్కులు తాము దక్కించుకోవాలంటే అనే దానికి సరైన సమాధానం కావాలి.

బీసీ కులాల అస్తిత్వ నిర్మాణం చిక్కబడాలి. బీసీ కులాల మధ్య అంతర్గత ఐక్యత పెరగాలి. ఈ రెండూ జరగడానికి వీలుగా, దామాషా హక్కుల కోసం సమిష్టి కృషి కొనసాగిస్తునే, దొరుకుతున్న అవకాశాలు బీసీ కులాల మధ్య సమానంగా పంపిణీ జరగాలి. సరైన నాయకత్వ నిర్మాణం బీసీలకు కావాలి. జాతీయ స్థాయిలో, బీసీలకు సరైన గుర్తింపు దొరకాలి. అది జాతీయ స్థాయిలో, బీసీ సంఘాన్ని వ్యవస్థీకృతం చేయకుండా వీలుకాదు. ఎంత కృషి చేయకలిగిన ఒకరిద్దరి, లేక కొందరు పరిమిత కృషి మాత్రమే సరిపోదు. వ్యవస్థీకృత నిర్మాణం ద్వారా, బీసీ కీలక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు జరగాలి. అంతిమంగా, బీసీ నాయకత్వంలో బలమైన రాజకీయ వేదిక నిర్మాణం జరగాలి. తద్వారా జాతీయ స్థాయిలో బీసీలకు రాజ్యాధికారం చేపట్టాలి. దాంట్లో ఎవరి దామాషా హక్కులు వారికి చెందాలి. అదే సమ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. బీసీలు వారికి చెందవలసిన అవకాశాలు వారికి దొరకడానికి ఇలాంటి కృషి చాలా అవసరం. బీసీలు కులాలు ఉపకులాలు గా విడిపోయిన బీసీలుగా ఐక్య పడాలి.

కేవలం ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ప్రభుత్వం యాభై ఏడు శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కు పరిమితం చేశారు. తరతరాలుగా, బిసి లు విద్య, రాజకీయాలు, వ్యాపారం తో సహా వివిధ రంగాలలో అణగత్రొక్కబడినారు. విద్య వైద్యం ఉపాధి రంగాలలో ప్రభుత్వాల చేయూత లేకపోవడంతో అప్పులపాలై జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. ఓబీసీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వారిలో డెబ్భై శాతం ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్నారు, స్వచ్ఛమైన నీరు పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు, వివక్ష హింసకు గురవుతున్నారు. దేశంలో బీసీ ల విధి సంక్లిష్టమైన బహుముఖ సమస్య.

వారు వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించడానికి కేవలం నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు మాత్రమే కాకుండా, ఓబిసిలను చారిత్రాత్మకంగా అట్టడుగున ఉంచిన నిర్మాణాత్మక అసమానతలు మరియు వివక్షలను పరిష్కరించే చర్యలను కూడా కలిగి ఉన్న సమగ్ర విధానం అవసరం. అత్యంత వెనుకబడిన కులాల, సంచార జాతులు ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్ పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది.

ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు–-చేతివృత్తులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలు యాంత్రీకరణ–-కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్-, ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు-–సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్ షాపులు వల్ల చాకలి, నేత మిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్ కటింగ్ సెలూన్ రాకతో మంగళి, రెడీమేడ్ దుస్తులతో దర్జీలు, జ్యూయలరీ షాపులతో విశ్వబ్రాహ్మణ వృత్తులు దెబ్బతిన్నాయి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి.

Read More
Next Story